సెక్స్టింగ్ అంటే ఏమిటి, ఇది నేరమా?

ఫొటో సోర్స్, Getty Images
తనతో కలిసి పనిచేస్తున్న ఓ మహిళకు అభ్యంతరకర మెసేజ్‌లు, ఫోటోలు పంపారనే ఆరోపణలపై ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ పదవికి టిమ్ పైనే అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనిపై మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. కొన్ని రోజుల క్రితం దిల్లీలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో పరిచయమైన ఒక యువకుడికి ఓ వివాహిత అభ్యంతరకర మెసేజ్‌లు, ఫోటోలు పంపించారు. వీరిద్దరి మధ్య జరిగిన చాట్ బయటకు రావడంతో ఆ యువకుడితో కలిసి అత్తింట్లో అందరినీ ఆమె హత్య చేశారు.
ఈ రెండు కేసుల్లోనూ ‘‘సెక్స్టింగ్’’ అనే పదం ప్రధానంగా వినిపించింది. ఇటీవల ఈ పదం వినిపించడం ఎక్కువైంది. ముఖ్యంగా సైబర్‌క్రైమ్ ఘటనల్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.
సెక్స్‌టింగ్ అంటే ఏమిటి? ఇలా అభ్యంతరకర ఫోటోలు, మెసేజ్‌లు పంపడం నేరమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎలా వచ్చింది?
అశ్లీల చిత్రాలు, వీడియోలు, మెసేజ్‌లను ఆన్‌లైన్‌లో పంపుకోవడాన్ని సెక్స్‌టింగ్‌గా పిలుస్తారు.
రెండు ఇంగ్లిష్ పదాలు ‘సెక్స్’, ‘టెక్స్టింగ్’లను కలిపితే ఇది వస్తుంది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రాక ముందు కూడా ఈ పదం వాడుకలో ఉండేది.
ఈ పదం ఎలా వచ్చిందనే అంశంపై టెక్నాలజీ నిపుణురాలు, రచయిత ముక్తా చైతన్యతో బీబీసీ మాట్లాడింది.
‘పోర్న్ గేమ్స్: పోర్నోగ్రఫీ అండ్ గేమింగ్’’ పేరుతో ఆమె ఒక పుస్తకం కూడా రాశారు
‘‘2005లో ఆస్ట్రేలియన్ సండే టెలిగ్రాఫ్ మ్యాగజైన్ ఈ అంశంపై ఒక కథనం ప్రచురించింది. దానిలో సెక్స్టింగ్ అనే పదాన్ని ఉపయోగించారు’’ అని ఆమె చెప్పారు.
2009లో ఈ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా న్యూ ఆక్స్‌ఫర్డ్ అమెరికన్ డిక్షనరీ ప్రకటించింది. 2012 ఆగస్టులో మెరియమ్-వెబ్‌స్టెర్ డిక్షనరీలో కూడా దీన్ని చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
బేసిక్ మొబైల్ ఫోన్‌లలో ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడే సెక్స్టింగ్ మొదలైంది.
కెమెరా, వీడియో రికార్డింగ్ లాంటి సదుపాయాలతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఇది మరింత వేగంగా విస్తరించింది.
2009లో స్నాప్‌చాట్ నిర్వహించిన ఓ అధ్యయనంలో 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 4 శాతం మంది అమ్మాయిలు, అబ్బాయిలు అభ్యంతరకర ఫోటోలు, మెసేజ్‌లు పంపుకుంటున్నట్లు తేలింది.
వీరిలో 15 శాతం మంది అలాంటి ఫోటోలు, మెసేజ్‌లు తమకు కూడా వచ్చాయని వెల్లడించారు. నేడు ఈ గణంకాలు చాలా పెరిగి ఉండొచ్చు.
2018 ఫిబ్రవరిలో జామా పీడియాట్రిక్స్ జర్నల్‌లో దీనిపై ఒక కథనం ప్రచురితమైంది.
ప్రతి పది మందిలో ఒక టీనేజర్ అభ్యంతర మెసేజ్‌లు లేదా వీడియోలు పంపినట్లు ఇందులో వెల్లడించారు. ఈ సర్వేలో దాదాపు ప్రపంచంలోని భిన్న దేశాలకు చెందిన దాదాపు లక్ష మంది టీనేజీ యువత పాల్గొన్నారు.
భారతీయ చట్టాల్లో ఈ ‘‘సెక్స్టింగ్’’ అనే పదాన్ని స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ రెండేళ్ల క్రితం విడుదల చేసిన 24 సైబర్ నేరాల జాబితాలో ఇది కూడా ఉంది.
‘‘లైంగికంగా ఉద్రేకపరిచే ఫోటోలు, వీడియోలు, ఎస్ఎంఎస్‌లను మొబైల్ లేదా ఈ-మెయిల్‌లో పంపుకోవడాన్ని సెక్స్టింగ్‌గా చెప్పుకోవచ్చు’’ అని అందులో రాశారు.
సైబర్ క్రైమ్ నేరాల్లో దీన్ని చేరిస్తే, మరి దీన్ని నేరంగా పరిగణిస్తున్నట్లేనా?

చట్టాలు ఏం చెబుతున్నాయి?
ఈ అంశంపై సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మహేంద్ర లిమాయేతో బీబీసీ మాట్లాడింది.
