తెలంగాణ ఎన్నికలు 2018: ఉద్యమంలో ఆత్మహత్యలు ఆశించిన లక్ష్యాలను సాధించాయా?

- రచయిత, రిపోర్టర్: బళ్ల సతీశ్
- హోదా, కెమెరామెన్: నవీన్ కుమార్ కె
'నీళ్లు, నిధులు, నియామకాలు' తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాదం! తెలంగాణ కోసం వివిధ రూపాల్లో పోరాడిన అందరి గొంతుల్లోనూ ప్రతిధ్వనించిన అంశాలు.. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉపాధి వస్తుందన్న ఆలోచనతో లక్షలాదిమంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమకు అవకాశాలు రావడం లేదని ప్రత్యేక రాష్ర్టమొస్తే సమస్యలు తీరిపోతాయని చాలా మంది భావించారు. భావోద్వేగాలు అదుపుతప్పి కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కుటుంబాలకు తీరని దుఃఖం మిగిల్చారు. ప్రత్యేక రాష్ర్టంతో సమస్యలు పరిష్కారమైపోతాయనే రీతిలో ప్రచారం కూడా సాగింది. అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.
మరి నాలుగున్నరేళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఆ మూడు రంగాల పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యార్థులనూ, తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల కుటుంబాలనూ బీబీసీ కలిసింది. నీళ్లు, నిధులు నియామకాల గురించి వారేమనుకుంటున్నారని ప్రశ్నించింది.
నాలుగున్నరేళ్ల పాలనలో ఈ మూడు లక్ష్యాలను చేరుకోవడంపై వారిలో మిశ్రమస్పందన కనిపించింది. ముఖ్యంగా నియామకాల విషయంలో అసంతృప్తి కనిపిస్తోంది.

శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
తెలంగాణ వచ్చాక నీళ్లు అయితే ఎంతో కొంత వచ్చాయనీ, నియామకాలు జరగాల్సి ఉందనీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అభిప్రాయపడ్డారు.
అయితే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి తగినంత గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పోడిచేడి గ్రామంలో బీబీసీ బృందంతో ఆమె మాట్లాడారు.
‘‘ఈ నాలుగేళ్లలో బడుగు, బలహీన వర్గాల ఆశయ సాధనలో కొంచెం న్యాయం జరిగింది. నీళ్లు వచ్చాయి. వస్తాయి కూడా. కానీ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. అమరుల త్యాగాలకు న్యాయం జరిగింది కానీ అందరికీ న్యాయం జరగాలంటే ఉద్యోగాలు రావాలి. చదువులకు ఫీజులు ఉండకూడదని శ్రీకాంత్ అనేవాడు. అందరినీ ఉన్నతస్థాయిలో చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఉద్యోగాలు కల్పిస్తే అమరుల ఆత్మ శాంతిస్తుంది.’’
‘‘తెలంగాణ కోసం వెయ్యి మంది చనిపోయారు. అందులో 450 మంది అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, పది లక్షల రూపాయల నగదు ఇచ్చారు. ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టులు ఉంటే మిగతా వారికి కూడా ఉద్యోగాలు, ఆర్థిక సాయం చేస్తాం అన్నారు. ఉద్యోగాలు కల్పించాలి. ఆంధ్ర వాళ్లు వెళ్లిపోతే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇంటికొకటి కాకపోయినా, చదువుకున్నవారందరికీ ఉద్యోగాలు కల్పించాలి.’’
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
‘‘అమరుల కుటుంబాలకు స్వాతంత్ర్య సమరయోధుల తరహాలో పెన్షన్ ఇవ్వాలి. హెల్త్ కార్డు, గుర్తింపు కార్డు ఇవ్వాలి. హైదరాబాద్‌లో కాలనీ కట్టాలి. స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చినట్లు అమరులకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి. ఒక్కడే కొడుకు ఉండి చనిపోయిన వారున్నారు. ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు లేని కుటుంబాలున్నాయి. అటువంటి వారికి పెన్షన్ ఉపయోగపడుతుంది.’’
