లబ్..డబ్బు: డిస్కౌంట్లు, ఆఫర్ల వలలో పడుతున్నారా?
షాపింగ్ కు ఫలానా టైం అంటూ ఉండదు..! ఏదో పిలుపొచ్చినట్టు సడన్‌గా డిసైడ్ చేసుకుని వెళ్లిపోతుంటాం..! ఎన్నెన్ని డిస్కౌంట్ ఆఫర్లు, స్కీంలు, ఒక్క బటన్ నొక్కితే వెంటనే ఇంటికే మనం కొనుకున్న వస్తువులు వచ్చేస్తున్న రోజులివి.
ఎన్నో ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి కాబట్టే... వినియోగదారుడు - కాదు, వద్దు అని అనలేకపోతున్నాడు.
అలా అని గుడ్డిగా వెళ్లిపోకూడదు. మనకి కనిపించే డిస్కౌంట్ ఆఫర్లు, స్కీంల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అదెలాగో చూద్దాం.

కొన్ని వస్తువుల MRPలో GST జోడించే ఉంటుంది
MRP అనగానే... హా! అంటే ఏంటో మాకు తెలుసులే! అనుకుంటున్నారా? అయితే MRP పైన ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వకూడదు అన్న విషయం తెలుసా?
GST జోడించే MRPని ఫిక్స్ చేస్తారు. అలాగే కొన్ని వస్తువులపై టాక్స్ ఉండదు. ఆ వస్తువుల గురించి టాక్స్‌ల వివరాల గురించి తెలిపేందుకు మనకు ఇంటర్నెట్‌లో ఎన్నో వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి.

టెలీ బ్రాండ్లతో జాగ్రత్త
‘ఇది ఒక్క కిలో కొనగానే మరొక కిలో ఫ్రీ... సరిగా ఇప్పటి నుంచి పది నిమిషాలలో ఫోన్ చేస్తే ఇవి మీ సొంతమవుతాయి...’ ఇలా గొంతు చించుకుని ప్రోడక్ట్‌లు అమ్మే షోలు మనం రోజూ టీవీలో చూస్తుంటాము. ఇదే ఓవర్ అంటే!
‘నేను ముందర ఇలా ఉండేవాడిని... ఇపుడు ఇలా హీరో లాగా తయారయ్యాను...’ అంటూ చెప్పే కేసు స్టడీలు ఎక్స్ట్రా... అలాంటి వాటితో జాగ్రత్త!
సరైన వివరాలికివ్వకపోతే కేసు
కొన్ని వస్తువుల గురించి కొన్ని కంపెనీలు సరైన వివరాలు ఇవ్వవు. ఇలా మిస్‌లీడ్ చేసే ఆఫర్లు, యాడ్లు ఇచ్చే కంపెనీలపై కేసు పెట్టచ్చు.

ఈ సర్వీస్ టాక్స్ ఆప్షనల్
మీరేదయినా రెస్టారెంట్‌లో మంచి నీళ్లు తాగాలన్నా, లేదా వాష్‌రూమ్ వాడాలన్నా... ఇటువంటి వాటికి సర్వీస్ టాక్స్ కట్టడం అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. అంటే తప్పనిసరి కాదు!
ఆధార్ లింక్ గడువు పెరిగింది
ఇపుడు ప్రతి దానికి ఆధార్ లింక్ చేయాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం. మొబైల్ నంబర్లు, బ్యాంకు అకౌంట్‌లతో ఆధార్‌ను లింక్ చేసే గడువును సుప్రీమ్ కోర్ట్ పొడిగించింది. ఇంతక ముందు దీని గడువు మార్చ్ 31. సో గడువు పొడిగించారు కాబట్టి మొబైల్ ఆపరేటర్‌లు, బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఆధార్ ఆధార్ అంటూ విసుగు కలిగించే కాల్స్ తక్కువవుతాయి.

ధర, పన్ను ఇతర వివరాలు పరిశీలించండి
తెలివైన వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. ఏదైనా వస్తువులు కొనే ముందు.. వాటి ధర, పన్ను వివరాలు, అలాగే ఎక్స్‌పైరీ డేట్ లాంటివి తప్పకుండా చెక్ చేయాలి.
మార్క్ ఎక్కడుంది?
మార్క్ ఇక్కడుంది..? ఏదైనా కొనేటప్పుడు సర్టిఫికేషన్ మార్క్ అదే ISO మార్క్, EGMark, Hallmark లాంటివి ఉన్నాయా లేదా అన్న విషయం తప్పకుండా చూడాలి.

ఆన్‌లైన్ షాపింగ్‌తో జర భద్రం
ఇపుడు ఎవరిని కదిపినా, ఎటు చూసినా ఆన్‌లైన్ షాపింగ్ కబుర్లే.
అక్కడ మనకి దొరకనిదంటూ లేదు. అయితే ఈ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నపుడు కొన్ని విషయాలు గమనించాలి.
కొన్ని లింకులతో జాగ్రత్త
కొన్ని ఆన్‌లైన్ పోర్టల్స్‌లో మనకి రకరకాల ఆకర్షణీయ ఆఫర్లంటూ కొన్ని అదనపు లింక్స్ కనబడతాయి. అత్యాశకు పోయి వాటిని క్లిక్ చేసి వాళ్ళు అడిగిన వివరాలిచ్చేసారనుకోండి.. ఇంకా అంతే సంగతులు!
ఎందుకంటే వాటిలో చాలా లింక్స్ మీ బ్యాంకింగ్ వివరాలు తెలుసుకునేందుకు వేసిన వల. అందులో పడద్దు.

నకిలీలతో జాగ్రత్త
ఆన్‌లైన్ షాపింగ్‌లో మన బ్యాంకు డీటెయిల్స్ ఫిల్ చేసేటపుడు ఆ వెబ్‌సైట్ నమ్మదగినదా కాదా అని ఒకటికి రెండు సార్లు పరిశీలించండి. మనకి ఇంటర్నెట్‌లో అనేకరకాల ఫిషింగ్ ఫిల్టర్స్ లభిస్తాయి. అవి ఉపయోగిస్తే నకిలీ వెబ్‌సైట్ వివరాలు మనకి తెలుపుతాయి.
బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేయండి
ఆన్‌లైన్ షాపింగ్ చేశాక మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌లను చెక్ చేస్తూ ఉండండి. ఎటువంటి పొరపాట్లు జరిగాయని తెలిసినా మీరు వెంటనే బ్యాంకును సంప్రదించచ్చు.
డెబిట్ కార్డు బదులు క్రెడిట్ కార్డు
డెబిట్ కార్డు బదులు క్రెడిట్ కార్డు ఉపయోగించండి. ఎందుకంటే క్రెడిట్ కార్డుతో మనకి లభించే గ్యారంటీలు డెబిట్ కార్డుతో లభించవు.

వినియోగదారులకు చట్టాల మద్దతు
వినియోగదారుల హక్కులను కాపాడేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. రకరకాల హెల్ప్ లైన్ నెంబర్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి ఉపయోగించి కస్టమర్ ఫిర్యాదు చేయచ్చు. అయితే ఏదైనా మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలి.
సో అది ఈ వారం లబ్ డబ్బు! మరొక టాపిక్ తో మళ్లీకలుస్తాను!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









