12 ఏళ్లలోపు చిన్నారుల్లో సోషల్ మీడియా సంఘర్షణ

ఫొటో సోర్స్, venugopal
సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకునే స్థితిలో పిల్లలు లేరని ఇంగ్లండ్ చిల్డ్రన్స్ కమిషనర్ ఆనీ లాంగ్‌ఫీల్డ్ అన్నారు.
ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్‌కి మారుతున్న సమయంలో వారిపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటోందని ఆమె చెప్పారు.
పిలలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వివరించారు. ఈ సమయంలో పాఠశాలలు కీలక పాత్ర పోషించాలని ఆమె అన్నారు.
8 నుంచి 12 ఏళ్ల వయసులో పిల్లలు తమ గుర్తింపుపై మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని ఆనీ వివరించారు.
సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్ల ఆధారంగా వ్యక్తిత్వాన్ని వారు అంచనా వేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
8 నుంచి 12 ఏళ్ల వయసు విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందని ఆమె అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
చాలామంది చిన్నారులు సోషల్ మీడియాలో తమకొచ్చే లైకులు, కామెంట్లపై అధికంగా ఆధారపడి ఉంటున్నారని ఈ నివేదిక తెలిపింది.
ఆన్‌లైన్ భద్రతపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలలతో కలసి ప్రయత్నిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
ప్రైమరీ నుంచి సెకండరీ స్కూల్‌కి మారుతున్న సమయంలో చిన్నారులకు సోషల్ మీడియా కీలకంగా మారుతోంది.
సోషల్ మీడియా కారణంగా వచ్చే భావోద్వేగాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని ఇంగ్లండ్ చిల్డ్రన్స్ కమిషనర్ ఆనీ లాంగ్‌ఫీల్డ్ సూచించారు.
'కొత్త స్కూల్‌లో కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పైగా విద్యార్థుల దగ్గర సెల్‌ఫోన్లు ఉంటాయి. దీంతో సోషల్ మీడియాకు వారు అలవాటు పడతారు' అని ఆనీ లాంగ్‌ఫీల్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సమయంలో లైకుల కోసం పిల్లలు ఆరాట పడుతున్నారని, కామెంట్ల కోసం పరుగులు పెడుతున్నారని నివేదిక చెబుతోంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తమ స్టేటస్‌పై చాలా టెన్షన్ పడుతున్నామని చాలామంది విద్యార్థులు చెప్పారు.
సోషల్ మీడియాకు డిస్‌కనెక్ట్ కాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
నిజానికి సోషల్ మీడియా అకౌంట్ తెరవాలంటే కనీసం 13ఏళ్ల వయసు ఉండాలి. కానీ 10, 12 ఏళ్ల వయసు ఉన్న మూడొంతుల మంది చిన్నారులకు సోషల్ మీడియా ఖాతాలున్నాయని నివేదికలో తేలింది.
'సోషల్ మీడియా వల్ల చిన్నారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో వారు మానసిక సంఘర్షణకు గురి అవుతున్నారు' అని లాంగ్‌ఫీల్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, Office of the Children's Commissioner
సోషల్ మీడియాలో భావోద్వేగాలకు అధికంగా గురికాకుండా చిన్నారులకు డిజిటల్ లిటరసీ నేర్పించాల్సిన అవసరం ఉందని లాంగ్‌ఫీల్డ్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా 6 నుంచి 7 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాపై ముందే అవగాహన కల్పిస్తే వారు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉంటారని వివరించారు.
ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ నివేదిక తయారు చేసిన వాళ్లు 8 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్న కొందరు పిల్లలతో మాట్లాడారు.
చిన్నారులు చెప్పిన కొన్ని ఆసక్తికర అంశాలు :
- 'ఒకవేళ నాకు 150 లైకులు వస్తే, వాళ్లు నన్ను ఇష్టపడినట్లే. అప్పుడా ఫీలింగ్ చాలా బాగుంటుంది. అంటే వాళ్లు మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారని అర్ధం' - ఆరన్, 11 ఏళ్లు.
- 'నా ఫొటోలను నేను ఎడిట్ చేస్తాను. అవి మరింత అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటా' - అనీ, 11 ఏళ్లు.
- 'స్నాప్‌చాట్‌లో మా అమ్మ నా ఫొటోలు తీసుకుంటుంది. కానీ నాకది ఇష్టం ఉండదు' -హసన్-8 ఏళ్లు
- 'నేను ఒక అందమైన అమ్మాయిని చూశా. ఆమెకున్నవన్నీ నాకు కావాలని అనిపిస్తుంది. ఆమెలా తయారు కావడమే నా లక్ష్యం' - బ్రిడీ- 11ఏళ్లు.
మా ఇతర కథనాలు:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








