పుతిన్‌ను రష్యన్ మీడియా రక్షకుడిగా ఎందుకు చూపిస్తోంది?

ఫొటో సోర్స్, ALEXEI DRUZHININ/AFP
- రచయిత, ఆడమ్ రాబిన్సన్
- హోదా, బిబిసి మానిటరింగ్
సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉంటూ పాశ్చాత్య దేశాలకు దీటుగా దేశాన్ని నిలబెడుతున్న పుతిన్‌కు ఆధ్యాత్మిక ఇమేజ్‌ను రష్యా మీడియా ఆపాదిస్తోంది.
ఎన్నికలు మార్చిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో దేశంలోని కొన్ని ప్రధాన టీవీ చానళ్లు పుతిన్‌ను ఆధ్యాత్మిక నాయకుడిగా చూపిస్తున్నాయి.
రష్యా విచ్ఛిన్నం కాకుండా, దేశంలో అశాంతి నెలకొనకుండా పుతిన్ కృషి చేశారని అవి చిత్రీకరిస్తున్నాయి.
దేశంలోని ప్రధాన టీవీ చానల్ రొస్సియా-1 పుతిన్‌కు ఇష్టమని భావించే వలామ్ ఆశ్రమంపై ఇటీవల ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. రష్యాలోని మారుమూల ఉత్తర లడొగా సరస్సులోని ద్వీపాల సముదాయంలో ఈ వలామ్ ఆశ్రమం ఉంది.
సోవియట్ పాలనలో దీన్ని మూసేశారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఇది పూర్తిగా ధ్వంసమైంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాతే మళ్లీ దీన్ని నిర్మించారు. అయితే, పుతిన్ వల్లే ఇది సాధ్యమైనట్లుగా ఆ డాక్యుమెంటరీ చూపించింది.
వలామ్‌ను రష్యా ప్రతిబింబంగా అభివర్ణిస్తుంటారు. 1917 అక్టోబర్ విప్లవం తర్వాత ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత దీని పునర్ నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు వలామ్‌లో వచ్చిన మార్పు పుతిన్ హయాంలో రష్యా ఎలా మారిందో సూచించే ప్రతీకగా ఆ డాక్యుమెంటరీ అభివర్ణిస్తోంది.

ఫొటో సోర్స్, Rossiya 1
'గ్రేట్ రష్యా విధ్వంసం అయినప్పుడే వలామ్ నాశనమైంది' అంటూ ఆ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానం వినిపిస్తుంది. 'వలామ్ పునరుద్ధరణ జరిగింది. మన దేశం కూడా తిరిగి కాళ్ల మీద నిలబడుతోంది' అంటూ వలామ్‌ను పుతిన్ సందర్శిస్తున్న వీడియోతో ఆ డాక్యుమెంటరీ ముగుస్తుంది.
పునర్జన్మ
అధ్యక్షుడు పుతిన్ ఈ ఆశ్రమాన్ని మొదటిసారి దర్శించుకున్నప్పుడు దాన్ని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంగా అభివర్ణించారు.
'ఇక్కడ పడవ నిలిపివేసిన చోటే పుతిన్ ఉద్భవించారు' అని శ్రావ్యమైన నేపథ్య సంగీతం వస్తుంటే ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.
వలామ్ ఆశ్రమ నిర్వహకులు బిషప్ పాన్కట్రీ కూడా మరుగునపడిన వలామ్.. పుతిన్ హయాంలో పునర్జీవనం చెందినట్లు ఆ డాక్యుమెంటరీలో చెబుతారు.
ఒకప్పుడు పూర్తిగా ధ్వంసమైన ఈ ఆశ్రమం ఇప్పుడు కొత్త శోభను ఎలా సంతరించుకుందో డాక్యుమెంటరీలో పదే పదే చూపిస్తుంటారు.
సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రాభవం కోల్పోయిన రష్యాను పుతిన్ మళ్లీ ఎలా నిలబెట్టారనేది ఇంకో డాక్యుమెంటరీలోని ప్రధాన విషయం.

