క్యాష్‌లెస్ గ్రామాలు: ఏడాది తర్వాత ఎలా ఉన్నాయ్?
రిపోర్టర్ : దీప్తి బత్తిని, షూట్ ఎడిట్-ప్రోగ్రాం ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్
నోట్ల రద్దు తర్వాత తెలంగాణలోని 386 గ్రామాలు నగదు రహితమని ప్రకటించుకున్నాయి. ఈ ఏడాది కాలంలో ఆ గ్రామాల్లో నగదు రహిత వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి బీబీసీ తెలుగు ప్రతినిధి దీప్తి బత్తిని కొన్ని గ్రామాలకు వెళ్లి పరిశీలించారు.
2016 డిసెంబరులో నగదు రహితంగా ప్రకటించుకున్న గ్రామాల్లో తెలంగాణలోని ఇబ్రహీంపూర్ మొదటిది. ఈ గ్రామ జనాభా 1,200 వరకు ఉంటుంది. ఇప్పటికీ నగదు అవసరం రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
నోట్ల రద్దు చేసినపుడు చాలా ఇబ్బందులు పడ్డామని, రోజూ బ్యాంకుల ముందు క్యూ కట్టేవాళ్లమని గ్రామానికి చెందిన రజిత చెప్పారు. అయితే గ్రామంలో డిజిటల్ లావాదేవీలు మొదలయ్యాక పరిస్థితి మారినట్లు తెలిపారు. ఊళ్లో చాక్లెట్ కొనాలన్నా ఇప్పుడు డిజిటల్ లావాదేవీల ద్వారానే కొంటున్నామని వివరించారు.
ఈ గ్రామంలోని రెండు దుకాణాలకు కార్డు స్వైప్ చేసే పీవోఎస్ మెషీన్లను ఆంధ్రా బ్యాంక్ సమకూర్చింది. సాధారణంగా కార్డుతో లావాదేవీ జరిపితే బ్యాంకులు నెలనెలా రూ.1,400 వసూలు చేస్తాయి. అయితే, ఇక్కడ మాత్రం 2017 మార్చి వరకు ఆ చార్జీలు వసూలు చేయకుండా బ్యాంకు అధికారులు మినహాయింపు ఇచ్చారు.
అయితే, మార్చి తర్వాత చార్జీలు వసూలు చేయడంతో దుకాణదారులు ఆ మెషీన్లను తిరిగి బ్యాంకుకు ఇచ్చేశారు.కానీ, ఇబ్రహీంపూర్ గ్రామస్తులు ఇప్పటికీ నగదురహితంగానే ఉండాలనుకుంటున్నారు.
ఈ గ్రామానికి రెండు ఆధార్ అనుసంధాన యంత్రాలను ఆంధ్రా బ్యాంక్ ఉచితంగా ఇచ్చింది. దుకాణదారులకు మాత్రం ఇంటర్నెట్ వాడకం కాస్త ఇబ్బందిగా ఉంటోందని చెబుతున్నారు. ముఖ్యంగా నెట్ వేగం తగ్గినప్పుడు ఆన్‌లైన్ లావాదేవీలు జరపడం కష్టమవుతోందని చెపుతున్నారు.
మరోవైపు గ్రామంలో అందరికి ఆధార్ అనుసంధాన బ్యాంకు కార్డులు లేవు.
ఈ గ్రామంలోనే కిరాణషాపు నిర్వహిస్తున్న రామస్వామి రోజుకు రూ.2 వేల వరకు వ్యాపారం చేస్తారు. ఒక చిన్న ఏటీయంను కూడా నిర్వహిస్తున్నారు. ఆయన నగదు రహిత విధానంపై మాట్లాడుతూ "బిస్కెట్టో, సబ్బో కొన్నప్పుడు కూడా గ్రామస్తులు నగదు ఇవ్వడం మానేశారు. ఇప్పుడు సమస్యంతా ఇంటర్నెట్ వేగం తక్కువున్నప్పుడే. ఊరి వాళ్లయితే తరువాత ఇమ్మంటాను. కానీ బయటివారు, తెలియని వాళ్లను అలా అడగలేను. ఆధార్ కార్డుతో కూడా ఇదే సమస్య ఎదురవుతోంది'' అని చెప్పారు.
మరోవైపు, నగదు రహితమని ప్రకటించిన 386 గ్రామాల్లో పూర్తిస్థాయిలో క్యాష్‌లెస్ విధానం అమలు కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
స్వైపింగ్ మెషీన్లకు అద్దె కట్టాల్సి రావడంతోనే చాలా గ్రామాలు నగదురహిత విధానాన్ని కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నాయి.
ఇబ్రహీంపూర్ నగదురహిత గ్రామంగా మారిన తర్వాత గ్రామానికి చెందిన నరసమ్మలాంటి మహిళలు కూడా డిజిటల్ లావాదేవీలు చేయడం నేర్చుకున్నారు.
"దుకాణానికి వెళ్లేప్పుడు నా మనవడిని తీసుకెళ్తా. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసి సరుకులు కొంటాం. లావాదేవీలు సరిగా జరగడంలో నా మనవడు సాయం చేస్తాడు. నా ఫోన్ కి బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది. అందులో డబ్బెంతుందో చూసుకోవచ్చు" అని ఆమె చెప్పింది.
ఈ గ్రామానికి అరకిలోమీటర్ దూరంలో బంజరుపల్లి ఉంది. ఇక్కడ రెండు దుకాణాలు ఉన్నాయి కానీ, స్వైపింగ్ మెషీన్ ఒక్కటీ లేదు.
"మా దగ్గర కార్డులు, మెషీన్లు లేవు. పక్క ఊళ్లో మెషీన్లున్నాయి కానీ, డబ్బు కావల్సొచ్చిన ప్రతీసారీ బ్యాంకుకు పరుగెత్తాలి" అని గ్రామానికి చెందిన వై.రామచంద్రుడు చెప్పారు.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
