70 ఏళ్ల కిందట ఒక హత్య తరువాత సంపూర్ణ మద్య నిషేధం విధించిన దేశంలో మళ్లీ ఇప్పుడు లిక్కర్ షాప్ ఎందుకు తెరుస్తున్నారు

రియాద్‌లో మద్యం విక్రయం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గ్రేమ్ బేకర్
    • హోదా, బీబీసీ న్యూస్

దాదాపు 70 సంవత్సరాల తరువాత సౌదీ అరేబియాలోని రియాద్‌లో మద్యం దుకాణం మొదలుకానుంది.

అయితే ఇందులో కేవలం కొందరు ముస్లిమేతర విదేశీయులకు మాత్రమే మద్యం అమ్ముతారు.

దౌత్య సిబ్బందికి మాత్రమే ఇక్కడ మద్యం విక్రయిస్తారు, వారు కూడా ముస్లిమేతరులై ఉండాలి.

సౌదీ అరేబియాలోని దౌత్య సిబ్బంది చాలాకాలంగా మద్యాన్ని అధికారికంగా సీల్డ్ పౌచ్‌లలో ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. వీటిని సౌదీలో డిప్లమేటిక్ పౌచెస్ అంటుంటారు.

1952 నుంచి సౌదీ అరేబియాలో మద్యనిషేధం అమల్లో ఉంది.

అప్పట్లో సౌదీ రాజకుమారుడు మద్యం తాగి జరిపిన కాల్పుల్లో ఓ బ్రిటన్ దౌత్యవేత్త మరణించారు.

ఆ తరువాత అక్కడ మద్యనిషేధ చట్టం అమల్లోకి వచ్చింది.

ఈ కొత్త దుకాణాన్ని రియాద్‌లోని సిటీ సెంటర్‌కు పశ్చిమాన ఉన్న దౌత్యవేత్తల క్వార్టర్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ఏఎఫ్‌పి, రాయ్‌టర్స్ న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి.

మరికొద్ది వారాలలో ఇక్కడ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

కొనాలంటే ఇవీ నియమాలు

  • రాయబారులు ముందుగానే నమోదు చేసుకుని ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలి.
  • దుకాణంలోకి 21 ఏళ్ళలోపు వయసున్నవారిని అనుమతించరు.
  • మద్యం కావాలనుకునేవారు తమకు బదులుగా డ్రైవర్లను ఇతరులను పంపకూడదు.
  • నెలవారీ పరిమితులు అమలు చేస్తారు.

నెలకు గరిష్ఠంగా 240 పాయింట్ల మద్యాన్ని అందిస్తారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొంది.

మద్యాన్ని పాయింట్లలో కొలవడం వేర్వేరుగా ఉంటుంది. బీర్ల విషయానికొస్తే ఒక లీటరు బీరును ఒక పాయింట్‌గా చెప్తారు. అదే వైన్ అయితే లీటర్ వైన్ 3 పాయింట్లు అవుతుంది. విస్కీ వంటి స్పిరిట్స్ అయితే లీటరు 6 పాయింట్లు.

అయితే దౌత్యపరమై హక్కులు లేని సాధారణ విదేశీయులకు కూడా ఇక్కడ మద్యం విక్రయిస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

రియాద్‌లో మద్యం విక్రయం

ఫొటో సోర్స్, GETTY IMAGES

రియాద్‌ జీవితంలో మద్యానికి స్థానం దొరకనున్నప్పటికీ మద్యం ఎక్కడ తాగాలి, తాగిన తరువాత ఎలా ఉండాలనే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

సౌదీ చట్టం ప్రకారం మద్యాన్ని కలిగి ఉన్నా, లేదా వినియోగించినా జరిమానా, జైలుశిక్ష విధించడంతోపాటు బహిరంగంగా కొట్టడం లాంటివి చేస్తారు.

లేదంటే అనధికారికంగా ఉంటున్న విదేశీయులైతే వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు.

మద్యం దుకాణం తెరిచేందుకు సిద్ధం చేసిన ఓ పత్రంలో కొన్ని నియంత్రణలను కూడా అమలుచేయనున్నట్టు పేర్కొన్నారు.

దౌత్యవేత్తలు తమతోపాటు తెచ్చుకునే నిర్ణీత మొత్తంలోని మద్యంపైనా నియంత్రణ విధించాలని భావిస్తున్నారు.

దీనివల్ల అపరిమితంగా సాగిపోతున్న ఇలాంటి దిగుమతులకు అడ్డుకట్ట వేయవచ్చని సౌదీ భావిస్తోంది.

ఏళ్ళ తరబడి దౌత్యసిబ్బంది తమ లగేజీలలో నిర్ణీత మొత్తంలో మద్యాన్ని తీసుకువస్తున్నారు.

సహజంగా వీరి లగేజీలను సంబంధిత దేశాలలో తనిఖీ చేయరు.

సౌదీ సమాజంలో విజన్ 2030 కింద సరళీకరణ విధానాలు తీసుకురావడానికి ప్రస్తుత పాలకుడు మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలలో మద్యం అనుమతి తాజా చర్య.

ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇలాంటి మద్యం విధానాలనే పాటిస్తున్నాయి.

యూఏఈ, ఖతార్ కూడా తమ దేశాలలో హోటళ్ళు, క్లబ్బులు, బార్లలో 21 ఏళ్ళు నిండినవారికి మద్యం విక్రయించేందుకు అనుమతిస్తున్నాయి.

ఇస్లాం ప్రకారం మద్యం తాగడం నిషేధం.

అయితే 1952వరకు సౌదీ ఈ విషయంలో మెతక వైఖరితో ఉండేది. కానీ 1951లో జెడ్డాలోని బ్రిటిష్ వైస్ కాన్సుల్ సిరిల్ ఓస్మాన్ ను మిషారీ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ అనే యువరాజు ఒక కార్యక్రమంలో కాల్చి చంపాడు. కేవలం తనకు కావాల్సినంత మద్యం ఇవ్వనందుకు ఈ హత్య జరిగింది.

ఈ ఘటన తరువాత సౌదీ రాజు అబ్దుల్ అజీజ్ సంపూర్ణ మద్య నిషేధం విధించారు.

మిషారీని హత్యానేరం కింద దోషిగా తేల్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)