కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి? ఈ ఆరు నెలల పరిశోధనల్లో ఏం కనుగొన్నారు?

- రచయిత, క్లారీ ప్రెస్ & బజీయాంగ్ జంగ్
- హోదా, బీబీసీ న్యూస్
ఒక మహమ్మారి పుట్టుకొచ్చినపుడు దాని మూలాలను శోధిస్తూ వెదికి పట్టుకోవటమనేది ఏదో సాధారణ డిటెక్టివ్ చేయగల పని కాదు.
ఆధారాలు చెరిగిపోయే లోగా నేర స్థలానికి చేరుకుని, బాధితులను ప్రశ్నించి సమాచారం సేకరించి.. అప్పుడు హంతక మహమ్మారి కోసం వేట మొదలుపెడతారు. అది మళ్లీ దాడిచేయకుండా నివారించటానికి.
కానీ.. అంతర్జాతీయంగా అసామాన్యమైన కృషి జరుగుతున్నా.. కరోనావైరస్ విజృంభిస్తూనే ఉంది. ప్రతి రోజూ వేలాది మందిని కబళిస్తూనే ఉంది.
ఈ ఆరు నెలల కాలంలో కరోనా మహమ్మారిని వేటాడే క్రమంలో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ఏం కనుగొన్నారు?
తొలి హెచ్చరిక...
ఏదైనా వైరస్ మన ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపగలదు, ఎంత వేగంగా విస్తరించగలదు అనేది అంచనా వేయాలంటే ఆ వైరస్ మూలాలను అర్థం చేసుకోవటం కీలకం. కానీ కరోనావైరస్ ఆది నుంచీ ఎవరికీ అంతుచిక్కటం లేదు.
కొత్త ఏడాది ఆరంభమవుతుండగా.. వూహాన్ సెంట్రల్ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగంలో క్వారంటీన్‌లో ఉంచిన ఏడుగురు రోగులను అధ్యయనం చేస్తున్నారు డాక్టర్ లీ వెన్‌లియాంగ్. ఆ ఏడుగురూ న్యుమోనియాతో బాధపడుతున్నారు.
ఆయన డిసెంబర్ 30న వియ్ చాట్ గ్రూప్‌లో తన సహచరులకు పంపిన మెసేజ్‌లో.. సార్స్ రెండో వెల్లువ కనిపిస్తున్నట్లుగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
2003లో చైనాలో పుట్టుకొచ్చిన మరో తరహా కరోనావైరస్... సార్స్ 26 దేశాలకు వ్యాపించి 8,000 మందికి పైగా సోకింది. కానీ డాక్టర్ లీ గుర్తించిన ఈ వైరస్ సార్స్ రెండో వెల్లువ కాదు. కోవిడ్-19 మొదటి వెల్లువ.
ఈ వైరస్ మహమ్మారిలా వ్యాపించవచ్చునని తన సహోద్యోగులను హెచ్చరించిన మూడు రోజుల తర్వాత డాక్టర్ లీని, మరో ఎనిమిది మందిని ‘వదంతులు వ్యాపిస్తున్నార’నే ఆరోపణలతో పోలీసులు నిర్బంధించారు.
నిర్బంధం నుంచి విడుదలై మళ్లీ విధుల్లోకి వచ్చిన కొన్ని రోజులకే 34 ఏళ్ల డాక్టర్ లీకి కరోనావైరస్ సోకింది. ఆయన ఫిబ్రవరి 7న చనిపోయారు. ఆయనకు ఒక కుమారుడు, గర్భవతి అయిన భార్య ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేర స్థలం
2019 డిసెంబర్ చివర్లో.. డాక్టర్ లీతో పాటు మరింత మంది డాక్టర్లు, నర్సులు ఈ వైరస్ విజృంభించవచ్చునని హెచ్చరిస్తున్న తరుణంలో.. తమ పేషెంట్లలో ఎక్కువ మంది హూనాన్ సీఫుడ్ మార్కెట్‌లో పనిచేస్తున్నారనే సంబంధాన్ని తొలుత గుర్తించింది కూడా వైద్య సిబ్బందే.
