చైనా: ఉద్యోగం చెయ్యడంకన్నా మానెయ్యడం బెటరని చైనీయులు ఎందుకు అనుకుంటున్నారు?

చైనా ఎకానమీ, షీ జిన్‌పింగ్, కమ్యూనిస్ట్ పార్టీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రభుత్వం అమలు చేసిన కఠిన నిబంధనలు భవిష్యత్ గురించి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచాయి.
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ, వెయ్‌మా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

నత్తనడక నడుస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు చైనా పాలకులు శ్రమిస్తున్నారు. ఏక కాలంలోనే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ప్యాకేజీలు ఇచ్చారు. ప్రజలకు నేరుగా నగదు అందించారు.

అభివృద్ధిలో వేగం పెంచేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించారు. డీలా పడిన రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు.

ఈ నిర్ణయాలన్నీ గతంలో తీసుకున్నవే.

ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘పొంచి ఉన్న ప్రమాదాలు, తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడం’ గురించి మాట్లాడారు.

ఆయన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారని అనేక మంది భావించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చైనా ఎకానమీ, షీ జిన్‌పింగ్, కమ్యూనిస్ట్ పార్టీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దేశం ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఇటీవల షీ జిన్‌పింగ్ మాట్లాడారు.

చైనా ప్రజల మీద ఎలాంటి ప్రభావం ఉంది?

దిగజారుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీని ప్రభావం చైనా ప్రజల మీద ఏ మేరకు ఉందనేది తెలియదు. ప్రజలు తమ ఆశల్ని, అసహనాన్ని బయటకు చెప్పుకోలేరు. వాటి మీద తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయి.

అయితే రెండు తాజా పరిశోధనల్ని పరిశీలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ గురించి కొంత అవగాహన వస్తుంది.

ఇందులో మొదటిది చైనా ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని గురించి నిర్వహించిన సర్వే. ప్రజలు నిరాశావాదులుగా మారుతున్నారని, భవిష్యత్ ‌గురించి ఆందోళన చెందుతున్నారని ఈ సర్వే తేల్చింది.

ఆర్థిక కష్టాల కారణంగా ప్రజలు ఆన్‌లైన్‌లోను, వీధుల్లోనూ ఆందోళన చేస్తున్నారని మరో అధ్యయనంలో వెల్లడైంది.

చైనా అంతటా ఇదే పరిస్థితి ఉందని చెప్పలేకపోయినా, చైనాలో ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఈ సర్వేలు ఉపకరిస్తాయి.

ఈ సర్వేల ద్వారా ప్రజలు తమ భవిష్యత్ గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు.

రియల్ ఎస్టేట్ సంక్షోభం ఒక్కటే కాదు, దానిని మించి పెరుగుతున్న చైనా ప్రభుత్వ వ్యయం, నిరుద్యోగ తీవ్రత...ప్రజల పొదుపు శక్తిని, కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

దీని వల్ల ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఐదు శాతంగా పెట్టుకున్న తన వృద్ధిరేటు లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు.

ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు నిరాశకలిగిస్తుంది. ఆ పార్టీ ప్రజల పట్ల తన వైఖరిని మార్చుకోవచ్చు.

చైనా, రియల్ ఎస్టేట్, ఎవర్ గ్రాండే, చైనా ఎకానమీ, నిరుద్యోగ యువత

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే దివాలా తీసినట్లు 2023 ఆగస్టు 18న ప్రకటించింది.

వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి పతన దిశకు...

చైనా ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి ఆ దేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిపింది.

చైనా పాలకులు ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తూ వచ్చారు. దీని వల్ల చైనాలో ప్రజలపై పాలకుల నియంత్రణ నిరాటంకంగా కొనసాగింది.

కరోనా మహమ్మారి ముగిసిన వెంటనే చైనా ఆర్థిక వ్యవస్థ మందగించింది. కరోనా కారణంగా చైనాలో మూడేళ్ల పాటు లాక్‌డౌన్లు, నిషేధాలు ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి.

చైనా ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందు, కరోనా తర్వాత అనే దానిపై హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ మార్టిన్ వైట్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ సెంటర్ ఆన్ చైనా ఎకానమీకి చెందిన స్కాట్ రోజెల్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ విద్యార్థి మైఖేల్ ఎలిస్కీ చేసిన అధ్యయనం చైనా ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేసింది.

ప్రొఫెసర్ మార్టిన్ 2004, 2009లోనూ చైనా ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేశారు.

షీ జిన్‌పింగ్ అధ్యక్షుడు కావడానికి ముందు జరిగిన అధ్యయనాలు అవి.

