జాస్మీన్ పథేజా: ఈమె లైంగిక వేధింపుల బాధితుల దుస్తుల్ని సేకరిస్తారు!

ఫొటో సోర్స్, Asif Saud
లైంగిక వేధింపులు జరిగిన సందర్భాల్లో చాలాసార్లు నెపాన్ని బాధితులపైనే నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ సమయంలో వారిని చాలా మంది అడిగే ప్రశ్న, ''అప్పుడు నువ్వెలాంటి డ్రెస్ వేసుకున్నావ్?'' అని.
బెంగళూరులో ఉంటున్న జాస్మీన్ పథేజా అలాంటి బాధితుల దుస్తులను సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. వేధింపులకు కారణం వారి దుస్తులు కాదని నిరూపించేందు కోసమే ఈ పని చేస్తున్నట్లు ఆమె బీబీసీ ప్రతినిధి గీతా పాండేకు తెలిపారు.
బెంగళూరులోని ఆమె ఇంటిలో, మ్యూజియంలా మార్చిన ఓ చిన్న గదిలో మనం డజన్ల కొద్దీ దుస్తులను చూడవచ్చు. అవి రోజూ మహిళలు సర్వ సాధారణంగా ధరించే దుస్తులే. కానీ వాటిలో ఒక్కొక్క దాని వెనుక ఒక్కో కథ ఉంది.
అవన్నీ లైంగిక వేధింపుల బాధితుల నుంచి జాస్మీన్ పథేజా సేకరించిన దుస్తులే. ఆ దుస్తులతో ఆమె త్వరలో ఒక స్టూడియోను ప్రారంభించాలని భావిస్తున్నారు.
వాటిలో ఎరువు, నలుపు జంప్ సూట్‌ను గత ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులో లైంగిక వేధింపులకు గురైన మహిళ డొనేట్ చేశారు.
''నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా ఓ గుంపు జొరబడి, మహిళల శరీరాలను తడుముతూ, వేధింపులకు గురి చేసినట్లు ఆమె చెప్పారు'' అని పథేజా తెలిపారు.
ఆ తర్వాత ఆమె ఎరుపు, నలుపు ప్రింట్‌తో ఉన్న ఓ క్రీమ్ కలర్ కుర్తా బయటకు తీసారు. ఆ డ్రెస్సు అత్యంత సాదాసీదాగా ఉంది. కోయంబత్తూర్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి ఓ వ్యక్తి ఆమె ఒంటిని తడిమాడు. ఆ డ్రెస్ ఆమె డొనేట్ చేసినదే.
''ఆ సంఘటన గురించి ఫిర్యాదు చేద్దామనుకుంటే ఆమెను వెనక్కి లాగారు'' అని పథేజా చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
ఆ తర్వాత పింక్ డ్రెస్ మాంట్రియల్‌కు చెందిన మహిళ పంపారు. ''మీరు గనుక తీసుకోకుంటే, దీన్ని పారేయదల్చుకున్నా. దాన్ని ఇంట్లో చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది'' అని ఆమె పథేజాకు చెప్పారు.
'ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్ ' అనే ఈ ప్రాజెక్ట్ తమ ఉమ్మడి బాధలు, వేదనలకు ప్రతిరూపమని పథేజా తెలిపారు.

