ఉత్తర కొరియా మీ తాత కలలు కన్న స్వర్గం కాదు: కిమ్‌కు ట్రంప్ వార్నింగ్

ఫొటో సోర్స్, AFP/Getty Images
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్‌కి మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా పార్లమెంట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాను తక్కువ అంచనా వేయొద్దని పేర్కొన్నారు.
‘మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. మాతో పెట్టుకోవద్దు’.. అని అంటూ ట్రంప్ ఉత్తర కొరియాను హెచ్చరించారు.
ఉత్తర కొరియా తీరును తీవ్రంగా ఖండించారు.
కిమ్‌ను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ‘‘మీరు సాధిస్తున్న ఆయుధ సంపత్తి మీ భద్రతకు కాదు. అవి మీ ప్రాంతాన్ని భారీ ప్రమాదంలోకి నెట్టేస్తాయి’’ అని అన్నారు.
12 రోజుల ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ దక్షిణ కొరియాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన అక్కడి పార్లమెంట్‌లో మాట్లడుతూ.. అమెరికా ఇప్పుడు గతంలోలాగా బలహీనంగా లేదన్నారు.
ఉత్తర కొరియా తక్షణమే అణు ఆయుధాలను వదిలిపెట్టాలని, అందుకు కిమ్ చర్యలు చేపట్టాలని అన్నారు.
‘ఉత్తర కొరియా మీ (కిమ్) తాత కలలు కన్నట్లు స్వర్గం కాదు.. ఇది నరకం. ఇక్కడ ఎవరూ ఉండాలనుకోరు’ అని వ్యాఖ్యానించారు.
ప్యాంగ్యాంగ్ అణు ఆయుధాలను వదిలిపెట్టేలా ఒత్తిడి పెంచాలని ఇతర దేశాలను కోరారు. చైనా, రష్యాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అణు విధ్వంసంతో భయపెట్టే పాలనను ప్రపంచం భరించదని హెచ్చరించారు. ఉత్తర కొరియాను ఏకాకి చేసేందుకు ఇతర దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు వాతావరణం సరిగ్గా లేనందువల్ల ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య డీమిలిటరైజ్డ్ జోన్ సందర్శనను ట్రంప్ రద్దు చేసుకున్నారు.
ముందుగా హెలికాప్టర్లో అక్కడకు ప్రయాణమైనా మధ్యలో వెనక్కి తిరిగి వచ్చేశారు.
ఆసియా పర్యటనలో భాగంగా జపాన్‌కి వెళ్లిన ట్రంప్.. అక్కడి నుంచి దక్షిణ కొరియాకు వచ్చారు. కొరియా పర్యటన తర్వాత చైనాకు వెళ్తారు. అనంతరం ఫిలిప్పీన్స్, వియత్నాంల్లో పర్యటిస్తారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








