తెలంగాణ: మీ ఇంట్లో పాత టీవీని కంప్యూటర్‌లా వాడుకోవచ్చు, ఎలాగంటే...?

ఫొటో సోర్స్, screengrab
రంగారెడ్డి జిల్లా హాజీపల్లికి చెందిన రాధికకు, ఇంటర్ రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతున్నారు. టీ ఫైబర్ కనెక్షన్‌తో తన ఇంట్లోని సాధారణ ఎల్ఈడీ టీవీని అప్పుడప్పుడు కంప్యూటర్‌గా వాడుతున్నారు.
అందులోని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తరహా ప్రోగ్రాములు, క్రోమ్ వంటి బ్రౌజర్‌తో పాటు, తాను తయారు చేసుకున్న ఫైళ్లను ఫోల్డర్లలో భద్రంగా దాచుకునే వెసులుబాటు ఉంది.
ఇంటర్నెట్ వాడుకుంటూ, ఫెయిల్ అయిన సబ్జెక్టులో కష్టమైన అంశాలను తెలుగులో నేర్చుకుంటున్నారు రాధిక.
రిమోట్‌లో కేవలం రెండు బటన్లు నొక్కితే చాలు.. టీవీ స్క్రీనే సీపీయూగా లేక కంప్యూటర్‌గా మారిపోతుంది. అప్పుడు కీబోర్డు, మౌస్‌తో రాధిక తన పనిచేసుకుంటున్నారు.

కొత్తగా కంప్యూటర్ కొనకుండానే రాధికకు పాత టీవీ ఉపయోగపడుతోంది.
''చదువు వరకూ ఫోన్ కంటే కంప్యూటరే ముఖ్యం. ఎప్పటికైనా కంప్యూటర్ సెంటర్‌కి వెళ్లి నేర్చుకోవాలి అనుకునేదాన్ని. కానీ, ఇప్పుడు ఇంట్లోనే కంప్యూటర్ వాడగలుగుతున్నా. ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ రావాలి కదా.. ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా ఏఐని అడుగుతున్నా. అది ఒక ఫ్రెండ్‌లా మాట్లాడుతోంది'' అని బీబీసీతో చెప్పారు రాధిక.
''టీవీని కంప్యూటర్‌లా వాడుకోవచ్చని, మా ఊరిలో నెట్ కనెక్షన్లు ఇచ్చినప్పుడు పెట్టిన మీటింగులో చెప్పారు. వాళ్లే ఇంటికొచ్చి ఎలా వాడాలో చెప్పారు. మా ఇంట్లో ఒక్క స్మార్ట్ ఫోనే ఉంది. అమ్మ పనికి వెళ్లినప్పుడు ఫోన్ నా దగ్గర ఉండదు. అందుకని ఈ టీవీని కంప్యూటర్‌గా మార్చి వాడుకుంటున్నా. కాలేజీల గురించి, జాబ్స్ గురించి సెర్చ్ చేసుకోవచ్చు'' అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ రంగ ఇంటర్నెట్ సంస్థ టీ-ఫైబర్ రాష్ట్రమంతా ఇంటర్నెట్, కేబుల్, ఓటీటీ కలిపి ప్యాకేజీ అందించే స్కీములో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు గ్రామాల్లో ఈ సేవలు ప్రారంభించింది. అందులో హాజీపల్లి ఒకటి.

ఈ సేవల్లో ఉచితంగా అందించే వర్చువల్ డెస్క్ టాప్ సౌకర్యం ఒకటి. రాధిక ఆ సౌకర్యాన్నే వాడుకుంటున్నారు.
దానికోసం వైర్ లెస్ కీబోర్డు, మౌస్ మాత్రం కొనుక్కోవాలి. స్మార్ట్ టీవీ, పోర్టబుల్ టీవీలనూ (సీఆర్టీ టీవీ) ఇలా వాడుకోవచ్చని ఈ సర్వీస్ అందిస్తోన్న టీ-ఫైబర్ చెబుతోంది.
''గ్రామీణ భారతంలో డిజిటల్ డివైడ్ చాలా స్పష్టంగా ఉందని పీసా నివేదిక చెబుతోంది. దీన్ని తగ్గించాలంటే ఇన్ఫ్రా పెంచాలి. అందుకోసం వర్చువల్ డెస్క్ టాప్ అనే కాన్సెప్ట్ ప్రారంభించాలనుకున్నాం. కొత్తగా కంప్యూటర్ కొనే అవసరం లేకుండా ఇంట్లోని సాధారణ టీవీని కంప్యూటర్‌గా మారిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సౌకర్యం ఇచ్చాం'' అని టీ-ఫైబర్ సంస్థ ఎండీ వేణు ప్రసాద్ బీబీసీకి చెప్పారు.
ఈ విధానం ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. స్వతహాగా కంప్యూటర్ కొనుక్కోలేని విద్యార్థులు తమ ఇళ్లల్లోని సాధారణ టీవీలనే బేసిక్ కంప్యూటర్‌గా మార్చుకునే అవకాశం తెలంగాణలో 6 ఉమ్మడి జిల్లాల్లో కల్పించబోతున్నట్టు టీ-ఫైబర్ చెబుతోంది.

