గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్‌లలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Vishal Singh
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌లలో గంగానదిలో శవాలు తేలిన ఘటన తరువాత బుధవారం గంగానది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టిన మృతదేహాలు దర్శనమిచ్చాయి.
కాన్పూర్, ఉన్నావ్, ఫతేపుర్‌లలో ఇలా ఖననం చేసిన వందలాది మృతదేహాలు బయటపడ్డాయి.
కొంతమంది తమ సంప్రదాయం ప్రకారం మృతదేహాలను ఖననం చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, శ్మశానవాటికల్లో ఖాళీలు లేకపోవడం, దహన సంస్కారాలు బాగా ఖరీదైపోవడంతో మృతదేహాలను ఇసుకలో ఖననం చేస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
బుధవారం ఉన్నావ్‌లోని గంగానది ఒడ్డున పెద్ద సంఖ్యలో కాకులు, గద్దలు ఎగురుతూ కనిపించడంతో, అనుమానపడిన గ్రామస్థులు దగ్గరకు వెళ్లి చూడగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది.
నది ఒడ్డున ఇసుకలో అనేక మృతదేహాలను పాతిపెట్టారు. కొన్ని శవాలు బయటకి వచ్చేశాయి. వాటిని కుక్కలు పీక్కు తింటున్నాయి. కొన్ని శవాలు వికృతంగా కనిపించాయి. శవాలను బాగా లోతుగా పూడ్చి పెట్టకపోవడంతో అవన్నీ బయటకు కనిపిస్తున్నాయి.
ఉన్నావ్‌లోని శుక్లాగంజ్‌లో గంగానది ఒడ్డున అనేక ఘాట్‌లు ఉన్నాయి. వాటికి దగ్గర్లో నది ఒడ్డున ఇసుకదిబ్బలు ఇలా శ్మశానవాటికలుగా మారిపోయాయి.
ఈ చిత్రాలు వైరల్ కావడంతో, గత కొద్ది రోజులుగా గ్రామంలో మరణించినవారిని తీసుకొచ్చి ఇసుకలో పూడ్చి పెడుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Vishal Singh
ఇలా చాలా రోజులుగా జరుగుతోంది కానీ ప్రజలకు ఇప్పటివరకూ తెలియలేదని శుక్లాగంజ్ నివాసి దినకర్ సాహూ అంటున్నారు.
"ఘాట్లలో విపరీతమైన రద్దీ, దహనానికి వాడే కలప చాలా ఖరీదైపోవడంతో పేద ప్రజలు మృతదేహాలను ఇసుకలో పూడ్చడం మొదలుపెట్టారు. సాధారణంగా ఇలా జరగదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నారు" అని ఆయన అన్నారు.
ఆ చుట్టు పక్కల గ్రామాల్లో శవాలను పాతిపెట్టే సంప్రదాయం ఉందని, అయినప్పటికీ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఉన్నావ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు.
"నదికి దూరంగా ఉన్న ఇసుకలో పాతిపెట్టిన శవాలు బయటపడ్డాయి. ఇతర ప్రాంతాల్లో కూడా మృతదేహాలు ఉన్నాయేమో పరిశోధిస్తున్నారు. కొంతమంది వారి సంప్రదాయం ప్రకారం మృతదేహాలను కాల్చకుండా పూడ్చి పెడతారు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఖననాలు జరగడం మామూలు విషయం కాదు. దర్యాప్తు కోసం ఆదేశాలు జారీ చేశాం. మాకు వచ్చే సమాచారాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. జంతువుల బారిన పడకుండా ఉండేందుకు మృతదేహాలను లోతుగా పూడ్చిపెట్టమని సంప్రదాయం ప్రకారం ఖననం చేసేవారికి చెబుతూనే ఉంటాం. చనిపోయినవారికి గౌరవంగా అంతిమసంస్కారాలు జరిపించాలి. అందుకు, తగినంత కలప లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం" అని రవీంద్ర కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Vishal Singh
ఉన్నావ్‌లో బక్సర్ ఘాట్ పక్కన కూడా పెద్ద సంఖ్యలో ఇసుకలో పూడ్చిపెట్టిన శవాలు బయటపడ్డాయి.
ఉన్నావ్, ఫతేపుర్, రాయ్‌బరేలీ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడకు అంతిమ సంస్కారాలు చేసేందుకు వస్తారని రవీంద్ర కుమార్ తెలిపారు.
ఖననం చేసే ఆచారం కొన్ని కులాల్లోనే ఉందని, అది కూడా దహన సంస్కారాలు చేయడానికి తగినన్ని వనరులు లేకపోతే పూడ్చిపెడతారని స్థానికులు అంటున్నారు.
"గ్రామంలో కొంతమంది చిన్నపిల్లలనూ, వృద్ధులను ఖననం చేస్తారు. చాలాసార్లు పొలాల్లో కూడా చనిపోయినవారిని ఖననం చేస్తుంటారు. అయితే, ఈ సంప్రదాయం చాలా కొద్ది వర్గాల్లో మాత్రమే ఉంది" అని స్థానిక జర్నలిస్ట్ విశాల్ ప్రతాప్ తెలిపారు.

