విషాన్ని కడిగి పారేస్తున్న రెజిన్ గుళికలు
- రచయిత, ఆమిర్ రఫీక్ పీర్జెడా
- హోదా, ఇన్నోవేటర్స్, బంగ్లాదేశ్
సన్నటి రెజిన్ గుళికలు వేల మంది ప్రాణాలు కాపాడగలవంటే నమ్మగలరా? తప్పకుండా నమ్మాల్సిందే. భారత్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు, బంగ్లాదేశ్‌లో ప్రమాదకర ఆర్సెనిక్ విష ప్రభావం బారిన పడకుండా ఎంతో మందిని ఈ గుళికలే కాపాడుతున్నాయి.
తాగు నీటిలో ఉన్న ప్రమాదకర ఆర్సెనిక్ విష రసాయానాన్ని తొలగించేందుకు రెజిన్ సాంకేతికత ఉపయోగపడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరైడ్ భూతం ఎంతగా విజృంభించిందో మనందరికీ తెలుసు. అలాగే ఈశాన్య భారత్‌తో పాటు, బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఆర్సెనిక్ ప్రజల ప్రాణాలను తోడేస్తోంది.
మానవ హక్కుల సంస్థలు చెబుతున్న లెక్కల ప్రకారం ఒక్క బంగ్లాదేశ్‌లోనే రెండు కోట్ల మందికి ఆర్సెనిక్ ప్రమాదం పొంచి ఉంది.
దీని బారిన పడి ఏటా దాదాపు 43 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. "మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన విష ప్రభావం" అని దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
బోరు నీళ్లు 'విషతుల్యం'
బ్యాక్టీరియా రహిత తాగు నీటి కోసం బంగ్లాదేశ్ వ్యాప్తంగా లక్షల బోర్లు వేశారు. ముఖ్యంగా 1970, 2000 మధ్య కాలంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున బోరు బావులు తవ్వించాయి.
అయితే 1980వ దశకం నుంచి భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ విపరీతంగా విస్తరించింది.
ఆర్సెనిక్ కంటికి కానరాదు, వాసన దొరకదు. అది చూపించే విషప్రభావం మాత్రం అంతా ఇంతా కాదు. దీని బారిన పడ్డవారిలో ప్రథమంగా చర్మంపై పొక్కులు ఏర్పడి, పుండ్లుగా మారతాయి.
కేన్సర్, గుండె, ఊపిరిత్తుల సంబంధిత రోగాలకూ దారితీయొచ్చు. అలా క్రమంగా బాధితులను జీవచ్ఛవాలుగా మార్చేస్తుంది.