మారుమూల ప్రభుత్వ బడులకు స్పీడ్ ఇంటర్నెట్
డిజిటల్ యుగంలో చదువులన్నీ కంప్యూటర్, ఏఐల చుట్టూ తిరుగుతోన్న వేళ, నెట్ సౌకర్యం అసలే లేని గ్రామీణ ప్రాంతాల్లో, పేదలు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితేంటి?
ఈ విషయంలో భారత్‌లో స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొందరికి వారి స్థోమతను బట్టి ఇళ్ళల్లో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ, దానికి అన్ లిమిటెడ్ నెట్ కనెక్షన్, మొబైల్ సిగ్నల్ ఇబ్బంది.
పిల్లల కోసం ప్రత్యేకంగా ఫోన్ లేదా ట్యాబ్ తీసుకోగలిగే కుటుంబాలూ తక్కువే. దీన్నే డిజిటల్ డివైడ్‌గా వ్యవహరిస్తున్నారు.
అంటే, నగరాలు, పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉండటం, ఎగువ తరగతి, ఎగువ మధ్య తరగతితో పోలిస్తే పేద, మధ్య తరగతి వర్గాలకు నెట్ లేదా కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ లేదా ఏఐ టూల్స్ పూర్తిగా అందుబాటులో లేకపోవడమే ఈ డివైడ్.
సరిగ్గా ఈ లోటును భర్తీ చేయడానికి పెద్ద ప్రయోగం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
టీ-ఫైబర్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం ప్రారంభించింది.
ప్రయోగాత్మకంగా ఒక చోట పూర్తిస్థాయి ఏఐ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలోని వేలాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ స్క్రీన్లు (ఐఎఫ్పీ) ఉన్నాయి.
వాటిలో ముందుగా లోడ్ చేసిన కొంత కంటెంట్ ఉంటుంది. కానీ, ఇంటర్నెట్ సౌకర్యం లేదు.
దీంతో, ఆసక్తి ఉన్న టీచర్లు తమ ఫోన్ హాట్ స్పాట్ ద్వారా ఆ పానెల్‌కి నెట్ కనెక్ట్ చేసి పిల్లలకు అవసరమైన వీడియోలు చూపించేవారు.
టీచర్ లేనప్పుడు ఆ అవకాశం ఉండదు.

విద్యా శాఖ, టీ-ఫైబర్ మధ్య ఒప్పందం
తాజాగా టీ-ఫైబర్ ఇస్తోన్న ఇంటర్నెట్ కనెక్షన్‌తో, ఆ పానెళ్లు నిరంతరం హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్‌తో కనెక్ట్ అయి ఉంటున్నాయి.
దీంతో, టీచర్ ఉన్నా లేకపోయినా, పిల్లలు క్లాస్ రూములో ఇంటర్నెట్‌ను వాడి విద్యా సంబంధిత వీడియోలు చూడొచ్చు.
ఫోన్ సిగ్నల్ లేకపోయినా నెట్ ద్వారా పాఠాలు చెప్పగలుగుతున్నారు ఉపాధ్యాయులు.
''రాష్ట్రంలో 26 వేల బడులు ఉండగా, పైలట్ ప్రాజెక్ట్ కింద 2010 స్కూళ్లకి ఇంటర్నెట్ ఇచ్చేందుకు విద్యా శాఖ, టీ-ఫైబర్ మధ్య ఒప్పందం కుదిరింది. కనెక్షన్లు ఇవ్వడం కూడా ప్రారంభమైంది'' అని టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
ఈ కథనం రాసే సమయానికి 400కి పైగా బడుల్లో నెట్ కనెక్షన్ ఇవ్వడం పూర్తికాగా, అందులో 3 బడులకు బీబీసీ వెళ్లింది.
ఇంటర్నెట్ పట్ల పిల్లలు, ఉపాధ్యాయులు చాలా సంతృప్తితో ఉన్నట్టు చెప్పారు.

