యుక్రెయిన్ మహిళా సైనికులు: 'ఒక మగవాడు తుపాకీ కాల్చాలా వద్దా అని సంకోచిస్తాడు... కానీ, మహిళ ఎప్పుడూ వెనుకాడదు'

యుక్రెయిన్

ఫొటో సోర్స్, UKRAINE DEFENSE MINISTRY

    • రచయిత, ఓల్గా మాల్‌చెవ్‌స్కా
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పోరాడేందుకు యుక్రెయిన్ మహిళలు భారీగా సైన్యంలో చేరుతున్నారు. అలాంటి మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఒకవైపు సైన్యంలో లింగ వివక్షను ఎదుర్కొంటూనే, మరోవైపు శత్రు సైన్యంపై పోరాడుతున్నారు ఈ మహిళా సైనికులు.

రష్యాపై ఫ్రంట్‌లైన్‌లో పోరాడుతున్న దాదాపు 5 వేల మంది మహిళా సైనికుల్లో ముగ్గురితో బీబీసీ మాట్లాడింది.

సన్నగా, నీలికళ్లు కలిగిన ఓ సైనికురాలు జిమ్‌లో వ్యాయామం చేసుకుంటున్నారు. రష్యన్ మీడియా ప్రకారం ఆమె అంతకుముందే 'చనిపోయారు.'

ఆమె పేరు ఆండ్రియానా అఖ్తా. యుక్రెనియన్ సాయుధ దళాలలో ప్రత్యేక యూనిట్ సార్జెంట్‌(రక్షక దళానికి అధికారి)గా ఉన్నారు. ఇపుడు మరోసారి యుద్ధబరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు ఆండ్రియానా.

గత డిసెంబర్‌లో ఖేర్సన్ ప్రాంతంలో ల్యాండ్‌మైన్‌ పేలడంతో గాయపడిన ఆండ్రియానాను యుక్రెయిన్‌లోని పునరావాస కేంద్రంలో బీబీసీ కలుసుకుంది.

భద్రతా కారణాల దృష్ట్యా మేం ఈ స్థలం వివరాలు వెల్లడించలేం.

రష్యన్ భాషలో వచ్చిన పలు టెక్ట్స్, వీడియో నివేదికలలో ఆమె మరణం గురించి వివరంగా ఉంది.

"నాకు కాళ్లు, చేతులు లేనట్లు చూపించారు. నన్ను చంపినట్లు చూపించారు. వాళ్లు ప్రచారం చేయడంలో నిపుణులు" అంటున్నారు ఆండ్రియా.

ఆ నివేదికలలో 'తలారి', 'చనిపోయిన నాజీ' వంటి అభ్యంతరకర పదాలు ఉన్నాయి.

"అది నాకు హాస్యాస్పదంగా అనిపించింది. నేను సజీవంగా ఉన్నా. నా దేశాన్ని కాపాడుకుంటూనే ఉంటా" అని ఆండ్రియానా చెప్పారు.

యుక్రెయిన్

తుపాకీ పేల్చడంలో వెనకాడేది లేదు..

యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసి పద్దెనిమిది నెలలు గడిచాయి. ఇప్పటికి యుక్రెయిన్ సాయుధ దళాల్లో 60 వేల మంది మహిళలు పని చేస్తున్నారు.

సైనిక స్థానాల్లో 42 వేల మందికి పైగా మహిళలు ఉన్నారని, వీరిలో 5 వేల మంది మహిళా సైనికులు ఫ్రంట్‌లైన్‌లో ఉన్నారని యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ బీబీసీకి తెలిపింది.

యుక్రెయిన్ చట్టం ప్రకారం, ఏ మహిళనూ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సైన్యంలో చేర్చుకునే ప్రసక్తే లేదని రక్షణ శాఖ పేర్కొంది.

అదే సమయంలో, యుద్ధ వాతావరణంలో కొందరు మహిళలు కొన్ని బాధ్యతలను మెరుగ్గా నిర్వహిస్తారని విశ్వసిస్తారు.

