స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..

స్కైలాబ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కిర్స్టీ బ్రూవర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దాదాపు 50 సంవత్సరాల క్రితం.. స్కైల్యాబ్ 4 మిషన్‌లో అంతరిక్షంలో ఉన్న ముగ్గురు వ్యోమగాములు భూమి మీదున్న మిషన్ కంట్రోల్‌తో వాగ్వాదానికి దిగారు.

ఆ తర్వాత కాసేపటికే స్కైల్యాబ్ 4 నుంచి మిషన్ కంట్రోల్‌కు కమ్యూనికేషన్ నిలిచిపోయింది.

దాని తర్వాత వ్యోమగాములు సమ్మెకు దిగారన్న వార్తలు గుప్పుమన్నాయి.

స్కైల్యాబ్ సమ్మెగా అభివర్ణించే ఈ సంఘటన జరిగి అర్థ శతాబ్దం కావొస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1973లో నాసా స్కైల్యాబ్ 4 మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించింది.

వాళ్లు పైకి వెళ్లిన తరువాత ఒకరోజు నాసాతో కమ్యూనికేషన్ ఆగిపోయింది.

వ్యోమగాములు కమ్యూనికేషన్ స్విచ్ ఆపేసి సమ్మె చేశారనే వార్తలు వచ్చాయి.

కానీ కొన్ని గంటల్లోనే మళ్లీ రేడియో కమ్యూనికేషన్ ప్రారంభమైంది.

ఇదిలా ఎందుకు జరిగింది అనే విషయంపై నాసాకు వ్యోమగాములకు మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి.

నాసా

ఫొటో సోర్స్, NASA

ఇంతకీ ఆరోజు అసలు ఏం జరిగింది?

ఆ ముగ్గురు వ్యోమగాముల్లో ప్రస్తుతం ఎడ్ గిబ్సన్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు.

ఆ రోజు ఏం జరిగిందో ఆయన వివరించారు.

ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత వారిలో ఒకరైన బిల్ పాగ్ అనారోగ్యం పాలయ్యారు.

ఇది కొంచం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఎందుకంటే, టెక్సాస్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు పాగ్‌కు 'ఇనుప పొట్ట (ఐరన్ బెల్లీ) అనే పేరుండేది.

గుండ్రంగా, వేగంగా తిరిగే కుర్చీలో ఎంతసేపు కూర్చున్నా ఆయనకు కడుపులో తిప్పేది కాదు.

అలా తిరుగుతున్నపుడు కూడా హాయిగా తలను ముందుకు, వెనక్కు వంచడం, పక్కకు తిప్పడం చేయగలిగేవారు. ఈ అభ్యాసం ఆయనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదు.

అయితే, వాళ్లు ముగ్గురూ మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత అక్కడి పరిస్థితి వేరుగా ఉంది.

భూమి మీద అనుభవం అంతరిక్షంలో ఏ మాత్రం పనికి రాలేదు.

అంతరిక్షంలోకి వెళ్లాక వాళ్లకి ప్రయాణం వలన అనారోగ్యం (మోషన్ సిక్‌నెస్) కలిగింది.

కొన్ని టమాటాలు తింటే కడుపులో తిప్పడం ఆగుతుందని కమాండర్ జేమ్స్ కార్, పాగ్‌కు సలహా ఇచ్చారు.

"కానీ, పాపం బిల్ తేరుకోలేదు. వాంతులు అయ్యాయి. మేము చాలా నిరుత్సాహపడ్డాం. మాకు చేతిలో బోల్డంత పని ఉంది కాని ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది. అప్పుడే మేము మొదటి తప్పు చేశాం" అని గిబ్సన్ వివరించారు.

స్కైలాబ్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, స్కైల్యాబ్ 4లో వెళ్లిన వ్యోమగాములు వీళ్లే

స్కైల్యాబ్ మిషన్ 4

ఇప్పుడు ఎడ్ గిబ్సన్‌కు 84 సంవత్సరాలు.

స్కైల్యాబ్ 4 మిషన్ 1973 నవంబర్‌లో ప్రారంభమైంది.

గిబ్సన్‌కు ఆనాటి అనుభవాలన్నీ ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి.

అంతరిక్షం నుంచి భూమిని చూసిన క్షణం, సూర్యుడి కాంతి వలయం, అనంతమైన నిశ్శబ్దం.. అన్నీ గుర్తున్నాయి.