‘‘భారత చట్టాల్లో సెక్స్టింగ్ అనే పదాన్ని స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదు. అయితే, సెక్స్టింగ్‌కు పాల్పడితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవచ్చు’’ అని మహేంద్ర చెప్పారు.
‘‘ఇద్దరు వ్యక్తుల సమ్మతితో ప్రైవేటుగా సెక్స్టింగ్ జరిగితే, ఆ చట్టం కింద చర్యలు తీసుకోరు. అదే బహిరంగ ప్రాంతాల్లో సెక్స్టింగ్ చేస్తే ఇద్దరిపైనా చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది’’ అని ఆయన వివరించారు.
సెక్స్టింగ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66-ఈ కూడా వర్తిస్తుందని ఆయన చెప్పారు. ‘‘ఆ సెక్షన్ ప్రకారం, సదరు వ్యక్తి అనుమతి లేకుండా ఫోటోలు, మెసేజ్‌లు పంపితే, ఆ వ్యక్తి ప్రైవసీని ఉల్లంఘించినట్లే అవుతుంది’’ అని ఆయన తెలిపారు.
‘‘అదే మైనర్ల కంటెంట్ విషయంలో అయితే, శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు సెక్స్టింగ్ చేస్తారు?
సెక్స్టింగ్‌కు చాలా కారణాలు ఉండొచ్చు. వారిద్దరి మధ్య ప్రేమ ఉండొచ్చు. లేదా వివాహేతర సంబంధం ఉండొచ్చు. లేదా నేరుగా తరచూ కలుసుకోవడానికి సాధ్యం కాకపోచ్చు.
ఎదుటి వ్యక్తికి తమ ప్రైవేటు మెసేజ్‌లు, వీడియోలు పంపినా తమకేమీ ముప్పు కలగదు అని భావించినప్పుడు సెక్స్టింగ్‌కు ఎక్కువ అవకాశం ఉంటుంది.
మైనర్లలోనూ సెక్స్టింగ్ రేటు ఎక్కువగానే ఉంటుంది. సరదాగా కూడా చాలా మంది ఇలాంటి ఫోటోలు, వీడియోలను పంపుకుంటారు. మరికొంత మంది తాము దాచుకోవడానికి కూడా ఇలాంటి ఫోటోలు, వీడియోలను తీసుకుంటారు.
ఎందుకు సెక్స్టింగ్ చేస్తారనే అంశంపై ముక్తా చైతన్య కొన్ని ఉదాహరణలు చెప్పారు.
- ఎక్కువసార్లు ఇద్దరి సమ్మతితోనే సెక్స్టింగ్ జరుగుతుంది. జీవిత భాగస్వామితో సెక్స్ జీవితం సంతృప్తికరంగా లేనప్పుడు లేదా భాగస్వామే లేనప్పుడు ఎక్కువ మంది దీన్ని ఆశ్రయిస్తుంటారు.
- కొంత మందికి ఫాంటసీలు కూడా ఉంటాయి. తమ భావాలను మెసేజ్‌ల రూపంలో, వాయిస్ రూపంలో ఎదుటి వ్యక్తికి చెప్పాలని, వారివి వినాలని కొందరు కోరుకుంటారు. ఇదేమీ తప్పుకాదని, కేవలం మెసేజ్‌లే పంపుతున్నామని చాలా మంది భావిస్తుంటారు.
- చాలా మందికి ఒకరి కంటే ఎక్కువ మంది నచ్చుతుంటారు. కానీ, అలాంటి సంబంధాలకు మన సమాజంలో చోటు ఉండదు. అందుకే వారు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటారు.
- మైనర్ల విషయంలో పక్కవారి నుంచి వచ్చే ఒత్తిడీ దీనికి కారణం అవుతుంది. స్నేహితులతో గొప్పగా చెప్పుకునేందుకు చాలా మంది సెక్స్టింగ్ చేస్తుంటారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
పరస్పర అంగీకారం లేకుండా సెక్స్టింగ్ జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉండొచ్చని ముక్తా చైతన్య చెప్పారు. అవి ఏమిటంటే..
- ఆ ఫోటోలు, వీడియోలను చూపించి డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేయొచ్చు.
- ఇతరులకు వాటిని పంపిస్తామని కూడా బెదిరించొచ్చు.
- ఇవి బయటపెడతామని బెదిరిస్తూ తమకు కావాల్సిన పనులు చేయించుకోవచ్చు.
- రిలేషన్‌షిప్ లేదా పెళ్లి సమయంలో బ్లాక్‌మెయిల్ చేయొచ్చు.
‘‘అసలు చేయకూడదు’’
‘‘మీరు మైనర్లు అయినా లేదా సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, అభ్యంతరకర మెసేజ్‌లు పంపినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇలాంటివి వెంటనే మానుకోవాలి’’ అని ముక్తా చెప్పారు.
‘‘పెద్దవారైనా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం అశ్లీల సమాచారాన్ని ఇతరులకు అసలు పంపకూడదు’’ అని ఆమె చెప్పారు.
‘‘చాటింగ్ విషయంలోనూ వెంటనే మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పంపాలని ఒత్తిడి చేసినప్పుడు ఒక నిమిషం ఆగి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలి’’ అని ఆమె సూచించారు.
‘‘అయితే, మొదట్లో ఆసక్తికరంగా కనిపించే సెక్స్టింగ్ తర్వాత కాలంలో వ్యసనంగా మారుతుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి’’ అని ముక్త చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















