‘సెక్స్’ సామర్ధ్యం తగ్గుతుందని మగవాళ్లు భయపడతారా, అందుకే పురుషులకు గర్భనిరోధక మాత్రలు రాలేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జరియా గార్వెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1968లో ఒక యువకుడికి వీర్యస్ఖలనం జరగకుండానే భావప్రాప్తి కలిగింది.
స్కిజోఫ్రెనియా ట్రీట్‌మెంట్ కోసం థయోరిడజీన్ అనే మందు తీసుకుంటున్నాని డాక్టర్‌కు ఆ యువకుడు తెలిపాడు.
సుమారు మూడు దశాబ్దాల తరువాత ఆ ఘటన ఓ కొత్త ఆలోచనకు పునాది వేసింది. గర్భం రాకుండా మహిళలకు కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉన్నట్లే మగవారి కోసం కూడా పిల్స్‌ను తయారు చేయొచ్చా అనే ఆలోచన మొదలైంది.
తరువాతి కాలంలో ఫినాక్సిబెంజమైన్ అనే ఔషధం కూడా మగవారిలో స్ఖలనాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు కనిపెట్టారు. ఈ మందు ఆరోగ్యవంతులైన పురుషులకు ఇవ్వడం సురక్షితం కాదు కానీ, ఇదెలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం ప్రయోగాలు చేశారు.
సురక్షితమైన, ప్రభావవంతమైన మేల్ పిల్, మహిళలపై గర్భనిరోధక భారాన్ని తగ్గించి, అవాంఛిత గర్భధారణకు చెక్ పెట్టగలదు. కానీ వీర్యస్ఖలనం జరగకుండా భావప్రాప్తి పొందడం కొందరు మగవారికి నచ్చలేదు. కొంతమందికి అది ‘మగతనం’ కాదనిపించింది.
ఆ తరువాత క్రమంగా పరిశోధన నిలిచిపోయింది. మేల్ పిల్ అభివృద్ధి చెందలేదు.
నేటికీ మగవారి గర్భనిరోధక మాత్రలు కార్యరూపం దాల్చలేదు.
అయితే ఇటీవల ఎలుకలపై జరిపిన కొన్ని ప్రయోగాలు ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చాయి. ఒక ప్రోటీన్ వీర్యం వెలువడకుండా రెండు గంటల పాటు అదుపుచేయగలదని తేలింది. మేల్ పిల్ విషయంలో ఇది సరికొత్త మలుపుకు నాంది పలకగలదు. దాన్ని తయారు చేసి, మానవుల్లో ఉపయోగించేందుకు అనేక రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది.
నిజానికి మగవారి కోసం కాంట్రాసెప్టివ్ పిల్ తయారు చేయడం పెద్ద సమస్య కాలేదు. కొన్నింటికి క్లినికల్ ట్రయిల్స్ కూడా నిర్వహించారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే కారణంతో వాటికి అనుమతులు లభించలేదు.
మగవారికి గర్భనిరోధక మాత్రలు ఆమోదం పొందడం ఎందుకంత కష్టం? సవాళ్లు సంస్కృతికి సంబంధించినవా లేక శాస్త్రబద్ధమైనవా?

ఫొటో సోర్స్, Getty Images
నీతి నియమాలకు సంబంధించిన ప్రశ్న..
పురుషుల గర్భనిరోధక మాత్రలకు సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఆమోదయోగ్యం కాదన్నది తెలుసుకోవాలంటే మహిళలకు గర్భనిరోధక మాత్రలు కనిపెట్టినప్పుడు ఏం జరిగిందో ఓసారి పరిశీలించాలి.
1950ల చివర్లో, క్లినికల్ ట్రయల్స్ కోసం అధికారిక ప్రమాణాలు లేవు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌లను అధిక మోతాదులో కలిపి తయారుచేసిన మాత్రపై ప్యూర్టో రికో వంటి అనేక దేశాలలో వివాదాస్పద స్థాయిలో ప్రయోగాలు జరిపారు.
