కువైట్‌లో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన

కువైట్‌లో బానిస మార్కెట్
ఫొటో క్యాప్షన్, కువైట్, సౌదీ అరేబియాల్లో వేలాది మంది మహిళలను గృహ కార్మికులుగా అమ్మటం, కొనటం యథేచ్ఛగా సాగుతోంది

కువైట్‌లో రోడ్ల మీద తిరుగుతున్నపుడు.. ఈ మహిళలు కనిపించరు. వాళ్లు మూసిన తలుపుల వెనుకే ఉంటారు. వారి కనీస హక్కులు కూడా హరించుకుపోయాయి. ఉన్న ఇల్లు వదిలి బయటకు రాలేరు. అంతేకాదు.. వీళ్లని ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్లకి అమ్మేస్తుంటారు.

కానీ.. ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుని కొన్ని యాప్‌లలో చూస్తే.. వీళ్ల ఫొటోలు వేలాదిగా కనిపిస్తాయి. వాటిలో వీరిని జాతుల ప్రకారం వర్గీకరించి.. అమ్మకానికి పెడతారు. ఎంతంటారా? ఒక్కొక్కరికి మూడు, నాలుగు వేల డాలర్లు.

గృహ కార్మికులను ఆన్‌లైన్ నల్లబజారులో అమ్మటం, కొనటం యథేచ్ఛగా సాగుతోందని.. ఆ వ్యాపారం విక్రేతలకు చాలా లాభసాటిగా మారిందని బీబీసీ న్యూస్ అరబిక్ రహస్యంగా నిర్వహించిన పరిశోధనలో కనుగొంది.

ఈ వ్యాపారం.. ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ మీద కూడా సాగుతోంది. అందులో.. ఆల్గోరిథమ్‌తో వేగంగా విస్తరించే హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ మహిళల విక్రయాలను ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు మెసేజీల ద్వారా బేరసారాలు జరుపుతున్నారు.

గూగుల్ ప్లే, ఆపిల్ యాప్ స్టోర్‌లు ఆమోదించి, అందించే యాప్‌లతో పాటు.. ఈ-కామర్స్ వేదికల సొంత వెబ్‌సైట్లలో కూడా వీరి విక్రయాల ప్రకటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

''అవి ఆన్‌లైన్ బానిస మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నాయి'' అంటారు ఊర్మిళా భూలా. ఆమె ఆధునిక బానిసత్వ రూపాల మీద ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

''గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్ లేదా ఏ కంపెనీ అయినా ఇటువంటి యాప్స్‌కు స్థానం ఇస్తున్నట్లయితే.. ఆయా సంస్థలను బాధ్యులను చేయాలి'' అని ఆమె ఉద్ఘాటించారు.

ఈ విషయం గురించి ఫేస్‌బుక్‌ను అప్రమత్తం చేసినపుడు.. ఇందుకోసం ఉపయోగించిన ఒక హ్యాష్‌ట్యాగ్‌ను తాము నిషేధించినట్లు ఆ సంస్థ చెప్పింది.

అక్రమ కార్యకలాపాలను నిరోధించటానికి తాము యాప్ డెవలపర్లతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్, యాపిల్ సంస్థలు స్పందించాయి. ఈ అక్రమ విక్రయాలు.. యాప్ డెవలపర్లు, యూజర్లకు అమెరికా టెక్ సంస్థలు నిర్దేశించిన నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించటమే.

అయితే.. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యాపిల్, గూగుల్‌లలో అందుబాటులో ఉన్న ఇతర యాప్‌లలో ఈ విక్రయ ప్రకటనలు ఇంకా కొనసాగుతున్నాయని బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.

ఊర్మిళా భూలా
ఫొటో క్యాప్షన్, ఇది ఆధునిక బానిస మార్కెట్ అని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి ఊర్మిళా భూలా అభివర్ణించారు

బానిస మార్కెట్

కువైట్‌లో ప్రతి 10 ఇళ్లలో తొమ్మిది ఇళ్లలో గృహ కార్మికురాలు ఒకరు ఉంటారు. ప్రపంచంలోని కొన్ని నిరుపేద ప్రాంతాల నుంచి.. తమ ఇళ్లలో కుటుంబాలను పోషించుకోవటానికి అవసరమైన డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో వీరు గల్ఫ్‌కు వస్తారు.

