యుక్రెయిన్‌తో యుద్ధం చేయడం ఇష్టం లేక పారిపోయిన రష్యా సైనికుడు బీబీసీతో ఏమన్నారంటే...

డిమిత్రి మిషోవ్
ఫొటో క్యాప్షన్, డిమిత్రి మిషోవ్
    • రచయిత, ఇల్యా బరబనోవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లెఫ్టినెంట్ డిమిత్రి మిషోవ్ రష్యా నుంచి కాలినడకన పారిపోయి లిథువేనియా చేరుకున్నారు. తనకు రాజకీయ ఆశ్రయం కల్పించమని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.

26 ఏళ్ల డిమిత్రి బీబీసీతో మాట్లాడారు. రష్యా సైన్యం ఎంత నష్టాన్ని చవిచూస్తోందో, నైతికంగా ఎంత దీనమైన స్థితిలో ఉందో వివరించారు. ఇది అరుదైన ఇంటర్వ్యూ.

యుద్ధం కోసం తనను యుక్రెయిన్ పంపక ముందే ఒక చిన్న సంచి భుజాన వేసుకుని రష్యా నుంచి పారిపోయి రావడం, ఆ దుర్భర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు తాను చేసిన చివరి ప్రయత్నమని చెప్పారు.

యుక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి ఇష్టం లేని అనేకమంది సైనికులు రష్యా నుంచి పారిపోతున్నారు. అలాంటివారిలో డిమిత్రి ఒకరు.

అయితే, అలాంటివారిలో బీబీసీకి తెలిసిన ఏకైక వైమానిక దళ అధికారి డిమిత్రి మాత్రమే.

డిమిత్రి మిషోవ్ అధికారిక పత్రాలు సైన్యంలో ఆయన ర్యాంక్, స్థానాన్ని ధృవీకరిస్తున్నాయి
ఫొటో క్యాప్షన్, డిమిత్రి మిషోవ్ అధికారిక పత్రాలు సైన్యంలో ఆయన ర్యాంక్, స్థానాన్ని ధృవీకరిస్తున్నాయి

బయటపడే మార్గాల కోసం అన్వేషణ

డిమిత్రి యుద్ధ విమానాన్ని నడిపే అధికారి. వాయువ్య రష్యాలోని పిస్కోవ్ ప్రాంతంలో ఉన్న సైన్య స్థావరంలో పనిచేస్తున్నారు.

హెలికాప్టర్‌ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నప్పుడే, అది కేవలం ప్రాక్టీస్ కాదని, నిజంగానే యుద్ధం రాబోతోందని గ్రహించారు డిమిత్రి.

2022 జనవరిలోనే ఎయిర్ ఫోర్స్ విడిచిపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ, దానికి అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తికాలేదు. ఇంతలో ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్‌పై దాడికి దిగింది.

డిమిత్రిని బెలారస్ పంపించి, హెలికాప్టర్‌లో మిలటరీకి సరుకులు సప్లయి చేసే బాధ్యతలు అప్పగించారు.

డిమిత్రి యుక్రెయిన్‌లో అడుగుపెట్టలేదని చెబుతున్నారు. ఆయన మాటలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. కానీ, ఆయన చూపించిన పత్రాలు నిజమైనవిగా, చెబుతున్న విషయాలు యదార్థంగా కనిపించాయి.

2022 ఏప్రిల్‌లో ఆయన రష్యాలోని తన స్థావరానికి తిరిగివచ్చారు. పదవీవిరమణ చేసే ప్రయత్నాలు కొనసాగించారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. దాదాపు చివరికి వచ్చింది అనుకుంటూ ఉండగా, 2022 సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ 'పాక్షిక సైనిక సమీకరణను' ప్రకటించారు. ఆర్మీని విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని డిమిత్రికి ఆదేశాలు అందాయి.

త్వరలోనే తనను యుక్రెయిన్‌కు పంపిస్తారని ఊహించారు డిమిత్రి. దాన్ని తప్పించుకోవడానికి మార్గాలను అన్వేషించారు.

"నేను మిలటరీ అధికారిని. నా దేశాన్ని దాడుల నుంచి కాపాడడం నా బాధ్యత. కానీ, నేరంతో చేతులు కలపలేను. ఈ యుద్ధం ఎందుకు మొదలైందో మాకు ఎవరూ చెప్పలేదు. మేం యుక్రెయిన్‌పై ఎందుకు దాడి చేయాలి? ఆ దేశ నగరాలను ఎందుకు నాశనం చేయాలి? ఇవేవీ మాకు తెలీవు" అన్నారు డిమిత్రి.