‘గతంలో బొమ్మ వేసి చూపించేవాళ్లం, ఇప్పుడు.. యానిమేషన్‌లో చూపిస్తున్నాం’
టెక్స్ట్ బుక్ పాఠం చెప్పిన తరువాత కాసేపు ఐఎఫ్పీలను వాడి ఇంటరాక్టివ్ పాఠం చెబుతున్నట్టు పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ బయాలజీ టీచర్ మహిపాల్ రెడ్డి చెప్పారు.
''గుండె నిర్మాణం గతంలో బొమ్మ వేసి చూపించే వాళ్లం. కానీ, ఇప్పుడు గుండె ఎలా రక్తాన్ని సరఫరా చేస్తుంది, ఎన్ని దశలుంటాయి వంటివన్నీ యానిమేషన్‌లో చూపిస్తే సులువుగా అర్థమవుతోంది. బ్లాక్ బోర్డుపై బొమ్మ కంటే వీడియో వివరణ ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు మహిపాల్ రెడ్డి.
‘‘ అలాగే ప్లాంట్ టిష్యూస్, యనిమల్ టిష్యూస్ 10-11 రకాలుంటాయి. చెప్పేప్పుడు బాగానే ఉంటుంది. కానీ, పిల్లలకు గుర్తుండటం కష్టం. అందుకే ఆ పాఠం అయిపోగానే, ''డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యనిమల్ టిష్యూ ఇన్ వన్ ఫ్రేమ్'' అని ఏఐకి ప్రాంప్ట్ ఇస్తే అది టేబుల్, ఫ్లో చార్ట్, పిక్చర్ ఇలా మూడు రకాలుగా ఉన్న ఇమేజ్ ఇస్తోంది. పిల్లలు దాన్ని గుర్తు పెట్టుకోవడం సులువు'' అని అన్నారు మహిపాల్ రెడ్డి.
సాధారణంగా టీచర్ల ప్రశ్నలకు 30-40 శాతం పిల్లలు ఆసక్తి చూపిస్తారనీ, కానీ ఇంటర్నెట్‌తో కూడిన ఐఎఫ్పీ పానెళ్ళను వాడటానికి ప్రతి విద్యార్థీ ఆసక్తి చూపుతున్నట్టు ఆయన చెప్పారు.
పెద్దగా చురుగ్గా ఉండని పిల్లలు కూడా ఈ టచ్ స్క్రీన్ వాడటానికీ, డ్రాప్ డౌన్ ఎలా పనిచేస్తుందో చూడటానికి ఉత్సాహపడుతున్నట్లు తెలిపారు. అలాగైనా వారు నేర్చుకుంటారని అన్నారు.

‘ప్రపంచంతో కనెక్ట్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది’
ఇంటర్నెట్ వల్ల ఐఎఫ్పీలను బాగా ఉపయోగించగలుగుతున్నట్టు ఆ పాఠశాల హెడ్ మాస్టర్ ఓదెలు బీబీసీకి చెప్పారు.
''నెట్ కనెక్షన్ లేకముందు టీచర్లు పర్సనల్ వైఫై ద్వారా వీడియోలు చూపించేవారు. మారుమూల ప్రాంతాల పిల్లలు ప్రపంచంతో కనెక్ట్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. టీ-ఫైబర్ వచ్చాక కొత్త విషయాలు నేర్చుకోవడం సులువైంది. అయితే, కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు ఇన్‌స్ట్రక్టర్‌ని కూడా ఇస్తే బావుంటుంది'' అన్నారాయన.
టీచర్ల సెలవు, సమావేశాల రోజుల్లో కూడా పిల్లలు నేరుగా ఏఐ వాడి వివిధ వీడియోలు వంటివి చూడగలగడం ఈ నిరంతర ఇంటర్నెట్ వల్ల సాధ్యపడుతోంది. అలాగే ఉపాధ్యాయుల కొరత ఉన్న బడులకూ లాభం కనిపిస్తోంది.
ఇక మెదక్ జిల్లాకు చెందిన బాలానగర్ అనే గ్రామంలో రెండు ప్రాథమిక పాఠశాలల్లో ఒక దానిలో టీవీ, ట్యాబ్ ఉండగా, మరో దానిలో ట్యాబ్ మాత్రమే ఉంది.
ప్రభుత్వం ఇచ్చిన సిమ్ ఉన్నప్పటికీ, ట్యాబ్‌లో అడ్మిన్ పరమైన పనులు పూర్తయ్యాకే కొన్ని వీడియోలు పిల్లలకు చూపించేవారు.
కానీ, ఇప్పుడు పాఠాలతో పాటు, చెప్పిన పాఠానికి సంబంధించి వీడియోలు అపరిమితంగా, బఫర్ లేకుండా చూపించే అవకాశం ఆ ఇంటర్నెట్ ద్వారా కలిగినట్టు అక్కడి ఉపాధ్యాయులు బీబీసీకి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన కంప్యూటర్ హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్‌కు తాజా టీ-ఫైబర్ నెట్ కనెక్షన్ తోడవ్వడంతో మరింత వేగంగా, మెరుగ్గా బయటి ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నారు పిల్లలు.

