కూటమి కుప్పకూలడానికి కారణాలేమిటి.. - ఎడిటర్స్ కామెంట్

ఫొటో సోర్స్, trspartyonline/facebook
- రచయిత, జి.ఎస్.రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
కారుజోరుకు హస్తం బేజారైంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టుగానే కారు దూసుకుపోయింది. వాస్తవానికి అంచనాలకు మించి ఫలితాలను పరుగెట్టించింది.
గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉండడం వల్ల మీడియాలో ఆసక్తి రేపిన లగడపాటి జోస్యం పూర్తిగా గాడి తప్పింది. కేసీఆర్ వ్యూహాలు సంపూర్ణంగా విజయవంతమైతే విపక్ష వ్యూహాలు సంపూర్ణంగా విఫలమయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తు ఫలితమివ్వలేదు. ఎన్నికల రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి ప్రభావం చూపించలేకపోయింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలతో పథకాలు డిజైన్ చేసి ఎక్కువమందికి ఏదో రకంగా ఏదో లబ్ది చేకూర్చి వారిని నమ్ముకుని ముందస్తుగా ఎన్నికలకు దిగిన కేసీఆర్ తాను అనుకున్నది సాధించగలిగారు.
కాంగ్రెస్ రాష్ర్టంలో దెబ్బతిన్నా మిగిలిన రాష్ర్టాల్లో మరీ ముఖ్యంగా రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ల్లో బీజేపీ నుంచి అధికారం లాక్కుని కొత్త జవజీవాలు తెచ్చుకుంది. నిన్న మొన్నటి దాకా ఉత్తరాదిన ఈసురోమంటూ ఉన్న కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల ముందు ఇదొక బూస్ట్. నరేంద్ర మోదీకి పెను సవాల్.
కేసీఆర్ వర్సెస్ అదర్స్
ప్రాతినిధ్య పార్లమెంటరీ విధానమే అయినప్పటికీ వాస్తవార్థంలో తెలంగాణలో అధ్యక్ష తరహాలో జరిగిన ఎన్నిక ఇది. కేసీఆర్ వర్సెస్ ఇతరులు అన్నట్టు ఎన్నికల పోరాటం సాగింది. పాలనలోనే కాకుండా ఎన్నికల రాజకీయాలను కూడా తన చుట్టే తిప్పుకుని కేంద్ర బిందువుగా మారారు. పోయిన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమపు రాజకీయ కేంద్రీకరణ రూపంగా కనిపించిన కేసీఆర్ ఈ సారి ఆ ఇమేజిని ఉపయోగించుకుంటూనే సంక్షేమ సారధిగా తనను తాను ప్రజల ముందు నిలుపుకున్నారు. పథకాల హైవే మీద కారును ఉరకలెత్తించారు. రెండో సారి అధికారం చేపట్టబోతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెల్చుకోవడం ఇపుడు ఆయన తదుపరి లక్ష్యం కావచ్చు. రాష్ర్టంలో పాలనా పగ్గాలను చేపట్టి ఐదేళ్లూ సీఎం పదవిలో కొనసాగుతారా, ఇంకేమైనా కేంద్రపు ఆశలతో పీఠం కుమారుడికి అప్పగిస్తారా అనే అంచనాల సంగతి వేరే.
గత ఎన్నికల్లో కేవలం సెంటిమెంట్ మీద ఆధారపడి గెలిచిన పార్టీగా ముద్రవేసుకుంది టీఆర్ఎస్. అప్పటికింకా కేడర్ నిర్మాణం జరగలేదు. ఇపుడు పరిస్థితి వేరు.

