ఆప్టో జెనెటిక్స్: ఆల్గే లో లభించే ప్రోటీన్లతో చూపులేని వ్యక్తికి వైద్యులు ఇలా దృష్టి ప్రసాదించారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘెర్
- హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరస్పాండెంట్
శైవలా(ఆల్గే)లలో తొలిసారి గుర్తించిన కాంతికి స్పందించే ప్రోటీన్లతో ఒక వ్యక్తికి చూపును ప్రసాదించగలిగారు వైద్యులు. ఈ చికిత్స తీసుకున్న వ్యక్తి పాక్షికంగా చూడగలుగుతున్నారు.
‘ఆప్టో జెనెటిక్స్’గా పిలిచే విధానంలో ఆయనకు చికిత్స చేశారు. కంటి వెనుక భాగంలోని కణాలను నియంత్రించేందుకు ఈ ప్రోటీన్లను ఉపయోగించారు.
‘‘ప్రజలు రోడ్డు దాటేందుకు రోడ్లపై వేసే తెల్లని గుర్తులను అతడు చూడగలగడంతో..ఈ చికిత్స పని చేస్తోందని ఆయన తొలిసారి గ్రహించారు’’అని నేచర్ మెడిసిన్ మేగజైన్ పేర్కొంది.
‘‘ప్రస్తుతం బల్లపై వస్తువులను ఆయన లెక్క పెట్టగలుగుతున్నారు. జాగ్రత్తగా వాటిని పట్టుకోగలుగుతున్నారు.’’ అని వెల్లడించింది.
ఈ చికిత్సలో పాల్గొన్న వ్యక్తి వివరాలను బయటపెట్టలేదు. అయితే, ఆయన ఫ్రాన్స్‌లోని బ్రిటనీ ప్రాంత నివాసి. ఆయనకు పారిస్‌లో చికిత్స అందించారు.
40ఏళ్ల క్రితం ‘‘రెటీనైటిస్ పిగ్మెంటోసా’’ వ్యాధి ఆయనకు సోకింది. దీంతో ఆయన కంటిలోని రెటీనాపై ఉండే కాంతిని గుర్తించగలిగే కణాలు మరణించాయి. ఫలితంగా ఆయన చూపు కోల్పోయారు.
ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మందిని ఈ వ్యాధి పీడిస్తోంది. దీనితో పూర్తిగా దృష్టి కోల్పోవడం కొంచెం అరుదనే చెప్పాలి. అయితే, చికిత్సలో పాల్గొన్న వ్యక్తికి గత 20 ఏళ్లుగా చూపులేదు.

ఫొటో సోర్స్, JOSÉ-ALAIN SAHEL AND BOTOND ROSKA, NATURE MEDICINE
సరికొత్త విధానంలో..
ఆప్టో జెనెటిక్స్ విధానంలో ఆయనకు చికిత్స చేశారు. నాడీ శాస్త్ర చికిత్సా రంగంలో ఆప్టోజెనెటిక్స్ విధానం సరికొత్తది. దీంతో మరిన్ని కొత్త చికిత్సా విధానాలకు మార్గం సుగమం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ విధానంలో మెదడులోని కణాల చర్యలను నియంత్రించేందుకు కాంతిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం చూపు కోల్పోయిన వ్యక్తి కళ్లు.. కాంతిని గుర్తించేందుకు ఈ విధానాన్నే ఉపయోగించారు.
ఈ చికిత్స కోసం శైవలాల(ఆల్గేల) నుంచి చానెల్ రోడోప్సిన్స్‌గా పిలిచే ప్రోటీన్లను సేకరించారు. చానెల్ రోడోప్సిన్‌లు కాంతికి స్పందిస్తాయి. ఈ ప్రోటీన్ల సాయంతో కాంతివైపుగా శైవలాలు ముందుకు వెళ్తాయి.
ఈ చికిత్స విధానాన్ని జన్యు చికిత్సతో మొదలు పెట్టారు. రోడోప్సిన్స్ ఉత్పత్తి చేసేందుకు ఆల్గే అనుసరిస్తున్న జన్యు విధానాలను.. సదరు వ్యక్తి కంటిలోని రెటీనా కిందుండే పొరల్లోని కణాలకు అందించారు.
కంటిపై కాంతిని ప్రసరింప చేయడం ద్వారా మెదడుకు విద్యుత్ సంకేతాలు పంపగలిగారు. అయితే, ఆ కణాలు కేవలం పసుపు రంగు కాంతికి మాత్రమే స్పందించేవి. దీంతో సదరు వ్యక్తి ప్రత్యేక కళ్ల జోళ్లతోపాటు కంటి ముందు వీడియో కెమెరా, వెనుక ఒక చిన్న ప్రొజెక్టర్ పెట్టుకునేవారు.
చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఇవి రికార్డు చేసి, ఆయన కంటికి సరిపడే వేవ్‌లెంగ్త్ (తరంగ దైర్ఘ్యం)లో చూపించేవి.
ఈ కొత్త విధానాన్ని మెదడు నేర్చుకోవడానికి, కంటి చూపుకు సరిపడే స్థాయిలో రోడోప్సిన్లు ఉత్పత్తి కావడానికి నెలల సమయం పట్టింది.

‘‘మేం చాలా సంతోషపడ్డాం’’
రోడ్డు మీద నడుస్తూ జీబ్రా క్రాసింగ్ లైన్లను ఆయన గుర్తించినప్పుడు తొలిసారిగా చికిత్స పనిచేస్తున్నట్లు గుర్తించారని వైద్యులు చెప్పారు. ‘‘చికిత్సా విధానానికి చాలా సమయం పట్టడంతో మొదట్లో ఆయన కాస్త విసుగు చెందారు. మేం ఇంజెక్షన్ చేయడానికి, చూపు రావడానికి మధ్య చాలా సమయం పట్టింది’’అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజన్‌కు చెందిన డాక్టర్ జోస్ అలైన్ సహేల్ తెలిపారు.
‘‘ఆయన జీబ్రా క్రాసింగ్ లైన్లను ఆయన చూడగలిగినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది.’’ అన్నారు వైద్య నిపుణులు. అయితే, ప్రస్తుతానికి ఆ వ్యక్తికి పూర్తి దృష్టి రాలేదు. అయితే, పూర్తిగా చూపు లేకపోవడానికి, కొంచెం చూడగలగడానికి మధ్య చాలా తేడా ఉంది.
‘‘కంటి చూపును ఆప్టోజెనెటిక్స్ విధానంతో మళ్లీ తీసుకురావొచ్చని చెప్పడానికి తాజా చికిత్సా విధానమే నిరద్శనం’’అని బాసెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బొటోండ్ రోస్కా అన్నారు.
పాకిన్సన్స్, పక్షవాతం లాంటి వ్యాధుల చికిత్సకు కూడా పరిశోధకులు ఆప్టోజెనెటిక్స్ విధానాన్ని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