జిన్‌పింగ్ చైనా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత 2014, 2023లోనూ ఆయన చైనా ఆర్థిక వ్యవస్థపై సర్వే నిర్వహించారు. ఆయన సర్వే శాంపిల్ సైజ్ మూడు వేల నుంచి ఏడున్నర వేల వరకు ఉంది.

2004లో నిర్వహించిన సర్వేలో అంతకు ముందు ఐదేళ్లలో ( 1999-2004) తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైందని 60 శాతం మంది చెప్పారు. తర్వాతి ఐదేళ్లలో ( 2004-2009) తమ ఆర్థిక పరిస్థితి మారుతుందని వారంతా భావించారు.

2009లో 72.4 శాతం మంది ప్రజలు తమ జీవితాలు మెరుగయ్యాయని విశ్వసించారు.

2014లో ఇలా చెప్పిన వారి సంఖ్య 76.5 శాతం. 2009లో 68.8 శాతం మంది తమ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని భావించారు. 2014లో ఈ సంఖ్య 73 శాతం.

అయితే 2023లో కేవలం 38.8 శాతం మంది మాత్రమే తమ కుటుంబ జీవితం మెరుగుపడిందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తమ పరిస్థితి మెరుగుపడుతుందని 47 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇదంతా చూస్తే తమ భవిష్యత్ మారుతుందనే ఆశను కోల్పోతున్న వారి సంఖ్య అప్పటికీ ఇప్పటికీ మారింది. 2004లో తమ జీవితాలు మారతాయనే అంశంపై నిరాశతో ఉన్న వారి సంఖ్య 2.3 శాతం ఉంటే, 2023లో అది 16 శాతం ఉంది.

ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా ఉన్న వారి నుంచి అభిప్రాయాల్ని సేకరించారు. ఇందులో 20 నుంచి 60ఏళ్ల మధ్య వయసుగల వ్యక్తుల్ని ప్రశ్నలు అడిగారు.

అయితే చైనాలో ఉన్న నిరంకుశ పాలన వల్ల ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోవడం కష్టం.

అయితే ప్రజలతో మాట్లాడినప్పుడు నిరుద్యోగం పెరుగుతోందని తేలింది. లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ అర్హతలకు తగినవికాని, తక్కువ ఆదాయ ఉద్యోగాలు చేస్తున్నారు.

పని భారం పెరగడంతో కొంతమంది ఇకపై తాము చేస్తున్న పని ఎంత మాత్రం చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు. మరి కొంతమంది రోజుకు 16 గంటల పని వదిలేసి తమ తల్లిదండ్రులతో జీవిస్తున్నారు.

రెండు కారణాల వల్ల వాళ్లు ఇలా చేస్తున్నారు. ఒకటి వాళ్లకు వారు చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం లేదా వారు చేస్తున్న ఉద్యోగంలో విపరీతమైన పని భారం ఉండటం, పని వల్ల అలసి పోవడం లాంటివి అందులో ఉన్నాయి.

చైనా ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిస్ట్ పార్టీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్కువ పని చెయ్యడం వల్ల మెరుగైన భవిష్యత్‌కు గ్యారంటీ ఉంటుందని భావించే పరిస్థితి లేదని సర్వే తేల్చి చెప్పింది.

కష్టపడి పని చెయ్యడం వల్ల ప్రయోజనం లేదు

ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల్ని కఠినంగా అమలు చెయ్యడంతో ప్రజలు నిస్సహాయులుగా మారారని విశ్లేషకులు భావిస్తున్నారు.

చైనా ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ ఒక “టర్నింగ్ పాయింట్” అని సింగపూర్‌లోని లీ కువాన్ వీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో అసోసియేట్ ప్రొఫెసర్ అల్‌ఫ్రెడ్‌ వు చెప్పారు. కోవిడ్ ఆంక్షలు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలకు గుర్తు చేశాయి. చైనీయులు గతంలో ఎన్నడూ ఇంతటి నిఘా నీడలో జీవించలేదని భావించారు.

ప్రజల్లో అనేకమంది డిప్రెషన్‌కు లోనయ్యారు. కోవిడ్ తర్వాతి రోజుల్లో జీతాల కోత వల్ల ప్రజల్లో ఆత్మ విశ్వాసం తగ్గిందని అల్‌ఫ్రెడ్ వు చెప్పారు.

