ఎవర్‌గ్రాండే: లక్షల కోట్ల అప్పులు చేసి చైనా రియల్ ఎస్టేట్‌ను చిక్కుల్లో పడేసిన కంపెనీ.. ఆస్తుల అమ్మకానికి హాంకాంగ్ కోర్టు ఆదేశం.. అసలేం జరిగింది?

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణ రంగం వాటా దాదాపు 25 శాతం.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన చైనీస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్‌గ్రాండే ఆస్తులు విక్రయించాలని (లిక్విడేట్) హాంకాంగ్ కోర్టు ఆదేశించింది.

ఈ నిర్మాణ సంస్థ చేసిన అప్పులు తీర్చేందుకు ప్రణాళిక రూపొందించడంలో విఫలమైందని న్యాయమూర్తి లిండా చాన్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఎవర్‌గ్రాండేకు సుమారు రూ. 25 లక్షల కోట్ల (300 బిలియన్ డాలర్లు) అప్పు ఉంది. లిక్విడేషన్ అనేది కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని, విక్రయించే ప్రక్రియ.

దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కంపెనీ చేసిన అప్పును తీర్చేందుకు వినియోగిస్తారు.

చైనాది ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. చైనా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణ రంగం వాటా దాదాపు 25 శాతం.

రెండేళ్ల క్రితం ఎవర్‌గ్రాండే అప్పుల్లో కూరుకుపోయిందని తెలిశాక ఫైనాన్షియల్ మార్కెట్ కుదుపులకు లోనైంది. హాంకాంగ్ కోర్టు తీర్పు అనంతరం ఎవర్‌గ్రాండే షేర్ విలువ 20 శాతం పడిపోయింది.

ఈ తీర్పు దురదృష్టకరమని ఎవర్‌గ్రాండే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాన్ సీయు అన్నారు. అయితే కంపెనీ చైనాలో పని చేస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు.

హాంకాంగ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ స్వతంత్రంగా పనిచేస్తోందని ఎవర్‌గ్రాండే గ్రూప్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

ఎవర్‌గ్రాండే సంస్థ

ఫొటో సోర్స్, REUTERS

ఎవర్‌గ్రాండే చరిత్ర ఏంటి?

పారిశ్రామికవేత్త హుయ్ కా యాన్ 1996లో దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌలో ఎవర్‌గ్రాండే సంస్థను స్థాపించారు, దీనిని హెంగ్డా గ్రూప్‌గా పిలిచేవారు.

కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఎవర్‌గ్రాండే రియల్ ఎస్టేట్ గ్రూప్ చైనాలో 280 కంటే ఎక్కువ ప్రాంతాల్లో 1,300కు పైగా ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసింది.

ఎవర్‌గ్రాండే రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలలో కూడా భాగస్వామిగా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల నుంచి ఆహారం, పానీయాల తయారీ వరకు వివిధ పరిశ్రమల్లోకి ప్రవేశించింది.

దేశంలోని అతిపెద్ద ఫుట్‌బాల్ జట్లలో ఒకటైన గ్వాంగ్‌జౌ ఎఫ్ సీ‌లో ఎవర్‌గ్రాండేకు గణనీయమైన వాటా ఉంది.

హుయ్ ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ ప్రకారం హుయ్ సంపద నికర విలువ దాదాపు రూ. 3.5 లక్షల కోట్లు.

హుయ్ కా యాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో ఎవర్‌గ్రాండే సంస్థను హుయ్ కా యాన్ స్థాపించారు.

ఎవర్‌గ్రాండే ఎందుకు ఇబ్బందుల్లో పడింది?

ఎవర్‌గ్రాండే 300 బిలియన్ డాలర్లకు పైగా రుణం తీసుకొని, చైనాలోనే అతిపెద్ద కంపెనీగా వృద్ధి చెందాలనుకుంది.

అయితే, 2020లో బడా రియల్ ఎస్టేట్ కంపెనీల రుణాలను పరిమితం చేయడానికి చైనా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ చర్య ఎవర్‌గ్రాండే తన ఆస్తులను తక్కువ ధరకు విక్రయించేలా చేసింది. అనంతరం తీసుకున్న రుణాలపై వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడింది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎవర్‌గ్రాండే ఆధ్వర్యంలో చేపట్టిన చాలా నిర్మాణాలు పూర్తికాలేదు.

ఈ అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్‌లో గత మూడు సంవత్సరాల్లో ఎవర్‌గ్రాండే, దాని విలువలో 99 శాతం నష్టపోయింది.

2023 ఆగస్టులో దివాలా తీసినట్లు న్యూయార్క్‌లో ప్రకటించింది ఎవర్‌గ్రాండే. రుణదాతలతో బిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌పై పని చేస్తున్నందున కంపెనీ తన అమెరికా ఆస్తులను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు.

చైనా

ఫొటో సోర్స్, REUTERS

చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

ఎవర్‌గ్రాండే మూతపడితే చైనాలో సమస్యలు తీవ్ర రూపం దాల్చొచ్చు.

నిర్మాణ పనులు ప్రారంభించకముందే చాలామంది భవనాలు కొనుగోలు చేయడానికి డబ్బులు చెల్లించారు.

ఇప్పుడు కంపెనీ మూతపడితే ఆ డిపాజిట్లు తిరిగి రావడం కష్టం. ఎవర్‌గ్రాండేతో వ్యాపారం చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. నిర్మాణ, డిజైన్ సంస్థలు, సప్లయర్స్‌తో సహా అనేక కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొనే ప్రమాదముంది. ఇది ఆ కంపెనీలను దివాళా తీసే స్థాయికి తీసుకురావొచ్చు.

చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం విషయానికి వస్తే- ఎవర్‌గ్రాండే పతనంతో బ్యాంకులు, ఇతర రుణదాతలు ఇచ్చే రుణాల్లో కోత విధించొచ్చు. అనంతరం కంపెనీలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందడం కష్టమవుతుంది. అది రుణ సంక్షోభానికి దారితీస్తుంది.

అదే జరిగితే రుణ సంక్షోభం చైనాను ఇరుకున పెడుతుంది. మరోవైపు అప్పు తీసుకోలేని కంపెనీలు ఎదగడం కష్టం.

ఇటువంటి పరిస్థితి విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి చైనా సరైనది కాదని భావించొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)