భీమా కోరెగాం: స్ఫూర్తి ప్రదాతల కోసం చరిత్రలో దళితుల వెదుకులాట

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రామ్ పుణియానీ
- హోదా, బీబీసీ కోసం
భీమా కోరెగాంలో దళితులపై జరిగాయని చెబుతున్న దాడుల తర్వాత మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
1817లో పేష్వా సైన్యంతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన దళితులకు నివాళులు అర్పించటానికి ప్రతి ఏటా ఇక్కడికి పెద్ద సంఖ్యలో దళితులు వస్తుంటారు.
బ్రిటిష్ సైన్యంలో దళితులు (మహార్లు) భాగంగా ఉన్నందున.. బ్రాహ్మణీయ పేష్వాయీకి వ్యతిరేకంగా దళితులు పోరాడారన్న అభిప్రాయం ఉంది.
ఈ సైనికులకు నివాళులు అర్పించటానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వయంగా 1927లో ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
ఈ ఏడాది.. ఆ యుద్ధానికి 200వ వార్షికోత్సవం కావటంతో ఈ సంస్మరణ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు.
కాషాయ జెండా మోస్తున్న కార్యకర్తలు (సమస్త హిందూ అఘాటడీ - సమస్త హిందూ వేదిక) ఈ హింసను మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషాదకర హింసలో ఒక వ్యక్తి చనిపోవటంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి.

ఫొటో సోర్స్, Mayuresh Konnur
అదే సమయంలో దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ.. నాటి పేష్వా పాలనకు రాజధాని అయిన షాన్వర్‌వాడా (పుణె)లో ఒక సభలో మాట్లాడుతూ.. ఆధునిక పేష్వాకు - బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాలకు - వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
భీమా కోరెగాం యుద్ధ వాస్తవికత.. నేడు ప్రచారంలో ఉన్న చాలా కల్పితభావనలను బద్దలు కొడుతోంది.
అది బ్రిటిష్ వారు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు చేసిన యుద్ధం. అది పేష్వాలు తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు చేసిన యుద్ధం.
బ్రిటిష్ వాళ్లు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో తమ సైన్యంలోకి దళితులను పెద్ద సంఖ్యలో చేర్చుకున్నారు.
వారిలో మహర్లు, పరాయాలు, నామ్‌సూద్రాల వంటి వారు ఉన్నారు. వారి విధేయత కారణంగా, సులభంగా లభ్యమవటం వల్ల వారిని చేర్చుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పేష్వా సైన్యంలో అరబ్ సైనికులు, గోస్సాయినులు తదితరులున్నారు. హిందువులకు - ముస్లింలకు యుద్ధాలు అనే కల్పితభావనను ఇది ధ్వంసం చేస్తుంది.
శివాజీ సైన్యంలో ఇబ్రహీం ఖాన్ లోధీ ఉంటే.. బాజీరావ్ సైన్యంలో అరబ్ సైనికులు ఉన్నారు.
దురదృష్టవశాత్తూ నేడు మనం గతకాలపు ఘటనలను మతం అద్దాల నుంచి చూస్తున్నాం.
అధికారం, సంపదే ప్రధానావధిగా సాగిన రాజ్యాల కోణాన్ని విస్మరిస్తున్నాం.
అనంతర కాలంలో బ్రిటిష్ పాలకులు తమ సైన్యంలోకి దళితులు/మహర్లను చేర్చుకోవటం నిలిపివేసింది.
అందుకు కారణం.. దిగువ శ్రేణుల్లోని అగ్ర కులాలకు చెందిన సైనికులు తమ దళిత ఉన్నతాధికారులకు సెల్యూట్ చేయటానికి, వారి ఆదేశాలను పాటించటానికి నిరాకరిస్తున్నట్లు బ్రిటిష్ వారు గమనించటమే.

