AI చెప్పే సమాధానాలన్నీ గుడ్డిగా నమ్మొద్దని సుందర్ పిచాయ్ ఎందుకు అంటున్నారంటే...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫైజల్ ఇస్లామ్, రాచెల్ క్లన్, మెక్ మోహన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఏఐ టూల్స్ చెప్పే ప్రతిదాన్నీ యూజర్లు గుడ్డిగా నమ్మకూడదని గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ బీబీసీతో చెప్పారు.

ఏఐ మోడళ్లలో తప్పులు జరిగే అవకాశం ఉందని, మిగిలిన టూల్స్‌తో‌పాటు వాటిని ఉపయోగించాలని బీబీసీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ అన్నారు.

ఏఐ సాంకేతికత ఒక్కటే సరిపోదని, ఇతర టూల్స్ అవసరం కూడా ఎంతో ఉందని పిచాయ్ అన్నారు.

''అందుకే ప్రజలు గూగుల్ సెర్చ్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. కచ్చితమైన సమాచారం కోసం మరింతగా ఆధారపడగల మరిన్ని ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి'' అని ఆయనన్నారు.

గూగుల్ వంటి పెద్ద టెక్ సంస్థలు తమ టూల్స్‌ అందించే అవుట్‌పుట్‌ను ఫ్యాక్ట్-చెక్ చేయాలని కోరడం లేదని, తమ వ్యవస్థలను మరింత నమ్మదగినవిగా మార్చడంపై దృష్టి పెడుతున్నాయని కొందరు నిపుణులు అంటున్నారు.

''మీరు సృజనాత్మకంగా ఏమన్నా రాయాలనుకుంటే, చేయాలనుకుంటే ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. అవి ఏ విషయాల్లో సరిగ్గా ఉపయోగపడతాయో అలాంటివాటికే ఆ టూల్స్‌ను వాడడం నేర్చుకోవాలి. అంతేగానీ అవి చెప్పే ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మకూడదు'' అని సుందర్ పిచాయ్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టెక్నాలజీ, ఏఐ టూల్స్, తప్పుడు సమాధానాలు, కంపెనీల పోటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీబీసీకి సుందర్ పిచాయ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘ఏఐలో తప్పులు జరుగుతాయి’

''సాధ్యమైనంతమేర కచ్చితమైన సమాచారం ఇవ్వడానికి మేం కృషిచేస్తున్నాం. ఇది మేం గర్వించే విషయం. ప్రస్తుతమున్న ఏఐ సాంకేతికతలో కొన్ని తప్పులు జరగడానికి అవకాశముంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఏఐ టూల్స్‌పై తమ కంపెనీ డిస్‌క్లెయిమర్లు పెడుతుందని, అవి తప్పులు చేయగలవని యూజర్లకు అర్థమవుతుందని పిచాయ్ అన్నారు.

అయితే, ఆయన సొంత కంపెనీ ప్రోడక్ట్స్‌లో జరిగే తప్పులపై వచ్చే విమర్శలు, ఆందోళనల నుంచి రక్షించే కవచం కాదు ఇది.

గూగుల్ సెర్చ్ ఫలితాలను సమ్మరైజ్ చేసే ఏఐ ఓవర్‌వ్యూస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పుడు కొన్ని వింత, తప్పుడు సమాధానాలతో విమర్శల పాలైంది.

టెక్నాలజీ, ఏఐ టూల్స్, తప్పుడు సమాధానాలు, కంపెనీల పోటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏఐ టూల్స్‌ని గుడ్డిగా నమ్మొద్దని సుందర్ పిచాయ్ అంటున్నారు.

‘ఉపయోగపడే ప్రశ్నలకు గందరగోళ సమాధానాలు’

చాట్ బోట్స్ వంటి జనరేటివ్ ఏఐ ప్రోడక్ట్స్ తప్పుడు లేదా పక్కదోవ పట్టించే సమాచారం అందించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

'' ఈ వ్యవస్థలు సమాధానాలిస్తాయని మనకు తెలుసు. అవి మనల్ని సంతోష పెట్టడానికి అబద్ధాలు చెబుతాయి. అదీ సమస్య'' అని బీబీసీ రేడియో ఫోర్స్ టుడే ప్రోగ్రామ్‌లో క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో రెస్పాన్సిబుల్ ఏఐ సబ్జెక్టు బోధించే ప్రొఫెసర్ జినా నెఫ్ అన్నారు.

''నేను తర్వాత ఏ సినిమా చూడాలి అని అడిగితే పర్వాలేదు. కానీ అత్యంత సున్నితమైన నా ఆరోగ్యం, మానసిక బాగోగులు, సైన్స్, న్యూస్ గురించి అడిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది'' అని ఆమె అన్నారు.

తమ ఏఐ ప్రోడక్ట్స్‌పైన, వాటి కచ్చితత్వంపైన గూగుల్ మరింత బాధ్యతగా ఉండాలని, ఆ విషయాన్ని యూజర్లకే వదిలేయకూడదని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు.

టెక్నాలజీ, ఏఐ టూల్స్, తప్పుడు సమాధానాలు, కంపెనీల పోటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏఐ మోడల్ జెమినై 3.0 వస్తుందా?

