జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’

- రచయిత, రవీందర్ ఎస్ రాబిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జలియాన్‌వాలా బాగ్ నరమేధాన్ని భారతీయులెవరూ సులువుగా మరచిపోలేరు. ఆ ఊచకోతకు నేటితో 99ఏళ్లు నిండాయి. 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లో ఆ దురాగతం చోటుచేసుకుంది.
పంజాబీల పర్వదినాల్లో ఒకటైన బైసాఖీ రోజున వేడుకలు జరుపుకోవడానికి జలియాన్‌వాలా బాగ్‌కు వందలాది స్త్రీ, పురుషులు చేరుకున్నారు. నిరాయుధులైన వాళ్లపై నాటి బ్రిగేడియర్ జనరల్ ఆర్‌ఈహెచ్ డయ్యర్ 50మంది సైనికులతో కాల్పులు జరిపించారు. ఆ దుర్ఘటనలో 1000కిపైగా అమాయక భారతీయులు చనిపోయారనీ, 1100కి పైగా గాయపడ్డారనీ చరిత్రకారులు చెబుతారు.
ఆ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. భారత స్వాతంత్రోద్యమంలో అదో కీలక మలుపుగా నిలిచింది.
బ్రిటన్ ప్రభుత్వం ఆ ఘటనపై చాలా ఆలస్యంగా తమ అభిప్రాయం తెలిపింది. 2013లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భారత్‌కు వచ్చినప్పుడు ఆ చర్యను ‘సిగ్గుచేటు’గా అభివర్ణించారు.

‘మరుసటి రోజు శవాల కుప్ప..’
ఆ నరమేధం జరిగి 99ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు బాధిత కుటుంబ సభ్యులను వెంటాడుతూనే ఉన్నాయి. నాటి దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు ఆ జ్ఞాపకాలను బీబీసీతో పంచుకున్నారు.
‘నగరంలో పరిస్థితి బాలేదని తెలిసి కూడా మా తాతయ్య అమిన్ చాంద్ ఆ రోజు జలియాన్‌వాలా బాగ్‌కు వెళ్లారు. అప్పుడాయన వయసు 45ఏళ్లు. తెల్లపైజామా నల్లకోటు వేసుకొని ఆయన ఇంటి నుంచి వెళ్లారని మా నాన్న చెప్పారు. కానీ ఆయన తిరిగి రాలేదు. ఆ రోజు నగరంలో కర్ఫ్యూ విధించడంతో తాతయ్యను వెతకడం కుదరలేదు. కానీ మరుసటి రోజు శవాల కుప్పలో నుంచి తాతయ్య మృతదేహం కూడా బయటపడింది’ అని సత్పాల్ శర్మ అనే విశ్రాంత హెడ్ మాస్టర్ చెప్పారు.
‘ఇప్పటికీ మా నానమ్మా, నాన్నా జలియాన్‌వాలా బాగ్‌కి వెళ్లి నాటి మృతులకు నివాళులర్పిస్తుంటారు’ అని ఆయన చెబుతారు.

‘నేను దేశం కోసం చనిపోతున్నా..’
జలియాన్‌వాలా బాగ్‌ను చాలామంది పవిత్ర స్థలంగా భావిస్తారు. ‘మా పెళ్లయిన తరవాత మా మామగారు మొదట అమరులకు నివాళులర్పించడానికి మమ్మల్ని జలియాన్‌వాలా బాగ్‌కే తీసుకెళ్లారు. ఆ తరవాతే స్వర్ణ దేవాలయానికి తీసుకెళ్లారు. ఎప్పుడు అక్కడికి వెళ్లినా మావయ్య కన్నీళ్లు పెట్టుకొని నాటి దారుణాల్ని గుర్తుచేసుకుంటారు’ అంటారు సత్పాల్ శర్మ భార్య కృష్ణ శర్మ.
‘నేను దేశం కోసం చనిపోతున్నా. నా వారసులు కూడా ఇదే దారిలో నడుస్తూ దేశం కోసం ప్రాణాలర్పించాలి’.. ఇవీ జలియాన్‌వాలా బాగ్ నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన లాలా హరి రామ్ అనే వ్యక్తి చివరిగా పలికిన మాటలు. ఆ జ్ఞాపకాలను ఆయన మనవడు మహేష్ బెహల్ గుర్తు చేసుకున్నారు.
‘మా తాతయ్యకు ఖీర్ అంటే చాలా ఇష్టం. పండగ రోజున ఆయన ఇంటికొచ్చాక పెడదామని నాన్నమ్మ ఖీర్ వండింది. కానీ ఆయనకు దాన్ని తినే అవకాశం రాలేదు. ఆ రోజు గుండెలో, కాలిలో తూటాలతో ఆయన ఇంటికి చేరారు. ఆ సమయంలో వైద్యులు కూడా అందుబాటులో లేరు. ఇంటికి చేరిన తరవాత ఆయన చనిపోయారు.

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC
‘యూకే పార్లమెంటులో బేషరతుగా క్షమాపణ చెప్పాలి’
ఆ తరవాత చాలాకాలంపాటు మా కుటుంబ సభ్యులు విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. 1997లో క్వీన్ ఎలిజబెత్ భారత్‌కు వచ్చినప్పుడు కూడా మేం నిరసనలు చేపట్టాం. జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పకుండా ఆమె అమృతసర్‌లో అడుగుపెట్టడంలో అర్థం లేదని ప్లకార్డులు ప్రదర్శించాం’ అని మహేష్ గుర్తుచేసుకుంటారు.
రెండేళ్ల క్రితం పంజాబ్ ప్రభుత్వం సత్పాల్ శర్మ, మహేష్ బెహల్ లాంటి కొందరు పౌరులకు గుర్తింపు కార్డులను అందించింది. కానీ వాటి వల్ల ఉపయోగం ఏంటో తమకు తెలీదనీ, టోల్ ప్లాజాల దగ్గర టోల్ ఫీజు కట్టే అవసరం లేకుండా మాత్రమే అవి చేస్తున్నాయని సత్పాల్ సింగ్ చెప్పారు.
బ్రిటన్ ప్రభుత్వం జలియాన్‌వాలా బాగ్ నరమేధంపై యూకే పార్లమెంటులో బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారంతా కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC
ఎస్‌కే ముఖర్జీ అనే వ్యక్తి చాలాకాలంగా జలియాన్‌వాలా బాగ్ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆ నరమేధం నుంచి ప్రాణాలతో బయటపడ్డవాళ్లలో ముఖర్జీ తాతయ్య ఒకరు.
1997లో క్వీన్ ఎలిజబెత్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరోలు జలియాన్‌వాలా బాగ్‌కు వచ్చినప్పుడు విజిటర్స్ బుక్‌లో పెట్టిన సంతకాన్ని ఆయన చూపిస్తూ.. ‘ఒక క్షమాపణ వల్ల ఆ గాయాలు మానిపోవు. కానీ ఈ ప్రాంతాన్ని సంరక్షించుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటూ మనం ముందుకెళ్లాలి’ అంటారు ముఖర్జీ.. ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ..!
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