ఫొటో సోర్స్, Hulton Archive
సైన్యంలో దళితులను చేర్చుకోవటాన్ని పునరుద్ధరించేలా చూడాలని అంబేడ్కర్ కృషిచేశారు. ఈ సమస్యను అధిగమించటానికి మహర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.
సామాజిక నిర్మాణంలో దళితులకు చోటు కల్పించటం కోసం తన కృషిలో భాగంగా ఆయన మహర్ సైనికుల అంశాన్ని చేపట్టారు.
ఆనాడు భీమా కోరెగాం యుద్ధం అనేది పేష్వాలను కూలదోయటానికి దళితులు చేసిన యుద్ధమా?
పేష్వా పాలన తన విధానాల రీత్యా అత్యంత బ్రాహ్మణీయమైనది అనేది నిజం. శూద్రుల వల్ల గాలి కలుషితం కాకుండా ఉండాలని వారు తమ మెడకు ఒక ముంత కట్టుకునేలా చేశారు.
అలాగే వారు నడిచే నేలను పవిత్రం చేయటానికి నడుముకు చీపురు కట్టుకునేలా చేశారు. కుల అకృత్యాల కాఠిన్యానికి ఇది పరాకాష్ట రూపం.
బ్రాహ్మణీయ కాఠిన్యాలను రూపుమాపటానికి బాజీరావ్‌తో బ్రిటిష్ వాళ్లు యుద్ధం చేశారా? అవకాశమే లేదు.
వారు కేవలం తమ వాణిజ్యం, దోపిడీల కోసం తమ ప్రాబల్య ప్రాంతాన్ని విస్తరిస్తున్నారు. అలాగే మహర్ సైనికులు తమ యజమానికి విధేయతతో బ్రిటిష్ వారి కోసం యుద్ధం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాతి కాలంలో ఆధునిక విద్య ప్రభావం కారణంగా సామాజిక సంస్కరణలు మొదలయ్యాయి. బ్రిటిష్ సామ్రాజ్య యంత్రాంగానికి సిబ్బంది నియామకం కోసం కిందిస్థాయి ఉద్యోగులకు శిక్షణనివ్వటానికి ఆధునిక విద్యను ప్రవేశపెట్టారు.
బ్రిటిష్ దోపిడీ విధానానికి ఉప ఉత్పత్తిగా సామాజిక సంస్కరణ వచ్చింది.
బ్రిటిష్ వారికి సంబంధించినంత వరకూ సామాజిక నిర్మాణాలపై వారి విధానాల ప్రభావం అనుకోకుండా పడింది కానీ ఉద్దేశపూర్వకం కాదు.
కుల పీడన అనే స్పృహ మారుతున్న పరిస్థితుల్లో జోతీరావ్ ఫూలే అభివ్యక్తీకరణతో రూపం తీసుకుంది.
పేష్వాలు జాతీయవాదంతో పోరాడారని, దళితులు వలస శక్తులకు మద్దతు ఇచ్చారని భావించటం కూడా నిరాధారం. జాతీయవాదం అనే భావనే వలస పాలన కాలంలో వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ జాతీయవాదం రెండు రకాలుగా వచ్చింది. ఒకటి.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సమాజంలో విద్యావంతులైన తరగతులు, కార్మికుల ద్వారా వచ్చిన భారత జాతీయవాదం.
రెండోది.. మతం పేరుతో - హిందూ అని, ముస్లిం అని - సంస్థానాల అధిపతులు, రాజుల ద్వారా వచ్చిన జాతీయవాదం.
దళితుల్లో గత కొన్నేళ్లుగా వ్యక్తమవుతున్న అసంతృప్తి, ప్రస్తుత ప్రభుత్వ విధానాల కారణంగా.. రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్య, ఉనాలో దళితులను క్రూరంగా హింసించటం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండటం వల్ల.. పెరుగుతోంది.
దళితులు భారీ సంఖ్యలో కోరెగాం తరలిరావటం.. చరిత్రలో తమ స్ఫూర్తిప్రదాతలను వెదుక్కోవాలన్న వారి ఆరాటాన్ని చాటుతోంది.
వారిపై జరిగిన దాడి.. వారి ఆకాంక్షలను అణచివేయటం లక్ష్యంగా వచ్చిన ప్రతిస్పందన.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








