‘నా బహుమతి తీసేసుకున్నారు’.. అమ్మానాన్నలపై కేసు పెట్టిన యువతి

కవర్లతో చిన్నారులు

ఫొటో సోర్స్, iStock

    • రచయిత, వెటె టాన్
    • హోదా, బీబీసీ న్యూస్

పండగలకు పబ్బాలకు పుట్టినరోజులకు పిల్లలకు ఎంతో కొంత డబ్బు కానుకలుగా ఇవ్వటం ప్రపంచమంతా ఉన్న ఆనవాయితీ. అలా పిల్లలకు ఇచ్చిన డబ్బు ఎవరికి చెందుతుంది? చైనాలో ఓ యువతి తన తల్లిదండ్రులపై కేసు వేసి ప్రపంచమంతా కలకలం సృష్టించింది. ఆ కథ ఇదీ.

చైనా సహా పలు తూర్పు ఆసియా దేశాల వారు చంద్రమాన సంవత్సరాలు పాటిస్తారు. ఈసారి కొత్త చంద్రమాన సంవత్సరం ఫిబ్రవరి 16న మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ సంవత్సరారంభాన్ని వేడుకగా జరుపుకున్నారు.

ప్రతి చంద్రమాన కొత్త సంవత్సరం నాడూ చిన్నారులకు వారి బంధుమిత్రులు ఎర్రటి కవర్లలో ‘లక్కీ మనీ’ (అదృష్టాన్నిచ్చే డబ్బు) పెట్టి కానుకగా అందిస్తారు.

ఈ సంవత్సరం.. తనకు లక్కీ మనీగా వచ్చిన 58,000 యువాన్లను (సుమారు రూ. 6,00,000) తన తల్లిదండ్రులు జేబులో వేసుకున్నారని ఒక చైనా యువతి కేసు వేసింది.

దీంతో.. ఎర్ర కవరులోని లక్కీ మనీకి.. ఆ మాటకొస్తే పిల్లలకు కానుకగా ఇచ్చే డబ్బుకు యజమానులు ఆ పిల్లలా, లేక వారి తల్లిదండ్రులా అనే ప్రశ్నపై సర్వత్రా చర్చ మొదలైంది.

ఎర్ర కవర్లలో చైనా నగదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా సంస్కృతిలో ఎరుపు రంగు సంపదకు, సుసంపన్నతకు చిహ్నం

అసలు ఏమిటీ ఎర్ర కవరు?

ఈ ఎర్ర కవరును చాలా పేర్లతో పిలుస్తారు. మాండరిన్‌ భాషలో ‘‘హాంగ్‌బావో’’ అంటారు. కాంటోనీస్‌లో ‘‘లాయ్ సీ’’ అంటారు. ఏ పేరుతో పిలిచినా కానీ.. ఆ కవరులో డబ్బులు ఉంటాయి.

చైనా కొత్త సంవత్సరం సందర్భంగా.. చిన్న పిల్లలకు, పెళ్లికాని యువతకు.. కొత్త సంవత్సరంలో అదృష్టం కలిసి రావాలని ఆశీర్వదిస్తూ అందుకు సంకేతంగా ఈ కవర్లను కానుకలుగా అందిస్తారు.

సాధారణంగా.. పెళ్లయినవారు మాత్రమే ఈ కవర్లు ఇస్తుంటారు. పెళ్లికాని వారు కూడా తాము ఇవ్వదలచుకుంటే ఇవ్వవచ్చు.

ఈ కవర్లలో డబ్బు విలువ వంద రూపాయల నుంచి లక్షల రూపాయల వరకూ ఎంతైనా ఉండొచ్చు.

ఒక చిన్నారికి ఎర్ర కవరు అందిస్తున్న ఓ చైనా జంట

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, సాధారణంగా.. పెళ్లైన జంటలు చిన్నారులకు ఈ ఎర్ర కవర్లు కానుకగా ఇస్తారు

ఇప్పుడు ఏం జరిగింది?

చైనాలోని యునాన్ రాష్ట్రంలో ఓ యూనివర్సిటీ విద్యార్థిని.. తన ఎర్ర కవరు డబ్బును తల్లిదండ్రులు ’’తస్కరించార’’ని ఆరోపిస్తూ కేసు వేసినట్లు చైనా మీడియా కథనం ప్రచురించింది. ఆ కేసులో ఆమె గెలిచారని కూడా పేర్కొంది.

కొన్నేళ్లుగా తనకు వచ్చిన.. 58,000 యువాన్ల విలువైన ఎర్ర కవర్లను తన తల్లిదండ్రులు ఉంచేసుకున్నారన్నది ఆమె ఆరోపణ.

