ఏటీఎంలు.. ఎనీటైం మూతపడతాయా? - లబ్ డబ్బు

వచ్చే మార్చి నెల నాటికి చాలా ఏటీఎంలు మూతబడతాయనే వార్త ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. డీమానిటైజేషన్‌తో ఎలాంటి ప్రభావం పడిందో దీంతోనూ అలాంటి ప్రభావమే పడుతుందని కొందరంటున్నారు. అంటే.. డబ్బులు తీసుకోవడం కోసం చాంతాడంత క్యూలు కట్టే రోజులు ఎంతో దూరం లేవనేది ఈ వార్తల సారాంశం. అసలింతకూ.. ఏటీఎంలు మూతపడనున్నట్టు హెచ్చరికలు చేసిందెవరు? దీని ప్రభావం ఎలా ఉండొచ్చో చూద్దాం ఈ వారం లబ్-డబ్బులో..
చాలా ఏటీఎంలు మార్చి నెలలోగా మూతపడతాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ హెచ్చరికను జారీ చేసింది మరెవరో కాదు... సాక్షాత్తు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీనే.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కంగారు పడకండి.. నోట్ల రద్దు లాంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు కానీ సగానికి పైగా ఏటీఎంలు మూతపడిపోవడం అనేది మాత్రం నిజంగానే కంగారు పుట్టించే వార్తే. రానున్న నాలుగు నెలల్లో లక్షా 13 వేల ఏటీఎంలు మూతపడొచ్చని చెబుతున్నారు.
అంటే... సంపాదించడానికి మనం ఎంత కష్టపడతామో, మన సొంత డబ్బునే మన పర్సులోకి తెచ్చుకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాలన్న మాట.

ఏటీఎంలను నిర్వహించేది ఎవరు?
సాధారణంగా ఏటీఎంల నిర్వహణ మూడు రకాలుగా ఉంటుంది. మొదటి రకం - బ్యాంకులు స్వయంగా నడిపించేవి. చాలా బ్యాంకులు తమ బ్రాంచీల్లో లేదా బయట ఉండే ఏటీఎంలను నిర్వహిస్తుంటాయి. రెండో రకం, కాంట్రాక్టుకు నడిపించే ఏటీఎంలు. ఏటీఎం మెషీన్లు సరఫరా చేసే కంపెనీలకే బ్యాంకులు వాటిని నడిపించేలా కాంట్రాక్టు ఇస్తాయన్నమాట. నిర్వహణ కోసం బ్యాంకులు కొంత కమీషన్ కూడా చెల్లిస్తాయి. ఇక మూడో రకం- కొన్ని కంపెనీలకు ఏటీఎం మెషీన్లు పెట్టేందుకు లైసెన్సులు ఇచ్చారు. ఇవి కూడా కమీషన్ ఫార్ములాతోనే నడుస్తాయి.
ఏప్రిల్లో ఆర్బీఐ కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటిని 2019 మార్చి వరకూ అమలు చేయాలని ఆపరేటర్లనూ, బ్యాంకులనూ కోరింది ఆర్బీఐ. అయితే, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనీ, ఇక ఏటీఎంలను మూసెయ్యడం తప్ప తమకు గత్యంతరం లేదని కాన్ఫెడరేషన్ అంటోంది.

ఫొటో సోర్స్, Reuters
ఆర్బీఐ తాజా నిబంధనలేంటి?
ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లు ఎల్లప్పుడూ 100 కోట్ల రూపాయలు కలిగి ఉండాలి.
కనీసం 300 ప్రత్యేకమైన క్యాష్ వ్యాన్లు కలిగి ఉండాలి.
సీసీటీవీ కెమరాలు, జీపీఎస్, వైర్లెస్ కమ్యూనికేషన్, హూటర్స్ తప్పనిసరి.
అలాగే పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9, గ్రామీణ ప్రాంతాల్లోనైతే సాయంత్రం 6 గంటల తర్వాత క్యాష్ నింపగూడదు.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు లోపుగానే నగదు నింపాలి.
ఏటీఎం ఆపరేటర్ల డిమాండ్ ఏంటి?
ఆర్బీఐ ఆదేశానుసారం ఇప్పుడు పని చేస్తున్న ఏటీఎంలన్నీ అప్‌గ్రేడ్ చేయాలంటే దాదాపు 3 నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఆపరేటర్లు అంటున్నారు. ఈ వ్యాపారం ఇకపై గతంలోలా లాభదాయకంగా ఉండబోదన్నది వారి వాదన. బ్లూమ్‌బర్గ్ వెలువరించిన ఒక రిపోర్ట్ ప్రకారం, గత ఐదేళ్లుగా ఇంటర్‌ఛేంజ్ చార్జ్ ప్రతి ట్రాన్జాక్షన్‌కు 15 రూపాయల చొప్పున నిలకడగా ఉంటోంది. ఈ చార్జీని పెంచాలన్నది ఏటీఎం ఆపరేటర్లు చేస్తున్న డిమాండ్.

ఫొటో సోర్స్, Reuters
నోట్ల రద్దు తర్వాత నగదు ప్రభావం తగ్గిందా? పెరిగిందా?
సమస్యేంటంటే... నోట్లరద్దు, డిజిటల్ పేమెంట్స్ గురించి ఎన్ని ప్రకటనలు చేస్తున్నా, ఇప్పటికీ నగదు నారాయణుడి ప్రాభవం మాత్రం తగ్గలేదు. ఇది ఆర్బీఐ స్వయంగా చెబుతున్న మాట. ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయడం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
చిక్కు సమస్యేంటంటే, నోట్ల రద్దు తర్వాత జన్ ధన్ ఖాతాలు ఎడాపెడా పెరిగిపోయాయి. మరోవైపు ఏటీఎంల సంఖ్య పెరగడానికి బదులు తగ్గిపోయింది. మొత్తానికి ఇది ఆందోళన కలిగించే పరిణామమే. అయితే దేశంలో రెండో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంకు మాత్రం ఏటీఎంలను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఎలాగూ ఇది 2019లో జరగనుంది కాబట్టి ఆ లోగా ఏం మార్పులు జరుగుతాయో, ఎవరికి తెలుసు?
ఇవి కూడా చదవండి:
- నోట్ల రద్దు: భారీ కుంభకోణం... ఆ 15 మంది కోసం మోదీ చేసిన కుట్ర - రాహుల్ గాంధీ
- రిజర్వు బ్యాంకుకూ కేంద్రానికీ మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది?
- తెలుగు రాష్ర్టాల్లో ‘నో క్యాష్’ .. ఎందుకో తెలుసా!?
- పెద్ద నోట్ల రద్దుకి ఏడాది - భారత్ ఆర్థికంగా బలపడిందా? బలహీనపడిందా?
- ఏటీఎంలోని నోట్లను కొరికేసిన ఎలుకలు
- లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: స్వదేశీ ఉద్యమం సాక్షిగా మొదలు
- ‘క్యాష్ లెస్’ దొంగతనాలు: పర్సులు కొట్టేవారంతా ఇప్పుడు పక్షుల వెంటపడ్డారు
- డిజిటల్ ఇండియాపై మోదీ మాటల్లో వ్యత్యాసం
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