ఫొటో సోర్స్, Vishal Singh
కాన్పూర్‌లో కూడా...
ఉన్నావ్‌లో మాత్రమే కాకుండా కాన్పూర్‌లో కూడా గంగానది వెంబడి అనేక ఘాట్ల వద్ద ఇసుకలో పాతిపెట్టిన మృతదేహాలు బయటపడ్డాయి.
"బిల్హౌర్ తాలూకా ఖేరేశ్వర్ గంగాఘాట్‌లో పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఇసుకలో పాతిపెట్టారు. ఇక్కడ కూడా ఉన్నావ్‌లాంటి పరిస్థితే కనిపిస్తోంది. భారీగా ఇసుకలో శవాలను ఖననం చేశారు. చుట్టు పక్కల ప్రజలు ఈ విషయంపై పెదవి విప్పడానికి నిరాకరిస్తున్నారు. ఖననం చేసే సంప్రదాయం ఉన్న కుటుంబాలు ఈ చుట్టుపక్కల కనిపించలేదు. ఇలా ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ ఖననాలు జరగలేదు. కొన్ని మినహాయిపులు ఉంటే ఉండుచ్చు కానీ సంప్రదాయం అనేది ఏమీ ఇక్కడ కనిపించడం లేదు" అని కాన్పూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రవీణ్ మోహ్తా తెలిపారు.
బిల్హౌర్ ఖేరేశ్వర్ గంగాఘాట్‌లో ఇసుకలో కనిపించిన మృతదేహాల గురించి కాన్పూర్ అధికారులు ఎవరూ పెదవి విప్పడం లేదు.
గత కొద్ది రోజుల్లో ఈ గ్రామాల్లో ఎన్ని చావులు జరిగాయంటే దహన సంస్కారాలు చేయడానికి స్థలంగానీ, సమయంగానీ దొరకలేదని, అందుకే ఇలా ఇసుకలో పాతిపెట్టేశారని ప్రవీణ్ మోహ్తా అంటున్నారు.

ఫొటో సోర్స్, UMESH SHRIVASTAVA/BBC
ఉన్నావ్, ఫతేపూర్ జిల్లాల్లో గత నెల రోజుల్లో జ్వరం, శ్వాస అందకపోవడం కారణంగా అనేకమంది మరణించారని ఉన్నావ్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించే పురోహితుడు విజయ్ శర్మ తెలిపారు.
"గంగానది ఒడ్డున ఘాట్ల వద్ద దహన సంస్కారాలకు ఎక్కువ సమయం పడుతుండండంతో ఉన్నావ్, ఫతేపుర్, రాయ్‌బరేలీ నుంచి వచ్చిన మృతదేహాలను ఉన్నావ్‌లోని బక్సర్ ఘాట్‌కు కొద్ది దూరంలో నడి ఒడ్డున ఇసుకలో ఖననం చేశారు. అంతకుముందు ఘాట్లలో 10-12 మందికి అంతిమ సంస్కారాలు జరిపేవారు. కానీ గత నెల రోజులుగా రోజుకు 100 కన్నా ఎక్కువమందికి దహన సంస్కారాలు చేస్తున్నారు" అని విజయ్ శర్మ చెప్పారు.
ఇసుకలో పూడ్చిపెట్టబడిన శవాలు ఎవరివి? ఏ కుటుంబాలకు చెందినవి? అనేది స్పష్టంగా తెలియలేదు. వారు కరోనాతో మరణించారో లేక ఇతర కారణాల వల్ల మరణించారో తెలియదు.
ఈ శవాలన్నీ సమీప గ్రామాల నుంచి వచ్చినవే కావొచ్చు కానీ, ఇప్పుడు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
ఇసుకలో ఖననం చేసిన శవాలు వెలుగులోకి రావడంతో ఉన్నావ్, ఫతేపుర్ జిల్లాల అధికారులు బుధవారం సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ప్రస్తుతం యంత్రాల సహాయంతో అక్కడి ఇసుకను పూడ్చారు. శవాలపై కప్పిన గుడ్డలను తొలగించారు.
ఇకపై ఇలా జరగకుండా చూసేందుకు యంత్రాంగం సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ ఫంగస్: మ్యూకర్మైకోసిస్ అంటే ఏమిటి... ఇది ఎవరికి ప్రమాదకరంగా మారుతుంది?
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్‌తో చనిపోతున్న జర్నలిస్టులు... వారు ఫ్రంట్‌లైన్ వర్కర్లు కాదా?
- ముంబై మోడల్ ఆక్సిజన్ సరఫరా అంటే ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాలు దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి?
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: కలవరపెడుతున్న రంజాన్ షాపింగ్.. ఇసుకేస్తే రాలనట్లుగా పాతబస్తీ రోడ్లు
- కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?
- ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా
- కోవిడ్ టెస్ట్‌లకు వాడిన కిట్లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








