తెలంగాణ ఎన్నికల్లో ఆ ఇద్దరి విజయం ప్రత్యేకం

ఫొటో సోర్స్, Ramulu, chandar/fb
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఖంగుతినిపించారు.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లతో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించినప్పటికీ రెబల్ అభ్యర్థి కారణంగా ఒక చోట సీటు కోల్పోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ కూడా రెబల్ అభ్యర్థి చేతిలో ఒక చోట ఓడిపోయింది.
టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కూటమిగా ఏర్పడి పోటీచేసినా అధికార పార్టీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.
బీజేపీ 118 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో విజయంతో సరిపెట్టుకుంది. టీఆర్ఎస్ హవా అంతటా కనిపించినప్పటికీ, ఓ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Ramulu naik/fb
టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీలను కాదని వైరా నియోజకవర్గ ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాములు నాయక్‌ను గెలిపించారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌పై దాదాపు 2 వేల మెజార్టీతో ఆయన విజయం సాధించారు.
ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాములు నాయక్ 52650 ఓట్లు తెచ్చుకుంటే, టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ 50,637 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ప్రజాకూటమి తరఫున పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి బానోతు విజయ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఈ గెలుపుతో అసెంబ్లీలో అడుగుపెడుతున్న ఏకైక ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా రాములు రికార్డ్ సృష్టించారు.

ఫొటో సోర్స్, korakanti chandar/fb
అధికార పార్టీకి రెబల్ దెబ్బ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని మరోసారి నిలుపుకుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జగిత్యాల నుంచి కూడా గెలుపొందింది. కానీ, రామగుండంలో మాత్రం రెబల్ చేతిలో ఓడింది.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగగా, అదే పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన కోరకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. ప్రజాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ ఠాకూర్ బరిలోకి దిగారు.
ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసిన చందర్ పటేల్‌ను గెలిపించారు. ఆయనకు ఈ ఎన్నికల్లో 61,400 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు 34,981 ఓట్లు వచ్చాయి.
కోరకంటి చందర్ 2014 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో 33,494 ఓట్ల సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి రెబల్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








