వరవరరావు అరెస్ట్: గృహనిర్బంధం అంటే ఏంటి?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, దల్జిత్ అమి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విప్లవ రచయితల సంఘం నాయకుడు పెండ్యాల వరవరరావు సహా ఐదుగురు పౌర హక్కుల ఉద్యమకారులను సెప్టెంబర్ 6 వరకు గృహ నిర్బంధంలో ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో చోటు చేసుకున్న హింస కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా దాడులు చేసిన పుణె పోలీసులు అయిదుగురు ఉద్యమకారులు - వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జనవరిలో భీమా కోరెగావ్‌లో దళితుల్ని వారు రెచ్చగొట్టారని, ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసతో వారికి సంబంధం ఉందని, ‘అత్యున్నత నేత’ హత్యకు వారు కుట్ర పన్నారన్నది పోలీసుల ఆరోపణ.
పుణె తరలించిన వరవరరావు, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను వారివారి స్వగృహాల్లోనే నిర్బంధించాలని తెలిపింది. గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లు ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉన్నందున ఆ నిర్బంధాన్ని కొనసాగించింది.
పౌరహక్కుల కార్యకర్తలు, విప్లవ రచయితల నివాసాలపై దేశవ్యాప్తంగా మంగళవారం పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా.. హౌస్ అరెస్ట్, ట్రాన్సిట్ రిమాండ్, యూఏపీఏ లా వంటి పలు న్యాయపరమైన పదాలు మీడియా వార్తల్లో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. విలేఖరులు, పోలీసులు, లాయర్లు కూడా ఈ పదాలు వాడుతున్నారు.
ఈ పదాలు, వాటి అర్థాలు ఏంటో వివరంగా మీ కోసం..

ఫొటో సోర్స్, Getty Images
హౌస్ అరెస్ట్
ఆంగ్ల భాషలో హౌస్ అరెస్ట్.. తెలుగులో గృహ నిర్బంధం. వాస్తవానికి ఇది భారతీయ న్యాయ వ్యవస్థలోని పదం కాదు. దీని అర్థం సదరు వ్యక్తిని వారి నివాసానికే పరిమితం చేయడం. పోలీసు స్టేషన్‌కు గానీ, జైలుకు కానీ తీసుకువెళ్లకుండా, వారి ఇంట్లోనే నిర్బంధంలో ఉంచడం.
గృహ నిర్బంధంలో ఉన్నవారు ఎవరిని కలవొచ్చు, ఎవరిని కలవకూడదు.. ఎవరితో మాట్లాడొచ్చు, ఎవరితో మాట్లాడకూడదు వంటి షరతులు కూడా విధించవచ్చు. అయితే, ఇంట్లో ఉన్నంత మాత్రాన సాధారణ పౌరులకు ఉన్నంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఆ ఇంట్లో నివశించే వ్యక్తులు, లేదా న్యాయవాదులను మాత్రమే కలిసేలా ఈ నిర్బంధం ఉండొచ్చు.
గృహ నిర్బంధాన్ని చట్టబద్ధమైన శిక్షగా పరిగణిస్తుంటారు. హింసకు పాల్పడని నిందితులను ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తారుమారు చేయకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా చూసేందుకు హౌస్ అరెస్ట్ చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
సెర్చ్ వారెంట్
పోలీసులు కానీ, దర్యాప్తు సంస్థ కానీ ఎవరైనా వ్యక్తి, ఏదైనా బిల్డింగ్ లేక వాహనాన్ని సోదా చేసేందుకు అధికారాన్ని కల్పించే చట్టబద్ధమైన ఆదేశం సెర్చ్ వారెంట్.
పోలీసులు సెషన్స్ కోర్టు (మేజిస్ట్రేట్ లేదా న్యాయమూర్తి)ని సంప్రదించి నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించే నిమిత్తం ఈ సెర్చ్ వారెంట్‌ను పొందుతారు.
