ఉద్యమకారుల అరెస్టు: మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ఫొటో సోర్స్, NHRC
భీమా కోరెగావ్ హింసతో సంబంధం ఉందంటూ ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్టు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది.
మీడియాలో వచ్చిన కథనాల ఆధాంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఐదుగురు హక్కుల ఉద్యమనేతలను ఆగస్టు 28న మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పుణే సమీపంలో భీమా-కోరెగావ్‌లో చెలరేగిన హింసతో వీరికి సంబంధం ఉందంటూ పుణే పోలీసులు హైదరాబాద్, దిల్లీ, పుణే, రాంచీ, గోవాల్లో కొందరు హక్కుల నేతల ఇళ్లపై దాడులు చేశారు.
అరెస్టైన వారిలో విరసం నేత వరవరరావు, సివిల్ లిబర్టీస్ కార్యకర్తలు గౌతమ్ నవ్‌లాఖ, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్ ఉన్నారు.
ఈ అరెస్టుల విషయంలో నిర్దేశిత పద్ధతిని పోలీసులు పాటించలేదని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్యానించింది.
ఈ మొత్తం సంఘటనపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది.
జూన్ నెలలో హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్ ధవలే, షోమా సేన్, మహోశ్ రౌత్‌ల అరెస్టుకు సంబంధించి గతంలో జెనీవాకు చెందిన ఓ ఎన్జీవో నుంచి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. దీనిపై కూడా అప్పట్లోనే మహారాష్ట్ర డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు ఇచ్చింది. నాలుగువారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

అసలేం జరిగింది?
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావు, మరికొందరు పౌర హక్కుల నాయకుల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. అనంతరం వరవరరావును అరెస్ట్ చేసి తమతో పాటు పుణే తీసుకెళ్లారు.
అరెస్ట్ అనంతరం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వరవరరావు ఇంటి వద్ద ఉన్న బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు జూన్ మొదటివారంలో కొందరిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం.
ఈ మేరకు వరవరరావుపై ఐపీసీ 153 (ఏ), 505 (1) (బీ), 117, 120 (బీ), చట్ట వ్యతిరేక చర్యల (నియంత్రణ) చట్టం సెక్షన్ 13, 16, 17, 18 (బీ), 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పూణే జిల్లా విశారంబాగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌తోపాటుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు పుణే జాయింట్ కమిషనర్ శివాజీ భద్కే వెల్లడించారు. బీమా కోరెగావ్ హింసకు సంబంధించి ముఖ్యంగా ఎల్గార్ పరిషత్ యాక్టివిటీస్‌కు సంబంధించి ఈ దాడులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కేసులో రోనా విల్సన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.
రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. పోలీసుల ఆరోపణలను హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్ర అని, ప్రశ్నించే గొంతునొక్కడమేతప్ప మరేమీ కాదని అంటున్నారు.
ముంబైలో అరుణ్ ఫెరీరా, వరుణ్ గోంజాల్వెజ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. హరియాణలోని సూరజ్ కుండ్ సమీపంలో చత్తీస్‌గఢ్ పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీస్ కార్యకర్త సుధా భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె కుమార్తె బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి
- ‘భీమా-కోరెగాం అల్లర్ల వెనుక అసలు కుట్ర ఏమిటి?’
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- స్ఫూర్తి ప్రదాతల కోసం దళితుల వెదుకులాట
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
- విరసం నేత వరవరరావు, పలువురు పౌర హక్కుల నేతల అరెస్ట్, దేశ వ్యాప్తంగా పలు ఇళ్లలో సోదాలు
- మహారాష్ట్రలో దాడికి ప్లాన్ వేసిన హిందూ కార్యకర్తలు... ఒకరి ఇంట్లో 22 బాంబులు: ఏటీఎస్
- జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