బీబీసీ రహస్య పరిశోధన బృందం.. కువైట్‌కు కొత్తగా వచ్చిన దంపతుల్లాగా నటిస్తూ 57 మంది యాప్ యూజర్లతో మాట్లాడింది. ప్రజాదరణ గల 4సేల్ (4Sale) అనే సరకుల విక్రయ యాప్‌ ద్వారా తమకు తమ ఇంటి పనివారిని విక్రయించటానికి ప్రయత్నించిన డజను మందిని పైగా కలిసింది.

వీళ్లందరూ.. తాము విక్రయిస్తున్న మహిళకు చెందిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ముందే గట్టిగా చెప్తున్నారు. ఆ మహిళలను ఇంటి నుంచి బయటకు పంపించవద్దని, వారికి సెలవు అంటూ ఇవ్వవద్దని, అరుదుగా తప్పితే ఫోన్ అసలు అందించవద్దని అనేక సూచనలు కూడా చేస్తున్నారు.

ఈ 4Sale యాప్‌.. విక్రయానికి ప్రకటనల్లో పెట్టిన మహిళా బానిసలను వారి జాతిని బట్టి, వారి ధరలను బట్టి, ఆఫర్లను బట్టి ఫిల్టర్ చేసి చూసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది.

''ఆఫ్రికన్ వర్కర్.. శుభ్రంగా.. నవ్వుతూ ఉంటుంది'' అని ఒక ప్రకటన చెప్తోంది. మరొక ప్రకటన.. ''ఒక రోజు సెలవు కావాలని అడిగే ధైర్యం చేసే నేపాలీ మహిళ'' అని వర్ణిస్తోంది.

బీబీసీ రహస్య పరిశోధన బృందం ఈ ప్రకటనలు పెట్టిన విక్రేతలతో మాట్లాడేటపుడు.. వారు పదే పదే జాతి వివక్షాపూరిత భాషను ఉపయోగించటం విన్నారు.

''భారతీయులు అత్యంత మురికిగా ఉంటారు'' అని మహిళను విక్రయానికి పెట్టిన విక్రేత ఒకరు అభివర్ణించారు.

ఫాతో
ఫొటో క్యాప్షన్, కువైట్‌లో ఫాతో అనే 16 ఏళ్ల బాలికను బీబీసీ రహస్య పరిశోధన బృందానికి అమ్మజూపిందో మహిళ

మానవ హక్కుల ఉల్లంఘన

ఈ విక్రేతలు సదరు మహిళలకు ''తామే యజమానులం'' అనే తరహాలో వ్యవహరించారు. వీరికి కనీస మానవ హక్కులు కూడా లేకుండా చూడాలని బీబీసీ పరిశోధన బృందానికి ఆ విక్రేతలు చెప్పారు. ''ఒక రోజు కాదు కదా.. కనీసం ఒక నిమిషం కానీ, ఒక్క క్షణం కానీ సెలవు అనేది ఇవ్వవద్దు'' అని బలంగా చెప్పారు.

కువైట్‌లోనే పోలీసు అధికారిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి.. తన దగ్గర పనిచేసే కార్మికురాలిని విక్రయించటానికి యాప్‌లో ప్రకటన పెట్టారు. ''నన్ను నమ్మండి.. ఈమె చాలా మంచిది. నవ్వుతుంటుంది. నవ్వు మొహం. ఆమెను తెల్లవారి ఐదు గంటల వరకూ మెలకువగా ఉంచినా కిమ్మనదు'' అని బీబీసీ బృందంతో చెప్పారు.

గృహ కార్మికులను ఒక వస్తువుగా ఎలా వినియోగించుకుంటారో ఆయన బీబీసీ పరిశోధన బృదానికి వివరించారు.

''కొంతమంది.. ఒక పనిమనిషిని 600 కువైట్ దీనార్లకు (సుమారు రూ. 1.5 లక్షలు) కొని.. 1,000 కువైట్ దీనార్లకు (సుమారు రూ. 2.5 లక్షలు) అమ్ముతుంటారు'' అని ఈ వ్యాపారం ఇంకా ఎలా జరుగుతుందో కూడా చెప్పారు.

ఆ మహిళతో ఎలా వ్యవహరించాలో కూడా ఆయన బీబీసీ బృందానికి చెప్పారు. ''ఆమెకు ఆమె పాస్‌పోర్టును ఇవ్వొద్దు. ఆమె స్పాన్సర్ మీరు. ఆమెకు ఆమె పాస్‌పోర్టును ఎందుకు ఇవ్వాలి?'' అని పేర్కొన్నారు.

