అత్యున్నత నేతను లక్ష్యం చేసుకున్నారు: పుణె పోలీసులు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, మయూరేష్ కొన్నూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర ఎల్గార్ పరిషత్, భీమా కోరెగాం హింసకు సంబంధించిన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పుణె కోర్టు గృహ నిర్బంధానికి పంపింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు జరిపిన ఒక రోజు తర్వాత, విరసం నేత వరవరరావు, ముంబై లాయర్లు, ఉద్యమకారులు అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోంజాల్వెజ్‌ను బుధవారం సాయంత్రం అదనపు సెషన్స్ కోర్ట్ జడ్జ్ కేడీ వదానే గృహ నిర్బంధానికి అప్పగించారు.
మానవ హక్కుల సంఘం నేతలు సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖాను వారి వారి రాష్ట్రాల పోలీసులు తీసుకెళ్లారు.
అదుపులోకి తీసుకున్న అందరినీ పోలీసులు వారి సొంత ఇళ్లలో గృహ నిర్బంధంలో ఉంచనున్నారు. పుణెలోని ముగ్గురు నిందితులను గురువారం వారి ఇళ్లకు తీసుకువెళ్తామని పోలీసులు తెలిపారు.
కాగా గురువారం ఉదయం వరవరరావు ఇంటికి చేరుకున్నట్లు ఆయన అల్లుడు కూర్మనాథ్ ఫేస్‌బుక్‌లో తెలిపారు. అందుకు సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేశారు.
అంతకు ముందు కోర్టులో ఏం జరిగింది
పుణె పోలీసుల తరఫున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్ "ముగ్గురు నిందితులు నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సంస్థలో క్రియాశీల సభ్యులని, 2017, డిసెంబర్ 31న పుణెలో ఎల్గార్ పరిషత్(కాంక్లేవ్) పేరుతో నిర్వహించిన సమావేశంలో పన్నిన కుట్రకు సంబంధించి వారిని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని" వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే కేసులో జూన్‌లో అరెస్టులు జరిగినపుడు స్వాధీనం చేసుకున్న పత్రాలు, లేఖల గురించి కోర్టుకు చెప్పిన పోలీసులు వాటిలో వరవరరావు, ఫెరీరా, గోంజాల్వెజ్ పేర్లు ఉన్నట్టు కోర్టుకు తెలిపారు.
భీమా కోరెగాం ఘర్షణలకు దారితీసిన సమావేశానికి ఐదుగురు కారణమని పుణె పోలీసులు ఆరోపించారు.
"అయితే, నిందితుల మధ్య ఆ లేఖల మార్పిడి జరగలేదు. ఈ ఏడాది జూన్‌లో సురేంద్ర గాడ్లింగ్, సోమా సేన్, రోనా విల్సన్, మహేష్ రౌత్, సుధీర్ ధవాలే అరెస్టుల తర్వాత పోలీసులు ఈ లేఖలు స్వాధీనం చేసుకున్నారు" అని అడ్వకేట్ పవార్ తెలిపారు.
"ఈ తీవ్రవాద సంస్థల కోసం నేపాల్, మణిపూర్ నుంచి ఆయుధాలు కొనే బాధ్యతను వరవరరావు తీసుకున్నారు. ఫెరీరా, గోంజాల్వెజ్ విద్యార్థి సంఘాలతో ఒప్పందాలు చేసుకోవడం లాంటివి చేశారు. వారిని రిక్రూట్ చేసుకుని నక్సల్ శిక్షణ జరిగే ప్రాంతంలో ట్రైనింగ్‌కు పంపించేవారు" అని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.
"వీరు ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నారు. దాన్ని వారు యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అనేవారు. అది మావోయిస్టు సంస్థ కోసం ఒక ఫ్రంట్ లా పనిచేస్తుంది. సుధీర్ ధవలే నిర్వహించిన ఎల్గార్ పరిషత్ లాంటి కార్యక్రమాలు ఆ ప్రయత్నంలో భాగమే. అందుకే నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం చాలా కీలకం" అని అడ్వకేట్ పవార్ అన్నారు.

