రష్యా జోక్యం విషయంలో అబద్ధమాడింది నిజమే: మైఖేల్ ఫ్లిన్

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న వ్యవహారంపై ఎఫ్‌బీఐ విచారణలో తాను అబద్ధాలు చెప్పినట్టు అమెరికా మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ అంగీకరించారు.
2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికలకు కొన్ని వారాల ముందు తాను రష్యా దౌత్యాధికారిని కలవడం గురించి ఎఫ్‌బీఐకి తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చానని ఫ్లిన్ ఒప్పుకున్నారు.
ఈ కేసుపై ప్రత్యేక అధికారి రాబర్ట్ ముల్లర్ విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని ఫ్లిన్ వెల్లడించారు.
విచారణాధికారులకు ఫ్లిన్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ట్రంప్ అధికార బృందంలోని ఓ సీనియర్ వ్యక్తిని ఇరకాటంలో పడేసేలా ఉన్నట్టు తెలిసింది.
కాగా, డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, అల్లుడు జారెడ్ కుష్నర్ పేరు ఇప్పుడు చర్చలోకి వచ్చిందని అమెరికా మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, William J Hennessy Jr
కోర్టులో ఏం జరిగింది?
వాషింగ్టన్ డీసీని ఫెడరల్ కోర్టులో హాజరైన ఫ్లిన్, "కావాలనే తప్పుడు, కల్పితమైన, మోసపూరిత వివరాలు చెప్పిన మాట వాస్తవమే" అని ప్రకటించారు.
అతని నేరాంగీకారాన్ని స్వీకరించిన న్యాయమూర్తి, ఫ్లిన్‌కు శిక్ష విధించబోమని తెలిపినట్టు ఈ విచారణ సందర్భంగా కోర్టులో ఉన్న ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ప్రతినిధి తెలిపారు.
తన కుటుంబం, దేశం ఆకాంక్షలకు అనుగుణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫ్లిన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన వైట్‌హౌజ్, "ఫ్లిన్ ప్రకటన అతని వ్యక్తిగతమే, దానితో ఎవరికీ ఇబ్బంది లేదు" అని పేర్కొంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించేందుకు రష్యాతో కలిసి పావులు కదిపారన్న ఆరోపణలను ఫ్లిన్ ఎదుర్కొంటున్నారు.
ఈ ఆరోపణలతో ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించడంతో తన పదవిని కూడా కోల్పోయారు.

ఫొటో సోర్స్, Reuters
శుక్రవారం ఫ్లిన్‌ను కోర్టు నుంచి ఎఫ్‌బీఐ ఏజెంట్లు తీసుకెళ్తున్న సందర్భంలోనూ నిరసనకారులు గుమికూడారు. "అతడు 'క్రిమినల్', 'జైల్లో పెట్టండి', ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ శిబిరానికి అనుకూలంగా పనిచేశాడు" అంటూ నినాదాలు చేశారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








