కూలిన విమానం చుట్టూ సమాధానం లేని ప్రశ్నలెన్నో.. రష్యా, యుక్రెయిన్‌లలో ఎవరు చెప్తున్నది నిజం?

కూలిన రష్యా విమానం

ఫొటో సోర్స్, RUSSIAN TELEGRAM

ఫొటో క్యాప్షన్,

రష్యాకు చెందిన ఇల్యూషిన్-76 మిలటరీ రవాణా విమానం యుక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్‌గోరెడ్ ప్రాంతంలో కూలిపోయింది.

అందులోని 65 మంది చనిపోయారని రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అయితే ఈ సంఘటనలో నిజానిజాలేమిటి?

కాల్పులు జరుపుకొనే యుద్ధాలే కాదు.. సమాచార యుద్ధాలు ఉంటాయి. ఈ రెండు రకాలుగానూ యుద్ధం చేస్తున్న దేశాలు ఉంటాయి.

సమాచార యుద్ధం సాగుతున్నప్పుడు నిజాలేమిటో నిర్థరించడం మిగిలినవారికి కష్టంగా మారుతుంది.

రష్యా, యుక్రెయిన్ యుద్ధంలోనూ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వార్ సాగుతోంది.

తప్పుడు సమాచారం ఇవ్వడంలో రష్యాకు ఉన్న గత చరిత్రను చాాలామంది గుర్తు చేస్తున్నారు.

గత దశాబ్దంలో ఎంహెచ్17 విమానాన్ని కూల్చివేయడం, సాల్సిబరీ నోవోచిక్ విషప్రయోగాలు లాంటి రెండు పెద్ద సంఘటనలలో రష్యా అబద్ధాలు చెప్పిందంటారు.

యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర కూడా రష్యా అబద్ధంతోనే ప్రారంభించింది. యుక్రెయిన్‌లో నాజీ పాలన అక్కడ రష్యా మాట్లాడే ప్రజలను మారణహోమం ప్రమాదంలోకి నెడుతోంది అంటూ యుద్ధం ప్రారంభించింది.

అయితే దీని ఉద్దేశం రష్యా ప్రభుత్వం, మీడియా, ఎంపీలు చెప్పేవన్నీ అబద్ధాలని అర్థం కాదు.

కానీ వారి మాటలను ఒకటికి రెండుసార్లు నిర్థరించుకోవాల్సిన అవసరం ఉంది.

ఈసారి మాత్రం Il-76 రవాణా విమానం కూలిపోయిన ఘటన మొదటగా రష్యా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీలలోనే కనిపించింది.

ఖైదీల మార్పిడిలో భాగంగా యుక్రెయిన్ ఖైదీలను పంపుతున్న విమానంలో డజన్లకొద్దీ యుక్రెయిన్ ఖైదీలు ఉన్నారని మాస్కోలో రష్యా రక్షణ మంత్రి చెప్పినట్టు ఆ ఏజెన్సీలు తెలిపాయి.

అయితే కీయెవ్ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. రష్యా వద్ద ఆధారాలు లేవు.

కానీ రష్యా రక్షణ మంత్రి ప్రకటనకు కొనసాగింపుగా రష్యా ఎంపీ అండ్రీ కర్టపోలోవ్ కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఖైదీలు ప్రయాణిస్తున్న విమానాన్ని పేట్రియాట్ క్షిపణిని వినియోగించి యుక్రెయిన్ కూల్చివేసి ఉండవచ్చని తెలిపారు.

అంటే దీనర్థం పశ్చిమదేశాలు అందించిన ఆయుధాలతో విమానాన్ని కూల్చివేశారని చెప్పడం. కానీ దీనిని నిరూపించేందుకు ఇప్పటిదాకా ఆధారాలు దొరకలేదు.

ఇలాంటి వాదన అంతకంతకు రష్యాబిగ్గరగా వినిపిస్తుండగా, ఈ వాదనే ప్రపంచం చుట్టూ తిరుగుతోంది. అయినా యుక్రెయిన్ దీనిపై మౌనంగానే ఉంది.

ఖైదీల మార్పిడిపై ఊహాగానాలు

కూలిన విమానం

కీయెవ్‌లో ఖైదీల మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మేం విన్నాం. తరువాత ఓ సోర్స్ ద్వారా ఇది నిర్థరణ అయింది కూడా. కానీ కీయెవ్ మాత్రం అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు.