జువాన్ అనే సదరు యువతి.. ఇన్నాళ్ల తర్వాత కేసు ఎందుకు వేసిందన్న దానికీ బలమైన కారణమే ఉంది.

తన తల్లిదండ్రులు విడిపోయారని.. తన యూనివర్సిటీ ఫీజులు కట్టటానికి వారిద్దరూ నిరాకరించారని దీంతో తాను కేసు వేయాల్సి వచ్చిందని ఆమె చెప్తోంది.

కోర్టు ఆ యువతికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీ విద్య పూర్తయ్యే వరకూ ఆమెకు ప్రతి నెలా 1,500 యువాన్లు (సుమారు రూ. 15,000) చెల్లించాలని తల్లిదండ్రులను ఆదేశించింది.

మరి.. ఎర్ర కవరులోని డబ్బు ఎవరికి చెందుతుంది?

దీనిపై జనంలో భిన్నాభిప్రాయాలున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు వచ్చే ఎర్ర కవర్ల డబ్బును.. ఇతర పిల్లల కోసం ఇచ్చే వాటికి పరిహారంగా, పిల్లల్ని పెంచటానికి అయ్యే ఖర్చును కొంతైనా భర్తీ చేసుకోవటానికి వీలుగా.. తామే ఉంచుకునే వీలుండాలని కొందరు అంటారు.

‘‘నా తల్లిదండ్రులు ఇతర పిల్లలకు ఇచ్చే ఎర్ర కవర్ల డబ్బును భర్తీ చేసుకోవటానికి.. నాకు వచ్చే కవర్లలోని డబ్బును తామే ఉంచేసుకుంటారు’’ అని ఏంజెలీన్ ఆంగ్-పాంగ్ అనే బాలిక బీబీసీకి చెప్పింది. సింగపూర్‌లో నివసించే ఏంజెలీన్.. ’’డబ్బు సంపాదించటం సులభం కాదని వారు మాకు ఓపికగా వివరిస్తుంటారు. కాబట్టి ఆ డబ్బు వారు ఉంచుకున్నా నేను, నా చెల్లెలు ఏమీ బాధపడం’’ అని ఆమె తెలిపింది.

సింగపూర్‌కే చెందిన పెంగ్లీ అనే మరో బాలుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశాడు.

‘‘హాంగ్‌బావోలు ఇవ్వటానికి అయ్యే ఖర్చును మాకు వచ్చే డబ్బుతో భర్తీ చేస్తుంటామని నా తల్లిదండ్రులు చెప్పారు. అయితే.. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ఇచ్చే డబ్బు ముఖ్యం కాదు.. అలా ఇచ్చే పని ముఖ్యం’’ అని అతడు పేర్కొన్నాడు.

హాంగ్‌కాంగ్‌లో చైనా కొత్త సంవత్సర వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, మలేసియా, సింగపూర్ సహా చాలా ప్రాంతాల్లో చంద్రమాన కొత్త సంవత్సరం జరుపుకుంటారు

కానీ అందరూ ఈ అభిప్రాయంతో ఏకీభవించటం లేదు. ఆ డబ్బును ఎవరి కోసం ఉద్దేశించారో వారికే.. అంటే పిల్లలకే చెందాలనేది వీరి వాదన.

‘‘ఆ డబ్బు మన కోసం ఉద్దేశించింది. కాబట్టి అది మనది’’ అని చైనా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ వీబో యూజర్ ఒకరు వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు నాకు 24 సంవత్సరాలు. ఇన్నేళ్లుగా నాకు వచ్చిన ఎర్ర కవర్లన్నీ నేనే ఉంచుకున్నాను. నా తల్లిదండ్రులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.

‘‘నాకు వచ్చిన లక్కీ మనీని నా తల్లిదండ్రులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత ఆ డబ్బంతా నాకే వచ్చింది’’ అని సింగపూర్‌కు చెందిన 28 ఏళ్ల జస్టిన్ జీ తెలిపాడు.

అసలు ‘‘లక్కీ మనీ’’ మీద హక్కుదారులు పిల్లలే అని రోస్ లిమ్ అనే ఓ తల్లి బీబీసీతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.

‘‘నా పిల్లల కోసం నేను ఆ డబ్బు దాస్తాను. వారు పెద్దయ్యాక తిరిగి ఇస్తాను. ఆ డబ్బుకు ఆ పిల్లలే హక్కుదారులని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పిల్లలే లేకపోతే అసలు ఆ డబ్బులే ఉండేవి కాదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)