ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పోలింగ్ ఇలా జరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈవీఎంల మొరాయింపులు ఒకవైపు, హింసాత్మక ఘర్షణలు మరోవైపు.. రోజంతా అత్యంత ఉత్కంఠగా సాగింది.
ఉదయం పోలింగ్ మొదలవ్వగానే ఒక్కసారిగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించడంతో అధికారులు పరుగులు తీయాల్సి వచ్చింది.
చాలాచోట్ల వెంటనే ప్రత్యామ్నాయ ఈవీఎంలతో పోలింగ్ సజావుగా సాగేలా చేశామని ఎన్నికల సంఘం తెలిపింది.
కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల రెండు మూడు గంటలపాటు ఓటర్లు వేచిచూడాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి.
దాంతో, పోలింగ్‌కు ఏర్పాట్ల విషయంలో ఎన్నికల సంఘం అధికారులు విఫలమయ్యారంటూ పలువురు నేతలు విమర్శించారు.

ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే, అది మరో అభ్యర్థికి వెళ్తోందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆరోపించారు.
అయితే, ఆ ఆరోపణలు నిరాధారమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్‌లో జనసేన అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది.
ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, రాష్ట్రంలో మరో అయిదు ఈవీఎం యంత్రాలు ధ్వంసమయ్యాయని, బాధ్యులపై కేసులు నమోదు చేశామని ఎన్నికల సంఘం తెలిపింది.

హింసాత్మక ఘర్షణలు.. ఇద్దరు మృతి
ఈవీఎంల సంగతి అలా ఉండగా.. రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటు, గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశాయి. టీడీపీ, వైసీపీ వర్గీయులు పలు చోట్ల పరస్పరం దాడులకు దిగారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరాపురంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి మృతి చెందగా, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ఇదే జిల్లాలోని సింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ-వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం మండలం టీ.సదుము గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘటనలో వైసీపీ సానుభూతిపరుడు వెంకటరమణా రెడ్డి మృతి చెందారని ములకలచెరువు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇదే జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై దాడి జరిగింది. చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్త ఒకరు గాయపడ్డారు.
గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కారుపై దాడి జరిగింది.
మొత్తానికి సాయంత్రం 6 గంటల వరకు 74 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు.

తెలంగాణలో ఇలా జరిగింది
తెలంగాణలోని పార్లమెంట్ పార్లమెంటు స్థానాలకు జిరిగిన ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది.
మెదక్ పార్లమెంట్ పరధిలో అత్యధికంగా 68.25 శాతం పోలింగ్ నమోదవగా, సికింద్రాబాద్‌లో అత్యల్పంగా 39.20 శాతం నమోదైంది.
185 మంది అభ్యర్థులు పోటీ చేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ 54.20 శాతానికే పరిమితమైంది.
గతంలో ఇక్కడ 66 శాతం పోలింగ్ జరిగింది. పసుపు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధరకల్పించ లేదని, పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని ఆగ్రహించిన రైతులు సిట్టింగ్ ఎంపీ కవితకు వ్యతిరేకంగా ఇక్కడ పోటీ చేశారు.
అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకం ఈవీఎంలను ఉపయోగించారు. ఒక్కో పోలింగ్ బూత్ లో 12 ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