‘కాంప్లెక్స్ టాపిక్స్ ఏఐతో బాగా అర్థమవుతున్నాయి’
అడవి శ్రీరాంపూర్ గ్రామంలో కార్పొరేట్ కంపెనీల సాయంతో ఒక ఏఐ ల్యాబ్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది టీ-ఫైబర్ సంస్థ.
ఇక్కడి కంప్యూటర్లలో ప్రీమియం ఏఐ టూల్స్‌ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు.
''పాఠాలు 3డీలో చూస్తే బావున్నాయి. హ్యూమన్ ఐ అండ్ కలర్స్ అనే టాపిక్ క్లాసులో చెప్పిన దాని తరువాత ఏఐలో చూస్తే బాగా అర్థమైంది. హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి, భూమి ఎలా తిరుగుతుంది వంటివి ఏఐలో బాగున్నాయి. సోలార్ సిస్టం మనం చూడలేం కదా. కానీ, అప్పటికప్పుడు వీడియోతో ఎక్స్‌ప్లెయిన్ చేసింది. కాంప్లెక్స్ టాపిక్స్ ఏఐతో బాగా అర్థమవుతున్నాయి'' అని చెప్పారు పదో తరగతి విద్యార్థిని సిరిచందన.
''నెట్ ఎప్పుడూ ఉంటే బ్రేక్ టైంలో కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఏఐలో సోర్సుతో సహా వస్తుంది. వాతావరణంలో ఐదు పొరలు పాఠం క్లాసులో విన్నప్పటికీ ఏఐ ద్వారా బాగా అర్థమైంది. లేయర్లను వీడియో రూపంలో చూపింది ఏఐ'' అని చెప్పారు మధు లాస్య.
''గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ప్రీమియం ఏఐ టూల్స్ ఇస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఒక ఏఐ రూరల్ ల్యాబ్ స్టార్ట్ చేశాం. అది అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. పిల్లలందరూ దాన్ని బాగా యుటిలైజ్ చేసుకోవడం ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. అది చూశాక మేం ఆలోచించిన విధానం కరెక్టే అని ప్రూవ్ అయింది'' అన్నారు వేణు ప్రసాద్.

ప్రయోగాత్మకంగా కనెక్షన్లు ఇస్తోన్న గ్రామాల్లో యువత కూడా ఈ నెట్ సౌకర్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
''రీచార్జి సమస్య తప్పుతోంది. ఊరు వెళ్తే నెట్ దొరకదన్న ఇబ్బంది లేదిప్పుడు'' అని ఎంసీఏ పూర్తి చేసిన ఓ యువతి బీబీసీతో చెప్పారు. ఆమె పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
అటు తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కూడా ఈ విషయంలో చురుగ్గా పనిచేస్తోంది.
విద్యా శాఖ కమిషనర్ నవీన్ నికోలస్ చెప్పిన వివరాల ప్రకారం, ''ఇప్పటికే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 19,800 ట్యాబులు ఉన్నాయి. 17,875 ఐఎఫ్పీలు హైస్కూళ్లలో ఉన్నాయి. ఈ ఐఎఫ్పీలలో ప్రీ లోడెడ్ కంటెంట్ ఉంది. నెట్ లేకపోయినా అందులో కొన్ని పాఠాలు ఉంటాయి'' అని చెప్పారు.
అయితే, తాజాగా కేబుల్ ద్వారా నెట్ వచ్చాక, వాటి వాడకంలో విప్లవాత్మక మార్పు వచ్చినట్టు బీబీసీ పరిశీలనలో కనిపించింది.
''ఇప్పటికే 3,565 కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ ల్యాబులు, ప్రైమరీ పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ ల్యాబులు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది'' అని బీబీసీకి చెప్పారు ఐఎఎస్ నవీన్ నికోలస్.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబుల కోసం విద్యా శాఖ తన ప్రయత్నాల్లో ఉండగా, తాము నెట్ కనెక్షన్ ఇచ్చే చోట్ల స్వచ్ఛంద సంస్థలతో కలసి ఏఐ ల్యాబులు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు టీ-ఫైబర్ తెలిపింది.

