చంద్రుడిపై నీళ్లు.. అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి సరిపోతాయా?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్
చంద్రుడిపై నీరు ఉన్నట్లు కచ్చితమైన ఆధారలను నాసా విడుదల చేసింది. కొద్ది రోజులక్రితమే సహజ ఉపగ్రహమైన చంద్రునిపై కొత్త ఆవిష్కరణల గురించి నాసా సూచనలిచ్చింది.
"నీరు ఉన్నట్టు నిస్సందేహంగా తెలియడం" వలన చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేయాలనే నాసా ఆలోచనలకు బలం చేకూరింది. చంద్రుడిపై ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని స్థావరాన్ని కొనసాగించాలనేది నాసా లక్ష్యం.
ప్రస్తుత పరిశోధనా ఫలితాలను 'నేచర్ ఆస్ట్రానమి' అనే జర్నల్‌లో ప్రచురించారు.
ఇంతకుమునుపు చంద్రుడి ఉపరితలంపై విస్ఫోటనాల వల్ల ఏర్పడిన కొన్ని ప్రదేశాల్లో నీటి జాడలు కనుగొన్నారు. కానీ ఇప్పుడు సూర్యకాంతి పడే చోట అణుసహిత నీటి జాడలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ పరిశోధనా బృందంలో భాగమైన క్యాసీ హోనిబాల్ ఆన్‌లైన్ టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.."చంద్రుడిపై ఒక మీటర్ ఘనచతురస్రపు (క్యూబిక్ మీటర్) మట్టిలో దాదాపు 12 ఔన్సుల నీరు (355 మిల్లీ లీటర్లు) లభ్యమయ్యిందని" తెలిపారు. క్యాసీ హోనిబాల్, మెరీల్యాండ్‌లోని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో పోస్ట్‌డాక్టరల్ ఫెల్లోగా ఉన్నారు.
మరొక నాసా శాస్త్రవేత్త జాకబ్ బ్లీచర్ మాట్లాడుతూ..."చంద్రుడిపై కనిపించిన నీటి గుంటల స్వభావాన్ని ఇంకా పరిశోధించవలసి ఉంది. భవిష్యత్తులో ఈ నీటిని ఎంతవరకూ ఉపయోగించుకోవచ్చు అనే విషయంపై అవగాహన కోసం మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉంది" అని తెలిపారు.
ఇంతకుమునుపు అనేకసార్లు చంద్రుడిపై నీటి జాడలు కనుగొన్నప్పటికీ, ప్రస్తుత ఆవిష్కరణలు నీటి సమృద్ధిని సూచిస్తున్నాయి. "దీనివలన చంద్రుడిపై నీటి వనరులను అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది" అని మిల్టన్ కీన్స్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ప్లానెటరీ సైంటిస్ట్ హన్నా సర్జెంట్, బీబీసీకి తెలిపారు.
"చంద్రుడిపై ఎక్కడ స్థావరం స్థాపించాలనేది, ఎక్కడ నీరు ఎక్కువగా లభ్యమవుతుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది" అని డా. సర్జెంట్ తెలిపారు.
2024లో మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని చంద్రుడిపైకి పంపనున్నట్లు నాసా ఇదివరకే ప్రకటించింది.
"అంతరిక్ష పరిశోధనలు మరింత స్థిరంగా సాగాలంటే స్థానిక వనరులను ఉపయోగించుకోవడం ముఖ్యం. నీరు స్థానికంగా లభ్యమైతే, మరింత ఎక్కువకాలం పరిశోధనలు కొనసాగించవచ్చు" అని సర్జెంట్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, NASA
చంద్రుడిపై నీటిని శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారు?
గాలిలో తిరిగే ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ 'సోఫియా' ద్వారా మొట్టమొదట ఈ నీటి చెలమలను కనిపెట్టారు. ఈ వాతావరణ పరిశోధనాలయం (అబ్జర్వేటరీ) అధునాతన బోయింగ్ 747లో, భూమికి చాలా ఎత్తులో ఎగురుతూ సౌర వ్యవస్థకు ఏ ఆటంకం లేకుండా పరిశీలించగలుగుతుంది.
