బ్లాగ్: 'ఎమ్మెల్యే గారూ, ముగ్గురు పిల్లల తల్లులపై కూడా అత్యాచారాలు జరుగుతాయ్!'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మీరే చెప్పండి... ముగ్గురు పిల్లల తల్లిని ఎవరైనా రేప్ చేస్తారా? నేను సైకాలజీ ఆధారంగా చెప్పగలను. ఇది కచ్చితంగా అబద్ధం. మహిళలపై అత్యాచారాలు, హరిజనులపై అత్యాచారాలు.. ఇవన్నీ చూస్తుంటే మొత్తం సమాజంపైనే అత్యాచారం జరిగినట్టుగా ఉంది."
పై మాటలు మాట్లాడింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.
తమ సొంత పార్టీకే చెందిన కుల్దీప్ సెంగర్ అనే మరో ఎమ్మెల్యేకు మద్దతుగా పై మాటలు సురేంద్ర సింగ్ అన్నారు. ప్రస్తుతం కుల్దీప్ ఒక మైనర్‌ను రేప్ చేశారన్న ఆరోపణల కారణంగా వార్తల్లోకెక్కారు. ఆయనను అరెస్ట్ చేయాలన్న డిమాండ్‌తో ఉత్తర్ ప్రదేశ్ అట్టుడుకుతోంది.
సురేంద్ర సింగ్ చెబుతున్న 'సైకాలజీ' ఎలాంటిదో మనకు తెలియదు మరి. అయితే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వాస్తవాలూ, గణాంకాల ముందు ఆయన 'సైకాలజీ' పేకమేడలా కూలిపోవడం మాత్రం ఖాయం.
ఆయన 'సైకాలజీ' ఎంత తప్పుడుదో ప్రపంచంలోని మనస్తత్వ నిపుణులెవరైనా చెప్పగలరు.
అయితే, ఈ వాదన ఎలా తప్పు అనేది తెలుసుకోవడానికి ముందు, అసలు రేప్ అంటే ఏంటో తెలుసుకోవడం అవసరం.

ఫొటో సోర్స్, Surendra Nath Singh/Facebook
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం..
ఏ వయసున్న మహిళ పైనైనా ఆమె ఇష్టానికి విరుద్ధంగా లేదా ఆమె ఆమోదం లేకుండా,
- ఆమె శరీరంలో (యోని లేదా మలద్వారం) అతడి శరీరంలోని ఏ భాగాన్నైనా జొప్పించడం రేప్ అవుతుంది.
- ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లోకి పెనిట్రేట్ చేసే ఉద్దేశంతో ఆమెకు నష్టం చేసే ప్రయత్నం ఏదైనా రేప్ అవుతుంది.
- ఆమె నోట్లోకి అతడు తన ప్రైవేట్ పార్ట్‌ను పెట్టడం రేప్ అవుతుంది.
- ఆమెతో ఓరల్ సెక్స్ చేయడం రేప్ అవుతుంది.
మరి కొన్ని ముఖ్యమైన విషయాలు
మహిళను భయపెట్టి, బెదిరించి ఆమెను ఒప్పుకునేలా చేయడం, మత్తుపదార్థాలు తినిపించి లేదా తాగించి స్పృహ కోల్పోయేలా చేసి, ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినా అది రేప్ అవుతుంది.
ఇకపోతే, 16 లేదా అంతకన్నా తక్కువ వయసున్న అమ్మాయితో ఆమోదం ఉన్నప్పటికీ అలా చేయడం రేప్ అవుతుంది. ఆఖరుకు ఆమె సదరు వ్యక్తి భార్య అయినా సరే.
అంటే, ఏ మహిళపైనైనా ఇలాంటి నేరాలు జరగొచ్చనీ, మహిళ వయస్సుతో దీనికి సంబంధమేమీ లేదని చట్టంలోనే స్పష్టంగా చెప్పారు.
విషయం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ, ఇంకా ఎవరికైనా సందేహాలుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను పరిశీలించొచ్చు.

ఆరేళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారులపైనా, 60 ఏళ్లకు పైబడి వయసున్న వృద్ధురాళ్ల పైనా అత్యాచారాలు జరుగుతున్నాయనేందుకు పై గణాంకాలే సాక్ష్యం.
సామాజిక పీడన
2015లో కోల్‌కతాలో 71 ఏళ్ల క్రైస్తవ సన్యాసిని (నన్)పై సామూహిక అత్యాచారం జరిగింది. డిసెంబర్ 2017లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి ఆమెను హతమార్చిన దారుణ ఘటన జరిగింది.
ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌లో 24 సెంటీమీటర్ల కర్రను గుచ్చి, రక్తం ముద్దలా మారిన ఆమె శవాన్ని అక్కడే వదిలేశారు.
జమ్మూ కశ్మీర్‌లో ఎనిమిదేళ్ల ఆసిఫా, పాకిస్తాన్‌లో ఏడేళ్ల జైనబ్‌లపై అత్యాచారం, హత్యల ఘటనలు జరిగి ఎక్కువ రోజులు కూడా కాలేదు.
ఇక, మహిళలపై అత్యాచారాలు, దళితులపై ఘోరాల పేరుతో మొత్తం సమాజంపైనే అత్యాచారం జరుగుతున్నట్టుగా ఉందని ఎమ్మెల్యే అన్న మాటల విషయానికొస్తే, ఒక మహిళ లేదా ఒక దళితుడిపై దారుణం జరిగిందంటే అది మొత్తం సమాజంపైనే జరిగినట్టు అని అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
అయితే, నిజానికి రేప్ వంటి దారుణ అకృత్యాల విషయంలో నేతలు ఇలాంటి హేయమైన (ఇంతకన్నా తక్కువగా వీటిని వర్ణించలేం) వ్యాఖ్యలు చేయడం మొదటిసారేమీ కాదు.