పిల్లలకు పెళ్లిళ్లు కావట్లేదు
"ఆర్సెనిక్ భూతం నన్ను, నా కుటుంబాన్ని కకావికలం చేసింది. ఇప్పడు ఎవరైనా వండిపెడితే తిని, కుర్చీలో కూర్చోవడం తప్ప ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నా. నా పిల్లల జీవితం అగమ్యగోచరంగా మారింది. ఆర్సెనిక్ విష ప్రభావం కారణంగా వారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ రావట్లేదు" అంటూ ఈమె పడే ఆవేదన వింటే గుండె తరుక్కుపోతుంది.
ఇలాంటి దీన గాథలు బంగ్లాదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో కోకొల్లలు.
బోరు బావులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నా, నేటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా మార్పు లేదు.
'హ్యూమన్ రైట్స్ వాచ్' అంచనాల ప్రకారం ఆర్సెనిక్ విష ప్రభావంతో ఒక్క బంగ్లాదేశ్‌లోనే ఏటా 43 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కొత్త పరిష్కారం
చిన్ననాటి నుంచి అమెరికాలో పెరిగిన మిన్హజ్ చౌధరి.. వేసవి సెలవుల్లో బంగ్లాదేశ్‌లోని సొంతూరికి వెళ్లేవారు. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్సెనిక్ విష ప్రభావంతో ప్రజలు పడుతున్న అవస్థలను చూసి చలించిపోయారు.
తన తాతను కబళించింది కూడా ఆ విషతుల్యమైన నీరేనన్న చేదు నిజాన్ని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు. దాంతో ఆ సమస్యను పారదోలేందుకు తనవంతు కృషి చేయాలని సంకల్పించాడు.
నీటిని శుద్ధి చేసేందుకు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు.
"ఇక్కడి ప్రజల పరిస్థితి ఎంతో ఆందోళన కలిగించింది. అమెరికాలో ఇలాంటి సమస్య ఎన్నడూ చూడలేదు. బంగ్లాదేశ్‌లో మాత్రం ప్రతి ఐదు మరణాల్లో ఒకదానికి అపరిశుభ్ర నీళ్లే కారణమవటం ఎంతో బాధాకరం" అని చౌధరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దక్షిణాసియాలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలను 'బీబీసీ ఇన్నోవేటర్స్' సిరీస్ వెలుగులోకి తెస్తుంది.
సమస్యలకు పరిష్కారాలు చూపే గొప్ప ఆవిష్కరణలు మీకు ఎక్కడ కనిపించినా, మీరే అలాంటి పరిష్కారాలు కనుగొన్నా ఆ ఫొటోలను మాతో పంచుకోండి. [email protected] కి ఈమెయిల్ చేయొచ్చు. #Jugaad, #BBCInnovators హ్యాష్‌ట్యాగ్‌లతో @BBCWorldService కి షేర్ చేయండి. లేదా ఈ లింక్‌ను క్లిక్ చేసి అప్‌లోడ్ చేయొచ్చు..

నీటిని శుభ్రపరిచే రెజిన్ సాంకేతికతను కనుగొన్న డాక్టర్. అరుణ్ గుప్తా సహకారంతో 2013లో "డ్రింక్‌వెల్" అనే సంస్థను మిన్హజ్ చౌధరి ప్రారంభించారు.
నీటి నుంచి ఆర్సెనిక్‌తో పాటు, ప్రమాదకర వ్యర్థాలను రెజిన్ గుళికలు తొలగిస్తాయి. భారత్‌లో విజయవంతమైన ఈ సాంకేతికతను డ్రింక్‌వెల్ ఫిల్టర్లలో వినియోగిస్తున్నారు.
ఈ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని గ్రామాల్లో అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రేటులో తేడా ఉంటుంది. 20 లీటర్లకు 3 నుంచి 7 రూపాయలు తీసుకుంటారు.

లక్షల మందికి రక్షిత నీరు
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం నీటి సరఫరా ప్రాజెక్టుల్లో 30 నుంచి 50 శాతం వరకు సరైన నిర్వహణ లేక మూలనపడుతున్నాయి. డ్రింక్‌వెల్ అలా కాదు. నిర్వహణ పక్కాగా ఉంటుంది.
2015లో మానిక్‌కంజ్ జిల్లాలో తొలి ప్లాంటును ఏర్పాటు చేశారు. ఆ ఒక్క ప్లాంటు నుంచే రోజుకు లక్షా యాభై వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని డ్రింక్‌వెల్ నిర్వాహకుడు హబిపూర్ రెహమాన్ అంటున్నారు.
ఆర్సెనిక్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డ్రింక్‌వెల్ అనుసరిస్తున్న విధానం ఎంతో ఆదర్శమని అధికారులు సైతం కొనియాడుతున్నారు.
ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్‌లో 30 డ్రింక్‌వెల్ ప్లాంట్లు ఉన్నాయి. రోజూ లక్ష మందికి పైగా శుద్ధమైన నీటిని సరఫరా చేస్తున్నారు.
ఆసియా ఖండంలోని కోట్ల మందికి రక్షిత మంచినీటిని అందించాలన్నదే తమ ధ్యేయమని డ్రింక్‌వెల్ వ్యవస్థాపకుడు చౌధరి అంటున్నారు. అందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలతో చేతులు కలుపుతామని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