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లోని సెక్షన్ 91, 92, 93ల ప్రకారం ఏదైనా విశ్వసనీయ సమాచారం, సహేతుకమైన అనుమానం, భోగట్టాలను కారణాలుగా చూపించొచ్చు.
ఒకవేళ పోలీసులు తమ పరిధిలో లేని ప్రాంతంలో సోదాలు జరపాల్సి వస్తే.. స్థానిక పోలీసులను కూడా తమతోపాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ ప్రదేశానికి చెందిన పోలీసు స్టేషన్ రికార్డుల్లో సోదాల గురించి పేర్కొనాల్సి ఉంటుంది.
ఈ సోదాల ప్రక్రియలో భాగంగా పోలీసులు నేరారోపణలకు బలం చేకూర్చే ఆధారాలను స్వాధీనం చేసుకోవచ్చు. అయితే, అలా స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను 'సోదాలు, జప్తు' మెమోలో పేర్కొనాలి. ఇదంతా ఇద్దరు పౌర సాక్షుల సమక్షంలో జరగాల్సి ఉంటుంది. ఈ మెమోపై సోదాలు జరిపిన అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది.
కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సెర్చ్ వారెంట్ లేకుండా కూడా పోలీసులు సోదాలు జరపొచ్చు. అరెస్టు చేయాల్సిన నిందితుడు అయి ఉండి, విచారణార్హమైన సోదాలను కనుక పోలీసులు నిర్వహిస్తే వాటికి అనుమతి లభిస్తుంది.
ఒకవేళ సోదాలు చేసే భవనంలో మహిళలు మాత్రమే నివసిస్తుంటే.. రాత్రి వేళల్లో సోదాలు జరపకూడదు. పగటి వేళల్లో జరిపే సోదాలను కూడా మహిళా పోలీసుల సమక్షంలోనే చేపట్టాలి.

ఫొటో సోర్స్, Getty Images
అరెస్ట్ వారెంట్
ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేస్తుంది. అరెస్ట్ వారెంట్ ఆధారంగా ఆస్తులను కూడా తనిఖీ చేయవచ్చు, వాటిని జప్తు కూడా చేయవచ్చు.
నేరం ఎలాంటిది అనే దానిని బట్టి, ఇది బెయిల్ లేదా నాన్ బెయిలబుల్ కావచ్చు. పోలీసులు తమ చట్టపరిధికి బయట ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు, వారు స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. తాము చేసిన అరెస్టు గురించి లోకల్ పోలీస్ స్టేషన్ డైరీలో రాయవలసి ఉంటుంది.
గుర్తించదగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకపోయినా నిందితులను అరెస్ట్ చేయవచ్చు. ఆ వ్యక్తిని 24 గంటల్లోపల కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది.
సెక్షన్ 41 ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తికి పోలీసులు బెయిల్ ప్రక్రియ గురించి చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇతర వివరాలు కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది.
సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం పోలీసులు, ఒకరిపై ఏదైనా ఫిర్యాదు నమోదైనప్పుడు లేదా వారికి వ్యతిరేకంగా ఏదైనా ధ్రువీకరించిన సమాచారం ఉన్నప్పుడు మాత్రమే వారిని అరెస్టు చేయగలరు. ఫిర్యాదు ప్రకారం నిందితులకు ఏడేళ్ల శిక్ష పడుతుంది అనిపిస్తే, వారిని అరెస్ట్ చేయవచ్చు
నిందితుడు ముందు ముందు ఏదైనా నేరం చేసే అవకాశం ఉందనిపిస్తే, సాక్ష్యాలను, దర్యాప్తును ప్రభావితం చేయవచ్చు అనిపిస్తే అతడిని అరెస్ట్ చేయవచ్చు.