మరొక ఉదంతంలో.. బీబీసీ బృందానికి ఓ 16 ఏళ్ల బాలికను విక్రయిస్తామని ఒక మహిళ ముందుకు వచ్చారు. బీబీసీ బృందం ఆమె అసలు పేరు తెలియకుండా ఉండటానికి.. ఫాతో అనే మారు పేరుతో వ్యవహరించింది.

పశ్చిమ ఆఫ్రికాలోని గినీ నుంచి ఫాతోను అక్రమంగా కువైట్‌కు రవాణా చేశారు. ఆమె గురించి బీబీసీ తెలుసుకునేటప్పటికి.. ఇక్కడ ఆరు నెలలుగా ఇంట్లో పనిమనిషిగా పనిచేయించుకుంటున్నారు.

అయితే.. గృహ కార్మికుల వయసు 21 సంవత్సరాలు దాటి ఉండాలని కువైట్ చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి.

ఫాతోను విక్రయానికి పెట్టిన మహిళ.. ఆ బాలికకు తాను అసలు ఖాళీ సమయం కానీ, సెలవులు కానీ ఇవ్వలేదని గొప్పగా చెప్పారు. ఆమె పాస్‌పోర్టును, ఫోనును స్వాధీనం చేసేసుకున్నానని.. ఆమెను ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లనివ్వలేదని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కువైట్‌లో చట్టవ్యతిరేకమే.

కువైట్‌లో బానిస మార్కెట్
ఫొటో క్యాప్షన్, మహిళా కార్మికులను అమ్మకానికి పెట్టిన పలువురిని బీబీసీ కలిసి వారితో సంభాషణలను రికార్డు చేసింది

స్పాన్సర్ అనుమతి

''ఆధునిక బానిస విధానానికి ఇది అచ్చమైన ఉదాహరణ. ఒక చిన్నారిని ఒక ఆస్తిలాగా అమ్మటం, వ్యాపారం చేయటం మనం ఇక్కడ చూస్తున్నాం'' అన్నారు ఊర్మిళా భూలా.

గల్ఫ్‌లోని చాలా దేశాల్లో గృహ కార్మికులను ఏజెన్సీల ద్వారా దేశంలోకి తీసుకువస్తారు. ఆ తర్వాత వారి వివరాలను ప్రభుత్వం దగ్గర అధికారికంగా నమోదు చేస్తారు.

వీరిని పనుల్లో పెట్టుకునే వారు ఆ ఏజెన్సీలకు కొంత ఫీజు చెల్లించి.. సదరు గృహ కార్మికులకు అధికారిక స్పాన్సర్‌గా మారుతారు.

కఫాలా వ్యవస్థ అని పిలిచే విధానం కింద.. ఒక గృహ కార్మికురాలు తన స్పాన్సర్ అనుమతి లేకుండా.. ఉద్యోగం మారటానికి కానీ, మానేయటానికి కానీ, దేశం విడిచి వెళ్లటానికి కానీ వీలు లేదు.

గృహ కార్మికులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కువైట్ 2015లో చాలా విస్తృతమైన చట్టాలు చేసింది. కానీ.. ఈ చట్టాల గురించి అందరికీ తెలియదు.

ఈ మహిళలను పనుల్లో పెట్టుకున్న వారు.. వీరి ద్వారా లాభాలు పొందటం కోసం తమ స్పాన్సర్‌షిప్‌ను విక్రయించటానికి 4Sale, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లు వీలు కల్పిస్తున్నాయి. ఇందులో ఏజెన్సీలకు చోటు ఉండదు. దీంతో ఒక నియంత్రణ లేని నల్లబజారు తయారయింది. ఫలితంగా ఈ మహిళలు మరింత అధికంగా దోపిడీకి, అకృత్యాలకు గురయ్యే ప్రమాదంలో పడుతున్నారు.

ఈ ఆన్‌లైన్ బానిస మార్కెట్ సాగుతున్నది ఒక్క కువైట్‌లో మాత్రమే కాదు.

సౌదీ అరేబియాలో.. మరొక ప్రముఖ యాప్ 'హరాజ్'లో వందలాది మంది మహిళలను విక్రయిస్తున్నట్లు బీబీసీ పరిశోధన బృందం గుర్తించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వందలాది విక్రయ ప్రకటనలు ఉన్నాయి.

