ఇండోనేసియా: వాడేసిన స్వాబ్ టెస్ట్ కిట్‌లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

స్వాబ్ టెస్ట్

ఫొటో సోర్స్, EPA

ఇండోనేసియాలోని ఓ ఔషధ కంపెనీకి చెందిన కొందరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగించిన 'నాజల్ స్వాబ్ టెస్ట్ కిట్'లను కడిగేసి మళ్లీ విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు.

మేదన్‌లోని ఒక విమానాశ్రయంలో సుమారు 9 వేల మంది ప్రయాణికులను ఇలా వాడిన కిట్‌లతోనే పరీక్షలు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

దీంతో ఇండోనేసియా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కిమియా ఫార్మాపై ప్రయాణికుల తరఫున కొందరు దావా వేయడానికి సిద్ధమవుతున్నారు.

కరోనా మహమ్మారి తరువాత దాదాపుగా ప్రతి దేశంలోనూ స్వాబ్ టెస్ట్‌లు సాధారణమైపోయాయి.

నార్త్ సుమత్రా దీవుల్లోని మేదన్‌లో ఉన్న కౌలానాము విమానాశ్రయం కేంద్రంగా గత డిసెంబరు నుంచి ఇలా వాడిపడేసిన కిట్‌లను మళ్లీ వాడుతున్న కుంభకోణం సాగుతోందని పోలీసులు చెబుతున్నారు.

విమాన ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ ఉండాలి. ఇందుకోసం అక్కడి విమానాశ్రయం అక్కడే స్వాబ్ టెస్ట్‌లు చేస్తోంది. ఇందుకోసం యాంటిజెన్ ర్యాపిడ్ కిట్‌లను కిమియా ఫార్మా సరఫరా చేస్తోంది.

అయితే, కొందరు ప్రయాణికులు తమకు తప్పుడు పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు అనుమానిస్తూ ఫిర్యాదులు చేయడంతో పోలీసులు ఒక అండర్ కవర్ ఆఫీసర్‌ను పంపించారు. ఆ ఆఫీసర్ గత వారం ప్రయాణికుడిలా వెళ్లి గుట్టంతా బయటపెట్టారని స్థానిక పత్రిక దేతిక్ వెల్లడించింది.

ఆ అధికారి అక్కడికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దాంతో మిగతా పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు చేశారు. రీసైకిల్ చేసిన కిట్‌లను పోలీసులు అక్కడ పట్టుకున్నారు.

విమాన ప్రయాణికులు

ఫొటో సోర్స్, Reuters

ఈ స్కామ్ నేపథ్యంలో గత వారం కిమియా ఫార్మాకు చెందిన అయిదుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

ఆరోగ్య, వినియోగదారుల చట్టాలను ఉల్లంఘిస్తూ... ఒకసారి వాడిన స్వాబ్ టెస్టుల కిట్‌లను శుభ్రం చేసి తిరిగి ప్యాక్ చేశారన్న ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు.

పోలీసులు 23 మంది సాక్షుల నుంచి ఆధారాలు సంపాదించారని స్థానిక మీడియా రాసింది.

ఈ కుంభకోణంతో నిందితులు భారీగా సొమ్ము చేసుకున్నారని.. వారిలో ఒకరు అత్యంత విలాసవంతమైన భవంతి నిర్మించుకున్నారని రాశారు.

తాజా కేసు నేపథ్యంలో కిమియా ఫార్మా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన సంస్థకు చెందిన ఉద్యోగులను తొలగించింది.

ప్రయాణికుల తరఫున తాము కేసు వేయబోతున్న ఇద్దరు న్యాయవాదులు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'కు తెలిపారు.

ఇండోనేసియా కూడా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశమే. అక్కడ 17 లక్షల పాజిటివ్ కేసులు రాగా 46 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)