నీళ్ల విషయంలో, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం విషయంలో సంతృప్తి వ్యక్తం చేసిన శంకరమ్మ, చనిపోయిన వారిని గౌరవించే విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘నా బాధ ఏంటంటే, కేసీఆర్.. అసెంబ్లీలో అమరులకు నివాళులు అర్పించాకనే, ఏ పనైనా మొదలుపెడతాం అని చెప్పారు. దీంతో అమరులు జనజీవితంలో ఎప్పటికీ బతికుంటారని అనుకున్నాం. కానీ ఇప్పుడు అమరవీరుల ఊసే లేదు. ఆ విషయంలో వెయ్యి మంది తల్లితండ్రులు బాధపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి జనం సుఖపడుతున్నారంటే అమరుల త్యాగమే కారణం. శ్రీకాంతాచారి త్యాగం చూసి సోనియా తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు అతని త్యాగానికి అర్థం లేకుండా పోయింది. బతికున్నంత కాలం ఆ త్యాగం గుర్తు చేసుకోవాలి. కానీ ఇప్పుడు అసలు శ్రీకాంతాచారీ లేడు, ఎవ్వరూ లేరు’’ అని శంకరమ్మ అన్నారు.
'కోట్లిచ్చినా కొడుకు రాడు'
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా శ్రీకాంతాచారి పేరు ప్రస్తావించకపోవడాన్ని ఆమె గుర్తు చేశారు.
‘‘ఈ నాలుగేళ్లలో అమరులను మర్చిపోయారు. తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలు మాత్రం సంతోషంగా లేవు. పిల్లలు చనిపోయారు. కుటుంబాలు ఆగమయ్యాయి. పేర్లు కూడా లేవు. మొన్న కేసీఆర్ శ్రీకాంతాచారి సొంత నియోజకవర్గం తుంగతుర్తి వచ్చి కనీసం శ్రీకాంతాచారి పేరు ప్రస్తావించలేదు. వాళ్లనే మర్చిపోయినప్పుడు ఇంక ఎవరికేం ఉంటుంది. కోట్లిచ్చినా కొడుకు తిరిగిరాడు. అమరుల కుటుంబాలకు ఏమిచ్చినా తక్కువే. వేదికలకు అమరుల పేర్లు పెట్టాలి. ఏ సభ అయినా అమరులకు నివాళులు అర్పించాలి'' అని శంకరమ్మ బీబీసీతో అన్నారు.
శ్రీకాంతాచారి సోదరుడికి రెవెన్యూ శాఖలో ఉద్యోగం వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆయన తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఉత్తమకుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి శంకరమ్మకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు.

కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేసిందని, ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి అన్నారు.
కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ పి.కిష్టయ్య కుటుంబాన్ని కరీంనగర్‌లోని వారి నివాసంలో బీబీసీ బృందం కలిసింది. ఆత్మహత్య ఘటనను గుర్తు చేసుకుని ఆయన భార్య భావోద్వేగానికి లోనయ్యారు.
''తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినా తప్పు లేదనేవాడు. నువ్వు చనిపోతే మేం దిక్కులేని వాళ్లం అయిపోతాం అన్నాకానీ తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం అన్నాడు. నేనొక్కడినే కాదు, తెలంగాణ కోసం మన కుటుంబం మొత్తం ఆహుతైనా సంతోషమే అన్నాడు. నేను బతికుంటే మన పిల్లలే బాగుపడతారు, తెలంగాణ వస్తే ప్రజలందరూ బాగుపడతారు అనేవాడు. రాత్రి 2 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కి తుపాకితో కాల్చుకుని చనిపోయాడు. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు. ఎవ్వరు చెప్పినా వినలేదు. 'ఉద్యమం నీరుగారుతోంది. నావల్ల అయినా తెలంగాణ రాష్ట్రం రావాలి' అని ఆత్మహత్య చేసుకున్నాడు'' అని ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు.