ఇప్పుడు బిల్ పాగ్, జేమ్స్ కార్ ప్రాణాలతో లేరు.

మనకు ఆనాటి కథ చెప్పడానికి ఎడ్ గిబ్సన్ మాత్రమే ఉన్నారు.

స్కైల్యాబ్ ఒక అంతరిక్ష పరిశోధన నౌక.

అంతరిక్షంలో మానవుల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై అధ్యయనం చేయడానికి, భూమిని, సూర్యుడిని పరిశీలించడానికి, ఇంకా అనేక రకాల ప్రయోగాలు చేయడానికి దీన్ని ప్రయోగించారు.

ఈ ప్రయోగాల్లో స్కైల్యాబ్ 4 చివరిది కావడంతో ఈ మిషన్ లక్ష్యాల జాబితా పెద్దగా ఉండేది.

84 రోజులపాటు సాగిన ఈ మిషన్ అప్పట్లో అత్యంత సుదీర్ఘ ప్రయోగం.

చేయాల్సిన పనులు అనేకం ఉండడం, వ్యోమగాముల్లో ఒకరు అనారోగ్యం పాలవ్వడం నాసాను కలవరపెట్టింది. అంతరిక్షంలో ఉన్న విలువైన సమయాన్ని కోల్పోతామని ఆందోళన చెందింది.

అయితే, వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి కుదురుకోవడానికి తగినంత సమయం ఇవ్వలేదని, వెళ్లిన వెంటనే పనులు ప్రారంభించాల్సినంత బిజీ షెడ్యూల్ తయారు చేసారని నాసా అంగీకరించింది.

అంతరిక్షంలోకి వెళ్లిన ముగ్గురూ అప్పటికే చాలా ఒత్తిడిలో ఉండడంతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

"అంతరిక్ష కేంద్రంలో కొంచం సర్దుకుని పని మొదలుపెడదాం అనుకున్నాం. అందుకే బిల్ అనారోగ్యం గురించి మేము నాసాకు సమాచారం అందించలేదు" అని గిబ్సన్ చెప్పారు.

అయితే స్పేష్ మిషన్ ఎప్పుడూ భూమికి అనుసంధానమయ్యే ఉంటుందనే సంగతి వాళ్లు మర్చిపోయారు. వారి మాటలు, చేతలు అన్నీ రికార్డ్ అవుతూ నాసాకు చేరుతూనే ఉన్నాయి.

కింద నుంచి ఆస్ట్రోనాట్ ఆఫీస్ చీఫ్ అలన్ షెపర్డ్ గొంతు మిషన్ కంట్రోల్‌లో ఖంగుమంటూ వాళ్లకు వినిపించింది. ఆయన వీరితో మాట్లాడిన మాటలు పబ్లిక్‌లో ప్రసారమయ్యాయి కూడా.

"ఇక్కడి పరిస్థితుల గురించి నాసాకు సమాచారం అందించనందుకు ఆయన మమ్మల్ని గట్టిగా మందలించారు. అది ఫరవాలేదుగానీ ఈ మాటలన్నీ రికార్డ్ అయి మొత్తం ప్రపంచానికి తెలియడం మాకు నచ్చలేదు" అని గిబ్సన్ అన్నారు.

స్కైలాబ్

ఫొటో సోర్స్, NASA

చంద్రుడిపై గోల్ఫ్ ఆడిన షెపర్డ్

షెపర్డ్ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి అమెరికా వ్యోమగామి.

అపోలో 14 మిషన్‌ కమాండర్‌గా చంద్రుడిపైకి కూడా వెళ్లారు.

అక్కడ ఆయన రెండు గోల్ఫ్ బంతులు ఆడారు.

గిబ్సన్‌కు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కలగడానికి ఆయనే ప్రేరణ.

"చంద్రుడిపై గోల్ఫ్ ఆడిన వ్యక్తి.. నిబంధనలు ఉల్లంఘించామని మమ్మల్ని మందలించడం చాలా ఆశ్చర్యం కలిగింది" అని గిబ్సన్ చెప్పారు.

షెపర్డ్ మందలింపులు వింటున్న మా బంధువులు, స్నేహితులు మా గురించి ఏమనుకుంటారని బాధ కలిగిందని గిబ్సన్ అన్నారు.

ఇది వారికి శుభారంభంగా తోచలేదు. వ్యోమగాముల బృందానికి, మిషన్ కంట్రోల్‌కు మధ్య మరింత ఒత్తిడి పెరిగింది.