ఈ టెలిస్కోప్ ద్వారా చూస్తూ శాస్త్రవేత్తలు నీటి అణువుల ప్రత్యేకమైన రంగును గుర్తించగలిగారు.
ఈ నీరు చద్రుడిపై గాజు తరహా బుడగల్లో లేదా ఉపరితలంపై ఉన్న ధూళి మధ్యలో నిల్వ అయి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
మరొక పరిశోధనలో, చంద్రుడి ఉపరితలంపై శాశ్వతంగా నీడ ఉండే ప్రదేశాల్లో (కోల్డ్ ట్రాప్స్) నీటి జాడలున్నాయేమో అని పరిశోధించారు. ఇలాంటి చోట నీటిని నిల్వచేసే వీలు ఉంటుంది. చంద్రుడి రెండు ధృవాల దగ్గర ఈ కోల్డ్ ట్రాప్‌లను కనుగోన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 40,000 కిలోమీటర్ల చదరంలో నీటిని నిల్వ చెయ్యొచ్చని నిర్థారించారు.
ఈ పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
"దీనివలన, మనం స్థావరాలను ఏర్పాటు చేసుకోగలిగే ప్రదేశాల సంఖ్య పెరగొచ్చు" అని సర్జెంట్ అన్నారు.
రాబోయే రోజుల్లో చంద్రుడి ధృవ ప్రాంతాలకు వెళ్లి మరిన్ని పరిశోధనలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ దీర్ఘకాలికంగా చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పరిశోధనలు చేపడుతున్నారు.
"ఈ సమయంలో ఈ పరిశోధనలు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తాయి. సమృద్ధిగా నీరు లభ్యమయ్యే అవకాశాలను కనుగొనడం, చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది" అని సర్జెంట్ అభిప్రాయపడ్డారు.
చంద్రుడిపై నీటిని సమృద్ధిగా సేకరించగలిగే విధానాలు కనిపెట్టిన తరువాత, భవిష్యత్తులో చంద్రుని మీద ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి బాటలు ఏర్పడతాయి అని నిపుణులు అంటున్నారు.
చంద్రుడిపై నీరు సమృద్ధిగా లభ్యమైతే రాకెట్‌కు కావలసిన ఇంధనాన్ని చంద్రునిపైనే తయారుచేసుకోవడం సులువు. భూమినుంచీ పంపించడంకన్నా చంద్రుడిపైనే ఇంధనాన్ని తయారుచేసుకోవడం తక్కువ ఖర్చుతో కూడిన పని అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రునిపైనుంచి భూమికి రావాలన్నా లేదా మరో గ్రహానికి వెళ్లాలన్నా అక్కడ దొరికిన నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా మార్చుకుని రాకెట్‌కు ఇంధనాలుగా వాడుకోవచ్చు.
ఇలా ఇంధనాన్ని తయారుచేసుకోగలిగితే అంతరిక్ష యానాలు చౌక అవుతాయి. చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవడం కూడా సులువవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ పుట్టుకపై కట్టుకథలు ఆపండి... డబ్యూహెచ్ఓ హెచ్చరిక
- కరోనావైరస్: గబ్బిలాలు ఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయా? శాస్త్రీయ సమాధానం ఇదీ
- ఈ రాకాసి గబ్బిలాలు రక్తం జుర్రుకుంటూ ముద్దులు పెట్టుకుంటాయ్
- కరోనావైరస్ తమలోనే ఉన్నా గబ్బిలాలు జబ్బు పడవెందుకు? రహస్యం శోధిస్తున్న శాస్త్రవేత్తలు
- బ్లాక్ మార్కెట్లో ప్లాస్మా.. ఒక్కో యూనిట్ ధర రూ. 25,000 పైనే
- ఉమ్ము పరీక్షలతో కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