ఇలా జాబ్ మానేసిన వారిలో 38 ఏళ్ల మోక్సీ ఒకరు. ఆయన సైకియాట్రిస్ట్ ఉద్యోగం వదిలేసి నైరుతి చైనాలోని డాలీ నగరానికి వచ్చారు. అధిక వత్తిడి ఉన్న ఉద్యోగాలు వదిలేసిన యువకులు స్థిరపడే నగరంగా డాలీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

"నేను స్వయంగా మానసిక వైద్యుడ్ని. కానీ నా జీవితం ఎక్కడికి వెళుతుందో ఆలోచించడానికి నాకు సమయం, స్థలం లేదు. ఆశ, నిరాశ గురించి ఆలోచించడానికి కూడా సమయం లేదు. కేవలం పని మాత్రమే ఉండేది” అని డాక్టర్ మోక్సీ చెప్పారు.

ఎక్కువ పని చెయ్యడం వల్ల మెరుగైన భవిష్యత్‌కు గ్యారంటీ ఉంటుందని భావించే పరిస్థితి లేదని సర్వే తేల్చి చెప్పింది.

2004, 2009, 2014లో నిర్వహించిన సర్వేల్లో ప్రతీ 10 మందిలో ఆరుగురు కష్టపడితే తమ జీవితం మెరుగవుతుందని చెప్పారు. అప్పట్లో 15 శాతం మంది మాత్రమే ఈ అభిప్రాయాన్ని అంగీకరించలేదు.

అయితే 2023లో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు మారిపోయాయి. కష్టపడి పని చేస్తే జీవితం బాగుపడుతుందని కేవలం 28.3 శాతం మంది మాత్రమే నమ్ముతున్నారు. మూడింట ఒక వంతు మంది మాత్రమే దీనిని అంగీకరించడం లేదు.

సంవత్సరానికి 50వేల యువాన్లు( దాదాపు రూ.6 లక్షలు) కంటే తక్కువ సంపాదన ఉన్న వారిలో ఇలాంటి అభిప్రాయం ఎక్కువగా ఉంది.

సంవత్సరాల తరబడి చదివి, డిగ్రీ సంపాదించిన తర్వాత ఆర్థిక భవిష్యత్తు బాగుంటుందని చైనీయులు తరచుగా చెబుతుంటారు.

బహుశా చైనా గతం వల్ల ఇలాంటి అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. ఎందుకంటే గతంలో తీవ్రమైన కరువు, యుద్ధ పరిస్థితుల్ని చైనీయులు అనుభవించారు.

చైనా నాయకులు కూడా పని సంస్కృతిని ప్రోత్సహించారు.

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కల అమెరికా కల లాంటింది. ప్రతిభ ఉండి కష్టపడి పని చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన నమ్ముతారు.

‘బిట్టర్ సిప్స్’ తీసుకోవాలని ఆయన యువతకు తరచుగా చెబుతుంటారు. కష్టపడి పని చెయ్యడం అనే అర్థంలో బిట్టర్ సిప్స్ అనే పదబంధాన్ని చైనాలో తరచు ఉపయోగిస్తుంటారు.

చైనా ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిస్ట్ పార్టీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధనవంతులు కావడానికి సామర్థ్యం, ప్రతిభ, మంచి చదువు, కష్టపడి పనిచేస్తే చాలని పదేళ్ల క్రితం మెజార్టీ చైనీయులు భావించారు.

పెరుగుతున్న ఆర్థిక అసమానతలు

ధనవంతులు తమ కుటుంబ సంపద, సంబంధాల వల్ల ప్రయోజనాలు పొందుతారని 2023లో వైట్ అండ్ రోసెల్ నిర్వహించిన అధ్యయనంలో భాగంగా కొంతమందిని ప్రశ్నించినప్పుడు తేలింది.

ధనవంతులు కావడానికి సామర్థ్యం, ప్రతిభ, మంచి చదువు, కష్టపడి పనిచేస్తే చాలని పదేళ్ల కిందట మెజార్టీ చైనీయులు భావించారు.

అయితే ఇది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ “సమ సమాజం” అనే విధానానికి వ్యతిరేకం.

ప్రజల మధ్య సంపదలో అసమానతల్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ విధాన చట్రం పెద్ద కంపెనీలు, బడా వ్యాపారాలకు మాత్రమే పరిమితం అయిందని విమర్శలు చెబుతున్నారు.

ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందనడానికి ఇంకా అనేక ఇతర సంకేతాలు ఉన్నాయి. చైనా డిసెంట్ మానిటర్ ( అసమ్మతి సూచి ) ప్రకారం 2023 రెండో త్రైమాసికంలో నిరసల్లో 18 శాతం పెరుగుదల ఉంది.