భూమి మీద ఉన్న సిబ్బందికి ఈ బృందంతో సరైన సంబంధం ఏర్పడలేదని గిబ్సన్ అన్నారు.

వాళ్లు మొదటి రెండు మిషన్లను పర్యవేక్షించడంలో బిజీగా ఉన్నప్పుడు స్కైల్యాబ్ 4 వ్యోమగాముల బృందం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతూ ఉంది.

"అంటే మా మధ్య పని సంబంధాలు బలపడలేదు. సాన్నిహిత్యం ఏర్పడలేదు" అని గిబ్సన్ అభిప్రాయపడ్డారు.

"భూమి నుంచి మాకొచ్చిన ప్రతి కాల్‌లో బోల్డన్ని ప్రశ్నలు, సూచనలు, డిమాండ్లతో దాడి ప్రారంభమయ్యేది. దానికి తోడు రోజూ పొద్దున్నే పెద్ద సూచనల జాబితా ఒకటి పంపించేవారు" అని ఆయన అన్నారు.

"అన్ని స్పేస్ మిషన్లూ ఇలాగే పనితో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఉంటాయి కానీ ఇలా ప్రతి నిముషానికి సూచనలు, సలహాలు మాకు ఇబ్బందికరంగా అనిపించాయి" అని గిబ్సన్ వివరించారు.

"ఒకరోజు పొద్దున్నే మాకు 60 అడుగుల సూచనల జాబితా అందింది. ముందు అది చదివి అర్థం చేసుకోవడమే పెద్ద పనిగా తోచింది మాకు. తరువాత మళ్లీ రేడియో ద్వారా ఒక మీటింగ్. అందులో మరొక అరగంట పోయేది.

"రోజులో ఒక్క గంట ఇలా గడిస్తేనే భరించడం కష్టం. అలాంటిది 24 గంటలు ఇలా గడిస్తే ఎలా ఉంటుంది? అందులో ప్రతి నిముషం స్కెచ్ వేసి ఏం చేయాలో చెప్తూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఈ పద్ధతి మాకు పని చేయలేదు. మేము అనుకున్న పనులేవీ సరిగ్గా జరగలేదు. ఎందుకంటే అందులో మా నిర్ణయాలు, మా ఆలోచనలు ఏమీ లేవు.

దానికి తోడు ఫ్లైట్ సర్జన్లు రోజువారీ వ్యామాయ సమయాన్ని 60 నుంచి 90 నిముషాలకు పెంచేశారు. అయితే, అదనంగా 30 నిముషాలు వ్యాయామం చేయడం బాగానే ఉండేది" అని గిబ్సన్ చెప్పారు.

"వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరమంతా పై నుంచి కిందకు రక్తం వేగంగా ప్రవహిస్తూ ఉంటే బాగుండేది. భూమి ఆకర్షణ శక్తి లేకపోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అప్పుడే నాకర్థమయ్యేది.

బిల్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకపోయినా రోజుకు 16 గంటలు పని చేయవలసి వచ్చేది. మొదటి నెల అంతా విశ్రాంతి అనేదే లేకుండా తమ లక్ష్యాలను అందుకునేందుకు కృషి చేశారు" అని గిబ్సన్ తెలిపారు.

వీరికి ముందు స్కైల్యాబ్ 3లో పని చేసిన బృందం ఊహించిన దాని కన్నా ఎక్కువ పని చేసి "150% బృందం" అని పేరు తెచ్చుకుంది. ఇప్పుడు వీళ్లని వాళ్లతో పోల్చి చూస్తారని గిబ్సన్ బృందానికి తెలుసు.

స్కైల్యాబ్ 3 సిబ్బంది.. తమ తరువాత వచ్చే బృందం నమూనాలను తయారు చేసి వాటికి బట్టలు తొడిగి ఉంచారు. ఆ బొమ్మలు కూడా గిబ్సన్ బృందంతో పాటూ అంతరిక్ష కేంద్రంలో ఉండేవి.

"వాటిని చూసి మేము సరదా పడ్డాం. అవి ఓ పక్కన ఉంటే మాతో పాటూ మరో మనిషి ఉన్నట్టే అనిపించేది. అప్పుడప్పుడూ పరాకుగా వాటిని చూసి తుళ్ళిపడేవాళ్లం" అని గిబ్సన్ అన్నారు.

