వీడియోలతో గూగుల్ సెర్చ్, ఈ ఫీచర్‌తో వచ్చే మార్పేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టాగ్ గేర్కాన్
- హోదా, టెక్నికల్ జర్నలిస్ట్
గూగుల్ సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వీడియోల ద్వారా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు కల్పిస్తోంది.
వీడియో సెర్చ్ ద్వారా ప్రజలు తమ కెమెరాను ఏదైనా ఒక వస్తువుపై పెట్టి, సంబంధిత సమాచారాన్ని అడిగితే, సెర్చ్ రిజల్ట్స్‌లో పూర్తి సమాచారం వస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు తమ ఫోన్‌లలో ‘ఏఐ ఓవర్‌వ్యూస్’ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఇంగ్లీష్‌లోనే పనిచేయనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి ప్రజలు ఆన్‌లైన్‌లో శోధించే విధానాన్ని మార్చడానికి టెక్ దిగ్గజం ఈ తాజా చర్యలకు దిగింది.
మూడు నెలల కిందట ఓపెన్ ఏఐ కూడా కొత్త సెర్చ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇందులో యూజర్లు చాట్‌బాట్‌లో నేరుగా ప్రశ్నలు అడగడం ద్వారా తమకు కావాల్సిన సెర్చ్ ఫలితాలు పొందేలా రూపొందించారు.

గూగుల్ సెర్చ్‌లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడటం ఈ ఏడాది నుంచే గూగుల్ ప్రారంభించింది.
అయితే, ఫలితాలు కచ్చితంగా రాకపోతుండటంతో ఇది విమర్శలను ఎదుర్కొంది.
అప్పటి నుంచి ఏఐ ద్వారా సెర్చ్ ఫలితాలను మెరుగుపర్చడంపై గూగుల్ పనిచేస్తున్నట్లు ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.
గూగుల్ తన ఉత్పత్తుల్లో ఏఐ వాడకాన్ని పెంచుతోంది. గూగుల్ లెన్స్ ద్వారా ఇమేజ్‌ల గురించి ప్రశ్నలు అడిగే సౌకర్యాన్ని కూడా గూగుల్ జతచేసింది.
ఈ ఫీచర్‌తో గూగుల్ లెన్స్ పాపులారిటీ పెరిగిందని, ఈ అప్లికేషన్‌ను మరింత మెరుగుపరిచేలా ఇది దోహదం చేసిందని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
మరింత తేలికగా..
ప్రజలు తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరింత తేలికగా ప్రశ్నలు అడిగేలా ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని గూగుల్ సెర్చ్ హెడ్ లీజ్ రీడ్ అన్నారు.
ఇందుకు ఆమె ఒక అక్వేరియం వద్ద ఉన్న వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నారు. ఆ అక్వేరియంలో చేపలన్నీ ఒకేవైపు ఎందుకు ఈదుతున్నాయో తెలుసుకోవాలని ఆ వ్యక్తి అనుకుంటే అతను సింపుల్‌గా తన మొబైల్ ఫోన్‌లోని కెమెరాను అక్వేరియం వైపు చూపించి ఓ షార్ట్ క్లిప్ రికార్డు చేసి తన ప్రశ్నను అడిగితే చాలు గూగుల్ ఏఐ ఆ వీడియోను పరిశీలించి మీ ప్రశ్నకు తగిన ఫలితాలను చూపిస్తుంది అని ఆమె తెలిపారు.
గూగుల్‌కు ఇది చాలా పెద్ద డీల్ అని ఇండస్ట్రీ అనలిస్ట్ పాలో పెస్కాటోర్ అన్నారు.
‘‘ప్రతీ దానిలో మనం ఏఐను చూస్తున్నాం. విజువల్స్‌తో ప్రజలు బాగా కనెక్ట్ అవుతారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సెర్చ్ మార్గాలేంటి?
వీడియో సెర్చ్ ఫీచర్ మాత్రమే కాక, ఎన్నో ఇతర అప్‌డేట్లను కూడా గూగుల్ విడుదల చేసింది. తన షాపింగ్ ఫలితాలను మెరుగుపరచడంలో భాగంగా వివిధ విక్రేతల నుంచి సమీక్షలు, ధరల సమాచారాన్ని కూడా పొందుపరుస్తుంది.
దీంతోపాటు యాపిల్ మ్యూజిక్ రికగ్నైజేషన్ అప్లికేషన్ షాజమ్ కు పోటీగా గూగుల్ కూడా కొత్త అప్లికేషన్ తీసుకువస్తోంది. ఈ కొత్త ఆండ్రాయిల్ టూల్‌ను సర్కిల్ ద్వారా ఉపయోగించవచ్చు.
ఈ అప్లికేషన్‌తో ప్రజలు ఆ వెబ్‌సైట్ నుంచి బయటికి వెళ్లకుండానే, ఏ వెబ్‌సైట్ నుంచైనా పాటలను, షోలను సెర్చ్ చేయవచ్చు.
ప్రస్తుతం 90 శాతం ఇంటర్నెట్‌ను గూగుల్‌నే నియంత్రిస్తోంది. కానీ, ఇతర సంస్థలు కూడా దాంతో పోటీపడుతున్నాయి.
గూగుల్ ప్రత్యర్థిగా ఓపెన్ ఏఐ ఉంది. కొత్త సెర్చ్ ఫీచర్‌పై తాము కూడా పనిచేస్తున్నట్లు ఓపెన్ ఏఐ తెలిపింది.
సెర్చ్ జీపీటీ ద్వారా ప్రజలు చాట్‌బోట్‌ను ప్రశ్నలు అడిగి సమాధానం పొందొచ్చు. ఇది ప్రస్తుతం అమెరికాలో పరిమిత సంఖ్యలోనే టెస్ట్ చేశారు. ఓపెన్ ఏఐ కంపెనీ మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి 6.6 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.
గూగుల్ ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ ఫీచర్, ప్రత్యర్థి సంస్థల వృద్ధికి అడ్డుకట్ట వేసేందుకు ఒక మార్గంగా ఉండొచ్చు. కానీ, గూగుల్‌తో పోటీపడే స్థాయిలో ఇప్పటి వరకు ఏ కంపెనీ లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