ఫొటో సోర్స్, Getty Images
'రేప్‌కు ఉరి శిక్ష వేస్తారా? కుర్రాళ్లన్నప్పుడు తప్పు చేయడం సహజమే కదా…'
గతంలో రక్షణమంత్రిగా ఉన్న ములాయంసింగ్ యాదవ్ ఎన్నికల సందర్భంగా ఒక ర్యాలీలో మాట్లాడుతూ పై వ్యాఖ్య చేశారు.
రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఓటుబ్యాంకును కూడా గట్టిపర్చుకోవడం కోసం ఈ మాటలన్నారా లేదైనా మరేదైనా కారణంతోనా అన్నది ఆయనకే తెలియాలి.
ఒకవేళ ఆయన ఉరిశిక్షకు వ్యతిరేకంగా (అందుకు అవకాశాలు లేవనే చెప్పొచ్చు) పై మాటలు అన్నట్టయితే, ఇంతకన్నా ఘోరమైన పద్ధతి మరొకటి ఉండదు.
'రేపిస్టులది ఎంత తప్పో బాధితురాలిది కూడా అంతే తప్పు. ఆ కుర్రాళ్లను ఆ అమ్మాయి అన్నా అని సంబోధిస్తూ వారిని ప్రాధేయపడాల్సింది'
పై మాటలన్నది కింది ఫొటోలో ఉన్న ఆసారామ్. 2012లో దిల్లీలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన 'నిర్భయ' గురించి ఆయన అభిప్రాయం ఇది. ఆయన స్వయంగా రేప్ ఆరోపణల్తో ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసారామ్ గ్యాంగ్‌రేప్ నుంచి తప్పించుకొనే 'ఉపాయం' చెప్పడంతో పాటు, రేపిస్టులది ఎంత తప్పో బాధితురాలిది కూడా అంతే తప్పని సెలవిచ్చారు.
మరోవైపు, ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను బట్టి చూస్తే చాలా రేప్ ఘటనల్లో సోదరుడి వంటి దగ్గరి బంధువులే దోషులుగా ఉంటున్నారని అర్థమవుతోంది.

'రేప్‌లు ఇండియాలో జరుగుతాయి, భారత్‌లో కాదు'
పై మాటలన్నది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిపతి మోహన్ భాగవత్.
రేప్ వంటి నేరాలు గ్రామాల్లో జరగవనీ, కేవలం పట్టణాల్లోనే జరుగుతాయనీ, ఎందుకంటే పట్టణాల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువని ఆయన చాలా నమ్మకంగా ఉద్ఘాటించారు.
ఇంత కీలక సమాచారాన్ని ఆయన ఎక్కడి నుంచి రాబట్టారో ఆయనే చెప్పాలి. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఏ రోజు పేపర్ తిరగేసినా గ్రామాల్లోనూ ఇలాంటి నేరాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది.
అంటే, మోహన్ భాగవత్ చెబుతున్న 'భారత్'లోనే బోల్డన్ని నేరాలు జరిగిపోతున్నాయి.
'ఆడపిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్లు చేసేస్తే రేప్‌లు ఆగిపోతాయ్'
అమ్మాయిలను రేప్ బారిన పడకుండా కాపాడడానికి హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌటాలా సూచించిన 'ఉపాయం' ఇది.
ఆయన అక్కడితోనే ఆగిపోలేదు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఈ విషయంపై గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం కూడా అందించారు.

రేప్ నుంచి అమ్మాయిలను కాపాడడానికి బాల్య వివాహాలు చేయాలన్నది ఆయన సూచన. అంటే ఒక నేరాన్ని అరికట్టడానికి మరో నేరం చేయాలనే సలహా అన్నమాట.
చట్టం ప్రకారం 16 ఏళ్లకు తక్కువ వయసున్న అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం రేప్ కిందకు వస్తుంది. ఆఖరుకు ఆ వ్యక్తి స్వయంగా ఆమె భర్త అయినా సరే.
మరో విషయం, పెళ్లయిన అమ్మాయిపై రేప్ జరగదా? జరగడం లేదా? మరి ఆయన ఈ అంచనాకు ఎలా వచ్చారు?
రేప్ నేరాలకు సంబంధించిన వార్తల్ని పరిశీలిస్తే బాధితుల్లో చిన్న వయసు బాలికల నుంచీ పెళ్లయిన యువతులూ, పెద్ద వయసు మహిళలు అందరూ ఉంటున్నారు.
అంటే రేప్ విషయంలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలకూ, జరుగుతున్న వాస్తవాలకూ మధ్య ఎలాంటి పొంతనా లేదన్న మాట.
రేప్ నేరాలకు వయసుతో, పట్టణంతో, గ్రామంతో, కులంతో, మతంతో - దేనితోనూ సంబంధం లేదు. దానికి సంబంధం ఉన్నది ఒకే ఒక్క అంశంతో - అదే రేపిస్టు మనస్తత్వం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