ఆర్మీలో యుద్ధం పట్ల మిశ్రమ భావాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కొందరు యుద్ధానికి మద్దతు ఇస్తుండగా, కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యాను పెద్ద ప్రమాదం నుంచి రక్షించడానికి పోరాడుతున్నామని నమ్మేవారు చాలా తక్కువ మందే ఉన్నారని అన్నారు.

రష్యా మొదటి నుంచి ఒకటే కారణం చెబుతోంది.. తమ దేశంపై దాడిని నిరోధించడానికి "ప్రత్యేక సైనిక ఆపరేషన్"ని చేపట్టాల్సి వచ్చిందని చెబుతోంది.

డిమిత్రి మిషోవ్

'యుద్ధ నివేదికలను ఎవరూ నమ్మట్లేదు'

కాగా, ఆర్మీలో జీతాలు చాలా తక్కువగా వస్తుండడంపై సర్వత్రా అసంతృప్తి ఉందని డిమిత్రి చెప్పారు.

బాగా అనుభవం ఉన్న వైమానిక దళ అధికారులకు కూడా యుద్ధానికి ముందు ఉన్న కాంట్రాక్ట్ ప్రకారం జీతం 90,000 రూబిల్సే చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు.

మరోవైపు, సైన్యంలో చేరడానికి ఆకర్షణీయమైన 2,04,000 రూబిల్స్ జీతాన్ని యువతకు ఆశ చూపిస్తున్నారని చెప్పారు.

యుక్రెయిన్ యుద్ధంపై అభిప్రాయాలు ఎలా ఉన్నా, అక్కడి నుంచి వస్తున్న యుద్ధ నివేదికలను ఆర్మీలో ఎవరూ నమ్మడం లేదని డిమిత్రి అన్నారు.

"మిలటరీలో ఎవరూ ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. వాస్తవంలో ఏం జరుగుతోందో చూస్తున్నారు. వాళ్లేమీ టెలివిజన్ ముందు కూర్చున్న పౌరులు కారు. అధికారిక రిపోర్టులను మిలటరీ నమ్మడం లేదు. ఎందుకంటే, అవి నిజం కావు" అన్నారాయన.

యుద్ధం ప్రారంభంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని, యుద్ధపరికరాలు నష్టపోలేదని రష్యన్ కమాండ్ చెప్పింది. కానీ, ప్రాణాలు కోల్పోయిన కొందరు తనకు వ్యక్తిగతంగా తెలుసని డిమిత్రి చెప్పారు,

యుద్ధానికి ముందు వాళ్ల యూనిట్‌లో 40 నుంచి 50 విమానాలు ఉండేవి. రష్యా దాడి ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఆరు విమానాలను నేలకూల్చారు. మూడింటిని నేల మీదే ధ్వంస చేశారు.

సైన్యంలో ఎంతమంది చనిపోరాయన్న విషయాన్ని రష్యా ప్రభుత్వం అంత తొందరగా బయటపెట్టదు.

గత సెప్టెంబరులో, రక్షణ మంత్రి సెర్గీ షోయిగు మాట్లాడుతూ, రష్యా దాదాపు 6,000 మంది సైనికులని కోల్పోయిందని తెలిపారు. ప్రభుత్వ అనుకూల మిలిటరీ బ్లాగర్లతో సహా చాలా మంది విశ్లేషకులు ఈ సంఖ్యను నమ్మలేదు. ఇంతకన్నా ఎక్కువమందే చనిపోయి ఉంటారని అంచనా వేశారు.

బీబీసీ రష్యా జర్నలిస్ట్ ఓల్గా ఇవ్షినా ఈమధ్య కాలంలో చేపట్టిన ఒక రిసెర్చ్ ప్రాజెక్ట్‌లో భాగంగా యుక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యన్ అధికారులను లెక్కవేసే ప్రయత్నాలు చేశారు. ఆమె తయారుచేసిన జాబితాలో 25,000 పేర్లు చేరాయి. వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని ఆమె భావిస్తున్నారు.

వైమానిక దళం నుంచి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య కూడా ఎక్కువేనని డిమిత్రి అన్నారు. పైలట్స్, టెక్నిషియన్లు వంటి అధిక నైపుణ్యం గల వందలాది రష్యన్ అధికారులు చనిపోయారని ఓల్గా ఇవ్షినా పరిశోధనలో తేలింది.