ఈ చట్టం ప్రకారం అరెస్టు చేస్తున్న వ్యక్తికి తాము ఎందుకు అరెస్టు చేస్తున్నామో పోలీసులు చెప్పాల్సి ఉంటుంది. 41D అరెస్ట్ అయిన ఒక వ్యక్తికి పోలీసు విచారణ సమయంలో తన వకీలును సంప్రదించే హక్కును అందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాన్సిట్ రిమాండ్
అరెస్టు చేసిన 24 గంటల్లోపు నిందితులను సంబంధిత కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అరెస్టులు.. ఆయా అధికారుల ప్రాదేశిక పరిధి బయట లేదా కోర్టులో హాజరు పరచడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంటే, ట్రాన్సిట్ రిమాండ్ కోసం అరెస్ట్ చేసిన వ్యక్తిని సమీప కోర్టులో ప్రవేశపెట్టవచ్చు.
సీఆర్పీసీ సెక్షన్ 76 ప్రకారం మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ లభించిన తర్వాతే పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని తమ స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి.

ఫొటో సోర్స్, Getty Images
హెబియస్ కార్పస్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226లో హెబియస్ కార్పస్ ప్రస్తావన ఉంది. ఇది ఒక లాటిన్ పదం. దీనికి 'మీ దగ్గర శరీరం ఉంది' అని అర్థం
ఒక వేళ ఒక వ్యక్తిని తప్పుడు పద్ధతుల్లో అరెస్టు చేస్తే, అతడిని అక్రమంగా జైల్లో పెడితే, 24 గంటల్లోపల అతడిని కోర్టులో హాజరు పరచకపోతే, అరెస్ట్ అయిన వ్యక్తి దగ్గరి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చు. కో
ఈ పిటిషన్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టులో అయినా వేయవచ్చు. దీనిపై ఏరోజు పిటిషన్ వేస్తారో, అదే రోజు విచారణ జరపవచ్చు. అవసరమైతే జడ్జి ఇంట్లో కూడా ఈ పిటిషన్‌పై విచారణ జరపవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
అక్రమ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)
1962లో దేశ సౌర్వభౌమాధికారం, ఐక్యతను కాపాడేందుకు అక్రమ కార్యకలాపాల చట్టం రూపొందించారు. దీనిని 2004 తర్వాత చాలా సార్లు అమలు చేశారు.
అతివాదం లేదా అక్రమ కార్యకలాపాలకు మద్దతివ్వడం లాంటిది జరిగినట్టు అనిపిస్తే, ఈ చట్టం ప్రకారం ఎలాంటి అరెస్టు వారెంట్ లేకుండానే వారిని అదుపులోకి తీసుకోవచ్చు.
ఒక వ్యక్తికి ఏదైనా అతివాద సంస్థతో లేదా నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తే.. ఈ చట్టం ప్రకారం వారిపై దర్యాప్తు జరిపించవచ్చు.
ఈ చట్టం ప్రకారం ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు. ఈ ప్రత్యేక చట్టం ప్రకారం పోలీసులు ఆరు నెలల్లోపు చార్జ్ షీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. సాధారణ చట్టాల్లో అయితే చార్జిషీటు మూడు నెలల్లోపల దాఖలు చేయడం తప్పనిసరి.
ఈ చట్టం ప్రకారం బెయిల్ లభించడం కఠినతరం అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- భారతీయ యువతులు చైనా యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకోరు?
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?
- 'కార్డు'లను కరెన్సీనోట్లుగా మార్చేందుకు సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే..
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- కృత్రిమ మేధస్సు: కాల్ సెంటర్లలో ఉద్యోగాలు హుష్ కాకేనా?
- ‘మద్యపానం.. మితంగా తాగినా ముప్పే’
- రోహింజ్యాల వలసలకు ఏడాది: శరవేగంగా ముదిరిన శరణార్థుల సంక్షోభం
- అటల్ బిహారీ వాజ్‌పేయి చితికి నిప్పంటించిన నమిత ఎవరు?
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