ఇలా ఓవర్ టైం పని చేస్తూ, ఓపిక తగ్గి, నీరసం వచ్చి.. పని భారం తగ్గించమని మిషన్ కంట్రోల్‌ను కోరినా ఏం లాభలేకపోయేసరికి గిబ్సన్ బృందానికి పూర్తిగా నిరాశ ఆవహించింది.

"అప్పుడే మేము రెండో తప్పు చేశాం" అని గిబ్సన్ వివరించారు.

స్కైలాబ్

ఫొటో సోర్స్, NASA

సమ్మె వదంతులు

పొద్దున్న మీటింగ్‌కు వారి ముగ్గురిలో ఎవరో ఒకరే హాజరైతే చాలని వాళ్లు నిర్ణయించుకున్నారు.

"ఈ పద్ధతి బాగా పని చేసింది. మా అలసట పోలేదు కానీ ఇది కొంత నయంగా తోచింది. అయితే, ఒకరోజు సిగ్నల్స్‌లో ఏదో సమస్య వచ్చి మా మాటలు భూమికి చేరలేదు.

భూమి కక్ష్యలో మొత్తం 90 నిముషాలు వారికి కమ్యూనికేషన్ ఆగిపోయింది. మళ్లీ కమ్యూనికేషన్ ప్రారంభమవడానికి కొంత సమయం పట్టింది.

భూమి మీద దీన్ని 'సమ్మె'గా భావించారు. కానీ అది మేము ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. పొరపాటున జరిగింది. వెంటనే మీడియా దీని చుట్టూ కథలు అల్లేసింది. ఈ కథ దేశాలు దాటి పాకింది. అప్పటి నుంచి మేము ఈ వదంతుల మధ్యనే బతుకుతున్నాం.

"అసలు మేమెందుకు అలా చేస్తాం? ఎవరిని, ఎలా భయపెడతాం? సమ్మె చేసి చంద్రుడిపై ఉండిపోతామని బెదిరించగలమా?" అని గిబ్సన్ అన్నారు.

ఇటీవల వచ్చిన ఒక వ్యాసంలో నాసా ఈ సమ్మె కథ గురించి మరొక వివరణ ఇచ్చింది.

"అదే సమయంలో వ్యోమగాముల బృందానికి ఒక రోజు సెలవు దొరికింది. సిగ్నల్స్ ఆగిపోవడం, వాళ్లకు సెలవు వచ్చి, పని చేయకపోవడం ఒకే సమయంలో జరగడం వలన ఈ మొత్తం గందరగోళం ఏర్పడి ఉండవచ్చు. అందువల్లే వ్యోమగాములు సమ్మె చేస్తున్నారనే వదంతులు వచ్చి ఉండవచ్చు" అని నాసా తెలిపింది.

డిసెంబర్‌లో క్రిస్మస్ నాడు జెర్రీ, బిల్ ఏడు గంటల పాటు స్పేస్ వాక్ చేయడంతో వారికి ఈ సెలవు లభించింది.

ఆ సమయంలో కొన్ని గంటల పాటూ కమ్యూనికేషన్ నిలిచిపోయిందిగానీ సమ్మెలాంటిది ఏమీ జరగలేదని భూమి మీద మిషన్ కంట్రోల్ స్పష్టం చేసింది.

సమ్మె అయినా కాకపోయినా ఆ సమయంలో అంతరిక్షంలోని వ్యోమగాములు, భూమి మీద మిషన్ కంట్రోల్‌ సిబ్బంది భయపడిన మాట నిజం. తరువాత డిసంబర్ 30న రెండు వర్గాల మధ్య ఈ పరిస్థితిపై సుదీర్ఘ సమావేశం జరిగింది.

"ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఒత్తిడితో కూడిన చర్చ జరిగింది. రెండు వైపులవాళ్లూ తమ తమ నిరాశ, నిస్పృహలను వెళ్లగక్కారు. వ్యోమగాములకు కొంత మేర పని భారం తగ్గించేందుకు మిషన్ కంట్రోల్ అంగీకరించింది. అంతే కాకుండా వ్యోమగాములకు కొంత వరకు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది" అని గిబ్సన్ తెలిపారు.

ఆ తరువాత పరిస్థితులు చక్కబడ్డాయి. వ్యోమగాముల పని సామర్థ్యం పెరగడమే కాక, అంతరిక్షంలో ప్రయాణాన్ని వాళ్లు ఆస్వాదించడం మొదలు పెట్టారు.

