కరోనావైరస్ తమలోనే ఉన్నా గబ్బిలాలు జబ్బు పడవెందుకు? రహస్యం శోధిస్తున్న శాస్త్రవేత్తలు

హార్స్ షూ బ్యాట్

ఫొటో సోర్స్, DANIEL WHITBY

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రాణాంతక వైరస్‌ల నుంచి తట్టుకునే ‘అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి’ గబ్బిలాలకు ఎలా వస్తుందో, వాటి జన్యు క్రమ నిర్మాణం ద్వారా తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

ఆరు రకాల గబ్బిలాల జన్యు నిర్మాణ క్రమాల గుట్టును తాము విప్పగలిగామని చెప్పారు.

కరోనావైరస్ వాటి శరీరాల్లో ఉన్నా, గబ్బిలాలు ఎందుకు జబ్బుపడటం లేదన్న రహస్యాన్ని ఈ సమాచారం ద్వారా తెలుసుకోవాలని పరిశోధకులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనావైరస్, భవిష్యతులో రాబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉందంటున్నారు.

గబ్బిలాలపై తమ పరిశోధనల్లో గుర్తించిన జన్యు క్రమాలు వాటికి ‘ప్రత్యేకమైన వ్యాధినిరోధక వ్యవస్థ’లు ఉన్నట్లు సూచిస్తున్నాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్ ప్రొఫెసర్ ఎమ్మా టీలింగ్ చెప్పారు.

‘‘వైరస్‌లకు గబ్బిలాల్లో కనిపిస్తున్న వ్యాధి నిరోధక ప్రతిస్పందనలను మనుషుల్లోనూ తీసుకురాగలిగితే, వాటిని మనం తట్టుకోవచ్చు’’ అని బీబీసీతో అన్నారు.

‘‘అది ఇప్పటికే పరిణామం చెంది ఉంది. మనం కొత్తగా కనుక్కోవాల్సింది లేదు. అయితే, అలాంటి ప్రతిస్పందనలు ఎలా తేవచ్చొన్నది మనం తెలుసుకోగలగాలి. దానికి తగ్గట్లు ఔషధాలు తయారుచేయాలి’’ అని వివరించారు.

ప్రొఫెసర్ టీలింగ్ బ్యాట్1కే ప్రాజెక్ట్‌ సహ వ్యవస్థాపకురాలు.

గబ్బిలం

ఫొటో సోర్స్, OLIVIER FARCY

ప్రస్తుతం జీవిస్తున్న మొత్తం 1,421 జాతుల గబ్బిలాల జన్యు క్రమాలను ఆవిష్కరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

‘‘గబ్బిలాల్లో పరిణామం చెందిన జన్యు పరిష్కారాలను మనుషుల్లో ఎలా రాబట్టుకోవాలన్నది గుర్తించేందుకు ఈ జన్యు క్రమాలే దారి’’ అని టీలింగ్ అన్నారు.

కోవిడ్-19 గబ్బిలాల్లో మొదలై, వేరే జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. సార్స్, మెర్స్, ఎబోలా లాంటి వ్యాధులు కూడా ఈ తరహాలోనే మనుషులకు వ్యాపించాయి.

గబ్బిలాలను వాటి ఆవాసాల్లో, సహజ రీతిలో బతకనిస్తే... మనుషులకు పెద్దగా ప్రమాదమేమీ ఉండదని పర్యావరణవేత్తలు అంటున్నారు.

ప్రకృతి సమతౌల్యానికి గబ్బిలాలు చాలా ముఖ్యం. మొక్కల్లో పరాగ సంపర్కానికి కొన్ని రకాలు ఉపయోగపడతాయి. మరికొన్ని కీటకాలను తింటాయి.

గబ్బిలం

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధనల్లో ఏం తేలింది?

అధునాతన సాంకేతికత సాయంతో ఓ అంతర్జాతీయ పరిశోధక బృందం గబ్బిలాల జన్యు క్రమాన్ని, వాటిలోని జన్యువులను గుర్తించేందుకు పనిచేసింది.

గబ్బిలాల జన్యుక్రమాలను మరో 42 క్షీరదాల జన్యుక్రమాలతో పోల్చి చూసి, జీవ వ్యవస్థలో వాటి స్థానాన్ని గుర్తించింది.

కుక్కలు, పిల్లులు, సీల్ చేపల వంటి మాంసాహార జీవ జాతులతో, పాంగోలిన్, తిమింగళాలు, గిట్టలుండే జంతువులతో గబ్బిలాలకు దగ్గరి సంబంధం ఉందని పరిశోధకులు కనిపెట్టారు.

జన్యుక్రమంలో గబ్బిలాల్లో ప్రత్యేకంగా పరిణామం చెందిన ప్రాంతాలను గుర్తించారు. ఇవే వాటి ప్రత్యేక సామర్థ్యాలకు కారణమవుతుండొచ్చు.

ప్రతిధ్వనులను గుర్తించడం ద్వారా పూర్తి చీకట్లోనూ తిరిగే సామర్థ్యం గబ్బిలాలకు ఉంది. దీనికి కారణమని భావిస్తున్న జన్యువులను కూడా పరిశోధకులు గుర్తించారు.

ఎగిరే క్షీరదాలు కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌ను ఎలా తట్టుకుంటున్నాయన్నది తమ పరిశోధన ఫలితాలతో గుర్తించే అవకాశముందని పరిశోధకులు అంటున్నారు.

చాలా వైరల్ ఇన్ఫెక్షన్లలో మరణానికి స్వయంగా వైరస్ కారణం కాదు. ఆ వైరస్‌కు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందించే తీరు తీవ్రంగా ఉండటంతోనే సమస్య వస్తూ ఉంటుంది.

గబ్బిలాల్లో ఇది నియంత్రణలో ఉంటుంది. వాటికి ఇన్ఫెక్షన్ సోకినా, వ్యాధి లక్షణాలేవీ కనిపించవు.

ఈ పరిశోధన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)