కేవలం 1,500 మంది మహిళలపై ప్రయోగాలు జరిపారు. మధ్యలో కొందరు ప్రయోగాలు వద్దని వెళ్లిపోయారు. ముగ్గురు చనిపోయారు. అయినప్పటికీ 1960లో ఆ మాత్రను అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.
కానీ, 1964 జూన్‌లో అంతా మారిపోయింది. వైద్య సంఘాల అంతర్జాతీయ సమాఖ్య 'వరల్డ్ మెడికల్ అసోసియేషన్' వైద్యంలో కొత్త నీతి నియమావళి ఆవశ్యకతను గుర్తించింది. ప్రత్యేకించి న్యూరెమ్‌బెర్గ్ ట్రయల్స్‌లో నాజీ జర్మనీలో వైద్యపరమైన నేరాలు చేశారని కొందరు వైద్యులపై అభియోగాలు వచ్చిన తరువాత కొత్త నియమావళి అవసరమని భావించారు.
ఫలితంగా, 'హెల్సింకి డిక్లరేషన్' రూపొందింది. ఇది వైద్య ప్రయోగాలలో పాల్గొనేవారిని రక్షించేందుకు రూపొందించిన నియమావళి.
"దీని తరువాతం ఔషధ ప్రయోగాలలో పొంచి ఉన్న ముప్పు విషయంలో సామాజికమైన మార్పులు వచ్చాయి" అని సూసన్ వాకర్ చెప్పారు. ఆమె బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయంలో గర్భనిరోధకాలు, పునరుత్పత్తి ఆరోగ్యం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్.
ఈ నియమావళి రాక ముందే మహిళల గర్భనిరోధక మాత్ర ఆమోదం పొందింది. అదే ఇప్పుడు ఆ మాత్రను అభివృద్ధి పరచి, ఆమోదం తెచ్చుకోవాలంటే చాలా క్లిష్టమవుతుంది.
అయితే, ఆ గర్భ నిరోధక మాత్రను తరువాతి కాలంలో మరింత అభివృద్ధి పరిచారు. ఆధునిక మాత్ర మహిళలకు సురక్షితమే కానీ, అరుదుగా అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్తడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ఈ మాత్రలు అనేక అంతగా హానికారకం కాని సైడ్ ఎఫెక్టులకూ దారి తీయవచ్చు. మూడ్ స్వింగ్స్, వాంతులు, తలనొప్పి, రొమ్ముల్లో నొప్పి మొదలైనవి కలగవచ్చు. కొన్నిసార్లు బాడి షేప్ (శరీరాకృతి) కూడా మారిపోవచ్చు.
పై కారణాల వల్ల మేల్ పిల్స్‌కు మరింత అధిక ప్రమాణాలను నిర్ణయించారు.
"ఎథిక్స్ కమిటీలు ప్రయోగాలలో ముప్పు, ప్రయోజనాలను అంచనా వేసే విషయంలో ఎలా ఆలోచిస్తాయో తెలుసుకోవాలి. గర్భధారణలో ఇద్దరి ప్రమేయం ఉన్నా, మహిళలు శారీరకంగా ఎక్కువ రిస్క్ కలిగి ఉంటారు. దానితో పోలిస్తే, అసౌకర్యం కలిగించినా సైడ్ ఎఫెక్టులు మరింత ఆమోదయోగ్యం" అంటారు వాకర్.
ప్రపంచవ్యాప్తంగా, ఏడాదికి సుమారు 2,95,000 మహిళలు కాన్పు సమయంలో ఆ తరువాత ప్రాణాలు కోల్పోతున్నారు.
కానీ, పురుషులకు ఇలాంటి రిస్క్ లేదు. గర్భనిరోధక మాత్రలు అత్యవసరం కాదు. కాబట్టి, వాళ్ల పిల్స్‌కు భద్రతా ప్రమాణాలను ఇంకా ఎత్తులో నిలబెట్టారు.