"కొత్త హెలికాప్టర్లను తేగలరు. కానీ, వాటిని నడపడానికి తగినంత మంది పైలట్లు లేరు. 1980లలో అఫ్గానిస్తాన్‌లో జరిగిన యుద్ధంలో సోవియట్ యూనియన్ 333 హెలికాప్టర్లను కోల్పోయిందని మనకి తెలుసు. గత ఏడాది కాలంలో అదే సంఖ్యలో విమానాలు కోల్పోయామని నేను నమ్ముతున్నా" అన్నారు డిమిత్రి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

తెలివిగా తప్పించుకున్నారు

ఈ జనవరిలో తనను "ఒక మిషన్"పై పంపించనున్నారని డిమిత్రికి తెలిసింది. యక్రెయిన్‌కు పంపిస్తారని ఆయనకు అర్థమైంది. వెంటనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. దానివల్ల ఆరోగ్యం పాడైతే, అప్పుడైనా ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పిస్తారని ఆశపడ్డారు. కానీ, అలా జరగలేదు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనకు ఒక కథనం కనిపించింది. పిస్కోవ్ ప్రాంతానికే చెందిన 27 ఏళ్ల మాజీ పోలీస్ అధికారి లాటివ్యాకు తప్పించుకుని పారిపోయారని చదివారు. అదే మార్గాన్ని అనుసరించాలని డిమిత్రి నిర్ణయించుకున్నారు.

"ఆర్మీలో పనిచేయడం నాకిష్టం లేదని కాదు. నిజంగా నా దేశం ప్రమాదంలో పడితే, యుద్ధం చేయడానికి నేను సిద్ధమే. కానీ, నేరంలో భాగస్వామ్యం పంచుకోలేను. నేను విమానం ఎక్కి యుక్రెయిన్ వెళ్లాల్సి వస్తే, చాలామంది ప్రాణాలు తీసుండేవాడిని. అది నాకిష్టం లేదు. యుక్రెయిన్ ప్రజలు మాకు శతృవులు కారు.

సహాయం కోసం డిమిత్రి టెలిగ్రాం ఛానెల్స్ ఆశ్రయించారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) సరిహద్దుల వెంబడి అడవుల గుండా తప్పించుకునే మార్గాలను అన్వేషించారు. బ్యాగు తేలికగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.

సరిహద్దుల్లో గార్డులు తనను అడ్డుకుంటారేమోనని భయపడ్డానని ఆయన చెప్పారు.

"వాళ్లు నన్ను పట్టుకుంటే, సుదీర్ఘకాలం జైల్లోనే గడపాల్సి ఉంటుంది"

ఒకసారి తనకు దగ్గర్లోనే ఎక్కడో విమానం దిగిందని, వెంటనే మరొకటి దిగిందని డిమిత్రి చెప్పారు. తనను పట్టుకోవడానికే బోర్డర్ గార్డులు వస్తున్నట్టు ఆయన భావించి, చాలా భయపడ్డారు.

"పరిగెత్తడం మొదలెట్టాను. ఎక్కడికి వెళుతున్నానో తెలియలేదు. నా బుర్ర పనిచేయలేదు."

అప్పుడే వైర్లతో చేసిన కంచె కనిపించింది. దాన్ని ఎక్కేశారు. ప్రమాదం తప్పిందని ఆయనకు అర్థమైంది.

"ఎట్టకేలకు, స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాను."

రష్యా అధికారులు తన మీద క్రిమినల్ కేసు వేస్తారని డిమిత్రి ఊహిస్తున్నారు. కానీ, తన తోటి ఆర్మీ అధికారులు తన ఉద్దేశాలను అర్థం చేసుకుంటారని భావిస్తున్నారు.

రష్యాలోని మరోచోట తలదాచుకోమని కొందరు డిమిత్రికి సలహా ఇచ్చారు కూడా. కానీ, అలా చేస్తే కచ్చితంగా దొరికిపోతానని ఆయన భయపడ్డారు.

తరువాత ఏం జరుగుతుందో తెలీదు.

సొంత దేశంలో గేలానికి చిక్కుకుని ఉండడం కంటే ఈయూకి పారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడం మేలని డిమిత్రి అన్నారు.

కాపీ ఎడిషన్ - కాటెరినా ఖింకులోవా

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)