గ్రామీణ తెలంగాణలో టీ-ఫైబర్
తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోనూ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలని టీ-ఫైబర్ భావిస్తోంది.
అందుకోసం ఇప్పటికే సమగ్రమైన మౌలిక సదుపాయాల వ్యవస్థ ఆ సంస్థ దగ్గర ఉంది.
హైదరాబాద్‌లో భారీ డేటా సెంటర్ ఉంది. ప్రస్తుతం టీ-ఫైబర్ కేబుళ్లు దాదాపు 80 శాతం తెలంగాణను కవర్ చేస్తున్నాయి.
కొత్త జిల్లాల ప్రకారం, 33లో 6 చోట్ల మినహా మిగిలిన జిల్లాల్లో విస్తరించి ఉంది. కానీ, ఇప్పటి వరకూ పూర్తి వినియోగంలోకి తేలేదు.
తాజాగా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడంతో పాటు, ఆ ప్రధాన లైన్స్ నుంచి ప్రతి గ్రామానికీ కేబుల్ వేస్తున్నారు.
ఇది మొత్తం భూగర్భ వ్యవస్థ. తాజాగా మొత్తం 12,751 గ్రామాలకుగానూ, ప్రధాన లైన్ నుంచి 8,898 గ్రామాలకు నెట్ కనెక్షన్ ఇవ్వడం పూర్తయినట్టు యాజమాన్యం చెబుతోంది.
సాధారణంగా గ్రామీణ కేబుల్ నెట్‌వర్క్స్ టీవీ మాత్రమే ఇస్తారు. కానీ, టీవీ, నెట్, ఓటీటీ, వర్చువల్ డెస్క్ టాప్ – ఈ నాలుగూ కలిపి ఇవ్వాలనేది టీ-ఫైబర్ ప్లాన్.
ఇటువంటి ప్రభుత్వ రంగ ఇంటర్నెట్ సౌకర్యం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా అమల్లోకి వచ్చింది. అయితే, ఏపీ -ఫైబర్ నెట్ ఎన్నో రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొంది.
అదే సమయంలో తెలంగాణ మాత్రం ముందుగా పాఠశాలలు, ప్రభుత్వ రంగం ద్వారా ఈ ప్రయోగం చేస్తోంది.
ఇకపై తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, బడులు ప్రాథమికంగా టీ-ఫైబర్ నెట్ తీసుకోవాలని ప్రభుత్వం జీవో 9 విడుదల చేసింది.
ఇప్పటికే 400 వరకూ బడులకు నెట్ కనెక్షన్ రాగా, ఫిబ్రవరి నాటికి 2 వేల బడులకు ఇస్తామని టీ-ఫైబర్ చెబుతోంది.
కేబుల్ టీవీ ధరలోనే కేబుల్ + ఇంటర్నెట్ ఇవ్వగలగడం ద్వారా తమ సంస్థ విజయం సాధిస్తుందని టీ-ఫైబర్ నమ్మకంతో ఉంది.
''ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ అందుబాటు ప్రతి 10 శాతం పెరుగుదలకు, జీడీపీ 2.6 శాతం పెరుగుతుంది. కానీ ఆ బ్రాడ్ బ్యాండ్ అన్ని గ్రామాల్లో అందుబాటులో లేదు. తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో మెజార్టీ భాగం ఇంటర్నెట్ లేదు. మూడు జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోని ప్రతి గ్రామానికీ నెట్ ఇవ్వగలిగిన వ్యవస్థ మా దగ్గర ఉంది. ఇప్పుడు అదే చేస్తున్నాం. ప్రయోగాత్మకంగా 4 గ్రామాల్లో ఇంటర్నెట్, కేబుల్, ఓటీటీ కలిపిన ప్యాకేజీ ప్రారంభించాం’’ అని చెప్పారు వేణు ప్రసాద్.
గ్రామీణ ప్రాంతాల్లో నెట్ ఇస్తే ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాక, విద్యార్థులకీ లాభం అనేది టీ-ఫైబర్ వాదన.
అయితే, స్మార్‌ఫోన్ అందుబాటులో ఉండగా పిల్లలకు ఇక వర్చువల్ కంప్యూటర్ అవసరమేముందనే ప్రశ్న ఉదయిస్తుంది.
''పిల్లలకు ఇప్పుడు హోం వర్క్, ప్రాజెక్ట్ వర్కు కూడా వాట్సప్ ద్వారా పంపుతున్నారు. వాళ్లు ఆ చిన్న స్క్రీన్ పక్కన పెట్టుకుని మొత్తం వర్క్ చేయాలి. ఒకటి కంటి సమస్య. రెండు, వాళ్ళు ఫోన్ వాడుతున్నంత సేపు పెద్దలు పక్కన ఉండాలి. అందరికీ అదనపు డివైజ్‌లు కొనలేరు. మా వ్యవస్థలో వాళ్లు టీవీనే వాడతారు కాబట్టి, పిల్లలు ఏం చూస్తున్నారన్న భయం అక్కర్లేదు. పెద్ద స్క్రీన్, డాటా ఎంత వాడారు, నెట్ స్పీడ్ రావట్లేదు అన్న సమస్య రాదు'' అన్నారు వేణు ప్రసాద్.

