తల్లి పాలు పట్టేటప్పుడు పిల్లలు చనిపోతారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భూమికా రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళలో గడిచిన ఏడాది కాలంలో పాలు పడుతుండగా ఆరుగురు పిల్లలు మరణించారని వార్తలు వెలువడ్డాయి.
తాజాగా ఇటీవలే పాలక్కాడ్ జిల్లాలోని అట్టప్పాడిలో తల్లిపాలు తాగుతూ ఒక పిల్లవాడు మరణించాడు.
ఇక్కడి ప్రభుత్వ గిరిజన ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ ఆర్.ప్రభుదాస్ గత ఏడాది కాలంలో పాలు తాగుతూ ఆరుమంది పిల్లలు మరణించారని తెలిపారు.
ఇంతకూ ఈ పిల్లలంతా తల్లిపాలు తాగడం వల్లే మరణించారా?
దీనికి జవాబు - కాదు.

పిల్లలు మరణించడానికి కారణం తల్లి పాలు తాగడం కాదు... పాలు పట్టే విధానం
దిల్లీకి చెందిన పిల్లల వైద్యుడు దినేష్ సింఘాల్, ''పిల్లలు మరణించడానికి తల్లి పాలు ఎప్పుడూ కారణం కావు. బహుశా పాలు పట్టేప్పుడు తల్లి నిర్లక్ష్యం వల్ల వాళ్లు మరణించి ఉండొచ్చు,'' అన్నారు.
''మొదట అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ మరణాలకు పాలు పట్టడంతో ప్రత్యక్ష సంబంధం లేదు. చాలాసార్లు తల్లి పిల్లలకు పాలు పట్టేటప్పుడు పాలు ఆహారనాళంలోనికి ప్రవేశించడానికి బదులు ట్రెకియా అని పిలిచే వాయునాళం(విండ్ పైప్)లోనికి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి పాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి. దీని వల్లే పిల్లలు మరణిస్తారు''అని వివరించారు.
కాన్పు అయిన వెంటనే ప్రతి తల్లికీ పిల్లలకు పాలు ఎలా పట్టాలో చెబుతారని ఆయన వెల్లడించారు.
తల్లి పడుకుని పిల్లలకు పాలు పట్టేటప్పుడు ఎక్కువ సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆయన వివరించారు.