చైనాలో జరుగుతున్న ప్రతీ నాలుగు ప్రదర్శనల్లో మూడు అసంతృప్తి కారణంగానే అని సీడీఎం నలుగురు ఎడిటర్లలో ఒకరైన కెవిన్ స్టేటన్ చెప్పారు.

2022 జూన్ నుండి 6400 నిరసన ప్రదర్శనలను సీడీఎం డాక్యుమెంట్ చేసింది.

ఈ నిరసనలు గ్రామస్తులు, కార్మికుల నుండి వ్యక్తమవుతున్నట్లు ఆయన గుర్తించారు. వారంతా తక్కువ వేతనాలు, భూ సేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు నిరసన చేస్తున్నట్లు తేలింది.

రియల్ ఎస్టేట్‌ సమస్యల మీద మధ్య తరగతి ప్రజలు సంఘటితం అవుతున్న సంఘటనలు కూడా కనిపించాయి. 370 కంటే ఎక్కువ నగరాల్లో, ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న వారిలో 44శాతం మంది భూస్వాములు, నిర్మాణ కార్మికులు ఉన్నారు.

అయితే, వీటి వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందని భావించాల్సిన అవసరం లేదని స్లేటన్ చెప్పారు.

చైనా ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిస్ట్ పార్టీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, దశాబ్ధాల తరబడి స్థిరమైన ఆర్థిక వృద్ధిని, మెరుగైన జీవన ప్రమాణాలను అందించడం ద్వారా ప్రజలపై కమ్యూనిస్టు పార్టీ పట్టు సాధించింది.

కమ్యూనిస్టు పార్టీలో ఆందోళన ఎందుకు?

ఈ పరిస్థితి చైనా కమ్యూనిస్టు పార్టీ నేతల్లో ఆందోళన పెంచుతోంది.

నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత 2023 ఆగస్టు, 2024 జనవరి మధ్య నిరుద్యోగం గురించిన గణాంకాల వెల్లడిని చైనా ప్రభుత్వం నిలిపివేసింది.

ఒక దశలో అధికారులు 'స్లో ఎంప్లాయిమెంట్' అనే కొత్త పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఉద్యోగం సంపాదించడంలో ఇబ్బంది పడుతున్న వారి గురించి ఈ పదం వాడారు. ఇది నిరుద్యోగిత కిందకు రాదని అధికారులు చెప్పారు.

ప్రజల్లో ఆర్థిక అసంతృప్తిని వ్యక్త పరిచే వాటిపై సెన్సార్ షిప్ విధించారు. పెరుగుతున్న నిరుద్యోగిత గురించి ఎవరైనా ఆన్‌లైన్‌లో కథనాలు రాస్తే వాటిని వెంటనే తొలగిస్తున్నారు.

విలాసవంతమైన వస్తువుల గురించి మాట్లాడే ఇన్‌ఫ్లూయెన్సర్లను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు. ప్రభుత్వ ఆంక్షలను అధికార మీడియా సమర్థించింది. ఈ ఆంక్షలు నాగరిక, ఆరోగ్యకరమైన, సమైక్య వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం అని ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల మధ్య గతవారం జరిగిన ఒక సంఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు షీ జిన్‌పింగ్ అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను విమర్శించిన ప్రముఖ ఆర్థిక వేత్త ఝూ హెంగ్‌పెంగ్‌ను నిర్బంధించారు.

(ప్రభుత్వం దృష్టిలో) ప్రజలు ప్రతికూలంగా భావించే సమాచారాన్ని నియంత్రించాలని కమ్యూనిస్టు పార్టీ భావిస్తోందని స్లేటన్ చెప్పారు.

ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ, ప్రజల్లో అసంతృప్తి వల్ల నిరసనలు పెరుగుతున్నాయని, ఈ పరిణామం చైనా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుందని చైనా డిసెంట్ మీటర్ పరిశోధన చెబుతోంది.

కఠినమైన కోవిడ్ నిబంధనల వల్ల 2022 నవంబర్‌లో ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు రావడానికి అనుమతించలేదు.

ఈ సమయంలో ఓ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోలేక పది మంది చనిపోయారు. ఈ సంఘటన తర్వాత, చైనాలోని అనేక ప్రాంతాలలో వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. జీరో-కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఆర్థిక అసమానతలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం ఉద్యమంగా మారే అవకాశం లేదని వైట్ అండ్ రోజెల్ అధ్యయనంలో తేలింది.

చైనా ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిస్ట్ పార్టీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తాజా పరిస్థితులతో కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న ఆందోళన

అధ్యయనం ఏం చెప్పింది?

ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వల్ల ప్రజల మీద కమ్యూనిస్ట్ పార్టీ పట్టుని బలహీన పరిచిందని వైట్ అండ్ రోజెల్ తమ అధ్యయనంలో రాశారు. దశాబ్ధాల తరబడి ప్రజలకు స్థిరమైన ఆర్థిక వృద్ధిని, మెరుగైన జీవన ప్రమాణాలను అందించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీ ఈ పట్టుని సాధించింది.

కోవిడ్ సమయంలో అమలు చేసిన కఠిన ఆంక్షలు ప్రజలను ఇంకా భయపెడుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో సోసియాలజీ ప్రొఫెసర్ యున్‌జౌ చెప్పారు.

జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రభుత్వం అమలు చేసిన కఠిన నిబంధనలు భవిష్యత్ గురించి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచాయి.

అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల్లో ఇది స్పష్టంగా కనిపించింది. లేబర్ మార్కెట్‌లో మహిళలు చాలా వివక్షను ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ యున్‌జౌ చెప్పారు.

చాలా కాలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలపైనా దీని ప్రభావం కనిపిస్తోంది.

చైనాలో కుటుంబ నమోదు విధానం ప్రకారం నగరాలకు వచ్చే కార్మికులు అక్కడి ప్రజా సేవలను ఉపయోగించుకోవడానికి వీలుండదు. దీంతో నగరాలకు వస్తున్న వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించలేకపోతున్నారు.

అయితే డాక్టర్ మోక్సీ లాంటి వారు ఇప్పుడు దూరంగా ఉన్న నగరాలకు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కట అద్దె తక్కువ, వాతావరణం బావుంటుంది. కలలను నిజం చేసుకోవడానికి ఇలాంటి నగరాలలో మరింత స్వేచ్చ ఉంటుంది.

చైనా ఆర్థిక వ్యవస్థ, కమ్యూనిస్ట్ పార్టీ, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, EPA

సర్వే ఎలా జరిగింది?

2004-2023 మధ్య వైట్, రోజెల్, అలెస్కీ నాలుగు సార్లు సర్వే నిర్వహించారు.

2004, 2009, 2014లో పెకింగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ సెంటర్ ఆన్ కాంటెంపరరీ చైనాలోని సహచరులతో కలిసి కొంతమందిని ప్రశ్నించి సమాచారం సేకరించారు.

ఆ సమయంలో 29 ప్రావిన్సుల్లో 17ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్న వారి నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. టిబెట్, జెన్ జియాంగ్ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు.

2023 మూడు, నాల్గో త్రైమాసికాలలో ఆన్‌లైన్ ద్వారా మూడు సర్వేలను నిర్వహించారు. ఇందులో 20-60 ఏళ్ల మధ్య వయసున్నవారి అభిప్రాయాలు తీసుకున్నారు.

అన్ని సర్వేల్లోనూ ఒకే రకమైన ప్రశ్నలు అడిగారు. సర్వేలు నిర్వహించిన నాలుగు సందర్భాల్లో సేకరించిన అభిప్రాయాలను పోల్చుతూ కొంతమంది సమాధానాలను తొలగించారు.

మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించేలా అన్ని సమాధానాలను తిరిగి సమీక్షించారు. ఈ అధ్యయనాన్ని ప్రచురించేందుకు చైనా జర్నల్ అంగీకరించింది. దీన్ని 2025లో ప్రచురిస్తారని భావిస్తున్నారు.

2022 జూన్‌లో చైనా అంతటా అసమ్మతి సంఘటనలపై చైనా డిసెంట్ మానిటర్ పరిశోధకులు డేటాను సేకరించడం ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో నడుస్తున్న వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాలు, పౌర సమాజాలు వెల్లడించిన నివేదికలను వారు పరిగణనలోకి తీసుకుని డేటాను రూపొందించారు.

ప్రజలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం పట్ల అసంతృప్తిని వ్యక్తం చెయ్యడానికి అధికార, అనధికార మార్గాల్లో జరిగాయి.

ఇటువంటి సంఘటనలను భౌతికంగా అణచివెయ్యడం లేదా సెన్సార్ షిప్ ద్వారా వాటిని అడ్డుకునే ప్రయత్నాలు తరచుగా జరుగుతున్నాయి.

ఇందులో వైరల్‌గా మారిన సోషల్ మీడియా పోస్టులు, ప్రదర్శనలు, సమ్మెలు లాంటివి ఉన్నాయి. అయితే ఇందులో చాలా సంఘటనల్ని స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యపడలేదు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)