బతికున్న కోళ్లు మొదలుకుని చేపలు, పాములు, వన్యప్రాణులు మొదలైనవన్నీ విక్రయించే మార్కెట్ అది. అంతుచిక్కని వైరస్‌తో మరిన్ని కేసులు రావటంతో డిసెంబర్ 31న వూహాన్ హెల్త్ కమిషన్ తమ మొదటి అధికారిక నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ మరుసటి రోజు హూనాన్ మార్కెట్‌ను క్వారంటీన్ చేశారు.
ఆ మార్కెట్‌లో వైరస్ భారీగా విస్తరించిందనే విషయంలో ఇప్పుడు శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉంది. కానీ.. ఆ వైరస్ మొదట బయటపడింది అక్కడేనా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఆ మార్కెట్‌లో సజీవ జంతువులు, మనుషుల నుంచి సేకరించిన నమూనాలు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలాయి.
కానీ.. ఈ మార్కెట్‌లో వైరస్ విస్తరించటానికన్నా నాలుగు వారాల ముందే ఈ కరోనావైరస్ సోకిన కేసు నమోదైనట్లు గుర్తించామని వూహాన్ వైద్య పరిశోధకులు చెప్తున్నారు. సదరు వ్యక్తికి 2019 డిసెంబర్ 1వ తేదీ నాటికే ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. కానీ అతడికి హూనాన్ మర్కెట్‌తో ఎటువంటి సంబంధం లేదు.
జనవరి 11వ తేదీన కోవిడ్-19 కారణంగా తొలి మరణం నమోదయ్యేటప్పటికే వైరస్ చైనా సరిహద్దులు దాటింది. జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్‌లకు విస్తరించింది.
అప్పుడు.. ఈ హంతక వైరస్ కోసం వేట మొదలైంది. కానీ మన ప్రపంచం వైద్యం, సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత అభివృద్ధి చెందినా కూడా ఈ వైరస్ కన్నా ఒక అడుగు వెనుకే ఉన్నాం.
కోవిడ్-19 కేవలం ఆరు నెలల్లో 188 దేశాలకు విస్తరించి 66 లక్షల మందికి పైగా ప్రజలకు సోకింది.

ఫొటో సోర్స్, Getty Images
హంతక వైరస్ వివరాలు
‘అసలు ఏమిటిది?’ అనేది మా మొట్టమొదటి ప్రశ్న అంటారు ఇమ్యునాలజీ ప్రొఫెసర్ క్రిస్టెన్ ఆండర్సన్.
వైరస్‌లు జంతువుల నుంచి మనుషులకు ఎలా జంప్ చేస్తాయి, భారీ స్థాయిలో ఎలా విజృంభిస్తాయి అనే దానిమీద వీరు పరిశోధన చేస్తారు.
జనవరిలో వూహాన్‌లో తొలి కేసులు ఆస్పత్రుల్లో చేరిన కొన్ని గంటలకే వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో.. ఆ తొలి కేసుల్లోని మిస్టరీ వైరస్‌ను విశ్లేషించటం మొదలుపెట్టారు. దాని పూర్తి జన్యుపటాన్ని క్రోడీకరించాలన్నది వారి ప్రయత్నం.
కానీ.. ఒక వైరస్ జన్యుపటాన్ని విశ్లేషింటచటానికి సాధారణంగా నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. అయితే వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అసాధారణ వేగంతో జనవరి పదో తేదీ కల్లా కోవిడ్-19 తొలి జన్యు క్రమాన్ని ప్రచురించింది. పజిల్‌లో అత్యంత కీలకమైన అంశం ఇదే.
ఇది కరోనావైరస్ రకమని, దాదాపు 80 శాతం సార్స్ వైరస్‌తో పోలి ఉందని మాకు అర్థమైంది అని ప్రొఫెసర్ ఆండర్సన్ చెప్పారు.
ఈ వైరస్ సోకినట్లు గుర్తించటం ఎలా అనేది రెండో ప్రశ్న. దీనికి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను తయారు చేయటం ఎలా అనేది మూడో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకూ వైరస్ జన్యుపటం ద్వారా సమాధానాలు లభించగలవు.
