టీనేజర్ల నుంచి వృద్ధుల వరకు తప్పనిసరిగా వేసుకోవాల్సిన టీకాలివే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ దేశం పీఆర్
- హోదా, బీబీసీ తెలుగు కోసం
టీకాలు అనగానే మనలో చాలామందికి చిన్న పిల్లలే గుర్తుకొస్తారు. అయితే, అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పిల్లలు మాత్రమే కాదు, పెద్దవారు, వయసు మళ్లిన వారు కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉన్నాయి.
పెద్దవారికి టీకాలేంటి అనుకుంటున్నారా? టీనేజర్లు, పెద్దవాళ్లు, వృద్ధులు ఎలాంటి టీకాలు వేసుకోవాలో, ఎందుకు వేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

అసలు టీకాలు ఎందుకు?
మనుషులకు సోకే అనేక రకాల వ్యాధులలో కొన్ని అంటువ్యాధులు ఉంటాయి, మరికొన్ని అంటువ్యాధులు కానివి ఉంటాయి. ఆర్థికంగా వెనకబడిన దేశాల్లోని ప్రజల్లో అవగాహనా లోపం కారణంగా అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి.
అంటు వ్యాధులను వ్యాప్తి చెందించే సూక్ష్మ జీవులు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. వీటిలో చాలావరకు వైరస్ జాతికి చెందినవి, మరికొన్ని బ్యాక్టీరియా జాతికి చెందినవి ఉంటాయి.
వైరస్/బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరితే మనలోని రోగ నిరోధక కణాలు వాటిపై పోరాడుతాయి. ఈ పోరులో రోగ నిరోధక వ్యవస్థ గెలిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే రోగాల బారిన పడతాం.
మనం తీసుకునే మందులతో రోగ నిరోధక వ్యవస్థ మళ్లీ బలపడి మనల్ని ఆరోగ్యంగా మారుస్తుంది. చిన్నపిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే వారికి రెండేళ్లలోపే చాలా రకాల టీకాలు ఇచ్చి రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తాం.
రకరకాల పారాసైట్లు, ఫంగస్‌లు, ప్రోటోజోవాల వల్ల కూడా అంటువ్యాధులు వస్తాయి. కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని ఎదుర్కోవడానికి టీకాలు తయారు చేయడం అంత సులువు కాదు.
వ్యాధి సోకిన తర్వాత మందులు, ఇంజెక్షన్లతో చికిత్స చేయాల్సి ఉంటుంది. లేదంటే ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని, రాకుండా నివారించుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పెద్దవాళ్లు ఏ టీకాలు తీసుకోవాలి?
టీడాప్:
ఈ ఇంజెక్షన్‌తో ధనుర్వాతం, డిప్తీరియా, పేర్చుసిస్ వ్యాధులను ముందే నివారించవచ్చు. గతంలో దీన్నే టీటీ ఇంజెక్షన్ అనేవారు. ఇప్పుడు డీటీ / టీడాప్ పేరుతో అందుబాటులో ఉంది. సాధారణంగా ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ ఇంజెక్షన్ ఇస్తుంటారు. దీన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒకసారి తీసుకుంటే దీని ప్రభావం పదేళ్ల వరకూ ఉంటుంది. కాబట్టి మీరెప్పుడైనా టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే మళ్లీ పదేళ్ల వరకూ మరో డోసు వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
చికెన్ పాక్స్ :
చిన్న పిల్లలు/యుక్త వయసులో ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన టీకా ఇది. గతంలో చికెన్ పాక్స్ వ్యాధి బారిన పడనివారు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇది రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది.
జోస్టర్:
ఇది 60 ఏళ్ల పైబడినవారు, డయాబెటిస్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా తీసుకోవాల్సిన టీకా. చికెన్ పాక్స్‌ను కలగజేసే వరిసెల్లా వైరస్ శరీరంలోని నాడీ కణాల్లోకి వెళ్లి స్థిరపడిపోతుంది. వయసు పెరిగాక లేదా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వైరస్ మళ్లీ యాక్టివేట్ అయ్యి, జోస్టర్ అనే వ్యాధికి కారణమవుతుంది.
దీని వల్ల ఛాతీ, పొట్ట చుట్టూ చికెన్ పాక్స్ మాదిరి గుల్లలు వస్తాయి. ఈ గుల్లలు తొందరగానే తగ్గినా, వాటి వల్ల వచ్చే నొప్పి కొన్ని నెలల పాటు, కొన్నిసార్లు కొన్నేళ్ల పాటు ఉంటుంది. దాన్నే పోస్ట్-హెర్పెటిక్ న్యూరాల్జియా అంటారు. దీన్ని నివారించడానికి జోస్టర్ టీకా ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
హెపటైటిస్ బి:
ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి అసురక్షిత శృంగారం ద్వారా, అసురక్షిత రక్తం ఎక్కించుకోవడం ద్వారా సోకుతుంది. గర్భిణి నుంచి పుట్టబోయే శిశువుకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ బారిన పడితే లివర్ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటివి వస్తాయి.
