మనీ: యూపీఐ, ఓఎల్‌ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ఇటీవల హరియాణా పోలీసులు అరెస్ట్ చేసిన ఒక సైబర్ క్రైం ముఠా సంపాదన అక్షరాలా వంద కోట్లకు పై మాటే.
యూపీఐ, ఓఎల్‌ఎక్స్ (OLX), ఉద్యోగ అవకాశాలు అంటూ అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 28 వేల మందిని ఈ ముఠా మోసం చేసింది.
ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉన్న కొన్ని ప్రముఖ యాప్స్ గురించి ఇప్పుడు చూద్దాం:
యూపీఐ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అనే పేరున్న ఈ విధానం ద్వారా రోజూ ఎన్నో లావాదేవీలు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఈ రకమైన లావాదేవీలు తేలికగా చేయొచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్‌లతో ఈ యూపీఐ విధానం ఎంతో ప్రాచుర్యం పొందింది.
యూపీఐతో ప్రయోజనాలే కాదు మోసాలు కూడా పెరుగుతున్నాయి. 2020-21లో 77 వేల మోసాలు 2021-22లో 84 వేలు మోసాలు, 2022-23లో 95 వేల మోసాలు నమోదయ్యాయి.
ఒక లింక్ లేదా స్కానింగ్ కోడ్ పంపించి అది క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్ నుంచి డబ్బులను కొల్లగొడుతుంటారు. ఈ రకంగా చాలా ఎక్కువ మోసాలు జరుగుతుంటాయి. అందుకే ఎలాంటి లావాదేవీలు చేసే సమయంలోనైనా జాగరూకతతో మెలగాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఓఎల్‌ఎక్స్ (OLX) లాంటి మార్కెట్ యాప్స్: వ్యాపార సంస్థలకు మాత్రమే కాకుండా వ్యక్తిగత స్థాయిలో కూడా క్రయవిక్రయాలు జరిపే సౌకర్యాన్ని కొన్ని యాప్స్ కల్పిస్తాయి. వీటివల్ల కస్టమర్లకు సమయం ఆదా కావడంతో పాటు ఇంటి నుంచే పని పూర్తి అవుతుంది. సరిగ్గా ఇలాంటి యాప్స్ ద్వారా ఆర్థిక నేరస్థులు ప్రజలను మోసం చేస్తున్నారు.
ఈ యాప్స్ ద్వారా చేసే కొన్ని రకాల మోసాలను ఇక్కడ చూద్దాం.
1. మీరు వస్తువు అమ్ముతుంటే అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దానికి సంబంధించిన లింక్ పంపి, ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్ నుంచి డబ్బులు కాజేయడం.
2. కొరియర్ చార్జ్ పేరుతో మీకు వేరే యూపీఐ కోడ్ పంపించడం. ఆ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్: ప్లాస్టిక్ మనీగా ప్రాచుర్యం పొందిన కార్డ్ వినియోగం మామూలు దొంగతనాలను అరికడుతుందని అందరూ భావించారు.
కానీ, ఇప్పుడు కార్డ్ ద్వారా లావాదేవీలు చేసే కొందరిని లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ఫోన్ చేసి కార్డ్ నంబర్ సహా వివరాలు చెప్పి ఆ తర్వాత మనకు వచ్చే ఓటీపీ ఇవ్వాలని అడుగుతారు.
ఫలానా బ్యాంక్ నుంచి అని నమ్మించే ప్రయత్నం చేయడం ఈ తరహా మోసాల ప్రత్యేకత. క్రెడిట్ కార్డ్ పాయింట్లు ఇస్తామని లేదా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ వోచర్లు పంపుతామని ప్రలోభపెట్టి ఓటీపీ తీసుకోవడం ఎక్కువగా జరుగుతోంది.
భారత రిజర్వ్ బ్యాంక్‌తో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇలాంటి మోసగాళ్ళను నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మూడు రకాల మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా?
యూపీఐ లావాదేవీలు ఇలా చేయొచ్చు:
1. యూపీఐ లావాదేవీల కోసం ఒక ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచి అందులో ఒక చిన్న మొత్తం ప్రతి నెలా జమ అయ్యేలా చూసుకోవాలి. అన్ని యూపీఐ లావాదేవీలు కేవలం ఆ అకౌంట్ ద్వారా మాత్రమే జరపాలి. ఇలా చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
2. జీతం వచ్చే అకౌంట్ లేదా ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేసే అకౌంట్‌ను యూపీఐతో అనుసంధానం చేయకపోవడం మంచిది. యూపీఐ లేకపోయినా ఆ అకౌంట్ ద్వారా మిగిలిన అన్ని సేవలను పొందవచ్చు.
3. మీకు తెలియని ఎలాంటి లింక్ వచ్చినా దానికి దూరంగా ఉండండి.
ఓఎల్‌ఎక్స్ మోసాలను ఇలా నివారించండి:
1. ఆ యాప్ నిర్ధరిత పేమెంట్ గేట్ వే మాత్రమే ఉపయోగించి లావాదేవీలు జరపండి.
2. వ్యక్తిగత అకౌంట్లకు నేరుగా డబ్బులు పంపకండి.
3. ఎలాంటి అనుమానం వచ్చిన యాప్ వారిని సంప్రదించి ఆ తర్వాతే లావాదేవీలు జరపండి.
క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ మోసాల నుంచి ఇలా తప్పించుకోండి:
1. ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీ ఇతరులకు ఇవ్వకండి. అలా ఓటిపీ అడిగే హక్కు బ్యాంక్ వారికి కూడా లేదనే విషయం గుర్తుంచుకోండి.
2. ఫలానా బ్యాంక్ ఉద్యోగులమని చెబితే వారి ఎంప్లాయీ నంబర్, ఈమెయిల్ లాంటి వివరాలు అడిగి తీసుకోండి. మీకు ఫోన్ చేసిన వారి దగ్గర మీ కార్డ్ వివరాలు ఉన్నంత మాత్రాన వారు మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేసినట్లు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి.
నోట్: ఈ కథనం ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే.
ఇవి కూడా చదవండి:
- కెనడా నుంచి వందల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చేయాల్సిందేనా? అసలేం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