ఈ వైరస్ గబ్బిలం నుంచి పుట్టుకొచ్చిందనటానికి చాలా ఆధారాలున్నాయని ప్రొఫెసర్ ఆండర్సన్ చెప్తున్నారు. ఇది పూర్తిగా సహజ వైరసే అని కూడా ఆయన అంటారు. అయితే.. ఇది మనుషుల్లోకి ఎలా వచ్చిందనేది ఇంకా తెలియటం లేదన్నారు.
కోవిడ్-19 తొలి జన్యు క్రమాన్ని ప్రపంచానికి తెలియజేసిన రెండు రోజుల్లో.. చైనాలోని ప్రొఫెసర్ ఝాంగ్ లేబరేటరీని స్థానిక అధికారులు మూసివేశారు. వారి పరిశోధన లైసెన్సును రద్దు చేశారు. ఇందుకు అధికారికంగా ఎటువంటి కారణమూ చెప్పలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రాక్, ట్రేస్, ఐసొలేట్
మహమ్మారి పట్టు బిగించటంతో.. వైరస్ మూలాలను కనుక్కునే ప్రయత్నాలు.. దానిని నియంత్రించటం మీదకు దృష్టి మళ్లాయి.
వైరస్ ఎలా వ్యాప్తిస్తోందో తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు రెండు మార్గాలను అనుసరించారు. క్షేత్రస్థాయిలో ‘కాంటాక్ట్ ట్రేసర్లు’ పనిచేస్తూ.. వైరస్ సోకిందని భావించిన వారిని వెదికిపట్టుకుని ఐసొలేట్ చేయటం మొదలుపెట్టారు. ఇంకోవైపు ఈ వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవటం కోసం దాని జన్యుపటాన్ని ఛేదించటంలో నిపుణులు తలమునకలయ్యారు.
దక్షిణ కొరియాలో ఈ సుశిక్షిత కాంటాక్ట్ ట్రేసర్ల సహాయంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో సఫలమయ్యారు.
మొదట దేశంలో చాలా వరకూ వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగామని భావించారు. కానీ ఫిబ్రవరి చివర్లో ఒకే ఒక్క నగరం నుంచి కొద్ది రోజుల్లోనే వేలాదిగా కేసులు వ్యాపించాయి. డేగు నగరంలో ఈ మహమ్మారి వ్యాపించటానికి ఒకే ఒక్క సూపర్‌స్ప్రెడర్ – పేషెంట్ 31 – కారణం అని గుర్తించారు.
ఈ పేషెంట్ 31 కరోనావైరస్ పాజిటివ్ అని ఫిబ్రవరి 17న తేలింది. ఆమె పది రోజుల్లో 1,000 మంది కన్నా ఎక్కువ మందిని కలిసినట్లు ట్రేసర్లు గుర్తించారు. వారందరినీ వెదికిపట్టుకుని ఐసొలేషన్‌లో ఉండేలా చేయటం ద్వారా వైరస్ మరింత విజృంభించకుండా అదుపుచేయగలిగారు.
ఈ ట్రేసింగ్ కోసం అవసరమైతే వారి క్రెడిట్ కార్డు లావాదేవీలు, ఫోన్ జీపీఎస్ హిస్టరీ వంటి వాటిని కూడా వాడుకున్నారు.
నిజానికి పేషెంట్ 31 షెంగోజీ చర్చి సభ్యత్వం గురించి వెల్లడించలేదు. కాంటాక్ట్ ట్రేసర్లే ఈ విషయం కనిపెట్టి.. ఆ చర్చి సభ్యుల్లో ఆమెను కాంటాక్ట్ అయిన వారిని కనిపెట్టి ఐసొలేషన్‌కు పంపించారు.
ఇలా దక్షిణ కొరియా వంటి పలు దేశాలు వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత మేరకు అడ్డుకోగలుగుతున్నా..
ప్రపంచమంతటా వైరస్ వ్యాపిస్తూనే ఉంది.

ఆధారాలు లభ్యం...
అంతలో జనవరిలో వూహాన్ నగరంలో ప్రొఫెసర్ యాంగ్ ఝెన్ జాంగ్ శాస్త్రవేత్తలు వైరస్ జన్యుపటాన్ని పూర్తిగా ఆవిష్కరించగలిగారు. అది వృద్ధి చెందుతున్న విధానాన్ని కనుగొన్నారు. అప్పటి నుంచీ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వేలాది నమూనాల నుంచి వైరస్ జన్యుపటాలను విశ్లేషిస్తూ ఫలితాలను జీఐఎస్ఏఐడీ సమాచార కేంద్రంలో ప్రచురిస్తూ వస్తున్నారు.
ఇలా వేలాదిగా జన్యుపటాలను ఆవిష్కరించటం ద్వారా.. వైరస్‌లో సంభవిస్తున్న జన్యుపరివర్తనల ఆచూకీ తెలుసుకోగలుగుతున్నారు. దానివల్ల వైరస్ ఎలా వ్యాపిస్తోందో గుర్తించగలుగుతున్నారు. ఉదాహరణకు.. న్యూయార్క్‌లో ఒక రోగి నుంచి సేకరించిన వైరస్‌లో జన్యుపరివర్తనలు, వూహాన్‌లో కొందరు రోగుల వైరస్ నమూనాల్లో జన్యుపరివర్తనలు ఒకే రకంగా ఉన్నట్లయితే.. ఆ రోగులకు వైరస్ ఒకేసారి వ్యాపించినట్లు భావించవచ్చు. ఘటనా క్రమాన్ని విశ్లేషించటం ద్వారా.. ఆ వైరస్ వూహాన్ నుంచి న్యూయార్క్‌కు ఎప్పుడు వ్యాపించిందనేదీ గుర్తించవచ్చు.
ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 37,000 కు పైగా నమూనాల జన్యుపటాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల ఈ వైరస్ సోకే స్వభావం పూర్తిగా బహిర్గతమైనట్లు భావించవచ్చు.
‘‘మనుషులతో మాట్లాడినప్పుడు వారికి ఆ వైరస్ ఎలా సోకిందో తెలియకపోవచ్చు. కానీ ఈ జీనోమ్ డాటా ద్వారా ఆ విషయాన్ని చాలా వరకూ తెలుసుకోవచ్చు’’ అని అంటురోగాల శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్మా హాడ్‌క్రాఫ్ట్ పేర్కొన్నారు.

అంతుచిక్కని లింక్‌లు
కరోనావైరస్ జీనోమ్ డాటాను విశ్లేషిస్తున్న నెక్స్ట్‌స్ట్రెయిన్ బృందానికి డాక్టర్ ఎమ్మా సారథ్యం వహిస్తున్నారు. ఆమె బృందం జనవరిలో అనేక నమూనాల్లో ఒకే తరహా జీనోమ్ ఉన్నట్లు గుర్తించారు. కానీ అవి ఎనిమిది విభిన్న దేశాలు - ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జర్మనీ, బ్రిటన్, అమెరికా, చైనా, నెదర్లాండ్స్ – నుంచి సేకరించిన నమూనాలు.
మొదట వీటన్నిటికీ మూలం ఏమిటనేది గుర్తించటం కష్టంగా మారింది. కానీ ఆస్ట్రేలియా నమూనాలకు సంబంధించిన వారు ఇరాన్‌కు వెళ్లివచ్చినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఇరాన్ నుంచి సేకరించిన వైరస్ నమూనాలేమీ లేవు. అయినప్పటికీ.. ఈ కేసులన్నీ ఇరాన్‌లో సోకినవో, ఇరాన్‌కు వెళ్లివచ్చిన వారి వల్ల వ్యాపించినవో అయి ఉంటాయని తాము చాలా ఖచ్చితంగా చెప్పగలమని ఎమ్మా పేర్కొన్నారు.
అలా వైరస్ నమూనాలను శోధిస్తూ వెళితే.. ఈ వైరస్‌లకు మూలం ఇరాన్‌లో ఉందని ఇరాన్‌లోనూ ఒకే మూలం నుంచి అది వ్యాపించిందని.. ఆ మూలం క్వామ్ నగరంలో మొదలైందని కనిపెట్టారు. ఆ నగరం నుంచి రెండు వారాల్లో ఇరాన్ మొత్తం వైరస్ వ్యాపించింది.
ఈ విధంగా ఒకవైపు కాంటాక్ట్ ట్రేసింగ్, మరోవైపు జీనోమ్ ట్రాకింగ్‌తో వైరస్ ఎంత వేగంగా, ఎంత గోప్యంగా ప్రపంచమంతా విస్తరిస్తోందనేది శాస్త్రవేత్తలు గుర్తించారు. అయినప్పటికీ.. గత ఆరు నెలలుగా నిపుణులందరూ వైరస్ కన్నా ఒక అడుగు వెనుకబడే ఉన్నారు. వైరస్ తర్వాత ఎక్కడ, ఎప్పుడు దెబ్బ కొడుతుందనేది అంచనా వేయలేకపోతున్నరు.
కోవిడ్-19ను నియంత్రించటంలో ఒక పెద్ద సమస్య అపరిష్కృతంగానే ఉంది. అది: జనంలో వైరస్ గందరగోళంగా వ్యాపించే విశిష్ట లక్షణం: ఇది ఒక్కోసారి ప్రాణాంతక మహమ్మారిగా మారి విలయం సృష్టిస్తుంది. అంతకన్న ఎక్కువగా అసలు లక్షణాలేవీ కనిపించకుండా చాపకింద నీరులా వ్యాపిస్తుంటుంది.
లక్షణాలేవీ లేని వారిలో కోవిడ్-19 వ్యాప్తి గురించి శోధించటం చాలా కష్టమైన పని. అయితే.. మిస్టరీకి సంబంధించి ఉత్తర ఇటలీలోని ఒక చిన్న గ్రామంలో చాలా ముఖ్యమైన క్లూ లభించింది.

ఫొటో సోర్స్, Nextstrain

ఫొటో సోర్స్, Nextstrain

ఫొటో సోర్స్, Nextstrain
కనిపించని శత్రువు
ఇటలీలో మొట్టమొదటి కోవిడ్ మరణం రద్దీగా ఉండే నగరాల్లో కాదు.. మారుమూల ఉన్న వో అనే ఒక కుగ్రామంలో నమోదైంది. వెనిస్ నుంచి గంట ప్రయాణం దూరంలో ఉండే ఆ గ్రామంలో సుమారు 3,000 మంది జనాభా ఉన్నారు.
ఫిబ్రవరి 21న దేశంలో తొలి కోవిడ్ మరణం గురించి ప్రకటించిన వెంటనే.. ఆ గ్రామాన్ని పూర్తిగా దిగ్బందించారు. గ్రామ ప్రజల్లో లక్షణాలు కనిపించినా, లేకున్నా అందరి నుంచీ నమూనాలు సేకరించారు. వాటిని పరిశీలించినపుడు చాలా మందికి వైరస్ సోకిందని.. ఎక్కువగా లక్షణాలేవీ కనిపించకుండానే వైరస్ గుప్తంగా వ్యాపిస్తోందని పరిశోధకులు గుర్తించారు.
ఈ పరిశోధన చాలా కీలక పాత్ర పోషించింది. ‘‘ఈ వైరస్‌ను మోసుకెళుతున్న వారిలో 40 శాతం మందికి పైగా జనానికి అసలు తమకు వైరస్ సోకిందన్న విషయం ఏమాత్రం తెలియదు. తమ వల్ల ఇతరులకు అది సోకుతోందనే ఆలోచన అసలే ఉండదు. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో ఇది అతి పెద్ద సమస్య’’ అని ఆ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ లావెజో పేర్కొన్నారు.
‘‘ఎక్కువ లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉంటారు. కానీ అతి తక్కువ లక్షణాలు ఉన్న వారు సాధారణంగా సంచరిస్తూ ఉంటారు. మనుషులను కలుస్తూ ఉంటారు. తాము ఇతరులకు వైరస్‌ను వ్యాపింపచేస్తుండవచ్చునన్న విషయం కూడా వారికి తెలియదు’’ అని ఆయన వివరించారు.