ముందున్న సవాళ్లు
నిజానికి ఫైబర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్, బీఎస్ఎన్ఎల్ అనుభవాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
మొదటిది రాజకీయ ఒడిదొడుకులు, రెండవది నిర్వహణ సమస్యలు.
గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ వ్యవస్థ బలంగా పాతుకుపోయి ఉంది.
విద్యా సంస్థల వరకూ ఓకే కానీ, స్థానిక కేబుల్ టీవీని కాదని టీ-ఫైబర్ ఎలా నిలబడగలదన్న ప్రశ్న ఉంది.
''ప్రస్తుత కేబుల్ వ్యవస్థను కదపడం లేదు. మా వ్యవస్థ నిర్వహణలో కూడా కేబుల్ వారిని పార్టనర్లుగా పెట్టుకుంటున్నాం. దాని వల్ల రెండు లాభాలు. ఒకటి మెయింటెనెన్స్ బాధ్యత వారిదే కాబట్టి ఎక్కడ నెట్ ఆగినా తమ ఊళ్లో క్షణాల్లో బాగు చేస్తారు. అప్పుడు మా సర్వీసు మీద ఫిర్యాదు రాదు. రెండు వారికి వాటా ఉంటుంది కాబట్టి, వారు మమ్మల్ని వ్యతిరేకించరు. అన్నిటికీ మించి వాళ్లు కేబుల్ టీవీ ఇచ్చే రేటుకు మేం నెట్‌తో కూడిన కేబుల్ ఇస్తాం కాబట్టి సక్సెస్ అవుతాం’’ అంటున్నారు టీ-ఫైబర్ ఎండీ.
‘‘అది కాక స్మార్ట్ టీవీ లేకపోయినా ఓటీటీ, యూట్యూబ్ వచ్చే ఏర్పాటు చేయడం మాకింకా అడ్వాంటేజ్. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. లాభం కాకుండా లాస్ట్ మైల్ డిజిటల్ యాక్సెస్ మా లక్ష్యం. అందుకే ఈ ప్రణాళిక. దాన్నే మేం డిజిటల్ జస్టిస్ అని పిలుస్తున్నాం'' అంటున్నారు టీ ఫైబర్ ఎండీ.
ప్రస్తుతం టీ-ఫైబర్ వేలాది కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందం చేసుకుంది.
ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉండే అతిపెద్ద సమస్య అయిన మెయింటెనెన్స్ (O&M) ప్రైవేటు చేతుల్లో పెట్టింది.
''మేం గవర్నెన్స్ వరకు మాత్రమే పరిమితం'' అంటోంది టీ-ఫైబర్.
ఇప్పటికే టీ-ఫైబర్ హైదరాబాద్‌లో పెద్ద స్థాయి మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. డేటా సెంటర్, కాల్ సెంటర్, నిర్వహణ వ్యవస్థ ఉంది.
అయితే, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌తో ఉన్న కొన్ని ఒప్పందాల సాంకేతిక కారణాల వల్ల ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం టీ-ఫైబర్ తన సేవలను అందించలేదు.
ఆ విషయంగా టీ ఫైబర్-బీఎస్ఎన్ఎల్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














