తెలంగాణ రాష్ట్ర సమితి: సునామీలాంటి విజయంతో మరుగునపడిపోయిన అంశాలివి - అభిప్రాయం

kcr

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో తమది దుర్భేద్యమైన పార్టీ అనే భావన టీఆర్ఎస్ శ్రేణుల్లో కలిగింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమిని నిరాశ ఆవరించింది. సునామీలాంటి టీఆర్ఎస్ విజయం వెనుక అనేక అంశాలు మరుగునపడిపోయాయి.

టీఆర్ఎస్ విజయాన్ని స్థూలంగా చూస్తే ఆ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు కలిగించిన లబ్ధి... ఓట్లు సాధించిపెట్టినట్లు కనిపిస్తుంది. వివిధ వర్గాలకు పింఛన్లు, రేషన్ దుకాణాల్లో కుటుంబానికి సరిపడా మేలురకం బియ్యం పంపిణీ, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ విజయానికి తోడ్పడ్డాయి.

ఎన్నికల వ్యయంపై నిందాపనిందలే కాకుండా మద్యం, డబ్బు ఎర చూపి ఓటర్లను ప్రలోభ పెట్టడంలో విపక్షం కంటే పాలక పక్షానికే ఎక్కువ అవకాశాలున్నాయన్నది అందరి మాట.

అయితే... ఎన్నికల సమయంలో పట్టుకున్న మద్యం, డబ్బు లెక్కలు చూస్తే రెండు పక్షాల మధ్య స్వల్ప తేడా ఉండొచ్చు కానీ రెండూ చేసే పనుల్లో మాత్రం తేడా లేదని స్పష్టమవుతుంది.

కేసీఆర్ ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, TRSparty

టీఆర్ఎస్‌కు లిట్మస్ పరీక్ష

టీఆర్ఎస్ విజయంలో ఒక సత్యం దాగి ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోంచి చూస్తే 2014లో ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేరుతాయనే ఆశతోనే టీఆర్ఎస్‌కు అధికారం కట్టబెట్టారు.

దీంతో మొన్న జరిగిన ఎన్నికలను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు, చూపించిన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చేపట్టిన లిట్మస్ టెస్ట్‌గా పరిగణించాలి. టీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి ప్రయత్నించింది. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్ఎస్ హామీలను ప్రశ్నించింది.

మరోవైపు సంక్షేమ కోణంలోంచి చూస్తే టీఆర్ఎస్ ట్రాక్ రికార్డు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. మునుపటి నయా ఉదారవాద ప్రభుత్వాల విధానాల్లోని నిర్లక్ష్యం, నిరాదరణ, జీవనోపాధి తగ్గిపోవటం కావడం.. వ్యవసాయం, అసంఘటిత రంగాలను పూర్తిగా పట్టించుకోకపోవడం వంటివన్నీ తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలను ఆర్థికంగా కుదేలు చేశాయి.

ఈ పరిస్థితులన్నీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు రూపమిచ్చాయి, ఆవిర్భావానికి దారులు వేశాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం తన పాలనాపటిమతో తక్కువ కాలంలోనే ప్రజల విశ్వసనీయతను పొందగలిగింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సుస్థిరంగా సాగించేందుకు ఆర్థిక పరిస్థితీ అనుకూలించింది.

టీఆర్ఎస్ విజయంతో సంబరాలు

పార్టీ నిర్మాణం బలహీనమైనప్పటికీ.. కేసీఆర్ ఛరిష్మాతో మళ్లీ అధికారంలోకి

ఉద్యమ పార్టీగా సాగుతున్న కాలంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వమేర్పరిచిన తరువాత కానీ పార్టీ నిర్మాణంపై టీఆర్ఎస్ దృష్టిపెట్టకపోవడం వేరే కథ.

ఆ పార్టీకి నియోజకవర్గ స్థాయిలో మూలాధారం ఎమ్మెల్యేనే. సువ్యవస్థీకృతమైన పార్టీ నిర్మాణం లేనప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి అధినేత కేసీఆర్ ఛరిష్మా, ప్రజల అవసరాలను అర్థం చేసుకుని అమలు చేసిన పథకాలే కారణం.

అందుకే డబుల్ బెడ్‌రూం ఇళ్లు మొదలైన హామీల అమల్లో చతికిలబడినా కూడా ప్రజల్లో ఆదరణ చెదరలేదు. ఇక విద్యారంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.

సామాజిక కోణంలో చూస్తే టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో మళ్లీ ఒకప్పటి స్థితి వచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రధాన ఓబీసీ కులాలకు పంచాయతీల నుంచి అసెంబ్లీ వరకు అవకాశాలు ఇవ్వడం ద్వారా సాధికారత కల్పించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కులం, వృత్తులు, జెండర్ ఆధారంగా ప్రజలు స్వయంగా పోరాటంలోకి వచ్చారు.