ఫొటో సోర్స్, Rossiya 1
యూఎస్ఎస్ఆర్ నాటి వైభవం సాధించాలనుకునేవారికి, రష్యా విప్లవానికి ముందునాటి సంప్రదాయ కట్టుబాట్లు తిరిగి రావాలని కోరుకునేవారికి మధ్య ఉన్న ఘర్షణను పుతిన్ తొలగిస్తూ వస్తున్నారనే సందేశాన్ని ఈ డాక్యుమెంటరీ ప్రస్తావిస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య, సామరస్యం కోసం బీజాలు పడ్డాయని పుతిన్ వాదించడం. ఆశ్రమాల నుంచి సన్యాసులను ఖాళీ చేయించేటప్పుడు అందులోని మతపరమైన వస్తువులను వారి వెంట తీసుకెళ్లేందుకు సోవియట్ సేనలు తగిన సమయం ఇచ్చాయని ఆయన పేర్కొనడం కూడా ఈ డాక్యుమెంటరీలో కీలకంగా కనిపిస్తుంది.
ఈ డాక్యుమెంటరీలో కమ్యూనిజం, క్రైస్తవం మౌలికంగా ఒకే భావజాలాన్ని కలిగి ఉన్నాయని పుతిన్ వాదిస్తారు. బొల్షివిక్ విప్లవ యోధుడు లెనిన్‌కు క్రైస్తవ సంప్రదాయాలకు అనుగుణంగానే సమాధి నిర్మించారని ఆయన చెబుతారు.
'ఐదో సామ్రాజ్యం'
పుతిన్‌ను రక్షకుడిగా, సోవియట్ విప్లవవాదులకు, సంప్రదాయవాదులకు మధ్య ఐక్యత కుదిర్చే వ్యక్తిగా చూపించే ఇతివృత్తాలతో చాలా డాక్యుమెంటరీలో వస్తున్నాయి.
అక్టోబర్ విప్లవంతో రష్యా సామ్రాజ్యాన్ని కూలదోసిన జోసెఫ్ స్టాలిన్ రష్యాలో విప్లవ శకాన్ని సృష్టించారు. ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక మరోసారి పుతిన్ దేశ రక్షకుడిగా అవతరించారు. ఆయన కృషి ఫలితమే ఐదో సామ్రాజ్యంగా పిలిచే నేటి రష్యా స్వర్ణ యుగం అని ఓ డాక్యుమెంటరీ పుతిన్‌ను అభివర్ణిస్తోంది.

ఫొటో సోర్స్, ALEXANDER UTKIN
ఎన్నికలు
ఎన్నికలు జరగడానికి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. మార్చి 18న అక్కడ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదంతా మరోసారి పుతిన్‌ను అధ్యక్ష పీఠం ఎక్కించే ప్రచారంలో భాగమేనని అర్థమవుతోంది.
వలామ్ డాక్యుమెంటరీని రూపొందించిన ఆండ్రీ కొండ్రషో ప్రముఖ జర్నలిస్టు. ఇటీవలే ఆయనను పుతిన్ ఎన్నికల ప్రచార అధికారిగా నియమించారు.
గతేడాది అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినా, దేశంలో జీవన ప్రమాణాలు పడిపోతున్నట్లు తేలినా.. జాతి పునరుజ్జీవనానికి రష్యన్లందరూ పుతిన్‌కు మద్దతిస్తున్నారని డాక్యుమెంటరీ చూపిస్తోంది. పుతిన్‌కు 80 శాతం ప్రజలు మద్దతిస్తున్నట్లు పేర్కొంటుంది.
అయితే, క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) ఇప్పటికి ఆందోళనతోనే ఉంది. అవినీతి వ్యతిరేక ప్రచారకర్తగా, పుతిన్ వ్యతిరేక వర్గానికి దీటైన నాయకుడిగా పేరున్న అలెక్సీ నావల్సీ గురించే ఆ ఆందోళన. అయితే అలెక్సీపై నేరారోపణలు రుజువు కావడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురయ్యారు. అయితే ఇదంతా రాజకీయ కుయుక్తిగానే చాలా మంది భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:








