నోట్ల రద్దు: భారీ కుంభకోణం... ఆ 15 మంది కోసం మోదీ చేసిన కుట్ర - రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Inc
‘‘పెద్ద నోట్ల రద్దు వెనుక నరేంద్ర మోదీ ఉద్దేశం చాలా స్పష్టం. ప్రతి భారతీయుడూ దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్న 15-20 ధనవంతులు, అత్యంత అవినీతి పరులు తమ నల్లధనాన్ని మార్చుకోవడానికే పెద్దనోట్లను రద్దు చేశారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలను, దుకాణదారుల్ని అంతం చేసి, పెద్దవాళ్లకు సహకరించటమే దీని ఉద్దేశం. పెద్దనోట్ల రద్దు పొరపాటు కాదు. ఇది చిన్న, మధ్యతరహా వ్యాపారులను ఆక్రమించేందుకు చేసిన కార్యక్రమం. మీ కాళ్లు నరికేందుకు వేసిన గొడ్డలి. ఇదొక పొరపాటు అనుకోకండి. ఇది కావాలని.. మీకు నష్టం చేయాలని.. మిమ్మల్ని అంతం చేయాలని తీసుకున్న నిర్ణయం. అమెజాన్ వంటి అతిపెద్ద కంపెనీలకు మార్గం తెరిచేందుకు ఇదొక పద్ధతి’’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
2016 నవంబర్ 8వ తేదీన రద్దు చేసిన రూ.వెయ్యి, రూ.500 నోట్లలో 99.3 శాతం నోట్లు తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని బుధవారం(ఆగస్టు 30వ తేదీ) రిజర్వు బ్యాంకు ప్రకటించింది.
రద్దయిన నోట్ల విలువ రూ.15.41 లక్షల కోట్లు కాగా.. బ్యాంకుల్లో చేరిన నోట్ల విలువ రూ.15.31 లక్షల కోట్లు అని రిజర్వు బ్యాంకు తెలిపింది. జమకాని నోట్ల విలువ రూ.10, 720 కోట్లు. దాదాపు రూ.3 లక్షల కోట్లు జమ కాకపోవచ్చని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం కనుమరుగు అవుతుందని, నకిలీ కరెన్సీ పోతుందని, ఉగ్రవాదానికి ఎదురుదెబ్బ తగులుతుందని ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం నగదు వెనక్కు వచ్చింది. రెండు శాతం జీడీపీ, కోట్లాది మంది ఉపాధి కోల్పోయినప్పటికీ పెద్ద నోట్ల రద్దు వల్ల ఫలితం లేదు. ఈ దేశ ప్రజలకు ముఖ్యంగా యువతకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. దేశానికి ఇంత పెద్ద గాయం చేయటానికి కారణం ఏంటి? ఇందులో హేతుబద్ధత ఏంటి?
ప్రధాని పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేశారో నేను కారణం చెబుతాను. నరేంద్ర మోదీకి చెందిన 15-20 మంది అతిపెద్ద క్రోనీ కేపిటలిస్టులు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. నరేంద్ర మోదీ ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకుని, దేశంలోని అతిపెద్ద క్రోనీ కేపిటలిస్టుల జేబులో వేశారు. నోట్ల రద్దు లక్ష్యం ఇదే. ఆ సమయంలో నరేంద్ర మోదీ స్నేహితులంతా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చారు. దీనికి ఉదాహరణ.. అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న గుజరాత్ కో ఆపరేటివ్ బ్యాంకులో 700 కోట్ల రూపాయలు మార్చారు. ఇదో కుంభకోణం. 70 ఏళ్లలో దేశంలో జరగనిది, ఎవ్వరూ చేయలేనిది నరేంద్ర మోదీ చేశారు.. దేశంలో మంట పెట్టారు. ఇదంతా ఎందుకు చేశారో దేశ యువత, చిన్న వ్యాపారులకు నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి. వీళ్లందరి నుంచి డబ్బు తీసుకుని 15-20 మంది పారిశ్రామిక వేత్తలకు ఎందుకిచ్చారు? పెద్ద నోట్ల రద్దు ప్రధాన సమస్య ఇదే.

ఫొటో సోర్స్, Reuters
పరువు నష్టం దావాలు వేస్తే.. వాస్తవాలు మారిపోవు
అనిల్ అంబానీ కాంగ్రెస్ పార్టీపైన ఎన్ని పరువు నష్టం దావాలు వేసినా.. జిల్లాకు ఒకటి వేయాలనుకున్నా వేయొచ్చు. కానీ, పరువునష్టం దావాల వల్ల వాస్తవాలు మారిపోవు. 15-20 మంది స్నేహితుల కోసమే నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేశారు. ఇదే నిజం. తన స్నేహితులకు మద్దతు ఇచ్చేందుకే రాఫెల్ కుంభకోణం కూడా చేశారు.
పెద్ద నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం తప్ప మరొకటి కాదు. దీనికి సాక్ష్యాలు కూడా బయటపడుతున్నాయి. మరిన్ని బయటకొస్తాయి. నల్లధనం తగ్గలేదు. ఉగ్రవాదం తగ్గలేదు. నోట్లు తగ్గలేదు. ఏదో ఒక కారణం ఉంటుంది కదా! ఆ కారణమే నేను చెబుతున్నా.
దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా రాహుల్ స్పందిస్తూ.. క్షమాపణ ఎప్పుడు కోరతారు? పొరపాటు జరిగినప్పుడు. ప్రధానమంత్రి పొరపాటు చేయలేదు. ప్రధానమంత్రి కావాలనే ఇదంతా చేశారు. దేశంలోని అతిపెద్ద క్రోనీ కేపిటలిస్టులు ప్రధాని ప్రచారం కోసం డబ్బులిచ్చారు. కాబట్టే, టీవీల్లో ప్రతిరోజూ నరేంద్ర మోదీ ముఖం కనిపిస్తుంటుంది. అలాంటి క్రోనీ కేపిటలిస్టులకు డబ్బు ముట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేశారు. ఆ డబ్బు ఎలా లభిస్తుంది? దేశంలోని రైతులు, మహిళలు, చిన్న దుకాణదారులు, చిన్న, మధ్యతరహా వ్యాపారుల జేబుల్లోంచి డబ్బుల్ని తీసి.. తన 15-20 క్రోనీ కేపిటలిస్టులకు ఇచ్చారు. ఇదొక వ్యవస్థ. ఈ క్రోనీ కేపిటలిస్టులు నరేంద్ర మోదీకి ప్రచారం చేసిపెడతారు. నరేంద్ర మోదీ ప్రజల నుంచి డబ్బు లాగేసుకుని క్రోనీ కేపిటలిస్టులకు ఇస్తారు. చాలా సింపుల్.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ, జైట్లీలు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేశారు
కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించి చూపించింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రికార్డులు చూడండి. నరేంద్ర మోదీ, అరుణ్ జైట్లీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేశారు. మా హయాంలో 2.5 లక్షల కోట్ల రూపాయల మొండి బాకీలు ఉన్నాయి. అవన్నీ కూడా నియంత్రించగల పరిధిలోనే ఉన్నాయి. ఇప్పుడు దేశంలోని మొండి బాకీలు 12 లక్షల కోట్ల రూపాయలు. ఎందుకు? ఎందుకంటే.. నరేంద్ర మోదీ తన స్నేహితులను రక్షించారు. గతంలో 20 సూత్రాల పథకం ఉండేది.. ఇప్పుడు సింగిల్ పాయింట్ పథకం.. అది.. దేశంలోని క్రోనీ కేపిటలిస్టులకు ఎలా మద్దతు ఇవ్వాలి? అన్నదే.