ఫొటో సోర్స్, NArendraModi/KCR/FACEBOOK
తెలుగుదేశంలో ఉన్నప్పటినుంచి కూడా వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కులాల వారీగా చేపట్టిన సంక్షేమ పథకాల లెక్క తప్పలేదు. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, చేనేత వస్ర్తాల కొనుగోలు, ఎకరాకు ఏడాదికి ఎనిమిది వేల చొప్పున రైతు ఎకౌంట్లో నేరుగా డిపాజిట్ చేసే రైతు బంధు పథకం ఈ సంక్షేమ పథకాల్లో కీలకమైనది. విద్యుత్ పరిస్థితి మెరుగుపడడం రైతాంగ జీవితంలో నిత్య అనుభవంలో ఉండి పాజిటివ్‌గా పనిచేసే అంశం. దానికి కారణాలు అనేకం ఉన్నా క్రెడిట్ పాలకుని రూపంలోనే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వారు మళ్లీ అధికారంలోకి రాకపోతే ఇప్పటికే మధ్యలో ఉన్న మిషన్ బగీరథ, మిషన్ కాకతీయ పథకాలు, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల పరిస్థితి ఏమవుతుందో అనే ఆలోచన కూడా రేకెత్తించగలిగారు.
అటు విపక్షాల పరిస్థితి చూస్తే స్పష్టమైన నాయకత్వం లేకపోవడం లోటుగా కనిపించింది. మూడు దశాబ్దాలకు పైబడి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ చేసిన ఎత్తు విఫలమైంది. మజ్లిస్‌తో అప్రకటిత పొత్తు టీఆర్ఎస్‌కు కలిసొస్తే టీజేఎస్, సీపీఐలతో పొత్తు కాంగ్రెస్‌కు అనుకున్న ఫలితాన్నివ్వలేదు. పైపెచ్చు సీట్లు గెలవలేకపోయినా పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాల్లో ఎంతో కొంత మెరుగైన ఇమేజ్ ఉన్న కోదండరాం, గద్దర్లను అవసరమైన రీతిలో కాంగ్రెస్ ఉపయోగించుకోలేకపోయింది. బహుశా నేడో రేపో వాళ్ల మధ్యలో ఉన్న అసంతృప్తులు బద్దలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, KTRTRS/facebook
విమర్శలు-అవసరాలు
ఫ్యూడల్ తరహా వ్యక్తి కేంద్రక పాలన, కుటుంబపాలన, అప్రజాస్వామిక విధానాలు, పౌర హక్కులకు లోటు, లోటు బడ్జెట్, వగైరా విమర్శలు అంతగా జనంపై ప్రభావం చూపలేకపోయాయి. లేదంటే సంక్షేమ పథకాల బలం ముందు వీటి బలం తేలిపోయింది. మెజారిటీ ప్రజలు అవసరాల మేరకు ఓటు వేస్తారు తప్పితే రాజకీయ విశ్వాసాలకోసమో లేక మధ్యతరగతిలో కొందరు ప్రచారంచేసే కొన్ని విలువల కోసమో కాదు. ఆ విలువల్లోనే ఆ విశ్వాసాల్లోనే వారి ప్రయోజనాలు దాగుంటాయి అని జనాన్ని ఒప్పించగలిగితే వేరే విషయం. అది అత్యంత కఠినమైన విషయం. కళ్లముందు రోజువారీ జీవితానికి ఉపయోగపడే కొన్ని ప్రయోజనాలు ముఖ్యంగా నిండిన కొన్ని చెరువులు, పనిచేస్తున్న మోటార్లు, నెల నెలా అందుతున్న కొన్ని నిధులు కనిపిస్తున్నపుడు కనిపించని అమూర్తమైన అంశాల కంటే అవే ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. లోటు బడ్జెట్, దీర్ఘకాలిక భవిష్యత్తు కంటే తక్షణ అవసరాలకే డబ్బు ఎక్కువ కేటాయించడం వంటి విమర్శలు మనసును తాకే అవకాశం తక్కువ. ఉద్యోగాల కల్పన విషయంలో యువతలో అసంతృప్తి ఉన్నప్పటికీ అది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో లేదని రిజల్ట్స్ అర్థం చేయిస్తున్నాయి.

ఫొటో సోర్స్, TWITTER@INCTelangana
కేంద్రంలో కూటమిపై ప్రభావం ఉంటుందా!
కాకపోతే కేంద్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా కాంగ్రెస్, తెలుగుదేశం దీర్ఘకాలిక వ్యూహంపై ఈ ఫలితాలు ప్రభావం చూపే అవకాశం తక్కువ. కేంద్రంలో కలిసి ప్రయాణించాల్సిన అనివార్యత ఆ రెండు పార్టీలకు ఏర్పడి ఉన్న తరుణమిది.
కాకపోతే కేసీఆర్ పాలనకు సవాళ్లైతే చాలానే ఉన్నాయి. పెన్షన్ల పెంపు దగ్గర్నుంచి నిరుద్యోగ భృతిదాకా చాలా కొత్త పథకాలనే టీఆర్ఎస్ వాగ్దానం చేసి ఉన్నది. అసలే భయానకమైన లోటు బడ్జెట్లో ఉంది. అవన్నీ ఎలా నెరవేరుస్తారు, నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారు అనేది చిక్కు ప్రశ్నే.
ఇక ఇతర రాష్ర్టాల ఫలితాలు చూస్తే చిన్న రాష్ర్టాలు చత్తీస్ గడ్, మిజోరాంలలో అనుమానాలకు బేరసారాలకు తావులేకుండా ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, మిజోరాంలొ ఎంఎన్ఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించాయి. సాధారణంగా చిన్న రాష్ర్టాల్లో ఫలితాలు కొంచెం అటూ ఇటూ వస్తే విపరీతమైన పొలిటికల్ డ్రామా ఉంటుంది. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అవుతారా లేక సచిన్ పైలట్ అవుతారా అనేదే ఇపుడు ఆసక్తి కరమైన అంశం. మధ్య ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఉత్తరాదిన పంజాబ్ మినహా సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిన కాంగ్రెస్‌కు ఈ విజయాలు మామూలువి కావు.
స్థూలంగా దేశ రాజకీయాల్లో మోదీకి తీవ్రమైన సవాల్ అయితే ఎదురుకాబోతున్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి అవసరమైన ఉత్తేజాన్ని కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు అందించాయి. జాతీయ స్థాయిలో రాబోయే రాజకీయం ఏకకేంద్రకం కాదు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








