ట్రంప్‌కి న్యాయస్థానం మొట్టికాయలు

ఫొటో సోర్స్, Getty Images
ట్రావెల్ బ్యాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. అమెరికాలోకి ప్రవేశించకుండా 6 ముస్లిం దేశాల ప్రయాణికులపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని అక్కడి కోర్టు నిలుపుదల చేసింది.
ఈ వారం నుంచి అమలులోకి రావాల్సిన నిషేధాజ్ఞలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఫెడరల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు.
ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాద్, ఉత్తర కొరియా, వెనెజువెలా దేశాల ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించారు.
ఆ నిషేధం అక్టోబర్ 18(బుధవారం) అర్ధరాత్రి నుంచి అమలులోకి రావాల్సి ఉంది.
ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం ఇలాంటి నిషేధాజ్ఞలు విధించే అధికారం ట్రంప్‌కి లేదంటూ అమెరికాలోని హవాయి స్టేట్ కోర్టును ఆశ్రయించింది.
అమెరికాను ముస్లిం రహిత దేశంగా మార్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

ఫొటో సోర్స్, Reuters
దానిపై విచారించిన డిస్ట్రిక్ జడ్జ్ డెర్రిక్ వాట్సన్ మంగళవారం తీర్పు వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దాదాపు 15 కోట్ల మంది విదేశీయులపై ప్రభావం చూసే ఈ నిషేధం విధించేందుకు అమెరికా ప్రభుత్వం సరైన కారణాలు చూపలేకపోయిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
అయితే తాజా తీర్పు ముస్లిం దేశాలకే పరిమితం, ఉత్తర కొరియా, మెనెజులా దేశాలకు వర్తించదు. అంటే ఈ రెండు దేశాల ప్రయాణికులపై ఈ బుధవారం నుంచి నిషేధం అమలులోకి రానుంది.
దీనికిముందు ఆరు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు న్యాయస్థానం ఇలాగే మొట్టికాయలు వేసింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