"నేను నా కమాండర్ వద్దకు వెళ్లి, నేనేం చేయగలనని అడిగాను? మీరు స్నైపర్ అవుతారని ఆయన నాకు చెప్పారు" అని ఇటీవల ఫ్రంట్‌లైన్‌లో కీలక పాత్ర పోషించిన అవెనియా ఎమరాల్డ్ గుర్తుచేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మహిళా స్నైపర్లు రొమాంటిక్‌గా మారారని, దాని వెనుక ఒక కారణం ఉందని ఆమె చెప్పారు.

"ఒక పురుషుడు తుపాకీ పేల్చాలా, వద్దా? అని సంకోచిస్తాడు. కానీ, స్త్రీ ఎప్పుడూ వెనకాడదు" అని అవెనియా అన్నారు.

"బహుశా పురుషులు కాకుండా స్త్రీలు మాత్రమే బిడ్డకు జన్మనివ్వగలగడానికి కారణం కూడా అదే కావొచ్చు" అని ఆమె అన్నారు. ఈ మాట చెప్తున్నప్పుడు మూడు నెలల కుమార్తె ఆమె చేతుల్లో ఉన్నారు.

2022లో క్రిమియాపై రష్యా దాడి చేసిన తర్వాత అవెనియా ఎమరాల్డ్ సైన్యంలో చేరారు. అంతకుముందు అవెనియా నగల వ్యాపారం చేసేవారు.

ఆండ్రియానా మాదిరి అవెనియాను కూడా రష్యన్ మీడియా 'శిక్షకురాలు', 'నాజీ'గా అభివర్ణించింది.

మహిళా స్నైపర్‌గా అవెనియా పాత్ర, వ్యక్తిగత జీవితం గురించి వందలాది రిపోర్టులు వచ్చాయి.

అయితే, స్నైపర్‌గా పని చేయడం శారీరకంగా, మానసికంగా క్రూరమైనదని అవెనియా అంటున్నారు. ఎందుకంటే, లక్ష్యాన్ని ఛేదించినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు.

అవేనియాతో పాటు, యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇతర మహిళా సైనికులతో మేం మాట్లాడాం. ఒకరిని లక్ష్యంగా చేసుకుని చంపడం గురించి ఆమె మాట్లాడడానికి నిరాకరించారు. కానీ, ఒకరిని చంపాలనుకున్నప్పుడు కలిగే వేదనను ఆమె పంచుకున్నారు.

“30 సెకన్ల పాటు నా శరీరం మొత్తం వణికిపోయింది, ఆ వణుకును ఆపలేకపోయాను. కానీ, తిరిగి రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనిపించింది. మేమేం వారిపై (రష్యా) దండెత్తలేదు. వాళ్లే మా మీదకు వచ్చారు'' అని అవెనియా చెప్పారు.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, ILLIA LARIONOV

అమ్మాయివి.. వెళ్లి సూప్ పెట్టుకోమన్నారు..

2014లో యుక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతంపై రష్యా దాడి చేసినప్పటి నుంచి యుక్రెయిన్ సైన్యంలో మహిళల వాటా క్రమంగా పెరిగింది. 2020 నాటికి సైన్యంలో మహిళల సంఖ్య 15 శాతం దాటింది.

అయితే, సైన్యంలోని లింగ వివక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాకు వ్యతిరేకంగా కీలకంగా పనిచేసిన మహిళా సైనికులు చెబుతున్నారు.

ఫ్రంట్‌లైన్ స్నైపర్‌గా కుదురుకుంటున్న సమయంలో, పూర్తి విశ్వాసం పెరగక ముందు తాను లింగ వివక్షను ఎదుర్కొన్నానని అవెనియా తెలిపారు.

"నేను స్పెషల్ ఫోర్స్‌లో చేరినప్పుడు ఒక సైనికుడు నా దగ్గరకు వచ్చి, 'అమ్మాయివి ఇక్కడేం చేస్తున్నావు? వెళ్లి సూప్ పెట్టుకో' అన్నాడు.

ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను వంట చేయగలను. నిన్ను కొట్టగలను కూడా అని చెప్పా'' అని గుర్తుచేసుకున్నారు అవెనియా.

"భర్తలను వెతుక్కునేందుకు అమ్మాయిలు సైన్యంలోకి వెళతారని సమాజంలో బలమైన నమ్మకం ఉంది" అని యుక్రేనియన్ మహిళా సైనికులకు సహాయం అందించే ఆర్మ్ ఉమెన్ నౌ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు అవెనియా వెలియా చెప్పారు. శారీరక వేధింపుల గురించి కూడా మహిళలు తనకు చెప్పారన్నారు.

"ఈ సమస్య ఎంత పెద్దది అనేది మేం అంచనా వేయలేం, ఎందుకంటే మహిళా సైనికురాలు ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు" అని అవెనియా వెలియా చెప్పారు.

అయితే, ఇలాంటివి కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని యుక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాల్యార్ బీబీసీతో చెప్పారు.

యుక్రెయిన్

లోదుస్తులు కూడా మగవారివే...

యుక్రెయిన్ సైన్యంలోని మహిళలకు వారి సొంత యూనిఫాం లేదు. వారికి పురుషుల లోదుస్తులు, బూట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో సహా మగ సైనికుల యూనిఫారాలు ఇస్తున్నారు.

తన ఫీల్డ్ యూనిఫాం మగ సైనికుల కోసం రూపొందించారని, ఫార్మల్ యూనిఫాంలో హీల్స్ ఉన్న షూలు ఉంటాయని డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ మలయార్ అన్నారు.

మహిళా సైనికులు మహిళల యూనిఫాం ధరించాలనుకుంటే, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి లేదా క్రౌడ్ ఫండింగ్‌పై ఆధారపడాలి.

అందుకే ఆండ్రియానా వెటరాంకా (యుక్రేనియన్ ఉమెన్ వెటరన్స్ మూవ్‌మెంట్) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ మహిళా సైనిక సిబ్బందికి సమాన హక్కుల కోసం ప్రచారం చేస్తుంది. యుక్రేనియన్ సైనిక చట్టాన్ని నాటోకి అనుగుణంగా తీసుకురావాలని వాదించింది.

అయితే, మహిళల కోసం ప్రభుత్వం కొత్త యూనిఫాం రూపొందించిందని మలయార్ చెప్పారు. మహిళల కోసం ఒక యూనిఫాం అభివృద్ధి చేసి, పరీక్షించారని, సమీప భవిష్యత్తులో భారీగా ఉత్పత్తి చేస్తారని మలయార్ తెలిపారు.

ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, యుద్ధానికి లింగ భేదం లేదని స్నైపర్ అవెనియా ఎమరాల్డ్ అంటున్నారు.

"యుద్ధం మీరు మగా? ఆడా అని చూడదు. క్షిపణి ఇంటిపై పడేటప్పుడు స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, పిల్లలున్నారా అనేది పట్టించుకోదు. అందరూ చచ్చిపోతారు.''

''ఫ్రంట్‌లైన్‌లో కూడా అంతే. మీరు సమర్థమైన మహిళ అయితే, మీ దేశాన్ని, ప్రజలను ఎందుకు రక్షించుకోకూడదు?" అని అన్నారు అవెనియా.

యుక్రెయిన్

సైన్యం కోసం సుఖాలను వదిలి...

స్నైపర్ ఇరినా ప్రస్తుతం తూర్పు డోన్‌బాస్ ప్రాంతంలో ప్రతీకార దాడిలో పాల్గొంటున్నారు. యుద్ధభూమిలో క్షణం తీరిక దొరికిన వెంటనే వారితో మాట్లాడుతున్నాం.