రాఫెల్ ఒప్పందంపై బుధవారం అరుణ్ జైట్లీ ప్రశ్నలు వేశారు. ఆయన ప్రశ్నలు అడగొచ్చు. నేను ఒప్పుకుంటున్నా. నేను అరుణ్ జైట్లీ ద్వారా నరేంద్ర మోదీకి కూడా ఆప్షన్ ఇచ్చాను. ప్రశ్నలు అడుగుదాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించి ప్రశ్నలు అడుగుదాం. అంతా స్పష్టమవుతుంది. రాఫెల్ ఒప్పందంలో ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. నాకైతే ఎలాంటి ఇబ్బందీ లేదు. కాంగ్రెస్ సహా ఏ ప్రతిపక్ష పార్టీకి అభ్యంతరం లేదు. మేమంతా కోరుతున్నాం. అరుణ్ జైట్లీ చాలా సుదీర్ఘంగా వ్యాసాలు రాస్తున్నారు. కానీ, జేపీసీ గురించి మాత్రం మాట్లాడట్లేదు. నేను అనుకుంటున్నా.. జైట్లీ దొరికిపోయారు. అనుమతి ఇవ్వాల్సింది నరేంద్ర మోదీ. మరి మోదీని జైట్లీ అడిగారో లేదో.

నరేంద్ర మోదీ, అనిల్ అంబానీ మధ్య ఒప్పందం ఏంటి?
రాఫెల్ చాలా సుస్పష్టమైన కేసు. అనిల్ అంబానీ ఎన్నడూ విమానాలు తయారు చేయలేదు. అనిల్ అంబానీ 45 వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నారు. అనిల్ అంబానీ రాఫెల్ ఒప్పందం జరగడానికి కొన్ని రోజుల ముందే కంపెనీ పెట్టారు. మరోవైపు హెచ్ఏఎల్ కంపెనీ.. 70 ఏళ్లుగా విమానాలు తయారు చేస్తోంది. ఎలాంటి అప్పులూ లేవు. వేలాది మంది ఇంజనీర్లు ఈ కంపెనీలో పనిచేయాలనుకుంటారు. 520 కోట్ల రూపాయలు విలువ చేసే విమానాన్ని 1600 కోట్ల రూపాయలకు ఎందుకు కొనుగోలు చేశారు? చాలా చిన్న ప్రశ్న. ఎవరికి లాభం చేకూర్చేందుకు కొన్నారు? అరుణ్ జైట్లీ కొన్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. వేయొచ్చు. కానీ, ఈ మూడు ప్రశ్నలకైతే స్పష్టంగా సమాధానాలు ఇవ్వండి. జేపీసీ వేయండి. దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటోంది నరేంద్ర మోదీ, అనిల్ అంబానీలు ఏం ఒప్పందం కుదుర్చుకున్నారోనని.
ఆ విమానాలు వేరు.. ఈ విమానాలు వేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు. కానీ, తాము ఇస్తామన్న విమానాలు ఒకటేనని ఫ్రాన్స్ చెబుతోంది. గతంలో భారత వాయుసేన పరీక్షించిన విమానాలనే ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనే ఫ్రాన్స్ స్పష్టంగా పేర్కొంది. మరి ఇప్పుడు మాట్లాడుతోంది ఎవరు? అక్కడ ఉన్నది ఎవరు? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయేనా లేక వేరే ఎవరైనానా? ఆయన అబద్ధాలాడుతున్నారు.
15 లక్షల రూపాయలు ఇస్తానని, రైతులకు మద్దతు ధర ఇస్తానని, బుల్లెట్ రైళ్లు తెస్తానని.. ఇలా ప్రధానమంత్రి చాలా హామీలు ఇచ్చారు. మేం వాటిని సీరియస్‌గా తీసుకోం. అయితే, ప్రధానమంత్రి చెప్పే అబద్ధాలను మాత్రం పట్టుకుంటాం. రాఫెల్ విషయంలో అనిల్ అంబానీకి మద్దతు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి కృషి చేశారు. బీజేపీ అధ్యక్షుడి హయాంలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.700 కోట్లు నగదు మారింది. పెద్ద నోట్లను రద్దు చేయటానికి ముందు పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను కొనుగోలు చేసింది. మా పని ప్రజలకు వాస్తవాలు చెప్పడమే.

ఫొటో సోర్స్, BJP
అబద్ధాల ఆధారంగా భవంతులను కట్టలేరు - బీజేపీ
రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఆయన మాటల్లోనే..