దీనిపై సమాచారం తెలుసుకోవడానికి ఎవరికి ఫోన్ చేసినా ఏమీ తెలియలేదు. దాదాపు 8 గంటలపాటు ఈ సమాచారం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

కానీ యుక్రెయిన్ తన సైనికులను ఉద్దేశపూర్వకంగా చంపిందనే వాదనపై రష్యా తన వెర్షన్ వినిపించడం ఆపలేదు.

అయితే ఈ వాదనను తోసిపుచ్చడమంటే యుక్రెయిన్ ఓ చేసిన తప్పును కప్పిపుచ్చడం కాదు. విమానం కూలిపోవడం నిజం, యుక్రెయిన్‌కు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నదీ నిజం.

అంతకు ముందు యుక్రెయినిస్కా ప్రావ్డా న్యూస్ వెబ్‌సైట్ సాయుధదళాలకు సంబంధించినవారిని ఉటంకిస్తూ ‘‘ఇది వారి పనే’’ అని రాసింది.

ఆ విమానం రష్యన్ S300 క్షిపణులను మోసుకుపోతున్నట్టు రాసింది.

మరో మాటలో చెప్పాలంటే దీనినొక విజయంగా రాసింది.

కానీ ఈ వార్తను తరువాత సరిదిద్దారు. తమకు అందిన సమాచారం నిర్థరణ కాలేదని పేర్కొంది.

దీని తరువాత రెండు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.

జనరల్ స్టాఫ్, యుక్రెనియన్ మిలటరీ ఇంటలిజెన్స్ నుంచి ఈ ప్రకటనలు వచ్చాయి. ఈ రెండు ప్రకటనలలో కూడా విమానాన్ని యూక్రెయిన్ కూల్చి వేసి ఉండొచ్చని చెప్పారు కానీ, నేరుగా ఈ విషయాన్ని అంగీకరించలేదు.

విమానంలో ఎవరున్నారనే విషయం తమకు తెలియదని యుక్రెయిన్ గట్టిగా చెబుతోంది.

బుధవారం ఖైదీల మార్పిడి ఉందని, కానీ ఆ పని జరగలేదని పేర్కొంది.

సహజంగా రష్యా ఖైదీల మార్పడికి సంబంధించి తాము ప్రయాణించాల్సిన మార్గం సురక్షితమో కాదో తేల్చుకోవడానికి ముందుగానే సమాచారం ఇస్తుంది.

ఈ సారి అటువంటి సమాచారమేదీ ఇవ్వలేదని యుక్రెయిన్ చెబుతోంది.

జనరల్ స్టాఫ్ ఇచ్చిన ప్రకటన కూడా స్థూలంగా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోంది.

బెల్గోరాడ్ నుంచి రష్యా క్షిపణుల దాడులను పెంచింది. ప్రత్యేకించి ఖార్కివ్‌పై దాడులుచేసింది. ఆ దాడులలో అనేక మంది పౌరులు చనిపోయారు. బుధవారం కూలిపోయిన విమానం లాంటివి సరిహద్దుమీదుగా ప్రయోగించే ఆయుధాలను సరఫరా చేస్తుంటాయి.

దీంతో కొన్ని సమాధానాలు, మరికొన్ని ఆధారాలు దొరికాయి. కానీ ఎన్నో ప్రశ్నలు మిగిలాయి.

విమానంలో ఎవరున్నారనేది ఇప్పటికీ తెలియదు. కీయెవ్‌లో ఉన్న అధికారులకు ఎంతమందికి ఈ విషయం తెలుసో లేదో తెలియదు.

ఒకవేళ రవాణా విమానంలో యుక్రెనియన్ సైనికులు ఉన్నట్టయితే అందుకు రష్యా ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. యుక్రెయిన్ కూడా పూర్తిగా సమాధానాలు చెప్పాల్సి ఉంది.

ఎందుకంటే రష్యాలో బందీలుగా ఉన్న ఉక్రెయిన్ సైనిక కుటుంబాలకు చెందినవారు ఉక్రెయిన్‌లో తమ వారి కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆందోళన కూడా చెందుతున్నారు.

వారికి సమాధానాలు దొరకాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)