మావోయిస్టు ఎజెండా విస్తరణ-పోలీసులు
పుణెలోని సాంస్కృతిక బృందం అయిన కబీర్ కళా మంచ్ ఆదేశాలతో ఎల్గార్ పరిషత్ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. కానీ దీని వెనుక అసలు ఉద్దేశం మావోయిస్టు అజెండాను పట్టణ ప్రాంతాల్లో విస్తరించడమే అని ఆరోపించారు.
వరవరరావుపై యూఏపీఏ కేసు నమోదు చేయాలనే పోలీసుల నిర్ణయాన్ని ఆయన తరఫు న్యాయవాది రోహన్ నహర్ ప్రశ్నించారు. 'నిషేధిత సంస్థలో సభ్యుడైనంత మాత్రాన నేరం చేశాడని అనలేమని' హైకోర్టు కూడా తన తీర్పులో స్పష్టం చేసిందని తెలిపారు.
తనను తాను డిఫెండ్ చేసుకున్న అరుణ్ ఫెరీరా నాలుగేళ్ల క్రితమే ఎలక్ట్రానిక్ డివైస్‌లు స్వాధీనం చేసుకున్నారని.. ఈ లేఖలు రాశారని చెబుతున్న వారిని ఇప్పటికే అరెస్టు చేశారని చెప్పారు. "మా నివాసాల్లో తనిఖీలు చేసినపుడు, మాలో ఎవరూ వాటిని వ్యతిరేకించలేదు, అడ్డుకోలేదు. అధికారులకు సహకరించాం. అక్కడ మమ్మల్ని పోలీసు కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు" అన్నారు.
"ఎల్గార్ పరిషత్ బహిరంగంగా జరిగింది, అదొక పబ్లిక్ ఈవెంట్, అక్కడ ఒక కుట్రకు ఎలా వ్యూహం రూపొందించగలరు" అని గోంజాల్వెజ్ లాయర్ రాహుల్ దేశ్‌ముఖ్ ప్రశ్నించారు.
"పోలీసులు ఒక కథను సృష్టించారు. అక్కడ లేఖలో పేర్లు ఉన్నంత మాత్రాన, వాళ్లు ఏదైనా నేరం చేశారని అనలేం" అన్నారు.

ఫొటో సోర్స్, GONSALVIS
పుణె కోర్టులో రెండున్నర గంటలపాటు వాదనలు జరిగిన తర్వాత, ఉద్యమకారులందరినీ గృహ నిర్బంధానికి పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశాల గురించి సమాచారం అందింది. దాంతో కోర్టు కాసేపు విచారణలు నిలిపివేసింది. మళ్లీ విచారణ ప్రారంభమైన తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయాలని జడ్జ్ పోలీసులను కోరారు.
ఇటు పుణె పోలీసులు నిందితుల అరెస్టులపై ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాము అరెస్టు చేసిన ఐదుగురి పేర్లను తెలిపారు.
2018 జనవరి 8న విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన నేరంపై దర్యాప్తు చేసినపుడు, నిందితులు ఈ నేరం చేసినట్టు తమకు చాలా ఆధారాలు లభించాయన్నారు. నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీ సభ్యులు, అరెస్టైన నిందితుల మధ్య సంప్రదింపులు జరిగినట్టు తేలిందన్నారు.
ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై అసహనంగా ఉన్నట్టు, కొన్ని సంస్థలు, పార్టీలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు అత్యున్నత రాజకీయ నేతనే లక్ష్యంగా చేసుకోవాలనుకున్నారని పుణె పోలీసులు తమ ప్రెస్ నోట్‌లో తెలిపారు.

ఫొటో సోర్స్, Pune police
నిషేధిత సీపీఐ(మావోయిస్టు) సంస్థ చేసిన భారీ కుట్రలో వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోంజాల్వెజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖాల ప్రధాన పాత్ర ఉన్నట్టు ఈ ఆధారాలు సూచిస్తున్నాయని తెలిపారు.
తమకు లభించిన ఆధారాల్లో నిందితులు అర్బన్ నక్సల్స్‌కు నిధులు అందించారని, యువత, విద్యార్థులను విప్లవం వైపు నడిపించడానికి ప్రయత్నించారని, వారికి ఆయుధాలు, ఇతర వివరాలు అందేలా చూశారని స్పష్టమైనట్టు పోలీసులు తెలిపారు.
నిందితులు చట్ట వ్యతిరేక కార్యకరాలాపాలలో పాల్గొన్నట్టు, ఇతర అక్రమ సంస్థలతో సంబంధాలు పెట్టుకుని హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నంచినట్టు ఆధారాలు లభించినట్టు చెప్పారు.
ఆగస్టు 28న దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో తనిఖీలు చేశామని తెలిపిన పోలీసులు హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవులు, మెమరీ కార్డులు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అందులో తెలిపారు.
ఇవికూడా చదవండి:
- క్వీన్ నీలగిరి: ఆకుపచ్చని ప్రపంచంలో అందాల రాణి
- డ్రోన్లు ఎగరేయాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే
- ఉద్యమకారుల అరెస్టు: మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
- నాగ్‌పూర్ అత్యాచారం: 'పాతికేళ్ల నా సర్వీసులో అంత క్రూరత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’
- ‘కొత్త రకం మోసం’: శిక్షణ అని చెప్పి ముక్కూమొహం తెలియని వ్యక్తితో పెళ్లి చేసేశారు
- వెనెజ్వేలా: శృంగార జీవితంపై సంక్షోభం ప్రభావం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








