లోక్‌సభ ఎన్నికలు 2019: ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?

మీ దగ్గర ఓటరు ఐడీ ఉన్నంత మాత్రాన మీ పేరు ఓటరు జాబితాలో కచ్చితంగా ఉంటుందనడానికి లేదు. ఎన్నికల కమిషన్ తరచూ ఈ జాబితాను అప్‌డేట్ చేస్తుంటుంది. కాబట్టి పొరబాటున మీ పేరు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది.
ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో ఎన్నికల కమిషన్ national voters service portal లో ఓటర్ల జాబితాను పెడుతుంది.
అందుకే మీ పేరు ఉందో లేదో ఈ లింకులో చెక్ చేసుకోండి. ఈ వెబ్‌సైటును ఓపెన్ చేసి, అందులో పేరు, తండ్రి / భర్త పేరు, వయసు / పుట్టిన తేదీ, స్త్రీ/పురుష/ఇతరులు లింగ వివరాలను సంబంధిత కాలమ్‌లలో ఎంటర్ చేయాలి. ఆ తరువాత మీ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుస్తుంది.
ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫామ్ 6ని నింపి మీ సమాచారాన్నివ్వండి.
ఒకవేళ మీరు మొదటిసారి ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకుంటున్నా సరే, ఫామ్ 6 ని నింపి పంపివ్వాలి.

ఫామ్‌తో పాటు ఇంకేం డాక్యుమెంట్లు కావాలి?
ఫామ్‌తో మరో మూడు డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
1. ఒక కలర్ ఫొటో
2. వయస్సును ధృవీకరించే పత్రం. (పదో తరగతి సర్టిఫికెట్ లాంటిది)
3. నివాస ధృవీకరణ పత్రం. రేషన్ కార్డు, ఫోన్, విద్యుత్తు బిల్లులు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు లేదా ఆధార్ కార్డు.

నింపిన ఓటరు గుర్తింపు కార్డు ఫామ్‌ను ఎవరికి పంపివ్వాలి?
పూర్తి చేసిన ఫామ్ 6తో పాటు ఇతర డాక్యుమెంట్లను మీ ప్రాంతీయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సమర్పించాలి. తరువాత మీ పేరు ఓటరు జాబితాలో నమోదవుతుంది.
ఫామ్ 6ను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించొచ్చు. వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ లింక్‌పైన క్లిక్ చేయాలి. దానికోసం మొదట యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను సృష్టించుకొని వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
ఫొటోతో పాటు ఇతర డాక్యుమెంట్లను కూడా అక్కడ అప్‌లోడ్ చేయాలి.
ఒకవేళ మీ వయసు 21 ఏళ్లు దాటి, మీరు తొలిసారి ఓటును నమోదు చేసుకుంటున్నట్లయితే, వయసును ధృవీకరించడానికి మీరు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పనిలేదు.
ఒకవేళ వాటిని అప్‌లోడ్ చేయడంలో సమస్యలున్నా, లేక ఆన్‌లైన్‌లో సమర్పించడం ఇష్టం లేకపోయినా, ఆ ఫామ్‌ను ప్రింట్ తీసుకొని ఇతర డాక్యుమెంట్లతో పాటు election registrar office లేదా Voters Registration Centre సమర్పించొచ్చు.
ఆ తరువాత ఒక బూత్ స్థాయి సిబ్బంది తనిఖీ కోసం వస్తారు. ఆ సమయానికి మీరు ఇంట్లో లేకపోయినా ఇతర కుటుంబ సభ్యులతోనో లేదా స్థానికులతోనో మీరిచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసుకుంటారు.
కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో ఫామ్ సమర్పించాక కూడా కార్యాలయానికి పిలిపిస్తారనే ఫిర్యాదులు అందుతుంటాయి. కాబట్టి అవకాశం ఉంటే నేరుగా election registrar office కి వెళ్లి దరఖాస్తును ఇచ్చిరావడం ఉత్తమం.
ఆ తరువాత అప్లికేషన్ ఐడీ ఇస్తారు. దాంతో ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు.
లేఖ ద్వారా గానీ, ఎస్సెమ్మెస్ ద్వారా గానీ మీ పేరు నమోదైందో లేదోనన్న సమాచారాన్ని అందిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓటరుగా నమోదు కోసం ఉండాల్సిన అర్హతలు
భారతీయుడై ఉండాలి. 2019 జనవరి 1 నాటికి 18ఏళ్ల వయసు దాటుండాలి.
నివాస ప్రాంతంలోనే ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటును నమోదు చేసుకోవడానికి కుదరదు.
ఓటరు గుర్తింపు కార్డులో తప్పులుంటే ఏం చేయాలి?
ఒకవేళ మీ పేరు రిజస్టర్ అయ్యుండి, అందులో ఏ వివరాల్ని సరిచేయాలంటే ఈ ఫామ్ 8 ని నింపాలి.
ఒకవేళ ఎవరి పేరైనా ఓటరు జాబితాలో నమోదవ్వడంపై అభ్యంతరాలుంటే ఫామ్ 7 ను నింపి సమాచారమివ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఓటరు ఐడీ పోతే ఏం చేయాలి?
ఓటరు గుర్తింపు కార్డు గనుక పోయినట్లయితే కొత్త కార్డు కోసం 25 రూపాయల ఫీజు చెల్లించడంతో పాటు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆ వివరాలను election registrar office లో జమ చేయాలి.
బూత్ స్థాయి అధికారి ఎవరో ఎలా తెలుస్తుంది?
వెబ్‌సైట్ హోం పేజీలో ఆ సమాచారం ఉంటుంది.
ఓటర్ ఐడీ రావడానికి ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా నెలలోపే ఓటర్ ఐడీ అందుతుంది. కాబట్టి, ఎన్నికలకు కనీసం రెండు నెలల ముందే ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేయడం మంచిది.

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana
జాబితాలో పేరు ఉన్నా.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఏం చేయాలి?
ఓటరుగా నమోదు చేసుకుని, ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు లేకపోతే.. ఈ కింది పత్రాల్లో వేటినైనా ఉపయోగించుకుని ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం చెబుతోంది.
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్
- పాన్ కార్డు
- డ్రైవింగ్ లెసెన్స్
- బ్యాంక్ పాస్‌బుక్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు
- ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) జాబ్ కార్డు
- జాతీయ జనాభా రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు
- కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
- ఎన్నికల యంత్రాంగం జారీచేసిన అధీకృత ఫొటో ఓటరు స్లిప్
ఓటరు జాబితాలో పేరు ఉండి.. పై గుర్తింపు పత్రాలు ఉన్న వారు.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
కానీ.. రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు వంటి పత్రాలను ఓటు వేయటానికి గుర్తింపు పత్రాలుగా అంగీకరించరు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