ఇరినా పురుషాధిక్య గల యూనిట్‌కు మహిళా కమాండర్‌గా పని చేస్తున్నారు. స్నైపర్లు ఆరు గంటల వరకు నేలపై పడుకుని తుపాకీ ఎలా పేల్చుతారు? ఆ వెంటనే పరిస్థితి ఎలా మారిపోతుందో ఇరినా వివరించారు. ఇది చావుతో ఆటాడుకోవడం లాంటిదే అని ఆమె అన్నారు.

సైన్యంలో పనిచేస్తున్న వేలాది మంది మహిళలు తమ కెరీర్‌తో పాటు కుటుంబాన్ని కూడా విడిచిపెట్టారు.

లింగ సమానత్వంపై ఐక్యరాజ్యసమితి సలహాదారుగా ఉన్న 35 ఏళ్ల ఆండ్రియానా గతేడాది రష్యా దాడి తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి యుక్రెయిన్ సైన్యంలో చేరారు.

యుద్ధానికి ముందు సమయాన్ని అండ్రియానా గుర్తు చేసుకున్నారు. ''నేను ఎక్కడికైనా వెళ్లేదాన్ని. సంతోషంగా ఉండేదాన్ని. కెరీర్, కలలు ఉండేవి'' అని అన్నారు.

రష్యా - యుక్రెయిన్ యుద్ధానికి ముందే ఆమెకు సైన్యంలో అనుభవం ఉంది.

2014లో రష్యా తొలిసారి యుక్రెయిన్‌పై దాడి చేసినప్పుడే ఆమె స్వచ్చందంగా బెటాలియన్‌లో చేరారు. అప్పట్లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో పాటు డాన్‌బాస్‌పై దాడి చేసింది. ఆ సమయంలో సైన్యం ఇంతలా పోరాడలేదు.

అండ్రియానా పనిచేసిన ఇదార్ బెటాలియన్‌‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు క్రెమ్లిన్, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపణలు చేశాయి. అయితే, వాటిని నిర్ధారించేందుకు సరైన ఆధారాలు లేవని యుక్రెయిన్ మిలిటరీ చెబుతోంది.

స్వచ్చంద బెటాలియన్లను కూడా సమర్థవంతమైన కమాండ్ అండ్ కంట్రోల్ పరిధిలోకి తీసుకురావాలని ఆమ్నెస్టీ కోరింది.

ఎనిమిదేళ్ల అనంతరం ఇదార్ నుంచి బయటికొచ్చిన తర్వాత ఆమె సేవలకు గానూ యుక్రెయిన్ ప్రభుత్వం అవార్డును బహూకరించింది. ఆమెకు వ్యతిరేకంగా రష్యన్ మీడియా చాలా ఆరోపణలు చేసింది. అయితే, అందుకు సరైన ఆధారాలు చూపలేకపోయింది.

యుక్రెయిన్

ఎంతమంది చనిపోయారు?

సున్నితమైన వ్యవహారం కావడంతో యుద్ధంలో ఎంతమంది మహిళా సైనికులు మరణించారనే విషయాలను యుక్రెయిన్ రక్షణ శాఖ అధికారికంగా బయటపెట్టలేదు.

బీబీసీ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం, రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 93 మంది యుక్రెయిన్ మహిళా సైనికులు యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మహిళల కోసం పనిచేస్తున్న ఉమెన్ నౌ అనే సంస్థ ప్రకారం, దాదాపు 500 మంది మహిళలు యుద్ధంలో గాయాలపాలయ్యారు.

అడ్రియానా ఫోన్ బుక్‌లో ఉన్న మహిళా సైనికుల్లో మరణించిన వారి సంఖ్య పెరిగింది. ''వంది మందికి పైగా స్నేహితులను కోల్పోయాను. నేను ఇంకా ఎంతమంది ఫోన్ నంబర్లు డిలీట్ చేయాలో తెలియడం లేదు''అని అండ్రియానా చెప్పారు.

వీడియో క్యాప్షన్, రష్యాతో కంటికి కనిపించని యుద్ధ తంత్రంతో పోరాడుతున్న యుక్రెయిన్

ఇవి కూడా చదవండి: