కరోనావైరస్: అన్ని వైరస్‌లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?

ఫొటో సోర్స్, Science Photo Library
- రచయిత, రేచల్ న్యూవెర్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
వైరస్‌లు.. కేవలం మానవాళి వినాశనానికే ఇవి ఉన్నట్టు కనిపిస్తాయి. గడిచిన వెయ్యేళ్ల కాలంలో ఈ వైరస్‌లు ఎన్నో సార్లు ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపించాయి. 1918లో తలెత్తిన మశూచి కారణంగా సుమారు 20 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రపంచాన్ని పీడిస్తున్న కోవిడ్-19 కూడా ప్రాణాంతక వైరస్‌ల దాడుల్లో ఒకటి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతులో మంత్రదండం ఉండి.. దాంతో మొత్తం వైరస్‌లన్నింటినీ మాయం చేయగల్గితే ఎలా ఉంటుంది? ఈ మాట చెప్పగానే చాలా మంది ఇప్పటికిప్పుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకోవచ్చు. కానీ ఆ ఆలోచన ముమ్మాటికి ప్రాణాంతకం అని చెప్పవచ్చు.
అది ఏ వైరస్ అయినా కావచ్చు.. ఎప్పుడైనా కావచ్చు. “అన్ని వైరస్‌లు ఒక్కసారిగా అంతమైతే బహుశా ఒక రోజు, లేదా రోజున్నర అద్భుతంగా ఉండవచ్చు. ఆ తర్వాత మనలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. అదీ అసలు విషయం” అని వ్యాఖ్యానించారు విస్కాన్సిన్-మాడిసన్ విశ్వ విద్యాలయంలో ఎపిడమాలజిస్ట్ టోనీ గోల్డ్ బెర్గ్.
మెజార్టీ వైరస్‌లు మానవులకు వ్యాధికారకాలు కావు. అంతే కాదు చాలా వరకు పర్యావరణాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. “మనం సమతుల్యమైన.. కచ్చితంగా సమతుల్యమైన జీవన విధానంలో నివసిస్తున్నాం. ఆ విధానంలో వైరస్‌లు కూడా ఒక భాగమే” అని మెక్సికోలోని నేషనల్ అటానమస్ యూనివర్శిటికీ చెందిన వైరాలజిస్ట్ సుసనా లోపెజ్ ఛార్టీన్ తెలిపారు.
ఈ భూమ్మీద వైరస్‌లు ఎంత కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. కారణం.. మనం మానవులకు హాని చేసే వైరస్‌లపై మాత్రమే దృష్టి పెడుతూ ఉంటాం. వైరాలజిస్టులంతా కేవలం వ్యాధికారక వైరస్‌లపై మాత్రమే పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే కేవలం ప్రాణాంతక వైరస్‌లపై మాత్రమే కాకుండా ఈ భూమిని కాపాడే వైరస్‌లపై పరిశోధకులు దృష్టి పెట్టడం ఇప్పుడిప్పుడే మొదలయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
“వైరస్ ప్రపంచాన్ని సమ దృష్టితో చూసేందుకు శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే ప్రయత్నించడం మొదలుపెట్టారు. వాళ్లు మంచి వైరస్‌లు కూడా ఉన్నాయని చెబుతూ వాటిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు” అని గోల్డ్ బెర్గ్ తెలిపారు.
వైరస్‌లు లేకపోతే భూమ్మీద జీవం ఉనికి అన్నదే ఉండదన్న విషయం శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ భూమ్మీద ఉన్న ప్రతి వైరస్‌ను నాశనం చెయ్యడం సాధ్యం కాని పని. అయితే వైరస్‌లు లేకుండా ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించడం ద్వారా, మనం మనుగడ సాగించడంలో వాటి పాత్ర ఎంతన్నది తెలుసుకోవడం మాత్రమే కాదు, వాటి గురించి మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
మొదట్లో శాస్త్రవేత్తలకు కూడా ఎన్ని వైరస్‌లు ఉన్నాయన్న విషయం తెలియదు. అధికారికంగా వేలాది వర్గాలుగా విభజించినప్పటికీ అనధికారికంగా కోట్లాది వైరస్‌లు ఉండవచ్చు. “మనం ఇప్పటి వరకు కనుగొన్న వైరస్‌ల సంఖ్య అంతంత మాత్రమే. ఎందుకంటే జనం ఇప్పటి వరకు వాటి వైపు పెద్దగా చూడలేదు. సైన్స్ ఇన్నాళ్లూ వ్యాధికారక వైరస్‌ల గురించి మాత్రమే పరిశోధనలు చేస్తూ వచ్చింది. ఇది నిజంగా పక్షపాతం అని చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పర్యావరణ వ్యవస్థలో కీలకం
ఫేజెస్ లేదా వైరస్ సోకిన బ్యాక్టీరియాలు చాలా ముఖ్యమైనవి అన్న విషయం మనకు తెలుసు. గ్రీకు పదం ఫాజిన్ నుంచి ఈ పదం పుట్టింది. ఫాజిన్ అంటే కబళించు అని అర్థం. అవి నాశనం చేస్తాయి. “ఇతర బ్యాక్టిరియాలను చంపడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. అవి లేకపోతే మనం తీవ్ర ప్రమాదంలో పడతాం” అని గోల్డ్ బెర్గ్ అభిప్రాయపడ్డారు.
మహా సముద్రాలు సహా ఈ భూమిపై ఉండే ప్రతి ఇతర పర్యావరణ వ్యవస్థలోని బ్యాక్టీరియాల సంఖ్యను “వైరస్‌లు” నియంత్రిస్తూ ఉంటాయి. వైరస్‌లు ఒక్కసారిగా మాయమైపోతే కొన్ని రకాల బ్యాక్టీరియాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఫలితంగా మిగిలిన బ్యాక్టీరియాలు వాటితో పోటీ పడలేక... వృద్ధి చెందడం పూర్తిగా ఆగిపోవచ్చు.
అప్పుడు 90శాతానికి పైగా జీవులు నివాసముండే సముద్రాల్లో పరిస్థితి అత్యంత సమస్యాత్మకమవుతుంది. వైరస్‌లు అందించే శక్తి ద్వారా ఆ అతి సూక్ష్మ జీవులే ఈ భూగ్రహపై సగం కన్నా ఎక్కువ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
మహా సముద్రాల్లో రోజూ 20శాతం అతి సూక్ష్మ జీవుల్ని అలాగే 50శాతం బ్యాక్టీరియాల్ని ఈ వైరస్‌లు చంపేస్తాయి. అతి సూక్ష్మ జీవులను తొలగించడం ద్వారా అధిక స్థాయిలో కిరణజన్య సంయోగక్రియను చేపట్టేందుకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లవకాలకు తగినంత పోషకాలు ఉన్నట్లు వైరస్‌లు నిర్ధరిస్తాయి. ఫలితంగా భూమ్మీద అవి మరింత కాలం జీవించగల్గుతాయి. “మనకు చావన్నదే లేకపోతే, అప్పుడు బతుకే ఉండదు. ఎందుకంటే జీవితం అన్నది పూర్తిగా పునరుత్పాదక పదార్థాలపైనే ఆధారపడి ఉంది. పునరుత్పాదక వ్యవస్థలో వైరస్‌ల పాత్ర అత్యంత కీలకం” అని బ్రిటిష్ కొలంబియా విశ్వ విద్యాలయానికి చెందిన ఎన్విరాన్మెంటల్ వైరాలజిస్ట్ కర్టిస్ సటల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
వివిధ జాతుల జనాభా నియంత్రణలో వైరస్‌లు కీలక పాత్ర పోషిస్తాయని కీటకాలు, తెగుళ్లపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక నిర్ణీత జాతి జనాభా పరిమితికి మించి పెరిగినప్పుడు వైరస్ వచ్చి వాటిని నాశనం చేస్తుంది. పర్యావరణ వ్యవస్థలో ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. దీన్ని కిల్ ద విన్నర్ అని పిలుస్తారు. ఇది ఇతర జాతుల్లో కూడా ఉంటుంది. మనం ఎదుర్కొనే మహమ్మారుల ద్వారా కూడా ఆ విషయం రుజువవుతోంది. జనాభా యథేచ్ఛగా పెరిగిపోతున్నప్పుడు వైరస్‌లు వరుసగా విజృంభించి ఒక్కసారిగా జనాభా సంఖ్యను తగ్గిస్తాయి. ఈ భూమ్మీద ఇతర జీవులు కూడా మనుగడ సాగించేందుకు తగిన స్థలాన్ని సృష్టిస్తాయి” అని పెన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వైరస్ ఎకాలజిస్ట్ మార్లిన్ రూస్నిక్ అభిప్రాయపడ్డారు.
వైరస్‌లు ఒక్కసారిగా మాయమైతే వాటితో పోటీ పడే జాతులు ఇతర జాతులకు హాని చేసే అవకాశం ఉంది. “ఫలితంగా ఈ భూమ్మీద ఉన్న జీవ వైవిధ్యాన్ని అత్యంత వేగంగా కోల్పోతాం. కొన్ని జీవులు మాత్రమే అన్నింటిపైనా ఆధిపత్యం చెలాయిస్తాయి” అని సటల్ అన్నారు.
మానవులతో సహా ఇతర జంతువుల శరీరాల్లో ఆరోగ్యకరమైన మైక్రోబియమ్స్‌ను కాపాడటంలో వైరస్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. “ ఇవి పూర్తిగా అర్థం కావు. కానీ వైరస్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అవి మన పర్యావరణ వ్యవస్థలో అంటే అది మానవ శరీర నిర్మాణ వ్యవస్థలో కావచ్చు, లేదా పర్యావరణం విషయంలో కావచ్చు కీలక భూమిక పోషిస్తాయనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి” అని సటల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వాదనకు మరింత బలాన్నిచ్చే నిర్ధిష్ట ఆధారాలను రాస్నిక్ ఆమె సహచరులు కనుగొన్నారు. ఒక పరిశోధనలో భాగంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని ఓ ప్రత్యేకమైన గడ్డిపై ఆవరించి ఉన్న ఫంగస్‌ను వారు పరిశీలించారు. ఆ ఫంగస్‌కు ఓ వైరస్ వ్యాపించడం వల్ల ఎప్పటికప్పుడు మారే భూ ఉష్ణోగ్రతల్ని తట్టుకునే శక్తి ఆ గడ్డికి వచ్చిందన్న విషయాన్ని వారు గుర్తించారు. “వైరస్, శిలీంద్రాలు, మొక్క.. ఆ మూడు ఒకే చోట కలిసి ఉంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఆ మొక్క జీవించగల్గుతుంది. ఒక్క ఫంగస్‌కు ఆ శక్తి లేదు” అని రాస్నిక్ చెప్పారు.
మొక్కలు, శిలీంద్రాలు సహజంగానే వైరస్‌ను ఒక తరం నుంచి మరో తరానికి వ్యాపింపజేస్తాయని రాస్నిక్ ఆమె సహచరులు కనుగొన్నారు. వైరస్‌లు తమకు ఆతిథ్యమిచ్చే వాటికి ఎంతో కొంత సాయం చేస్తాయని వారు భావిస్తున్నారు. “లేకపోతే మొక్కలు వాటినే ఎందుకు అంటిపెట్టుకొని ఉంటాయి?” అని రాస్నిక్ అన్నారు. ఉపయోగకరమైన అన్ని వైరస్‌లు మాయమైపోతే వాటికి ఆతిథ్యమిచ్చే మొక్కలు ఇతర జీవులు క్రమంగా నీరసించిపోతాయి. కొన్ని సార్లు చచ్చిపోతాయి కూడా.

ఫొటో సోర్స్, Getty Images
మానవ మనుగడకు రక్షణ
అపాయం కల్గించిన కొన్ని వైరస్‌లు సోకడం ద్వారా మానవుల్లో వ్యాధికారక వైరస్‌లు అంటకుండా ఉండటంలో సాయం చేస్తాయి.
జీబీ వైరస్ సి(హెపటైటిస్ జీ వైరస్) సహజంగా మానవ రక్తంలో పుట్టే వైరస్. నిలి వైరస్, డెంగ్యూ ఫీవర్‌కు కారణమైన వైరస్ జాతికి చెందినదే అయినప్పటికీ ఇది మాత్రం వ్యాధి కారకం కాదు. ఈ వైరస్ కల్గిన హెచ్ఐవీ రోగుల జీవిత కాలం పెరుగుతుంది. ఎబోలా వైరస్ ఉన్న వారికి “జీబీ వైరస్ సీ” సోకితే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా తక్కువ అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అలాగే “హెర్ప్స్” ఎలుకల్లో ప్లేగు, లిస్టీరియా(విషాహారం వల్ల కల్గే ఇబ్బంది) సహా కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్స్ సోకకుండా చేయగల్గుతుంది. హెర్పస్ వైరస్ సోకిన వారిలో ప్లేగు, లిస్టిరియాల విషయంలో ఎలుకలపై చేసిన ప్రయోగం మానవులపై చెయ్యడం అనైతికమైనప్పటికీ ఎలుకల విషయంలో కనుగొన్న అంశాలు మానవులకు కూడా వర్తిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
కొన్ని నిర్ధిష్టమైన వ్యాధులకు చికిత్స అందించే విషయంలో వైరస్‌లు నమ్మదగ్గ ఏజెంట్లుగా పని చేస్తాయి. 1920ల నాటికే సోవియట్ యూనియన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో వైరస్ థెరపీ అన్నది చెప్పుకోదగ్గ పరిశోధనాంశం.
“చాలా మందిలో యాంటీ బయాటిక్స్ విఫలమైనప్పుడు ఈ వైరస్‌ల కారణంగానే బతికి బయటపడ్డారు” అని సటల్ చెప్పారు.
“ఒంకాలటిక్” లేదా “వన్స్” ఎంపిక చేసిన కాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ చికిత్స విషయంలో తక్కువ హాని చేసి ఎక్కువ సమర్థవంతంగా పని చేసే “వన్స్” కోసం అన్వేషణ ఎక్కువయ్యింది.
“తరువాత తరానికి చెందిన చికిత్సావిధానానికి అవసరమయ్యే పరిశోధనల్లో, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో మమ్మల్ని ముందుండి నడిపించేందుకు మాకు వైరస్‌ల అవసరం ఎంతైనా ఉంది” అని గోల్డ్ బెర్గ్ చెప్పుకొచ్చారు.
మానవ జన్యురాశిలో సుమారు 8 శాతం ఈ తరహా వైరస్‌లు ఉంటాయి. అలాగే క్షీరదాల జన్యు రాశిలో సాధారణంగా వైరస్‌ల నుంచి పుట్టిన జన్యువుల అవశేషాలు సుమారు లక్ష వరకు ఉంటాయి. వైరల్ కోడ్ ఎప్పటికప్పుడు డీఎన్ఏలోని చలనం లేని భాగాలుగా గోచరిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సార్లు మాత్రం అవి కొత్తగా, ఉపయోగకరంగా, ఇంకా చెప్పాలంటే తప్పనిసరి విధుల్ని నిర్వర్తిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
మనిషి జీవితాన్ని నిలబెట్టడంలో సాయం చేసే వైరస్‌లను శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే కనుగొనడం ప్రారంభించారు. మున్ముందు మనం వైరస్‌ల గురించి వీలైనంత ఎక్కువగా నేర్చుకోవడం వల్ల కేవలం వ్యాధికారక వైరస్‌లను గుర్తించడం మాత్రమే కాదు, కొన్ని నిర్దిష్ట వైరస్‌ల ద్వారా మున్ముందు తలెత్తే మహమ్మారుల నుంచి తగిన రక్షణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు.
అన్నింటి కన్నా మించి వైరస్‌లలో ఉన్న వైవిద్యం గురించి ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా మనం నివసిస్తున్న ఈ భూమి గురించి, ఇక్కడ పర్యావరణ వ్యవస్థ గురించి, అలాగే వివిధ రకాల జీవుల గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. సటల్ చెప్పినట్టు “మనం కాస్త మన సమయాన్ని, కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకా ఏమి వైరస్‌లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలి. అది కూడా కేవలం మన మంచి కోసమే.”

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి.. ఈ మందు ఎలా పనిచేస్తుంది.. దీని ధర ఎంత
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్ కాలర్ ట్యూన్: ఫోన్లో నిత్యం జాగ్రత్తలు చెప్పే స్వరం ఎవరిదో తెలుసా?
- డిప్రెషన్‌ను గుర్తించడం ఎలా? దీని లక్షణాలు ఏంటి? దీన్నుంచి ఎలా బయటపడాలి?
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- కరోనా వైరస్ సోకిన తల్లులు బిడ్డకు పాలివ్వొచ్చా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
- హైడ్రాక్సీక్లోరోక్విన్: ‘కరోనావైరస్కు మలేరియా మందును వాడొద్దు’ అమెరికా ఔషధ సంస్థ ప్రకటన - భేషుగ్గా వాడవచ్చునన్న ట్రంప్
- కరోనావైరస్: 'మతం భవిష్యత్తు' ఎలా ఉంటుంది, ఆచారాలు పద్ధతులు ఎలా మారతాయి
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