ఇలా లక్షణాలు కనిపించని కేసుల సంఖ్య 70 శాతం వరకూ ఉండవచ్చునని ఇతర అధ్యయనాల అంచనాలు చెప్తున్నాయి. అయితే.. ఇటలీ గ్రామంలో అధ్యయనంలో వెల్లడైన మరో ఆశ్చర్యకరమైన విషయం.. మొత్తం 3,000 మంది గ్రామస్తుల్లో 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో ఎవరికీ ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధరణ కాలేదు. ‘‘పిల్లలకు ఈ వైరస్ సోకదని మేం అనటం లేదు. అలా సోకినట్లు వేరే అధ్యయనాల్లో కనిపించింది. అయితే ఈ గ్రామంలో కనీసం ఓ డజను మంది పిల్లలు వైరస్ సోకిన వారితో కలిసి నివసించినప్పటికీ వారికి సోకపోవటం ఆశ్చర్యం కలిగించింది’’ అని ప్రొఫెసర్ లావెజో చెప్పారు.
కోవిడ్-19 వ్యాప్తి అప్రతిహతంగా సాగటానికి ప్రధాన కారణం.. చాలా పెద్ద సంఖ్యలో జనాన్ని వారికి తెలియకుండానే తమ వాహకాలుగా ఈ వైరస్ హైజాక్ చేయగలగటం. కానీ.. కొన్నిసార్లు కేవలం స్వల్పమైన దగ్గు కలిగించటం నుంచి.. మరికొన్నిసార్లు ప్రాణాలను హరించేంతగా శ్వాస ఆడకుండా చేయలిగేంత వరకూ అనేక రకాల లక్షణాలను కలిగించే విశిష్ట సామర్థ్యం ఈ వైరస్‌కు ఎలా వచ్చింది? ప్రొఫెసర్ లావెజో అధ్యయనం ప్రకారం.. పిల్లల మీద ఎందుకు తక్కువ ప్రభావం చూపుతోంది?

ప్రాణాంతక సమ్మేళనం...
మానవ శరీర కణాల ఉపరితలం మీద ఉండే ఏసీఈ-2 అనే నిర్దిష్టమైన రిసెప్టర్లకు అంటుకోవటం ద్వారా మాత్రమే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించగలదని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
2003లో సార్స్ విజృంభించినపుడు ప్రొఫెసర్ మైఖేల్ ఫర్జాన్ లేబరేటరీలో ఈ ఏసీఈ-2 రిసెప్టర్‌ను తొలిసారి గుర్తించారు. సమస్య ఏమిటంటే.. మన శరీరమంతటా ముక్కు లోపల, ఊపిరితిత్తుల్లో, పేగుల్లో, గుండెలో, కిడ్నీల్లో, మెదడులో – అన్ని చోట్లా ఏసీఈ-2 రిసెప్టర్లు ఉంటాయి. కోవిడ్-19 సోకినపుడు అన్ని రకాల లక్షణాలు కనిపించటానికి ఇదే కారణం. ముక్కులో వైరస్ సోకినపుడు వాసన కోల్పోవటం జరుగుతుంది. ఊపిరితిత్తులకు సోకినపుడు తీవ్రంగా దగ్గు వస్తుంది.
వ్యాపించటంలోనూ, తీవ్ర వ్యాధి కలిగించటంలోనూ వేగంగా పనిచేయటం ఈ వైరస్ విశిష్టత. పిల్లల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సోకటంలో ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా అనే అంశం మీద ఇంకా స్పష్టత లేదు.
అయితే.. మొత్తం కేసుల్లో చిన్నారుల సంఖ్య కేవలం రెండు శాతమే ఉందని ప్రొఫెసర్ ఫర్జాన్ చెప్పారు. పెద్ద వాళ్లతో పోలిస్తే పిల్లల్లోని దిగువ ఊపిరితిత్తుల్లో ఏసీఈ-2 రిసెప్టర్లు తక్కువగా ఉన్నాయనేందుకు శాస్త్రవేత్తలు ఆధారాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
‘‘అంటే.. పిల్లలు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు. కనీసం పెద్దవాళ్లకు వస్తున్న తీవ్రమైన న్యుమోనియా పిల్లలకు రావటం తక్కువని భావించవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ.. పిల్లల్లో ఎగువ ఊపిరితిత్తుల్లో ఈ రిసెప్టర్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని.. దానివల్ల పిల్లల నుంచి ఈ వైరస్ ఇతరులకు వ్యాపించగలదని వివరించారు. ‘‘వైరస్ తదుపరి వ్యక్తికి సోకటానికి ఈ ఎగువ శ్వాస మార్గమే చాలా ముఖ్యం’’ అన్నారాయన.