కానీ టీఆర్ఎస్ పాలనలో ఓబీసీలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. మహిళలకు ప్రాధాన్యం గురించి మాట్లాడాలంటే అది మరో కథ. టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఈ కారణంగా తరచూ విమర్శలను ఎదుర్కొంది. అయితే... ప్రాతినిథ్య కోణాన్ని పక్కనపెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వర్గాలకు తమ పథకాల్లో ప్రాధాన్యమిచ్చిందన్నది సుస్పష్టం. గొర్రెలు, చేపపిల్లల పంపిణీ పథకాలు.. బీడీ కార్మికులు(అత్యధికం మహిళలే), చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఇంకా ఇతర అన్ని వర్గాల్లోని ఆర్తులకు ఆసరా పింఛన్లు ఇచ్చి ఆదుకుంది.

ఇవే కాకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటివి గ్రామాల్లో రైతన్నల కోసం అందించారు. లబ్ధిదారుల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఈ ఎన్నికల్లో ఫలించిన మంత్రమే అయినప్పటికీ దీర్ఘకాలంలో వీటి అవసరం, సాధ్యాసాధ్యాలు వంటి ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఈ మంత్రాన్ని నిత్య పరిష్కారంగా ఎంచుకోవడం తెలివైన పని కాకపోవచ్చు.

కేసీఆర్

ఫొటో సోర్స్, KCR/FB

ఎత్తుకు పైఎత్తుల వేదిక ఈ ఎన్నిక

మరోవైపు అజెండాలు, నేపథ్యాలు, విధానాలు, భాష, ప్రతీకాత్మకత విషయంలో ఈ ఎన్నికల్లో మరింత దిగజారుడుతనం కనిపించింది.

ఇటలీకి చెందిన మార్క్సిస్ట్ తత్వవేత్త ఆంటోనియో గ్రామ్సియన్ చెప్పినట్లుగా ఈ ఎన్నికలు రాజకీయ సమరంలా కాకుండా యుక్తుల ప్రదర్శనకు వేదికైంది. భారత రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ఎన్నికలకు పరిమితమయ్యాయి.. రాజకీయ పార్టీలు ఎన్నికల యంత్రాలుగా మారిపోయాయి.

ఎన్నికల్లో గెలుపోటముల లెక్కలే ప్రధానమైపోయిన ప్రస్తుత తరుణంలో సామాజిక ప్రయోజనాల కోసం చేసే వాస్తవ రాజకీయాలు లుప్తమైపోతున్నాయి.

రాజకీయ చర్చలు, ఎన్నికల ప్రచారాలు, విధానాల రూపకల్పన.. ఇలా ప్రతి చోటా ఇది కనిపిస్తోంది. ప్రస్తుత ఎన్నికల ఫలితాలూ ఇదే చెబుతున్నాయి.

చంద్రబాబు, కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGANA CMO/FACEBOOK

చంద్రబాబు చేసిన సాయం

ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారానికి రావడం టీఆర్ఎస్‌కు లాభించిందనే చెప్పాలి. కూటమి తరఫున ప్రచారానికి ఆయన రావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ ప్రచార ధోరణి మారిపోయింది.

తమ సొంత పథకాలను ప్రచారం చేసుకోవడం కంటే కూడా చంద్రబాబును ఎండగట్టడానికే అధిక ప్రాధాన్యమిచ్చి అందుకు ఫలితాలు అందుకుంది ఆ పార్టీ. తెలంగాణ డిమాండ్‌కు బద్ధ వ్యతిరేకి అని చంద్రబాబుపై ముద్ర ఉండడంతో టీఆర్ఎస్ దాన్ని చక్కగా సొమ్ము చేసుకోగలిగింది.

తెలంగాణలో మళ్లీ ఆంధ్ర పెత్తనాన్ని తీసుకొచ్చేందుకే చంద్రబాబు ఈ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసింది.

తెలంగాణలో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు, విభజన అనంతరం చంద్రబాబు తీరుపై టీఆర్ఎస్ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో విజయం సాధించింది.

అదేసమయంలో కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటూ కూటమి నేతలు చేసిన ప్రచారం పెద్దగా ఉపకరించకపోగా కేసీఆర్‌ ఇమేజ్‌ మరింత పెరిగేలా, ప్రజలు ఆయన్ను తెలంగాణ చిహ్నంగా భావించేలా చేశాయి. అంతేకాదు... తెలంగాణవాదాన్ని, గుర్తింపు పోరాటాన్ని, స్వతంత్రతను మరోసారి ఉనికిలోకి తెచ్చాయి.

ఆ విధంగా ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల అభిప్రాయానికి ప్రతీకగా మారిపోయాయి. జనాకర్షక పథకాలనే నమ్ముకున్నప్పటికీ ఇంతకాలం సాగిన సామాజిక విధ్వంసానికి పరిష్కారాలు వెతికే ప్రయత్నంలోనూ టీఆర్ఎస్ విజయం సాధించిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)