ఫాతో
ఫొటో క్యాప్షన్, కువైట్ చెర వీడిన బాలిక ఫాతో ఇప్పుడు తన దేశం వెళ్లి మళ్లీ బడికి వెళ్తోంది

'నిజంగా నరకం'

కువైట్‌లో విక్రయానికి పెట్టిన బాలిక ఫాతో కుటుంబాన్ని కలిసే ప్రయత్నంలో భాగంగా బీబీసీ బృందం గినీ వెళ్లింది.

ఇక్కడి నుంచి ప్రతి ఏటా వందలాది మంది మహిళలను గృహ కార్మికుల పేరుతో గల్ఫ్ దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.

''కువైట్ అనేది నిజంగా నరకం'' అని చెప్పారు మాజీ గృహ కార్మికురాలు ఒకరు. తనను ఉద్యోగంలో పెట్టుకున్న మహిళ.. తనను రోజూ ఆవుల పక్కన పడుకునేలా చేసిన ఉదంతాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

''కువైట్ ఇళ్లు చాలా చెడ్డవి.. తిండి ఉండదు.. నిద్ర ఉండదు.. ఏమీ ఉండదు'' అని మరొక మహిళ చెప్పారు.

కువైట్ అధికారులు ఫాతోను గుర్తించి.. గృహ కార్మికుల కోసం ప్రభుత్వం నిర్వహించే సంరక్షణశాలకు తరలించారు. ఆమె మైనర్ అయినందున.. రెండు రోజుల తర్వాత గినీకు తిరిగి పంపించేశారు.

కువైట్‌లో తాను ఉన్న తొమ్మిది నెలల్లో మూడు ఇళ్లలో పనిచేసిన తన అనుభవాలను ఆ బాలిక బీబీసీకి వివరించింది.

''నన్ను తిట్టేవారు. పశువు అనే వారు. చాలా బాధగా దిగులుగా అనిపించేది. కానీ నేను చేయగలిగింది ఏమీ లేకపోయింది'' అని చెప్పింది.

ఫాతో ఇప్పుడు కోనాక్రీలో తిరిగి బడికి వెళ్తోంది. అక్కడే బీబీసీ ఆమెను కలిసింది.

''నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నా కూడా చాలా సంతోషంగా ఉంది. నా జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉంది. బానిసత్వం నుంచి బయటపడుతున్నట్లు అనిపిస్తోంది'' అని చెప్పిందామె.

హ్యాష్‌ట్యాగ్ నిషేధం

కువైట్‌లో గృహ కార్మికులను విక్రయిస్తున్న ''ఈ తరహా ప్రవర్తన మీద యుద్ధం చేస్తున్నాం'' అని ఆ దేశ ప్రభుత్వం చెప్తోంది. ఈ విక్రయ ప్రకటనలకు చోటిస్తున్న యాప్‌లను నిశితంగా తనిఖీ చేస్తున్నామని పేర్కొంది.

కానీ.. ఇప్పటివరకూ ఆ వేదికల మీద గణనీయమైన చర్యలేవీ చేపట్టలేదు. ఫాతోను విక్రయించటానికి ప్రయత్నించిన మహిళ మీద కూడా చట్టపరమైన చర్యలేవీ లేవు. ఈ ఉదంతం మీద వ్యాఖ్యానించాలన్న బీబీసీ విజ్ఞప్తికి ఆమె స్పందించలేదు.

బీబీసీ బృందం తన పరిశోధనలో గుర్తించిన విషయాలపై సదరు యాప్‌లు, టెక్ కంపెనీలను సంప్రదించినప్పటి నుంచీ.. 4Sale యాప్ తన వేదిక మీద గృహ కార్మికుల విభాగాన్ని తొలగించింది.

ఇన్‌స్టాగ్రామ్ నుంచి "#maidsfortransfer" అనే అర్థం గల అరబిక్ హ్యాష్‌ట్యాగ్ ''خادمات للتنازل#''ను నిషేధించినట్లు ఫేస్‌బుక్ చెప్పింది.

''మా వేదికల మీద ఇటువంటి ప్రవర్తనను నిరోధించటానికి చట్టం అమలు చేసే వ్యవస్థలు, నిపుణుల సంస్థలు, పరిశ్రమతో కలిసి పనిచేయటం మేం కొనసాగిస్తాం'' అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

సౌదీ అరేబియాకు చెందిన సరకుల యాప్ హరాజ్ నుంచి ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు.

తమను ''ఈ ఆరోపణలు తీవ్రంగా కలచివేశాయి'' అని గూగుల్ చెప్పింది.