స్కైలాబ్

ఫొటో సోర్స్, Getty Images

కిటికీలోంచి భూమిని తొంగి చూస్తూ ఉండేవారు

గిబ్సన్ సోలార్ ఫిజిక్స్‌లో నిపుణులు. తనకు సమయం దొరికినప్పుడల్లా అపోలో టెలిస్కోప్ మౌంట్‌లో సూర్యుడిని పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ ఉండేవారు. కిటికీలోంచి తొంగి చూస్తూ భూమిని పరిశీలించేవారు.

"భూమి ఎంతో అందమైన ప్రదేశం. ఇప్పుడు తలుచుకుంటే అవన్ని అనుభవించడానికి మేమెంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. మూడు రోజులకొకసారి భూమి మీదున్న నా భార్య, నలుగురు పిల్లలతో కొన్ని నిముషాలు మాట్లాడే అవకాశం దొరికేది. అవి ఎంతో విలువైన క్షణాలు.

నేనేమో వాళ్లకి స్పేస్ విషయాలు చెప్తుంటే, ఐదేళ్ల మా పాప.. నాన్నా నువ్వు భూమి మీదకు వచ్చాక మనం బౌలింగ్ ఆడుకోడానికి వెళదామా అని అడిగేది. అప్పుడే నాకు.. మేము వేరు వేరు ప్రపంచంలో ఉన్నామనే స్పృహ కలిగేది. మేమిప్పటికీ అవన్ని తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాం" అని గిబ్సన్ చెప్పారు.

స్కైల్యాబ్ 4 సిబ్బంది తమ చివరి స్పేస్ వాక్ ముగించుకున్న ఐదు రోజుల తరువాత 1974లో వెనక్కు తిరిగి వచ్చి, పసిఫిక్ మహా సముద్రంలో దిగారు.

అంతకుముందు "150% సిబ్బంది" కన్నా ఎక్కువ ఉత్పాదకతతో స్కైల్యాబ్ 4 సిబ్బంది వెనక్కు తిరిగి వచ్చారు.

"మేము చాలా మంచి పరిశోధనలు చేసి విజయవంతంగా వెనక్కు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. మా అధ్యయనాలన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పేందుకు నాసాకు సహకరించాయి" అని గిబ్సన్ తెలిపారు.

అయితే, ఈ సమ్మె కథ గురించి వాళ్లకు భూమి మీదకు వచ్చేవరకూ తెలీదు.

వార్తా పత్రికల నిండా ఇదే వార్త. అంతరిక్షంలో సమ్మె అని, ఉపద్రవం అనీ వ్యాసాలు రాసాయి.

2014లో బిల్ పాగ్‌కు నివాళులు అర్పిస్తున్న సందర్భంలో కూడా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఈ వదంతుల ప్రస్తావన వచ్చింది.

అంతరిక్షంలో సమ్మె అంటూ అల్లిన కట్టు కథల గురించి గిబ్సన్ స్పందిస్తూ.. "ఎంతో శ్రమించి, కృషి చేసి మంచి పరిశోధనలు జరిపి వెనక్కు వచ్చి ఇలాంటి వదంతులు వినడం సరదా అయిన విషయమేం కాదు" అని అన్నారు.

గిబ్సన్ ఇప్పటికే అంతరిక్షానికి సంబంధించిన రెండు నవలలు రాశారు. అంతే కాకుండా, తన అనుభవాలను, వాస్తవాలను క్రోడీకరిస్తూ 'వియ్ ఎంటర్ స్పేస్ అనే పుస్తకం కూడా రాశారు.

ఈ ముగ్గురు వ్యోమగాముల్లో మళ్లీ ఎవరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు.

కానీ గిబ్సన్ చివరి వరకూ స్పేస్ ప్రోగ్రాంలోనే పని చేశారు.

ఈ మొత్తం సంఘటన ద్వారా మైక్రోమేనేజ్‌మెంట్ గురించి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు అని గిబ్సన్ అన్నారు.

"మైక్రోమేనేజ్‌మెంట్.. ప్రతి నిముషాన్ని లెక్కిస్తూ పని షెడ్యూల్ చేసుకునే పద్ధతి సరిగ్గా పని చేయదు అని మా మిషన్ నిరూపించింది. ఈ పాఠాలన్ని మా తరువాత అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములకు ఉపయోగపడ్డాయి" అని గిబ్సన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)