''పోలీసు ఉద్యోగం నిజాయితీతో చేసాడు. ఎక్కువగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. నక్సలైట్ల జీవితాల గురించి మాట్లాడేవాడు. పేద ప్రజల కష్టాల గురించి పాటలు పాడేవాడు. ఐడి పార్టీలో ఉన్నా, నక్సలైట్ల ఏరియాలో ఉన్నా అన్నలను మార్చాలని ప్రయత్నం చేసేవాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన కొట్లాటలు చూసి చలించిపోయాడు'' అని ఆమె అన్నారు.
కిష్టయ్యకు ప్రజా గాయకుడు గద్దర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు కుటుంబ సభ్యులు. చనిపోయే ముందు, కేసీఆర్‌తోనూ, గద్దర్‌తోనూ మాట్లాడించమని కోరారని వారు గుర్తు చేసుకున్నారు.
అమరుల కల అయిన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఆయన లేడన్న బాధొక్కటే తప్ప మరే బాధ లేదు. మా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్నారు. నేను, అబ్బాయి ఉద్యోగాలు చేస్తున్నాం. ఆయన చివరి కోరిక ప్రకారం టీఆర్ఎస్ పార్టీ మా పాపను మెడిసిన్ చదివిస్తోంది.’’

‘‘ముఖ్యమంత్రి మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు. పిల్లలు చదువుకోవడం మా ఆయన చూడలేదు. ఆయన లేడు అన్న బాధ ఎవ్వరూ తీర్చలేనిది. అదెప్పటికీ ఉంటుంది. అది తప్ప, మిగతా ఏ లోటూ లేదు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి, అందరి మంచి చెడులు చూశారు. వారి అమరత్వం ఎటూ పోలేదు. ప్రజలు, మాతోనే ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంది’’ అన్నారు పద్మావతి.
నీళ్లు, నిధులు, నియామకాలు అంశాలపై పద్మావతి ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు.
కిష్టయ్య చివరి కోరిక తన కుమార్తెను డాక్టర్ చేయడం. ప్రస్తుతం ఆయన కుమార్తె మెడిసిన్ చదవడం కోసం ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఫీజును టీఆర్ఎస్ పార్టీ చెల్లిస్తోంది. ఆయన భార్య, కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి.

ఉస్మానియాలో అసంతృప్తి
అయితే ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా విద్యార్ధుల్లో మాత్రం నియామకాల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది.
‘‘నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్టులో నీళ్లు, నిధులు పోయాయి వెనక్కు తీసుకోలేం. కానీ ఉద్యోగాలు తీసుకోవచ్చు. ముల్కీ నిబంధనలు, గిర్ గ్లానీ నివేదికలతో మోసం తెలుసుకోవచ్చు. జీవో 610, జీవో 36 లను ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. లక్షా ఏడు వేల ఉద్యోగాలు అన్నారు. కానీ నాలుగున్నరేళ్లలో ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయలేకపోయారు. ఇలాంటి ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు’’ అని ధర్మపురికి చెందిన జె శంకర్ అన్నారు. శంకర్ ఉస్మానియా తెలుగు విభాగంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు.
‘‘ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఆకాంక్షలు, ఉద్యమ లక్ష్యాలు పక్కకు నెట్టేయబడ్డాయి. రైతులు నష్టపోయారు. విద్యార్థులు మోసపోయారు. విద్య దూరమైంది, వైద్యం భారమైంది. ప్రజాస్వామ్యం కనుమరుగయింది. స్కూళ్ల మూసివేత, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు వంటి రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది’’ అని ఆయన ఆరోపించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
కేసీఆర్ చేస్తున్న మిగిలిన స్కీములు బాగున్నాయికానీ, ఉస్మానియా విద్యార్థులను నిర్లక్ష్యం చేయడం బాలేదని స్కాలర్ రేష్మ సుల్తానా అన్నారు.
నిజామాబాద్ బోధన్‌కి చెందిన రేష్మ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2010 ఫిబ్రవరి 14 రాత్రి ఆమె మోకాలికి టియర్ గ్యాస్ బుల్లెట్ తగిలి, గాయమైంది. అప్పుడు ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతోన్న రేష్మ, ఇప్పుడు కెమిస్ట్రీలో పరిశోధక విద్యార్ధిగా ఉన్నారు.