ఒక అర దగ్గర్నుంచి నుంచి మరో అరకు వెళుతుండగా ఆమె వరుసగా ఒక వైట్ డ్రస్‌ను, స్విమ్ సూట్‌ను, షాంపేన్ రంగులో ఉన్న గౌన్‌ను, ఒక జత ట్రౌజర్లను, ఒక స్కూల్ యూనిఫాంను చూపించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు అవి ప్రత్యక్ష సాక్ష్యాలు.
''నువ్వు ఎలాంటి దుస్తులు వేసుకున్నావు అన్నదానికి లైంగిక వేధింపులతో ఎలాంటి సంబంధమూ లేదు. ఇలాంటి హింసను ఏ రకంగానూ సమర్థించుకోలేరు'' అన్నారామె.
అందువల్లే ఆమె తన ప్రాజెక్టుకు 'ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్' అని పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, Asif Saud
వేధింపులు, ఈవ్ టీజింగ్.. పేరేదైతేనేం?
లైంగిక వేధింపులకు నిరసనగా ఆమె చేస్తున్న ఈ పోరాటం సుమారు ఒకటిన్నర దశాబ్దం కింద, ఆమె కళలలో ఉన్నత విద్య కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు వచ్చిన కొత్తలో ప్రారంభమైంది.
''కోల్‌కతాలో వేధింపులు లేవని కాదు. కానీ నేను అప్పుడే కొత్తగా బెంగళూరుకు వచ్చాను. నా వయసు అప్పుడు 23 ఏళ్లు. నన్ను కాపాడేందుకు ఇక్కడ మా వాళ్లెవరూ కూడా లేరు.''
''ఆ రోజుల్లో ఇలాంటి వేధింపులన్నిటినీ 'ఈవ్ టీజింగ్ ' అంటూ తేలిగ్గా కొట్టిపారేసేవాళ్లు. ఈ సమస్యపై ఎవరూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. దీంతో అలాంటి వాళ్లింకా రెచ్చిపోయేవాళ్లు.''
దానికి అడ్డుకట్ట వేయడానికి, ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
‘నిశబ్దంగా ఉంటే మరిన్ని వేధింపులు’
సర్వసాధారణంగా పిల్లికూతలు, అసభ్యమైన కామెంట్లు, తాకడం, తడమడం అన్నది దాదాపు మహిళలందరూ అనుభవించే బాధే.
ఎవరైనా దానిని ప్రశ్నిస్తే తప్పును వారిపైకే నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. ఆమె వాళ్లను రెచ్చగొట్టిందనో, ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించిందనో, రాత్రిళ్లు పొద్దుపోయే వరకు బయట తిరుగుతోందనో, మద్యం సేవించిందనో - ఒక్క మాటలో చెప్పాలంటే ఆమే ఆ వేధింపులు కోరుకుంది అనేలా ఉంటాయి వాళ్ల మాటలు.
''ఆడపిల్లలను చాలా జాగ్రత్తగా పెంచుతారు. మేం నిరంతరం ఒక అభద్రతా వాతావరణంలో పెరుగుతాం. మమ్మల్ని వేధిస్తే, నువ్వు తగినన్ని జాగ్రత్తలు తీసుకోలేదేమో అంటారు.''
ఆ భయాన్ని జయించడం కోసం ఆమె 2003లో 'బ్లాంక్ నాయిస్' అన్న గ్రూప్‌ను ప్రారంభించారు.
''నింద వల్ల అవమానం, అవమానం వల్ల అపరాధ భావం ఏర్పడుతుంది. అది మరింత నిశ్శబ్దానికి దారి తీస్తుంది. దాని వల్ల లైంగిక వేధింపులు, హింస మరింత పెరుగుతాయి'' అన్నారు పథేజా.

ఫొటో సోర్స్, Asif Saud
ఏదైనా ఒక భయాన్ని జయించాలంటే ముందుగా దానిపై ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించాలి. అందుకు 'ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్' ప్రాజెక్టు ద్వారా ఆమె మహిళల నుంచి వారి అనుభవాలను సేకరించడం ప్రారంభించారు.
బెంగళూరు, ఇతర పట్టణాలలోని బాలికలు, మహిళలు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అనుభవాలను పంచుకోవాలని కోరారు.
అలా ఆ గ్రూప్ - పేర్లు, వయసు, ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నది, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ సమయంలో వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించారు, అప్పుడు వారేం చేశారు, ఏం చేయాలనుకున్నారు - తదితర వివరాలు వైట్ బోర్డుపై రాయాలని కోరింది.

ఫొటో సోర్స్, Asif Saud
ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్
ఇలా తమ అనుభవాలను వివరించిన వారిలో 14 ఏళ్ల బాలిక మొదలుకొని, 40 ఏళ్లకు పైబడిన వారి వరకు ఉన్నారు.
ఆ వైట్ బోర్డును నింపిన వారంతా తాము ఆ సమయంలో ఎలాంటి దుస్తులు ధరించింది చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లపై దాడులు జరిగినపుడు వారు ధరించిన దుస్తులతో ఒక మ్యూజియాన్ని నెలకొల్పాలనే ఆలోచన ఆమెకు వచ్చింది.
ఒకవేళ 'డిడ్ ఐ ఆస్క్ ఫర్ ఇట్' అనే ప్రశ్న ఉత్పన్నమైతే, పథేజా చాలా స్పష్టంగా 'నో' అనే జవాబిస్తారు. ''ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్''.
''మేం బాధితులను వేధింపుల సమయంలో వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించింది గుర్తు తెచ్చుకుని, వాటిని తీసుకురావాలని కోరతాం. ఎందుకంటే అవే ఆ సంఘటనకు సాక్ష్యం, అవే వారి గొంతుక.''
(ఈ కథనం సమానత్వం కోసం పోరాడుతున్న భారతీయ మహిళల సిరీస్‌లో భాగం)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








