నరేంద్ర మోదీ వ్యతిరేక 'నగ్న నిరసన'ను తమిళ రైతులు ఎందుకు విరమించుకున్నారు?

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నాళ్ల క్రితం తమిళ రైతులు సాగించిన నిరసనలు సర్వత్రా చర్చనీయమయ్యాయి.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 141 రోజులపాటు ఆందోళనలు చేపట్టిన రైతులు.. తమ ఆవేదనను తెలియజేసేందుకు విపరీత మార్గాలను ఎంచుకున్నారు.
నిరసనల్లో భాగంగా పుర్రెలతో నృత్యాలు చేశారు. మూత్రం తాగారు. ఎలుకలు, మలం వంటివి తిన్నారు.
కొందరు ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట నగ్నంగా ఆందోళనలకు దిగారు.
రైతు ఉద్యమకారుడు, జాతీయ దక్షిణ భారత రైతు సంఘం అధ్యక్షుడు అయ్యకన్ను నేతృత్వంలో ఈ నిరసనలు జరిగాయి.
జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఇవి ప్రధాన వార్తలుగా వచ్చాయి.
లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరో 110 మంది రైతులతో కలిసి తానూ పోటీ చేస్తానని మార్చిలో అయ్యకన్ను ప్రకటించారు.

వారణాసి ప్రజలకు తమ దుస్థితి వివరించి, నామినేషన్‌కు అయ్యే డబ్బుల కోసం బిచ్చమెత్తుతామని చెప్పారు.
తాను, మిగతా రైతులు నగ్నంగా వెళ్లి నామినేషన్ వేయడం ద్వారా నిరసన గళం వినిపిస్తామని హెచ్చరించారు.
అయితే, ఇప్పుడు అయ్యకన్ను వైఖరి మారింది. వారణాసిలో పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలియజేశారు.
గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రైతు విభాగం భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)లో సభ్యుడిగా ఉండేవారు.
బీకేయూలో నాయకులతో విభేదాలు తలెత్తడంతో అందులో నుంచి బయటకు వచ్చారు.
బహిరంగంగానే స్థానిక భాజపా నాయకులతో అయ్యకన్ను వాగ్వాదాలకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో బీబీసీ ప్రశ్నలకు అయ్యకన్ను ఇచ్చిన సమాధానాలివి..
ప్రశ్న: అమిత్ షాతో మీ భేటీ కోసం ముందుగా ఎవరు సంప్రదింపులు జరిపారు?
సమాధానం: మా డిమాండ్ల గురించి తీర్మానం చేసి మార్చి 13న అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు పంపించాం. ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మమ్మల్ని సంప్రదించారు. అమిత్ షాతో భేటీ కోసం ఏర్పాట్లు చేశారు. మమ్మల్ని తీసుకువచ్చారు. మాలో తొమ్మిది మందిని ఏప్రిల్ 7న అమిత్ షా కలిశారు. తమిళనాడు రాష్ట్ర మంత్రి, ఏఐఏడీఎంకే నేత తంగమణి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్ర: ఏయే డిమాండ్లు వారి ముందు ఉంచారు?
స: నదుల అనుసంధానం, పంటలకు మద్దతు ధర, పంట రుణాల మాఫీ, రైతులకు పింఛన్లు, జన్యు మార్పిడి విత్తనాల దిగుమతిపై నిషేధం, ఎంత భూమి ఉందన్నదానితో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా ప్రయోజనాల కల్పన.. ఈ ఆరు మా ప్రధాన డిమాండ్లు. రుణాల మాఫీ మినహా మిగతావన్నీ తాము నెరవేరుస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని ఉంచుతామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన మాటలపై నమ్మకంతో మేం పోటీ ఉపసంహరించుకున్నాం.
ప్ర: బీజీపీ మీ డిమాండ్లను నెరవరుస్తామని ఎందుకు హామీ ఇచ్చిందనుకుంటున్నారు?
స: వారణాసిలో మేం బిచ్చమెత్తి, నగ్నంగా వెళ్లి నామినేషన్ వేస్తే తమకు ఇబ్బందికరంగా ఉంటుందని బీజేపీ భావించింది. అందుకే రాజీ కోసం చర్చలకు పిలిచింది. వారణాసిలో గెలవాలన్న ఉద్దేశంతో మేమేం పోటీ చేయలేదు. మా డిమాండ్ల సాధన కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం. వాటిపై హామీ లభించింది కాబట్టి ఇక పోటీ అనవసరం.
ప్ర: మీ తాజా నిర్ణయంపై వచ్చే ఘాటు విమర్శలకు ఏమని సమాధానమిస్తారు?
స: నిరసనలు చేస్తున్న సమయంలో 'ఔడీ కార్ అయ్యకన్ను' అని పిలుస్తూ వారు నన్ను అపకీర్తిపాలు చేశారు. అవమానించారు. నాకు రూ.కోట్లలో ఆస్తులున్నాయని ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో బీజీపీ నుంచి డబ్బు తీసుకున్నానని, ఎంపీ కావాలనుకుంటున్నానని, అందుకే నిర్ణయం మార్చుకున్నానని నిందిస్తున్నారు. ఇంకొందరు బెదిరింపులకు భయపడ్డానని అంటున్నారు. బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడిన మహాత్మ గాంధీకీ విమర్శలు తప్పలేదు. ఇలా హద్దులు దాటడానికి ముందు వాళ్లు నోళ్లను అదుపులో పెట్టుకోవాలి. (బీజేపీ) చర్చలకు పిలిచినప్పుడు దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది.
ప్ర: హామీలను నెరవర్చడంలో బీజేపీ విఫలమైతే మీరేం చేయబోతున్నారు?
స: దిల్లీలో మేం 141 రోజులపాటు ఆందోళనకు దిగాం. బీజేపీ హామీలు నిలబెట్టుకోకపోతే మరోసారి నిరసన బాట పడతాం.
ఇవి కూడా చదవండి:
- ‘వైమానిక దాడి జరిగిన’ బాలాకోట్ నుంచి BBC Exclusive రిపోర్ట్
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- లక్ష్మీ పార్వతి ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?- బీబీసీ క్విజ్
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఇలా జరిగింది
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఇక ఫలితాల కోసం 42 రోజులు ఆగాల్సిందే
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