‘‘నేను కేసీఆర్ స్ఫూర్తితో ఇంట్లో వద్దంటున్నా, ఉద్యమంలోకి వచ్చాను. నాలా ఎంతో మంది పోరాడారు. కానీ తెలంగాణకు రావాల్సినవి ఏమీ రాలేదు. నీళ్లు కొంత వరకూ వచ్చాయి. నిధులు వచ్చినయ్. కానీ నియామకాలు ఏవీ? ఇప్పటి వరకూ ఒక్క నియామకమైనా అయిందా? అన్నీ ఆలస్యమే. అసలు ఆ రోస్టర్ విధానమేంటో అర్థం కావడం లేదు. కేసీఆర్‌గారు గుర్తించుకోవాల్సింది ఆయన బలం, బలహీనత ఒస్మానియా విద్యార్థులేనని. కానీ కేసీఆర్ ఉద్యమకారుల్ని పట్టించుకోవడం లేదు. నియామకాలు జరపడం లేదు’’ అని రేష్మ అన్నారు.
‘‘నాకిప్పటికీ కేసీఆర్ అంటే ప్రేమ ఉంది. ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయన స్కీములు కూడా బాగున్నాయి. విద్యార్థులను పట్టించుకోవాలి. కానీ అన్ని స్కీములు ఇచ్చే బదులు యూత్‌కి ఒక ఉద్యోగం ఇస్తే కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి తెలంగాణ నిరుద్యోగుల కోసం నియామకాలు జరపాలనేది నా వినతి. ఈ యువతపైనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రిక్రూట్మెంట్‌లు ఎలా ఉన్నాయో తెలీదు. పీజీటీ, జేఎల్, డీఎల్‌లో ఒక్క మైనార్టీ పోస్టూ లేదు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కాదు, 12 శాతం అన్నారు. రెండూ లేవు. అన్ని స్కీములూ బాగానే చేసినా ఓయూని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు మఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించింది. అర్హులు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది.
2009 డిసెంబరు నుంచి 2013 అక్టోబరు మధ్య తెలంగాణ కోసం 1003 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కడివెండి తిరుపతి వివరించారు. ఆయన అమరవీరుల కుటుంబాల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. కేసీఆర్, కోదండరాంలు పరామర్శించిన కుటుంబాల ఆధారంగా ఈ సమాచారం సేకరించినట్టు ఆయన చెప్పారు. కానీ ఇప్పటి వరకూ 698 మంది కుటుంబాలనే ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సహాయం అందించిందని ఆయన చెప్పారు.
పోస్టుమార్టం రిపోర్టు లేని కారణంగా ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారిని గుర్తించడం కష్టమవుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందనీ, కానీ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, అమరుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదని అన్నారు తిరుపతి. రాష్ట్రం కోసం సొంత వాళ్లను కోల్పోయిన బాధ తమకే తెలుసన్నారాయాన.
ఇవి కూడా చదవండి
- ఆర్ట్స్ కాలేజ్ టూ అసెంబ్లీ - కీలక నేతలపై పోటీ చేస్తున్న ఓయూ విద్యార్థులు ఎవరు?
- తెలంగాణ రంగస్థలం: నీళ్లు, నిధులు, నియామకాలపై ఏ పార్టీలు ఏమన్నాయి
- తెలంగాణ ఎన్నికలు 2018: ఈ నియోజకవర్గాల్లో గెలుపెవరిది
- మనం ‘రేప్ కల్చర్’ను పెంచి పోషిస్తున్నామా
- BBC Quiz: టీఆర్ఎస్ మొదటి ఎన్నికల గుర్తు కారు కాదు - మరేంటి
- ఇన్సులిన్ అయిపోతే.. తలచుకుంటేనే భయమేస్తోందా
- దేశీ వాట్సప్ షేర్ చాట్ ఎందుకంత పాపులర్ అయింది?
- గోత్రం అంటే ఏమిటి.. అది ఎలా పుట్టింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








