హేమామాలిని: తమిళ సినిమాల నుంచి ఎందుకు తప్పుకున్నారు?

హేమ మాలిని

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, హేమ మాలినిని బాలీవుడ్ 'డ్రీమ్ గర్ల్‌'గా పిలుస్తారు
    • రచయిత, వందనా విజయ్, సునీల్ కఠారియా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

బాలీవుడ్ సినీ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని, "డ్రీమ్ గర్ల్‌"గా పేరు తెచ్చుకున్న నటి హేమ మాలిని.

తమిళనాడులోని ఉదగమండలానికి సమీపంలో ఉన్న అమ్మన్‌కుడిలో 1948లో హేమ మాలిని జన్మించారు.

జయలలిత, హేమమాలిని ఇద్దరూ ఒకేసారి సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభించారు.

1965లో 'వెన్నీరాడై' అనే తమిళ సినిమాతో హేమను నటిగా ప్రేక్షకులకు పరిచయం చేయాలని దర్శకుడు శ్రీధర్‌ భావించారు. ఆడిషన్స్ నిర్వహించారు. అయితే, స్క్రీన్ టెస్ట్‌లో హేమ మాలిని ఆ సినిమాలోని పాత్రకు సూటవ్వడం లేదని తెలిసింది. దాంతో, ఆమె ఆ సినిమాలో నటించే అవకాశం కోల్పోయారు.

ఆ తర్వాత ఆమె కొన్ని పాటల్లో కనిపించారు. కానీ, తమిళ సినిమాల్లో ఆశించినంతగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్లకు ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

సినిమా కెరీర్ ఒకేసారి మొదలుపెట్టిన హేమ, జయ ఇద్దరూ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. హేమ ఎంపీ అయ్యారు, జయలలిత తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు.

హేమ, ఆమె భర్త ధర్మేంద్ర ఇద్దరూ సినిమాల్లో పనిచేసి, తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టినవారే.

వీడియో క్యాప్షన్, వీడియో: హేమ మాలిని తమిళ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారు?

1999లో నటుడు వినోద్ ఖన్నా తరఫున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో హేమ ప్రచారం చేశారు. అప్పటి నుంచి బీజేపీతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది.

ఒకసారి ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ "ఎక్కడైతే మహిళలకు గౌరవం లభిస్తుందో, అక్కడ దేవుళ్లు కూడా సంతోషంగా ఉంటారు. స్త్రీ శక్తిని దుర్గ, లక్ష్మీ రూపాల్లో ఆరాధించారు. గతం నేనే, వర్తమానం నేనే, భవిష్యత్తు కూడా నేనే. నేను మహిళను, నారీ మణిని" అన్నారు.

హేమ మాలిని 2003, 2011లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో మధుర నుంచి 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు, జాట్ నేత జయంత్ చౌదరీని ఆమె ఓడించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లలో హేమ ఒకరు. ఇప్పుడు కూడా మధుర నుంచే ఆమె పోటీ చేస్తున్నారు.

హేమ మాలిని

ఫొటో సోర్స్, BBC/FACEBOOK/DREAMGIRLHEMAMALINI

ఇటీవల ఆమె ఫొటో, వీడియోలు కొన్ని చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పొలంలో కొడవలితో గోధుమ కంకులు కోస్తూ, నెత్తిన గొడుగుతో తిరుగుతూ కనిపించారు.

ఎన్నికల ముందు ఆమెకు రైతులు గుర్తుకొచ్చారా? అంటూ కొందరు విమర్శించారు.

అందుకు హేమ మాలిని స్పందిస్తూ... "ఆ ప్రాంతాన్ని చూడగానే నచ్చింది. దాంతో, అక్కడే దిగి కాసేపు తిరిగాను. మీరు ఫొటోలు తీసుకున్నారు. ఇతర ఎంపీలు వస్తే మీరు అలా చేయరు. ఎందుకంటే, నేను హేమ మాలిని. నా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆనందం పొందుతున్నారు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)