వ్యాక్సిన్ కోసం పరుగు పందెం
ఈ వైరస్‌ను నియంత్రించటం, భవిష్యత్తులో మళ్లీ విజృంభించకుండా అరికట్టటానికి ఏకైక మార్గం.. వ్యాక్సిన్ మాత్రమేనని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
కోవిడ్-19ని నివారించే తొలి వ్యాక్సిన్ తయారు చేయటం కోసం ప్రస్తుతం 124 బృందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంస్థలు సెప్టెంబర్ కల్లా వ్యాక్సిన్ రెడీ అవుతుందని.. దానిని ఉత్పత్తి చేసి పంపిణీ చేయటానికి ఆపైన 12 నుంచి 18 నెలలు పడుతుందని చెప్తున్నాయి.
అయితే.. బ్రెజిల్‌లో ఇటువంటి ఒక ప్రయోగానికి సారథ్యం వహిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ జార్జ్ కలీల్ అనుమానంగానే ఉన్నారు. మొదటి వ్యాక్సిన్ తయారు చేయాలనే హడావుడి కన్నా.. సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారీ మీద దృష్టిపెట్టటం ముఖ్యమని ఆయన అంటారు.
‘‘ఇది కారు రేస్ కాదు.. ముందుగా మందు తయారు చేసిన వారు గెలవటానికి.. ఈ పోటీలో అత్యుత్తమ ఔషధం – అంటే 90 శాతం మందికి పనిచేసే వ్యాక్సిన్‌ను తయారు చేసిన వారే గెలుస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండే వృద్ధులు, ఇతరత్రా తీవ్ర ఆరోగ్యసమస్యలు ఉన్న వారికి కూడా సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్‌ను తయారు చేయగలగినపుడు మాత్రమే ఈ మహమ్మారిని నిజంగా అంతమొందించగలమనేది ప్రొఫెసర్ కలీల్ అభిప్రాయం. లేదంటే వైరస్ వ్యాపించటం కొనసాగుతూనే ఉంటుందని అంటారాయన.
భవిష్యత్తులో ఈ వైరస్ మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని కూడా ఆయన భావిస్తారు.
‘‘డబ్బు, రాజకీయం సమస్య. ఇక్కడ సావో పాలోలో ధనికులు తమ అందమైన ఇళ్లలో ఏకాంతంగా గడుపుతున్నారు. కానీ ఓ పేద కుటుంబంలో ఎనిమిది, తొమ్మిది, పది మంది ఒకే గదిలో నివసిస్తుండవచ్చు. వారు ఎలా ఏకాంతంగా ఉండగలరు?’’ అని ఆయన ప్రశ్నిస్తారు.
‘‘ఈ మహమ్మారిని నిజంగా అంతమొందించాలంటే అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి వ్యాక్సిన్ అవసరం. మరో మార్గం లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు.
రిపోర్టర్ – క్లారీ ప్రెస్
అడిషనల్ రిపోర్టింగ్ – బగ్యాంగ్ జంగ్
ఇలస్ట్రేషన్స్ – క్లారీ న్యూలాండ్
గ్రాఫిక్స్ – జో బాథోలెమూ, డానియల్ డన్ఫోర్డ్, డొమినిక్ బైలీ, అలిసన్ త్రోస్డేల్
ఎడిటర్లు – బెన్ అలెన్, జాకీ మార్టెన్స్
కృతజ్ఞతలు – విక్టోరియా లిండ్రియా, కోర్ట్నీ టిమ్స్, ఏంజెలో అటానాసియో, జులియానా గ్రాగ్నానీ, వూంగ్‌బీ లీ

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