దానికి మరో కారణం కూడా ఏదైనా ఉండవచ్చా?
పిల్లలు జన్మించేప్పుడు తల్లికి ఏదైనా అంటువ్యాధి ఉండవచ్చు. పిల్లలు పుట్టినపుడు ఆ వ్యాధి వాళ్లకు కూడా సంక్రమించవచ్చు. తద్వారా వాళ్లు మరణించే అవకాశం ఉందని డాక్టర్ సింఘాల్ తెలిపారు.
ఎన్‌హెచ్‌ఎస్ (అమెరికా జాతీయ ఆరోగ్య పథకం) ప్రకారం, మొదటిసారి పిల్లలకు పాలు పట్టడం మహిళలకు కొంచెం కష్టంగా, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంతమాత్రాన వాళ్లు భయపడాల్సిందేమీ లేదు. పాలు పట్టడం తల్లీపిల్లా ఇద్దరూ కలిసి నేర్చుకోవాల్సిన విషయం.
పిల్లలకు ఎలా సౌకర్యంగా అనిపిస్తుందో అలా పాలు ఇవ్వొచ్చు. కానీ పాలు పట్టేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
ఎన్‌హెచ్‌ఎస్ ప్రకారం, పిల్లలకు పాలు పట్టేప్పడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి:
- పాలు పట్టేప్పుడు సౌకర్యవంతంగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే తల్లి మెత్తని దిండ్లను ఉపయోగించవచ్చు. పాలు పట్టేప్పుడు తల్లి చేతులు, భుజాలు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉండాలి.
- పిల్లల మెడ, భుజాలు, వెనుక భాగాలకు చేతితో ఊతం ఇవ్వాలి.
- పాలు పట్టేటప్పుడు పిల్లవాడి మీద పడకూడదు.
- మొదట చనుమొనలను పిల్లల ముక్కు దగ్గరకు తీసుకెళ్లి, పిల్లలు తమ నోరు మొత్తం తెరవడానికి ప్రయత్నించేలా చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన విషయాలు:
గర్భిణులైన మహిళల కోసం పేరెంట్‌క్రాఫ్ట్ క్లాసులు కూడా ఉంటాయి. వాటిలో గర్భం దాల్చడం నుంచి పిల్లలు పుట్టేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారు.
తల్లిపాలు కేవలం నవజాత శిశువులకు మాత్రమే అవసరం. వాళ్లు పెరిగి పెద్ద కావడానికి వాటి అవసరం లేదు. సాధారణంగా ప్రపంచంలోని ప్రతి తల్లికీ పిల్లలకు పాలెలా ఇవ్వాలో తెలుసు. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాల వల్ల వాళ్లకు తల్లిపాలు లభించకపోవచ్చు.
కానుపు అయిన వెంటనే వచ్చే తల్లిపాలను కొలొస్ట్రమ్ అంటారు. అవి నల్లగా, జిగురుగా, పసుపుపచ్చ రంగులో ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, ఇవి పిల్లల రోగ నిరోధక శక్తికి చాలా అవసరం.
సాధారణంగా పిల్లలకు ఆరునెలల పాటు తల్లిపాలు పట్టాలి. కానీ దాని తర్వాత కూడా పాలు పట్టొచ్చు. అయితే అదే సమయంలో ఇతర ఆహారం కూడా ఇవ్వడం ప్రారంభించాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..
- పిల్లలు పుట్టిన ఆరు నెలల వరకు వాళ్లకు తల్లిపాలు చాలా అవసరం.
- తల్లిపాలు పిల్లలను ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
- పాలు పట్టడం పిల్లలకే కాదు, తల్లులకూ మంచిది.
- మార్కెట్‌లో లభించే ఫార్ములా మిల్క్‌లో తల్లిపాలలో ఉండే యాంటీ బయాటిక్స్ ఉండవు.
- హెచ్‌ఐవీ ఉండే తల్లి నుంచి తల్లిపాల ద్వారా పిల్లలకు కూడా హెచ్‌ఐవీ సంక్రమించే అవకాశం ఉంది. కానీ దీనిని మందుల ద్వారా అరికట్టవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు ఎంత విరామంలో తల్లిపాలు పట్టాలి?
మొదటి వారంలో పిల్లలకు చాలా తక్కువ విరామంలో పాలు పట్టాలి. అంటే ప్రతి గంటా, రెండు గంటలకు వాళ్లు పాలు ఇవ్వాలి.
పిల్లలకు ఆకలైనప్పుడంతా వాళ్లకు పాలు పట్టొచ్చు. కానీ అవసరానికి మించి తాగకుండా చూసుకోవాలి.
పిల్లలు ఆకలితో ఉన్నారని తెలుసుకోవడం ఎలా?
- పిల్లలు చాలా అసౌకర్యంగా అటూ ఇటూ కదులుతారు.
- తమ నోట్లో వేళ్లు పెట్టుకోవడం ప్రారంభిస్తారు.
- నోటి ద్వారా కొన్ని శబ్దాలు చేస్తారు.
తల్లిపాలు పిల్లల ఆకలి తీర్చడం మాత్రమే కాదు, వాళ్ల ఆరోగ్యానికీ చాలా ముఖ్యం. సాధారణంగా పిల్లలకు ఆరునెలల పాటు పాలు పట్టొచ్చు. ఆ పైన పట్టినా మంచిదే.

ఫొటో సోర్స్, Alamy
తల్లిపాలు పిల్లలను ఈ క్రింది వ్యాధుల నుంచి రక్షిస్తాయి:
- అనేక రకాల ఇన్ఫెక్షన్లు
- అతిసార, వాంతి
- సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ (ఎస్‌ఐడీఎస్)
- లుకేమియా
- స్థూలకాయం
- గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలకు పాలు పట్టడం తల్లులకూ మంచిదే
పిల్లలకు పాలు పట్టడం వల్ల..
- తల్లికి రొమ్ము కేన్సర్, ఒవేరియన్ కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడడం) ప్రమాదం తగ్గుతుంది.
పిల్లలకు పాలు పట్టడంపై చాలా అపోహలు ఉన్నాయి.
వాటిలో మొదటిది, పాలు పట్టడం వల్ల వక్షోజాలు సాగుతాయనేది. అయితే ఇది నిజం కాదు.
గర్భధారణ కారణంగా వక్షోజాలను ఎత్తిపట్టే స్నాయువులు కొంత సాగుతాయి. అంతే కానీ పాలు పట్టడానికి, వక్షోజాలు సాగడానికి మాత్రం సంబంధం లేదు.
రెండోది - ఫార్ములా పాలు, తల్లిపాలతో సమానం అన్నది. కానీ డాకర్లు ఇది నిజం కాదంటారు.
ఇంకా అనేక అపోహలు ఉన్నాయి కానీ తల్లిపాలు పిల్లలకు అత్యంత సురక్షితం, ఆరోగ్యకరం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