త్వరలో ఏఐ మోడల్ జెమినై 3.0?

తాజా గూగుల్ కన్స్యూమర్ ఏఐ మోడల్ జెమినై 3.0 కోసం టెక్ ప్రపంచం ఎదురుచూస్తోంది. చాట్ జీపీటీ నుంచి మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకునేందుకు గూగుల్ దీనిని ప్రారంభిస్తోంది.

ఈ ఏడాది మే నుంచి గూగుల్ తన సెర్చ్‌లో కొత్త ఏఐ మోడ్‌ను పరిచయం చేయడం మొదలుపెట్టింది.

యూజర్లు ఓ నిపుణుడితో మాట్లాడిన అనుభూతి కల్పించాలన్న ఉద్దేశంతో జెమినై చాట్‌బోట్‌‌ను మొదలుపెట్టారు.

జెమినైని ఇలా సెర్చ్‌తో ఏకీకృతం చేయడం ఏఐ ప్లాట్‌ఫామ్ షిఫ్ట్‌లో కొత్త దశ అని ఆ సమయంలో పిచాయ్ చెప్పారు.

చాట్ జీపీటీ వంటి ఏఐ సర్వీసుల నుంచి వచ్చే పోటీ నుంచి తట్టుకోవడానికి ఆల్ఫాబెట్ తీసుకుంటున్న చర్యలో ఇది ఒక భాగం. గూగుల్ ఆన్‌లైన్ సెర్చ్ ఆధిపత్యానికి చాట్‌జీపీటీ సవాలుగా మారింది.

టెక్నాలజీ, ఏఐ టూల్స్, తప్పుడు సమాధానాలు, కంపెనీల పోటీ

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ పరిశోధనలో ఏం తేలిందంటే...

సుందర్ పిచాయ్ కామెంట్లు ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ చేసిన రీసెర్చ్‌ను బలపరుస్తున్నాయి. ఏఐ చాట్‌బోట్లు కొత్త స్టోరీలను అసహజంగా సమ్మరైజ్ చేస్తున్నాయని ఆ పరిశోధనలో తేలింది.

బీబీసీ వెబ్‌సైట్ నుంచి ఓపెన్‌ ఏఐ చాట్‌ జీపీటీ, మైక్రోసాఫ్ట్స్ కోపైలట్, గూగుల్స్ జెమినై, పర్‌ప్లెక్సిటీ ఏఐ వంటివాటన్నింటికీ కంటెంట్ ఇచ్చి దాని గురించి ప్రశ్నలడిగింది. ఏఐ సమాధానాల్లో తీవ్రమైన తప్పులున్నాయని ఆ పరిశోధనలో తేలింది.

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, వాటివల్ల కలిగే హానికారక ప్రభావాలను అరికట్టే భద్రతా చర్యలను అంతే వేగంగా రూపొందించడంలో వాటి మధ్య కొంత ఉద్రిక్తత ఉందని బీబీసీతో ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ చెప్పారు.

''ఈ సమయంలో మేం వేగంగా ముందుకెళ్తున్నాం. మా కస్టమర్లు అదే డిమాండ్ చేస్తున్నారనుకుంటున్నా'' అని ఆయన తెలిపారు.

టెక్నాలజీ, ఏఐ టూల్స్, తప్పుడు సమాధానాలు, కంపెనీల పోటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం ఏఐ సేవల విషయంలో ఏ కంపెనీకి గుత్తాధిపత్యం లేదని సుందర్ పిచాయ్ అన్నారు.

‘గుత్తాధిపత్యం లేదు’

తమ సంస్థ ఏఐలో పెట్టుబడులతో సమానంగా ఏఐ సెక్యూరిటీలోనూ పెట్టుబడులు పెంచిందని గూగుల్ అంటోంది.

''ఉదాహరణకు ఓ ఇమేజ్‌ను ఏఐ ద్వారా సృష్టించారా లేదా అనేది గుర్తించే ఓపెన్-సోర్సింగ్ టెక్నాలజీ మాకుంది'' అని సుందర్ పిచాయ్ చెప్పారు.

ఏఐ నియంతృత్వానికి గూగుల్‌కు చెందిన కొత్త డీప్‌మైండ్ కారణమవుతుందని టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ నుంచి ఓపెన్ ఏఐ వ్యవస్థాకుల వరకు వ్యక్తం చేసిన పాత కామెంట్ల గురించి అడగ్గా ఏఐ లాంటి శక్తిమంతమైన సాంకేతికతను ఏ ఒక్క కంపెనీ సొంతం చేసుకోకూడదని సుందర్ పిచాయ్ బదులిచ్చారు.

ఏఐ ఎకోసిస్టమ్‌లో ప్రస్తుతం అనేక కంపెనీలున్నాయని ఆయన చెప్పారు.

''ఏఐ టెక్నాలజీని సృష్టించే ఒకే ఒక కంపెనీ ఉంటే, ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించాల్సి వస్తే, నాకు అది కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. అలాంటిదానికి మనం చాలా దూరంగా ఉన్నాం'' అని సుందర్ పిచాయ్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)