''మేం మరింత లోతుగా దర్యాప్తు చేయటానికి వీలుగా అదనపు వివరాలను మాకు అందించాలని బీబీసీని మేం కోరాం. తమ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించటానికి యాప్ డెవలపర్లు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టేలా చూడటానికి మేం కృషి చేస్తున్నాం'' అని పేర్కొంది.

తన మార్కెట్‌ప్లేస్‌లో అందుబాటులో ఉంచిన యాప్‌లలో మానవ అక్రమ రవాణాను, చిన్నారుల దోపిడీని ప్రోత్సహించటాన్ని తాము ''కఠినంగా నిషేధించాం'' అని ఆపిల్ చెప్పింది.

''తమ యాప్‌ల మీద యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌ మీద నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా యాప్‌ల డెవలపర్లది. మాకు ఎప్పుడు ఏ సమస్య గురించి తెలిసినా.. తక్షణం సవరణ చర్యలు చేపట్టేలా ఆ డెవలపర్లతో కలిసి మేం పనిచేస్తాం. తీవ్రమైన ఉదంతాల్లో స్టోర్ నుంచి ఆ యాప్‌లను తొలగిస్తాం. ఏవైనా అక్రమాలు చోటుచేసుకుంటే స్థానిక ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసేలా వారితో కలిసి కృషి చేస్తాం'' అని వివరించింది.

అయితే.. ఈ సంస్థలు తమ స్టోర్లలో 4Sale, హరాజ్ యాప్‌లను పంపిణీ చేయటం కొనసాగిస్తున్నాయి. వాటి ప్రధాన ఉద్దేశం వస్తువులు, సేవల విక్రయం దీనికి కారణమని చెప్తున్నాయి.

వీటిలో 4Sale ఈ సమస్యను పరిష్కరించి ఉండవచ్చు. కానీ.. ఈ కథనం ప్రచురించే సమయానికి కూడా హరాజ్ యాప్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఇంకా బీబీసీ చూసిన మరికొన్ని యాప్‌లలోనూ వందల సంఖ్యలో గృహ కార్మికుల క్రయవిక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్, ఇతర యాప్‌లపై మహిళల క్రయవిక్రయాలు

చర్యలు చేపడుతున్న కువైట్

ఇంటి కార్మికులను బానిసలుగా అమ్మేందుకు వాడుతున్న సోషల్ మీడియా ఖాతాల సంబంధీకులను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. బానిసల అమ్మకానికి ప్రకటనలు ఇచ్చినవారిని వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. ఈ పని ఇకపై చేయబోమని వారి నుంచి చట్టబద్ధమైన పూచీ కూడా తీసుకున్నారు.

ఈ అంశంపై బీబీసీ సంప్రదించిన తర్వాత తాము కూడా చర్యలు చేపట్టామని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లపై ఈ కంటెంట్‌ను తొలగిస్తున్నామని చెప్పింది. ఆన్‌లైన్ బానిసల మార్కెట్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరూ ఖాతాలు తెరవకుండా నివారిస్తామని చెప్పింది.

గృహ కార్మికుల క్రయవిక్రయాలకు ఎక్కువగా వాడే ఖాతాల్లో చాలా వరకు ఖాతాలు కార్యకలాపాలను నిలిపివేసినట్లు కనిపిస్తోంది.

బీబీసీ కథనంలో- ఫాతో అనే 16 ఏళ్ల బాలికను అమ్ముతూ కనిపించిన మహిళపై విచారణ జరుపుతున్నామని కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్.. డాక్టర్ ముబారక్ అల్-అజీమీ చెప్పారు.

ఈ కథనంలో ఉన్న ఓ పోలీసు అధికారిపైనా ఉన్నతాధికారులు విచారణ సాగిస్తున్నారు.

బాలిక ఫాతో కేసును అమెరికాకు చెందిన అంతర్జాతీయ న్యాయవాది కింబర్లీ మోట్లీ చేపట్టారు.

ఫాతో విక్రయానికి ఉపయోగించిన యాప్ డెవలపర్లు ఫాతోకు పరిహారం చెల్లించాల్సిందేనని న్యాయవాది చెప్పారు. యాపిల్, గూగుల్ కూడా పరిహారం చెల్లించాలని అభిప్రాయపడ్డారు.

యాపిల్ స్టోర్లో ఉన్న ప్రతిదానికీ తమదే బాధ్యతని యాపిల్ స్టోర్లో ఉందని, ఆ బాధ్యత ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

గినీ దేశం నుంచి కువైట్‌కు బాలిక ఫాతోను అక్రమంగా తరలించినవారిపై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని మోట్లీ కోరారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)