గత మూడేళ్లుగా రాహుల్ గాంధీ చెప్పిందే చెబుతున్నారు. ఆయన చెప్పినదాంట్లో కొత్తదేమీ లేదు. పెద్దనోట్ల రద్దు గురించి రాహుల్ చేసిన ఆరోపణలన్నీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు నుంచీ చేస్తున్నవే. రాజకీయంగా జరిగిన నష్టం ఏంటో అందరూ చూశారు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలా జరిగిందో. ఈ దేశంలో అసలైన జడ్జిలు ప్రజలే. వాళ్లే ఓట్లేసి మరీ తీర్పు ఇస్తారు. అంత సమాధానం లభించిన తర్వాత కూడా ఇంకా అవే ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గాంధీ కుటుంబ సభ్యులు దోచి, దాచిన సొమ్ము అంతా పెద్ద నోట్ల రద్దుతో చిత్తు కాగితాలైపోయాయి. వాటిని చూసి సోనియా, రాహుల్ గాంధీలు కన్నీరు కారుస్తున్నారు. ఆంగ్ల భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అన్ని కుంభకోణాలు చేసిపెట్టింది. అలా ప్రజల జేబులు దొంగిలించి దాచిన సొమ్ము అంతా ఇప్పుడు చిత్తుకాగితాలు అవటంతోనే ఆయన రోధిస్తున్నారు. దేశానికి సంస్కరణ, రాహుల్ గాంధీకి చెడ్డ విషయం అవుతుంది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లోని 15 మంది పారిశ్రామిక వేత్తల్లో ఒక్కరైనా మా హయాంలో ధనవంతులైన వారు ఉన్నారా? మేం అధికారం చేపట్టకముందు నుంచే ఉన్నారా? వీరంతా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ధనవంతులయ్యారు. బ్యాంకుల మొండి బకాయిల గురించి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధానమంత్రి మోదీయే సమాధానం ఇచ్చారు. రాఫెల్ ఒప్పందంపై వివాదం రేపి రాజకీయంగా ఎదగాలని రాహుల్ గాంధీ చూస్తున్నారు కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా వాదిస్తున్నారు. దీన్ని అరుణ్ జైట్లీ పూర్తిగా ఎండగట్టారు. జైట్లీ సంధించిన 20 ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెప్పాలి. భారతదేశం ఆర్థికంగా బలోపేతం అయ్యింది నరేంద్ర మోదీ హయాంలోనే. ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా రాహుల్ గాంధీ రాజకీయంగా ఎదగలేదు. అబద్ధాల ఆధారంగా భవంతులను కట్టలేరు. భూమిపై వర్షం ఎక్కడ పడినా అది సముద్రంలోకే వెళుతుంది. ఈ దేశంలో ఏ కుంభకోణం జరిగినా అది 10, జన్‌పథ్‌కే దారి తీస్తుంది. కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు.
ఇవి కూడా చదవండి:
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- రూపాయి నోటుకు వందేళ్లు
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
- నగదురహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న స్వీడన్
- ‘క్యాష్ లెస్’ దొంగతనాలు: పర్సులు కొట్టేవారంతా ఇప్పుడు పక్షుల వెంటపడ్డారు
- ‘ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ దొంగతనం’: ‘ఆ కరెన్సీ ఎక్కడికి వెళ్లిందో తెలిసింది’
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- ఇంటర్నెట్ ఓటింగ్.. తెలుసుకోవాల్సిన విషయాలు
- రష్యా: ‘65 ఏళ్లకు పింఛన్’ అంటున్న ప్రభుత్వం.. 'మేం అంత కాలం జీవించం' అంటున్న జనం
- వరవరరావు అరెస్ట్: గృహనిర్బంధం అంటే ఏంటి?
- భారతీయ యువతులు చైనా యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకోరు?
- ట్రంప్: మాకు ఓటేయకపోతే 'అన్నీ కోల్పోవాల్సి వస్తుంది'
- #MeTooUrbanNaxal: ‘అధికారాన్ని, వ్యవస్థను ప్రశ్నించేవారంతా అర్బన్ నక్సలైట్లైతే నేనూ అర్బన్ నక్సల్నే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