1970ల నుంచి ఎన్నో రకాల మేల్ పిల్స్ కనిపెట్టారు. అప్పట్లో వలంటీర్లకు ప్రతి వారం టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు ఇచ్చి, వీర్యం ఉత్పత్తిని ప్రభావితం చేస్తోందో లేదో పరిశీలించేవారు. అలాంటి ఒక ప్రయోగం చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. దాన్ని మరింత అభివృద్ధి పరచి, ప్రొజెస్టెరాన్ కూడా కలిపి అందించేందుకు ప్రయత్నించారు.
కానీ, ఈ హార్మోన్ థెరపీలకు రకరకాల సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు ఇది బాగా అనుభవమే.
దాంతో, ఆ ప్రయోగం కూడా కుంటుపడింది.

ఫొటో సోర్స్, Alamy
ఆమోదానికి దారి..
పురుషులకు నాన్-హార్మోనల్ చికిత్సలు అందించే దిశలో కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఉదాహరణకు, వీర్యం పరిపక్వతను ప్రభావితం చేసే ప్రొటీన్ ఇంజెక్షన్, టెంపరరీ వేసెక్టమీ లాంటి చికిత్స, రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (RISUG) వంటివి.
RISUGలో వీర్యం బయటకి రాకుండా ఉండేదుకు సింథటిక్ పాలిమర్‌ను ఇంజెక్ట్ చేస్తారు. దీనిపై భారత్‌లో ప్రస్తుతం ఫేజ్-3 క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి.
కానీ, పురుషులు వీటిని ఆమోదిస్తారన్న నమ్మకం లేదు.
"పురుషులు భవిష్యత్తులో ఫెర్టిలిటీ, తెలియని దుష్ప్రభావల గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. సెక్స్‌లో వాళ్ల పనితీరు, వాళ్ల ఫీలింగ్స్ గురించి ఎక్కువ ఆందోళనపడుతున్నారు" అంటున్నారు వాకర్.
ఇలాంటి పరిశోధనలకు నిధులు దొరకడం కూడా ఒక సమస్యే. అమెరికాలో జరిపిన ఒక సర్వేలో 20 శాతం మంది పురుషులు పిల్ తీసుకోవడానికి మొగ్గుచూపలేదు. మరో 20 శాతం పిల్ తీసుకుంటామని చెప్పారు. మిగిలినవారు ఎటూ తేల్చుకోలేకపోతున్నామని చెప్పారు. అయినప్పటికీ, ఈ చికిత్స అభివృద్ధికి నిధులు సమకూరలేదు.
మగ గర్భనిరోధక చికిత్సల కోసం నిధులను సమకూర్చేందుకు చాలా చారిటీలు ప్రయత్నిస్తున్నాయని వాకర్ చెప్పారు. కానీ, మహిళల గర్భనిరోధక మాత్రలు ప్రభావంతంగా పనిచేస్తున్నప్పుడు పురుషులక్లు పిల్స్ కనిపెట్టడంతో ఫార్మా రంగం అంత ఆసక్తి చూపించదని, నిధులు పొందడం కష్టమేనని ఆమె అన్నారు.
"పురుషుల గర్భనిరోధక చికిత్స విషయంలో అందరూ చాలా రిస్క్ ఎవర్స్‌గా ఉన్నారు" అన్నారమె.
ఈ నెల జరిపిన ప్రయోగాలు ఈ అడ్డంకులన్నీ దాటుకుని ముందుకొస్తాయని, పురుషులకు గర్భనిరోధక మాత్రలు రూపొందించడంలో విజయం సాధిస్తాయని పరిశోధకులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ యుద్ధం వల్ల తిరిగొచ్చిన మెడిసిన్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు?
- జీవీఎంసీ: ‘రూ.100 కోట్ల ఆస్తులు ఉన్న కార్పొరేటర్లకు రూ.15 వేలు గిఫ్ట్ కూపన్ ఎందుకు ఇచ్చారు?’
- ఆంధ్రప్రదేశ్: ఈ గురుకుల పాఠశాల బాలికలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- జార్జ్ సోరోస్: మోదీ ప్రజాస్వామ్యవాది కాదన్నఈ బిలియనీర్ ఎవరు... ఆయన కామెంట్స్‌పై రియాక్షన్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













