BBC SPECIAL: సల్మాన్ ఖాన్ ఆ రోజు రాత్రి మొత్తం చెక్‌పోస్టు దగ్గరే ఉన్నారు

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి, జోధ్‌పూర్ నుంచి
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడినట్టు నమోదైన కేసు విచారణలో కీలక ప్రాసిక్యూషన్ సాక్షి సాగర్రామ్ బిష్నోయి తొలిసారిగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
ఆ జింకల కళేబరాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించిన వారిలో తాను కూడా ఉన్నానని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
కేసు విచారణ సమయంలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, తబూ, నీలమ్ కొఠారీ , సోనాలీ బింద్రేలను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన అధికారుల బృందంలోనూ ఉన్నానని ఆయన వెల్లడించారు.
అరుదైన రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారన్న కేసులో ఇటీవల జైలుకెళ్లిన సల్మాన్ ఖాన్‌కు రెండు రోజుల తర్వాత జోధ్‌పూర్ కోర్టు బెయిలు మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసులో మరో నలుగురు నటులను నిర్దోషులని కోర్టు పేర్కొంది.
1998లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఫారెస్ట్ గార్డుగా సాగర్రామ్ బిష్నోయికి పోస్టింగ్ వచ్చింది. 2018 మార్చి 28న ఏఎస్‌ఐ హోదాలో పదవీ విరమణ చేశారు.
ఇన్నాళ్లూ ప్రభుత్వ కొలువులో ఉన్నప్పుడు ఆయన మీడియాతో ఎన్నడూ మాట్లాడలేదు.
''నేను ప్రభుత్వ సర్వీసులో ఉన్నాను కాబట్టి ఈ కేసు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ విషయమైనా మా పై అధికారే చెప్పేవారు'' అని సాగర్రామ్ తెలిపారు.

ఈ కేసులో ఐదుగురు ప్రాసిక్యూషన్ సాక్షులు ఉండగా సాగర్రామ్ బిష్నోయి సాక్షి నంబర్. 2.
"కంకణి గ్రామం సమీపంలో అర్ధరాత్రి సల్మాన్ ఖాన్‌తో పాటు మరికొందరు కృష్ణ జింకలను వేటాడటం చూసిన ముగ్గురు సాక్షులు ఫిర్యాదు చేసేందుకు 1998 అక్టోబర్ 9న ఉదయాన్నే గూడలోని రాజస్థాన్ అటవీ శాఖ చెక్‌పోస్టుకు వచ్చారు.
మేము వెళ్లి ఆ జింకల కళేబరాలను స్వాధీనం చేసుకుని పై అధికారులకు చూపించేందుకు తీసుకెళ్లాం.
ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన మా పై అధికారి ఫోరెన్సిక్ పరీక్షలు చేయించాలని చెప్పారు. దాంతో వాటిని డాక్టర్. నేపాలియా ల్యాబ్‌కు తీసుకెళ్లాం.

ఫొటో సోర్స్, Getty Images
కొద్ది రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక ఇస్తామని డాక్టర్ నేపాలియా చెప్పారు. కానీ, చాలా రోజులు తీసుకున్నారు.
చివరికి ఆ జింకలు సహజ కారణాలతోనే చనిపోయాయంటూ నివేదిక ఇచ్చారు.
ఆ తర్వాత మరిన్ని పరీక్షల కోసం కళేబరాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించాం. ఆ జింకలు తుపాకీ కాల్పుల్లోనే ప్రాణాలు కోల్పోయాయని నివేదిక వచ్చింది" అని సాగర్రామ్ గుర్తుచేశారు.
రెండో ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత 1998 అక్టోబర్‌లో సల్మాన్ ఖాన్ అరెస్టయ్యారు.
"ఆ జింకలను కాల్చింది సల్మాన్ ఖానే" అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

"ఆ తర్వాత సల్మాన్‌తో సహా ఐదుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లాం. ఓ రాత్రి అంతా వాళ్లు మా అటవీ అభివృద్ధి శాఖ చెక్ పోస్టు దగ్గరే ఉండాల్సి వచ్చింది. కంకణి సహా 32 గ్రామాలు ఆ చెక్‌పోస్ట్ కిందకే వస్తాయి" అని ఆయన తెలిపారు.
సాగర్రామ్ కూడా సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా రెండు దశాబ్దాలకు పైగా పోరాడిన బిష్నోయి సముదాయానికి చెందిన వారే.
"ప్రాసిక్యూషన్ సాక్షుల్లో ఎక్కువ మంది బిష్నోయీలే ఉన్నారని, కేసు విచారణలో వాళ్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సల్మాన్ తరఫు లాయర్లు ఆరోపించేవారు. మరి వందల ఏళ్లుగా బిష్నోయీలు స్థిరపడిపోయిన ఈ ప్రాంతంలో ఫారెస్టు గార్డుగా ఆ సముదాయానికి చెందిన వారు కాకుండా బయటి వ్యక్తులు ఎందుకు ఉంటారు?" అని ఆయన ప్రశ్నించారు.
గమనిక:ఈ కథనంలోని అభిప్రాయాలు సాగర్రామ్ బిష్నోయి వ్యక్తం చేసినవి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉన్న ఆయన బీబీసీతో ముఖాముఖిలో చెప్పిన విషయాలనే ఇక్కడ ప్రచురించాం.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