వైద్య రంగంలో పని చేసేవారు, ల్యాబ్ టెక్నీషియన్లు, తరచుగా ఇంజక్షన్లు చేసేవారు కచ్చితంగా తీసుకోవాల్సిన టీకా హెపటైటిస్ బీ. దీనిని మూడు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఫ్లూ టీకా:
ఫ్లూ బారిన పడి ప్రతి ఏటా చాలామంది ఆసుపత్రి పాలవుతుంటారు. అమెరికా లాంటి దేశాల్లో అధిక శాతం జనాభా ఈ టీకా తీసుకుంటారు. భారత్‌లో కూడా ఇప్పుడు అవగాహన పెరిగి చాలామంది తీసుకుంటున్నారు. 50 ఏళ్లు పైబడిన అందరూ ఈ వ్యాక్సీన్ తప్పకుండా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త వేరియెంట్లు వస్తుంటాయి కాబట్టి ఏడాదికోసారి తీసుకోవడం మంచిది. డయాబెటిస్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రతి సంవత్సరం దీన్ని తీసుకోవాలి.
నీమోకొకల్ టీకా:
ఈ వ్యాక్సీన్ నిమోనియాను నివారిస్తుంది. అరవై ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన టీకా ఇది. ఒక డోసు వేసుకుంటే సరిపోతుంది. అరవై ఏళ్ల లోపు వారికి అవసరాన్ని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి ఒకటి లేదా రెండు డోసులు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. రక్తంలో షుగర్ లెవల్ నియంత్రణలో లేని వారు ఈ వ్యాక్సీన్ తప్పకుండా తీసుకోవాలి.
ఎంఎంఆర్ టీకా:
మీజిల్స్, మంప్స్, రుబెల్లా వ్యాధులను ముందుగానే టీకాలతో నివారించవచ్చు. 50 ఏళ్ల లోపు వారంతా దీన్ని తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి 50 ఏళ్లు దాటిన వారికీ దీన్ని ఇస్తారు. ఒక్క డోస్ తీసుకుంటే చాలు.

ఫొటో సోర్స్, Getty Images
హెపటైటిస్ ఏ, మెనింగోకొకల్ టీకాలు:
ఏ వయసు వారికైనా అవసరాన్ని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి ఈ టీకాలను డాక్టర్లు సూచిస్తారు.
టైఫాయిడ్ వ్యాక్సీన్:
వంటలు వండే వారు, హోటళ్లలో పని చేసే వారు ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు, తీర్థ యాత్రలకు వెళ్లేవారు కూడా ఈ టీకా తీసుకుంటే మంచిది. మూడేళ్లకోసారి ఒక డోసు తీసుకోవాల్సి ఉంటుంది.
హెచ్‌పీవీ వ్యాక్సీన్:
జననాంగాల్లో వచ్చే వ్యాధులను, కేన్సర్‌ను హెచ్‌పీవీ టీకా నివారిస్తుంది. 9 నుంచి 26 సంవత్సరాలలోపు వారికి దీన్ని ఇస్తారు. లైంగిక జీవితం ప్రారంభించబోతున్న వారు ఈ వ్యాక్సీన్ వేసుకుంటే భవిష్యత్‌లో ఎక్కువగా ఇబ్బందులు రావు. దీన్ని మూడు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ టీకాలన్నీ వైద్యుల సూచనల మేరకే తీసుకోవాలి.
గర్భిణులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, హెచ్ఐవీ బారిన పడినవారు, స్టెరాయిడ్‌లు వాడుతున్నవారు తమ డాక్టర్ల సలహా మేరకే ఏ టీకా అయినా తీసుకోవాలి.
డయాబెటిస్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వారు కూడా డాక్టర్లను సంప్రదించి, నిర్ణయం తీసుకోవాలి.
టీకాలు తీసుకుంటే రోగాల నుంచి దూరంగా ఉండవచ్చు, ఆసుపత్రి ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.
ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నివారణకు ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మరణాలకు కారణమైన స్మాల్ పాక్స్ (చిన్న అమ్మవారు) ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. పోలియో కేసులూ అంతే. ధనుర్వాతం వల్ల సంభవించే మాత శిశు మరణాలు టీటీ ఇంజెక్షన్ రాకతో తగ్గాయి.
అయితే, వ్యాధులు రాకుండా నివారించడానికి టీకాలు తీసుకోవడం ఒక్కటే మార్గం కాదు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛమైన నీరు తాగడం, బాగా ఉడికించిన ఆహారాన్ని తినడం, ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. రోజూ తగినంత సమయం వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం వంటివి మన రోగ నిరోధక శక్తిని బలంగా మారుస్తాయి.
(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















